
ఓపెన్ ఫోరానికి 36 దరఖాస్తులు
విజయవాడ : సీఆర్‌డీఏ స్థానిక కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓపెన్ ఫోరానికి 36 దరఖాస్తులు అందాయి. అనుమతుల కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ ఓపెన్ ఫోరం నిర్వహించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న 26 దరఖాస్తులను అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి మంజూరు పత్రం జారీచేశారు. మరో ఏడింటికి అదనపు సమాచారం కోరారు. నిబంధనలకు అనుగుణంగా లేని మూడు దరఖాస్తులను తిరస్కరించారు. వీటిలో భవన నిర్మాణ అనుమతుల కోసం నాలుగు దరఖాస్తులు రాగా, రెండింటిని అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి ఇచ్చారు. ఒక దరఖాస్తుకు అదనపు సమాచారం కోరారు. మరో దరఖాస్తును తిరస్కరించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం 13 దరఖాస్తులు రాగా, వాటిలో తొమ్మిదింటిని ఆమోదించి సర్టిఫికెట్లు జారీచేశారు. నాలుగు దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. లేఅవుట్ల అనుమతుల కోసం ఆరు దరఖాస్తులు రాగా, అన్నీ సక్రమంగా ఉన్న ఐదు లేఅవుట్లకు అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రం మంజూరు చేశారు.