వారానికి ఐదు రోజులే
*హైదరాబాద్ నుంచి రాజధానికి వచ్చే ఉద్యోగులకు ఏడాది వెసులుబాటు
*కార్యాలయాల్నే సమకూరుస్తున్నాం.. ఇళ్లు ఉద్యోగులే చూసుకోవాలి: నారాయణ
*ఆగస్టులోగా తరలింపు పూర్తి
విజయవాడ : హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారికి వారంలో ఐదురోజులు పనిదినాలుగా నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనివిధాలా చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే అమరావతికొచ్చే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులపాటు పనిదినాలుగా ఏడాదిపాటు వెసులుబాటును సీఎం చంద్రబాబు కల్పించారని ఆయన చెప్పారు.
రాజధానికొచ్చే ఉద్యోగులకు కార్యాలయాన్ని సమకూరుస్తున్నామని, ఇళ్లు మాత్రం వారే చూసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. జూన్ నాటికి 4,500 మంది, జూలై నెలాఖరుకు 3 వేలమంది, ఆగస్టులో మిగిలిన ఉద్యోగులు అమరావతికి తరలివస్తారని చెప్పారు. ఉద్యోగుల పిల్లల స్థానికత విషయంలో కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రానికి సీఎం లేఖ రాస్తారని మంత్రి వెల్లడించారు.