22 నుంచి రేషన్ డీలర్ల ఆమరణ నిరాహార దీక్షలు
Published Sat, Aug 20 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
హన్మకొండ చౌరస్తా : రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ. 20వేల వేతనం ఇవ్వాలని కోరుతూ ఈనెల 22 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రమేష్‌బాబు తెలిపారు. హన్మకొండ రెడ్డికాలనీలోని బిందాస్‌గార్డెన్‌లో శుక్రవారం రేషన్ డీలర్ల జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గతంలో ఐదు రోజుల పాటు నిరాహార దీక్షలు, ఆరో రోజు శాంతియుత మహార్యాలీ నిర్వహించామన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడినట్లు తెలిపారు. గత 40 ఏళ్లుగా చాలీచాలనీ కమిషన్లతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్, ఈ–పాస్, సీసీ కెమెరాలు, బినామీ డీలర్ల ఏరివేత, బోగస్ కార్డుల తొలగింపు ప్రక్రియను స్వాగతిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు పార్టీలకతీతంగా పాల్గొని సంఘం పో రాటాలకు మద్దతుగా నిలవాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్, నాయకులు పి. వీరన్న, జి.రాధాకృష్ణ, ఎం.రవీందర్, లింగయ్య, నర్సింహులు, వాణిరామరాజు, రమేష్, మల్లయ్య, విజయ్‌పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement