
4.01 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయింపు
- క్వింటాల్ రూ.7,700!
అనంతపురం అగ్రికల్చర్ :
త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌లో పంట సాగు చేసే రైతులకు రాయితీపై పంపిణీ చేయడానికి వీలుగా జిల్లాకు 4,01,881 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. మొదట 3.50 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఒక్కో రైతుకు మూడు బస్తాలకు బదులు నాలుగు బస్తాలు ఇస్తామని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అదనంగా 51,881 క్వింటాళ్లు కేటాయించారు. దీంతో సేకరణ ఏజెన్సీలు, మండలాల వారీగా కేటాయింపుల్లోనూ మార్పులు చేశారు. ఏపీ సీడ్స్‌కు 1.72 లక్షల క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్‌కు 60 వేలు, ఆయిల్‌ఫెడ్‌కు 69 వేలు, వాసన్ ఎన్‌జీవోకు 80 వేలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌సీ)కు 20 వేల క్వింటాళ్ల విత్తనకాయలను సేకరించి, నిల్వ చేసే బాధ్యత అప్పగించారు. ఇందులో ఇప్పటికే 3.50 లక్షల క్వింటాళ్ల వరకు సేకరించి గోదాముల్లో నిల్వ చేసినట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాకుల (జేడీఏ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొత్తగా వచ్చిన ఎన్‌ఎస్‌సీ సంస్థకు శెట్టూరు, కుందుర్పి, పుట్టపర్తి మండలాలకు వేరుశనగ సరఫరా బాధ్యతలు అప్పగించారు. వాసన్ సంస్థకు తనకల్లు మండలం ఇచ్చారు. మిగతా 59 మండలాలకు ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ సరఫరా చేస్తాయి. అలాగే విత్తన పంపిణీ ఏజెన్సీలను 45 మండలాల్లో గుర్తించగా, మిగిలిన వాటిలోనూ రెండు,మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు.
క్వింటాల్ రూ.7,700 !
విత్తన వేరుశనగ ధరలు, రాయితీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. క్వింటాల్ వేరుశనగ పూర్తి ధర రూ.7,700గా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో 33.3 శాతం రాయితీ రైతులకు వర్తింపజేసే అవకాశం ఉంది. అంటే రైతు వాటాగా క్వింటాల్‌కు రూ.5,135 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రభుత్వం రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించవచ్చని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపట్టడానికి వీలుగా తేదీలను ఖరారు చేయనున్నారు.