విశాఖనే బెస్ట్‌ ఆప్షన్‌ : జీఎన్‌ రావు | GN Rao Condemns False News Over AP Capital | Sakshi
Sakshi News home page

విశాఖనే బెస్ట్‌ ఆప్షన్‌ : జీఎన్‌ రావు

Published Wed, Jan 29 2020 4:57 PM | Last Updated on Wed, Jan 29 2020 8:53 PM

GN Rao Condemns False News Over AP Capital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలను విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు ఖండించారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్‌ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో జీఎన్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్‌ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు.

తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్‌ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం బెస్ట్‌ ఆప్షన్‌ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్‌ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్‌ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్‌ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా, ఆన్‌లైన్‌ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు.

చదవండి : ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement