చోరీ కేసుల్లో ముగ్గురు దొంగల అరెస్ట్
గుంతకల్లు రూరల్ : తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కసాపురం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, 10 తులాల బంగారు నగలను రికవరీ చేసుకున్నారు. స్థానిక కసాపురం పోలీస్ స్టేషన్‌లో రూరల్ సీఐ గురునాథ్ బాబు, ఎస్‌ఐ సద్గురుడు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుంతకల్లు పట్టణ ంలోని షికారి కాలనీకి చెందిన షికారి రాజు, అతడి అల్లుళ్లు అయిన అనంతపురం బుడ్డప్ప కాలనీకి చెందిన షికారి కరిమల్లయ్య అలియాస్ రాజేష్, షికారి నాగు అలియాస్ నాగేష్ కలిసి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు.
ఈ క్రమంలో ముగ్గురు కలిసి 2016 సెప్టెంబర్ 10న రాత్రి గుంతకల్లు పట్టణంలోని శాంతి నగర్ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న షేక్ ముక్తార్ ఇంట్లో మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర నెలల క్రితం స్థానిక వాల్మీకీ నగర్‌కు చెందిన బోయ శివశంకర్ ఇంట్లో 35 గ్రాముల బంగారు ఆభరణాలను, నాలుగు రోజుల క్రితం మండలంలోని దంచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఇంట్లో 25 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. మండలంలోని కసాపురం సమీపంలో దోసలుడుకి క్రాస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో వారు సంచరిస్తుండగా.. స్థానికులు వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ గురునాథ్ బాబు ఆధ్వర్యంలో కసాపురం ఎస్‌ఐ సద్గురుడు, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని మూడిళ్లలో చోరీ అయిన 10 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసుకున్నారు.