హాం ఫట్
ఉపాధి కూలీల పేరిట సొమ్ము స్వాహా
రూ.25 లక్షలు కాజేసినట్టు గుర్తించిన అధికారులు
జగ్గంపేట సబ్ పోస్టాఫీసు పరిధిలోని రాజపూడిలో బాగోతం
బీపీఎంపై సస్పెన్షన్ వేటు
పోస్టల్ శాఖకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆన్ లైన్ లో పెట్టినప్పటికీ.. అక్రమాలకు మాత్రం కళ్లెం పడడం లేదు. తాజాగా రాజపూడి గ్రామంలోని బ్రాంచ్ పోస్టాఫీసులో జరిగిన బాగోతం వెలుగులోకి వచ్చింది.
– రాజపూడి(జగ్గంపేట)
జగ్గంపేట సబ్ పోస్టాఫీసు పరిధిలో ఉన్న రాజపూడి బ్రాంచ్ పోస్టాఫీసు ద్వారా ఐదు గ్రామాల ప్రజలకు తపాలా సేవలందుతున్నాయి. ఉపాధి హామీ, ఉద్యానవన పనులకు సంబంధించి కూలీలకు వారానికి దాదాపు వెయ్యి మందికి వేతనాలు చెల్లిస్తున్నారు. రాజపూడితో పాటు సమీపంలోని గోవిందపురం, కృష్ణాపురం, సీతారాంపురం, మన్యంవారిపాలెం గ్రామాల కూలీలు ఉపాధి, ఉద్యానవన పనుల వేతనాలు తీసుకుంటున్నారు. కూలీలకు ఇచ్చే సొమ్మును ముందుగానే జగ్గంపేట సబ్ సోస్టాఫీసు ద్వారా నగదు రూపంలో తీసుకుని పే స్లిప్‌ల ఆధారంగా చెల్లించాల్సి ఉంది.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం!
ఏడాదిగా కూలీలకు చెల్లించే దానికి అదనంగా సొమ్మును చూపి గ్రామంలోని బీపీఎం ఎస్.లక్ష్మి సూర్యకాంతం డ్రా చేశారు. ఎప్పటి కప్పుడు సరిచూసుకోవాల్సిన పోస్టల్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ.25 లక్షల వరకూ స్వాహా అయినట్టు ఇప్పటివరకూ నిర్ధారించారు. ఇంకా పోస్టల్ లావాదేవీలను తనిఖీ చేయాల్సి ఉంది. మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
కొనసాగుతున్న విచారణ
ఆలస్యంగా మేల్కొన్న పోస్టల్ ఉన్నతాధికారులు.. ఈ బాగోతంపై విచారణ చేపట్టి, తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో పెద్దాపురం పోస్టల్ ఇన్ స్పెక్టర్ ప్రకాశరావు రాజపూడి బ్రాంచ్ పోస్టాఫీసులో రికార్డులను స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. బీపీఎం నిధులను అదనంగా డ్రా చేసినట్టు ఈ విచారణలో నిర్ధారించారు. దీనిపై పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ప్రకాశరావును వివరణ కోరగా, ఇప్పటికి సుమారు రూ.25 లక్షలు దుర్వినియోగం అయినట్టు గుర్తించామని చెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. బీపీఎంపై సస్పెన్షన్ వేటు వేసి, మల్లిశాల బీపీఎంకు తాత్కలికంగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఇలాఉండగా రాజపూడి బీపీఎం నుంచి రూ.3 లక్షలు రికవరీ చేసినట్టు జగ్గంపేట పోస్టల్ అధికారి సత్యనారాయణ తెలిపారు.