
వీసీ పీఠం ఎవరికో?
- రేసులో 35 మంది
- 22న సెర్చ్ కమిటీ సమావేశం
జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం నూతన వీసీ నియామకానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. జేఎన్‌టీయూ వీసీగా ఉన్న ప్రొఫెసర్ ఎం.సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. ఈ ఏడాది జూన్‌లో వీసీ పదవికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్వేషణ కమిటీ (సెర్చ్ కమిటీ)ని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈ కమిటీ ఈ నెల 22న విజయవాడలో సమావేశం కానుంది. అన్వేషణ కమిటీ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నారు. ఇందులో ఒకరిని సీఎం ఛాన్సలర్/ గవర్నర్‌కు సిఫార్సు చేస్తారు. మొదట పంపిన పేరును గవర్నర్ సమ్మతించకపోతే మరో పేరును (ఎంపిక చేసిన మూడు పేర్లలోనే) గవర్నర్‌కు సిఫార్సు చేస్తారు.
రేసుగుర్రాలు
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోరాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. 2008లో యూనివర్శిటీ ఏర్పడినప్పటికీ..2011 నుంచి సంస్కరణల అమలు చేయడంతో జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెరిగింది. సాంకేతిక విద్యలో జేఎన్‌టీయూ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిపోయింది. దీంతో సహజంగానే వీసీ పదవికి పోటీ పెరిగింది. మొత్తం 35 మంది వీసీ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఏడుగురు జేఎన్‌టీయూ అనంతపురం నుంచి పోటీలో ఉన్నారు. మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి, ప్రొఫెసర్ యోహాన్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ ఆనందరాజు, ఎలక్ట్రికల్‌లో ప్రొఫెసర్ విజయ్‌కుమార్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ సత్యనారాయణ, సివిల్ విభాగంలో ప్రొఫెసర్ సుదర్శనరావు, ప్రొఫెసర్ భాస్కర్‌దేశాయ్, దరఖాస్తు చేసుకొన్న వారిలో ఉన్నారు.
వచ్చే నెలలోనే నూతన వీసీ నియామకం
వచ్చే నెలలో జేఎన్‌టీయూ అనంతపురం నూతన వీసీ నియామకం కానున్నారు. అన్వేషణ కమిటీ(సెర్చ్ కమిటీ)లో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు వర్సిటీ నామినీ, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో సభ్యుడు యూజీసీ నామినీ ఉంటారు. వర్సిటీ నామినీగా ప్రొఫెసర్ వి.రామచంద్ర రాజు (ఐఐఐటీ వీసీ)ను నియామకం చేశారు. నెలాఖరులోగా అన్వేషణ కమిటీ సమావేశం కానుంది. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. మొత్తం ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా నియామకం చేయాలని భావిస్తే.. దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ, అన్వేషణ కమిటీ సమావేశమయినప్పటికీ .. వారి దరఖాస్తులను ఆహ్వానించే వెసులుబాటు ఉంది. అయితే 10 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా అనుభవమే ప్రధాన అర్హతగా పరిగణించారు. వీసీ పదవి దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రాజకీయ పలుకబడి సంపాదించుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.