ఉపాధి కల్పనలో 50లక్షల పనిదినాలు వెనుకబడ్డాం
ఉపాధి కల్పనలో 50లక్షల పనిదినాలు వెనుకబడ్డాం
Published Mon, Feb 13 2017 11:00 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
– అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు మంజూరు
– తన అనుమతి లేనిదే ఎంపీడీఓలు సెలవుల్లో వెళ్లేందుకు వీల్లేదు
– జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడంలో 50 లక్షల పనిదినాలు వెనుకబడ్డామని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేబర్ బడ్జెట్ పెంపుపై ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో మంజూరు చేసిన పనులకు లేబర్ బడ్జెట్ పెరిగేలా ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 50 లక్షల పనిదినాలు వెనుకబడ్డామని, పూర్తిస్థాయిలో లేబర్ బడ్జెట్‌ను అధిగమిస్తే రూ.50 కోట్లు లేబర్ కాంపోనెంట్ వస్తుందని.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడ్డ మండలాలు వచ్చే సోమవారం నాటికి ప్రతి మండలంలో 1.50 లక్షల మందికి పనులు కల్పించాలన్నారు. రానున్న మూడు మాసాలు గ్రామాల్లో కూలీలకు ఎలాంటి పనులు ఉండవని.. వారందరినీ ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు పురమాయించాలన్నారు. ఏపీడీ, ఏపీఓ, క్షేత్రస్థాయి అధికారుల టూర్ డైరీలను తాను ప్రతి శనివారం సమీక్షిస్తానని.. ప్రతి ఒక్కరూ లక్ష్యం మేరకు పనులు చేసి నివేదికలు ఇవ్వాలన్నారు.
ఉపాధిహామీ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. అలాగే ఎంపీడీఓలు కూడా తన అనుమతి లేనిదే సెలవుల్లో వెళ్లరాదని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు ఫారంపాండ్స్ ప్రకారం పనులు ప్రారంభించాలన్నారు. ఇంకా మంజూరుకు సంబంధించి ఏవైనా ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలన్నారు. ఓడీఎఫ్ కింద 135 గ్రామాల్లో మార్చి నెలాఖరులోగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులన్నీ చెరువులకు అనుసంధానం చేసేందుకు వాగుల్లో పేరుకుపోయిన మట్టి, జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు ఉపాధి హామీ కింద పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement