నారాయణ కాలేజీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది.
కడప : నారాయణ కాలేజీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కమిటీ సభ్యురాలు, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి తెలిపారు. ఈ ఘటనపై ఆ విద్యార్థినుల రూమ్మేట్స్ను కూడా విచారణ చేస్తామని ఆమె చెప్పారు.
కడప సమీపంలోని సీకే దిన్నెలో నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇంటర్మీడియెట్ బోర్డులోని పరీక్షల నియంత్రణాధికారి మాణిక్యం, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, వైఎస్సార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.సులోచన ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.