సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతిలో నిర్వహించనున్న టీడీపీ మహానాడుకు హాజరవ్వాలని కోరుతూ ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై గురువారం ఆయన పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా మహానాడు నిర్వహించడం ఇది మూడో పర్యాయమన్నారు.
అంతకు ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు కళా వెంకటరావు, ఎల్.రమణలతో పాటు రాష్ట్ర మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మహానాడు నిర్వహణ కమిటీల సమన్వయకర్త టీడీ జనార్థనరావులు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకున్నారు. వేదిక నిర్మాణానికి అనువైన చోటును ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్, మంచి నీరు, టాయిలెట్స్, అతిథులకు గదులు, భోజన వసతుల కల్పనపై కళా వెంకట్రావు.. జిల్లా మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మంత్రి నారాయణ, స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
టీటీడీ గదులు, కల్యాణ మండపాలు, అతిథి గృహాలను 20వ తేదీలోగా రిజర్వ్ చేసుకోవాలని, మహానాడు జరిగే మూడు రోజులూ పార్టీ నేతలందరూ అందుబాటులో ఉంటూ ఎవరికి కేటాయించిన బాధ్యతల్లో వారుండాలని సూచించారు. తెలంగాణ నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు, ఎమ్మెల్సీలు హాజరవుతారని ఎల్.రమణ పేర్కొన్నారు.