కోస్గి: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుధ్ఘాతానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అడవిపందుల కోసం వేసిన విద్యత్ కంచెలో చిక్కుకున్న తండ్రిని కాపాడటానికి వెళ్లిన కొడుకుతో పాటు తల్లికి కూడా కరెంట్ షాక్ కొట్టడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని కోస్గి మండలం తొగాపూర్ పంచాయతి పరిధిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(60) కుటుంబ సభ్యులు పత్తితోటలో పనికి వెళ్లారు. ఈ క్రమంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకడంతో షాక్ తో వెంకటయ్య కుప్పకూలిపోయాడు.
ఇది గుర్తించిన కొడుకు కిష్టప్ప(34) తండ్రిని రక్షించేందుకు వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన కిష్టప్ప భార్య విద్యుత్ కనెక్షన్ కట్ చేయడానికి పరిగెత్తగా.. కొడుకు తల్లడిల్లడం చూడలేని తల్లి అమృతమ్మ(56) అతన్ని పట్టుకొని లాగడానికి యత్నించి అక్కడే ప్రాణాలొదిలింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.