
13 ఏళ్ల బాలికకు 51 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
దేవరకొండ/కొండమల్లేపల్లి: 13 ఏళ్ల విద్యార్థిని ప్రేమలో పడిందని, పరువు పోతుందని కన్న తల్లిదండ్రులే 51 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆలస్యం గా వెలుగుచూసింది. త్రిపురారం మండలం రాగడప పరిధిలోని మిట్యతండాకు చెందిన బాలిక (13) దేవరకొండలోని ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తమ కూతురు ఓ యువకుడితో ప్రేమలో పడిందని, నాంపల్లి మండలం రాజ్య తండాకు చెందిన 51 ఏళ్ల వివాహితుడైన రమావత్ రవికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏడాది క్రితం నిశ్చయించారు. అప్పట్లో అధికారులు, పోలీసులు పెళ్లిని ఆపి వారిపై కేసు నమోదు చేశారు. రమావత్ రవి, బాలిక తల్లిదండ్రులు జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత సదరు బాలికను హాస్టల్‌లో చేర్పించారు.
సెప్టెంబర్ 29న హాస్టల్ నుంచి బాలిక అన్న ఆమెను బయటకు తీసుకెళ్లాడు. కొండమల్లేపల్లిలో ఉంటున్న అక్క ఇంట్లో బంధించారు. అక్టోబర్ 4న కొంతమంది సమక్షంలో ముష్టిపల్లిలోని ఓ దేవాలయంలో గుట్టుచప్పుడు కాకుండా అదే వ్యక్తితో పెళ్లి చేశారు. అప్పటి నుంచి బయటి వ్యక్తితో మాట్లాడనివ్వకుండా కట్టడి చేశారు. గురువారం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బాలిక ఉపాధ్యాయులకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. ఈ విషయం ఐసీడీఎస్, పోలీసు అధికారులకు తెలియడంతో ఆమెను పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ విషయంపై జిల్లా శిశు సంక్షేమ శాఖ పీడీ పుష్పలత, డీటీడబ్ల్యూఓ నరోత్తమరెడ్డి, దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్, ఇతర అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు.