వారానికి అయిదురోజులే
అమరావతి నుంచి పనిచేయాలంటే ఆ సౌకర్యం కల్పించండి
ప్రభుత్వానికి అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల ప్రతిపాదన
రాజధాని నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు సదుపాయం కావాలి
హైదరాబాద్: వచ్చే జూన్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయాలంటే తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త రాజధానిలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం కానందున వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలుండేలా చూడాలని కోరారు. అలా చేస్తే హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో అధికారులు, ఉద్యోగులు అక్కడికి వెళ్లకపోయినా.. తాము అధిక సమయం పనిచేయడానికి సిద్ధమన్నారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాలు రాజధానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.కుటుంబాన్ని హైదరాబాద్‌లోనే ఉంచి తాము మాత్రం అమరావతికి వెళ్లి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఐదు రోజుల పనిదినాల పద్ధతి అమలు చేస్తే శని, ఆదివారాలు హైదరాబాద్‌లో తమ కుటుంబంతో గడపవచ్చని వారు యోచిస్తున్నారు.
ప్రతీ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని, మళ్లీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే ఆ రైలులో తాము వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని అధికార వర్గాలంటున్నాయి.ఇలా హైదరాబాద్‌లోనే ఉంటూ రాజధాని వెళ్లి పనిచేసే ఉద్యోగులు, అధికారులకు బ్యాచ్‌లర్ అకామిడేషన్ కల్పిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.రెండు చోట్ల అద్దె అలవెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి హైదరాబాద్‌లోనే ప్రభుత్వ క్వార్టర్స్‌లో మరో ఏడాది పాటు ఉండేందుకు అనుమతించాలని అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.