అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.722 కోట్లు
గాంధీనగర్ : రాష్ట్రంలో ఈ ఏడాది అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణకు రూ.722 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు రాష్ట్ర గనులు, మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి పీతల సుజాత చెప్పారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం కళావేదిక వద్ద స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన మహిళా, శిశువులకు పౌష్టికాహారంపై అవగాహన ప్రదర్శనశాలను గురువారం ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 14లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుంటే మన రాష్ట్రంలో 48వేల 770 కేంద్రాలు, 6837 మినీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. వాటిలో లక్షా 4వేల మంది కార్యకర్తలు మహిళా శిశువులకు సేవలందిస్తున్నారన్నారు.
మధ్యాహ్న భోజనానికి రూ.750 కోట్లు
ఈ ఏడాది ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి రూ. 750కోట్లు ఖర్చుచేస్తుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తొలుత బాలలసేవే– పుష్కర సేవ, ఆహారం– పోషణ విస్తరణ కేంద్రం, సమతుల ఆహారం వంటి ప్రదర్శనలు ప్రారంభిస్తూ కార్యకర్తలను వివరాలడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తయారు చేసిన పిండివంటలను, చిరుతిళ్లను రుచిచూసి పరిశీలించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి జి జయలక్ష్మీ, ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి, కమిషనర్ ఐ. సామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.