నలుగురు ఐఏఎస్‌ల బదిలీల్లో మార్పులు చేసిన ప్రభుత్వం
జిల్లా మంత్రులు, సీనియర్ అధికారుల సిఫారసులతో నియామకాలు
హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగ్‌లలో ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. బదిలీ చేసి 24 గంటలు కూడా కాకముందే.. పోస్టింగ్‌లను మార్చేస్తోంది. ఆదివారం బదిలీ చేసిన 24 మంది ఐఏఎస్ అధికారుల్లో నలుగురి పోస్టింగ్‌లు మారిపోయాయి. జిల్లా మంత్రుల ఒత్తిళ్లతో ప్రభుత్వం పోస్టింగ్‌లను రద్దు చేస్తుండగా.. పలువురు ఐఏఎస్‌లు.. నేతలు, ఉన్నతాధికారుల అండతో కావాల్సిన పోస్టుల్లోకి మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అపార్డ్ కమిషనర్‌గా పనిచేసిన ప్రియదర్శినిని ప్రభుత్వం గతంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆదివారం నాటి బదిలీల్లో ఆమెకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రస్తుత కలెక్టర్ జగన్మోహన్‌ను అక్కడే కొనసాగించాలని కోరడంతో... బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రియదర్శినిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2గా హరి చందన దాసరికి పోస్టింగ్ ఇచ్చారు. ఆమె సోమవారమే విధుల్లో చేరారు కూడా. కానీ ఆ స్థానంలో ఆమ్రపాలికి పోస్టింగ్ ఇస్తూ... హరిచందనను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన దృష్ట్యా జిల్లాపై తనకు అవగాహన ఉందంటూ ఆమ్రపాలి పలువురు మంత్రులను కలిసి వివరించారని, రంగారెడ్డి జేసీగా పోస్టింగ్ పొందారని ప్రచారం జరుగుతోంది.
జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా నియమితులైన పౌసమి బసును 24 గంటల్లో మార్చేశారు. ఆమెను కరీంనగర్ జిల్లా జేసీగా పంపారు. అలాగే, ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సిఫారసుతోనే మారినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒత్తిళ్లతో మారిపోతున్న పోస్టింగులు!
Published Wed, Jan 14 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement