
చింటూ నుంచి రూ.50 లక్షల నగదు స్వాధీనం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ నుంచి శుక్రవారం పోలీసులు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన పావని అనే మహిళ 2013 నుంచి 2015 వరకు పలువురు మహిళల్ని మోసం చేసి 8 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని ముత్తూట్ ఫైనాన్స్‌లో 244 ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాకట్టు పెట్టింది. ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.1.52 కోట్లు రుణం తీసుకుంది. నగలు అడిగిన మహిళల్ని చింటూ ద్వారా బెదిరించింది.
మేయర్ హత్యకు ముందే పావని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, పావని తన నగలు ఇవ్వలేదని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పావని, ఆమె భర్త చరణ్, చింటూ, హరిదాస్ అనే నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల ఈ కేసులో చింటూ, హరిదాస్‌లను కస్టడీకు తీసుకుని విచారించారు. పావని తనకు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడ ఉన్నాయనే విషయం చింటూ చెప్పడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 460 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పావని, చరణ్ పరారీలో ఉన్నారని త్వరలోనే వీళ్లను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇక ముత్తూట్ ఫైనాన్స్‌పై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.