
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. నివేదికకు యథాతథంగా ఆమోదించాలా? ఇంకా ఏమైనా మార్పులు చేయాలా? అన్నది చర్చిస్తామన్నారు. కమిటీలో నిపుణులు సభ్యులుగా ఉన్నారని, అన్ని అంశాలను పరిశీలించాకే నివేదిక సమర్పించారని చెప్పారు.
మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా?
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించే ఆర్థిక స్థోమత రాష్ట్రానికి లేదని బొత్స పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టి నారాయణ కమిటీతో ముందుకు వెళ్లిందని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయని బొత్స పేర్కొన్నారు. ‘మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును నిలదీశారు. రాజధాని ప్రకటనకు ముందే హెరిటేజ్ సంస్థ అమరావతి ప్రాంతంలో భూములు కొనడం ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ కాదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment