All India Service officers
-
వారానికి ఐదు రోజులే
*హైదరాబాద్ నుంచి రాజధానికి వచ్చే ఉద్యోగులకు ఏడాది వెసులుబాటు *కార్యాలయాల్నే సమకూరుస్తున్నాం.. ఇళ్లు ఉద్యోగులే చూసుకోవాలి: నారాయణ *ఆగస్టులోగా తరలింపు పూర్తి విజయవాడ : హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారికి వారంలో ఐదురోజులు పనిదినాలుగా నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనివిధాలా చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే అమరావతికొచ్చే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులపాటు పనిదినాలుగా ఏడాదిపాటు వెసులుబాటును సీఎం చంద్రబాబు కల్పించారని ఆయన చెప్పారు. రాజధానికొచ్చే ఉద్యోగులకు కార్యాలయాన్ని సమకూరుస్తున్నామని, ఇళ్లు మాత్రం వారే చూసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. జూన్ నాటికి 4,500 మంది, జూలై నెలాఖరుకు 3 వేలమంది, ఆగస్టులో మిగిలిన ఉద్యోగులు అమరావతికి తరలివస్తారని చెప్పారు. ఉద్యోగుల పిల్లల స్థానికత విషయంలో కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రానికి సీఎం లేఖ రాస్తారని మంత్రి వెల్లడించారు. -
వారానికి అయిదురోజులే
అమరావతి నుంచి పనిచేయాలంటే ఆ సౌకర్యం కల్పించండి ప్రభుత్వానికి అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల ప్రతిపాదన రాజధాని నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు సదుపాయం కావాలి హైదరాబాద్: వచ్చే జూన్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయాలంటే తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త రాజధానిలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం కానందున వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలుండేలా చూడాలని కోరారు. అలా చేస్తే హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో అధికారులు, ఉద్యోగులు అక్కడికి వెళ్లకపోయినా.. తాము అధిక సమయం పనిచేయడానికి సిద్ధమన్నారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాలు రాజధానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.కుటుంబాన్ని హైదరాబాద్‌లోనే ఉంచి తాము మాత్రం అమరావతికి వెళ్లి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఐదు రోజుల పనిదినాల పద్ధతి అమలు చేస్తే శని, ఆదివారాలు హైదరాబాద్‌లో తమ కుటుంబంతో గడపవచ్చని వారు యోచిస్తున్నారు. ప్రతీ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని, మళ్లీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే ఆ రైలులో తాము వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని అధికార వర్గాలంటున్నాయి.ఇలా హైదరాబాద్‌లోనే ఉంటూ రాజధాని వెళ్లి పనిచేసే ఉద్యోగులు, అధికారులకు బ్యాచ్‌లర్ అకామిడేషన్ కల్పిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.రెండు చోట్ల అద్దె అలవెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి హైదరాబాద్‌లోనే ప్రభుత్వ క్వార్టర్స్‌లో మరో ఏడాది పాటు ఉండేందుకు అనుమతించాలని అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
గ్యాస్ రాయితీ వదిలించండి!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పేదలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు వీలుగా... సంపన్న వర్గాలు పొందుతున్న గ్యాస్ రాయితీని వదిలించుకొనేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఏటా రాయితీ సిలిండర్ల ద్వారా ఒక్కో కనెక్షన్‌పై దాదాపు రూ.6వేల వరకు సబ్సిడీ భారం పడుతోందని, సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతోద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఆర్థికంగా ఉన్నవారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖపై ఒత్తిడి తెస్తోంది. తాజాగా ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. విస్తృతంగా ప్రచారం: కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయిల్ కంపెనీలు.. ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రచారం మొదలెట్టాయి. మొబైల్ యాప్, ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎస్సెమ్మెస్ ద్వారా అయితే... ‘గీవ్ ఇట్ అప్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి భారత్‌గ్యాస్ వినియోగదారులు 773829899కు, హెచ్‌పీ గ్యాస్ అయితే 9766899899కు, ఇండియన్ గ్యాస్ అయితే 8130792899కు పంపి రాయితీని వదులుకోవచ్చు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా, లేదా డిస్ట్రిబ్యూటర్ల వద్ద దరఖాస్తు చేసుకుని సబ్సిడీని వదులుకునే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీల రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్ తెలిపారు. వదులుకున్నది 17వేల మంది ఇప్పటికే కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, ప్రముఖులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 మంది కలిపి 16,964 మంది రాయితీని వదులకున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 3,194 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో 2,566 మంది ఉన్నారు. రాయితీని వదులుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, పరిటాల సునీత, ఎంపీలు కవిత, కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పార్వతమ్మ, ఐఏఎస్‌లు కె.పున్నయ్య, రతన్ప్రకాశ్, పింగళి రామకృష్ణారావుతో పాటు ఇతర ప్రముఖుల్లో వైఎస్ భారతి, రామోజీరావు, వి.చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. వీరి తరహాలో మరింత మంది ముందుకు రావాలని ఆయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. -
ఒత్తిళ్లతో మారిపోతున్న పోస్టింగులు!
నలుగురు ఐఏఎస్‌ల బదిలీల్లో మార్పులు చేసిన ప్రభుత్వం జిల్లా మంత్రులు, సీనియర్ అధికారుల సిఫారసులతో నియామకాలు హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగ్‌లలో ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. బదిలీ చేసి 24 గంటలు కూడా కాకముందే.. పోస్టింగ్‌లను మార్చేస్తోంది. ఆదివారం బదిలీ చేసిన 24 మంది ఐఏఎస్ అధికారుల్లో నలుగురి పోస్టింగ్‌లు మారిపోయాయి. జిల్లా మంత్రుల ఒత్తిళ్లతో ప్రభుత్వం పోస్టింగ్‌లను రద్దు చేస్తుండగా.. పలువురు ఐఏఎస్‌లు.. నేతలు, ఉన్నతాధికారుల అండతో కావాల్సిన పోస్టుల్లోకి మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అపార్డ్ కమిషనర్‌గా పనిచేసిన ప్రియదర్శినిని ప్రభుత్వం గతంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆదివారం నాటి బదిలీల్లో ఆమెకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రస్తుత కలెక్టర్ జగన్మోహన్ను అక్కడే కొనసాగించాలని కోరడంతో... బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రియదర్శినిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2గా హరి చందన దాసరికి పోస్టింగ్ ఇచ్చారు. ఆమె సోమవారమే విధుల్లో చేరారు కూడా. కానీ ఆ స్థానంలో ఆమ్రపాలికి పోస్టింగ్ ఇస్తూ... హరిచందనను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన దృష్ట్యా జిల్లాపై తనకు అవగాహన ఉందంటూ ఆమ్రపాలి పలువురు మంత్రులను కలిసి వివరించారని, రంగారెడ్డి జేసీగా పోస్టింగ్ పొందారని ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా నియమితులైన పౌసమి బసును 24 గంటల్లో మార్చేశారు. ఆమెను కరీంనగర్ జిల్లా జేసీగా పంపారు. అలాగే, ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సిఫారసుతోనే మారినట్లు ప్రచారం జరుగుతోంది.