-
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ :
వచ్చే నవంబర్ ఒకటో తేదీన జిల్లాలో 284 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నామని, రైతులు వీటిని వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ కోరారు. గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ వెలుగు, పీఏసీఎస్, డీసీఎంఎస్ సిబ్బంది ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. గ్రేడ్–ఎ క్వింటాల్ ధర రూ.1510, 75 కేజీల ధర రూ.1132.50పైసలు గాను, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1470, 75 కేజీలు రూ.1102.50 గాను కొనుగోలు చేస్తామన్నారు. 1బి ప్రకారం ఆన్‌లైన్‌లో ఉన్న రైతుల పేర్లు జాబితాలను డీఆర్‌డీఏ, డీసీఓలు తీసుకుని కొనుగోలు సెంటర్‌లో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం కొనుగోలు చేసే ధరల గురించి కరపత్రాలు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏడీ మార్కెటింగ్‌ను ఆదేశించారు. సొసైటీలు కొనుగోలు చేసే ధాన్యాన్ని ఏఏ మిల్లులకు ఇవ్వాలో కేటాయించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెళ్లే ధాన్యంపై నిఘా, పరిశీలన ఉండాలన్నారు. రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, సివిల్ సప్లయిస్ శాఖలు సమన్వయంతో పనిచేసి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.