వీరోజిపల్లి వద్ద కొట్టుకుపోయిన రహదారి
పొంగుతున్న వాగులు, చెరువులు
నీట మునిగిన వందలాది ఎకరాల వరిపంట
వీరోజిపల్లితో తెగిపోయిన సంబంధాలు
పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు 78.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగుపారి ప్రవహిస్తున్నాయి. అలాగే ఉత్తులూర్ వాగు పాత వంతెనపై నుండి ప్రవహిస్తోంది.
వరద ప్రవాహం అంతా నిజాంసాగర్‌లోకి వెళ్తుండటంతో పాటు ఎగువ, సింగూరు నుంచి నీటి ఉధృతికి మండలంలోని కొత్తపేట, కొప్పోల్, జూకల్, సంగారెడ్డిపేట, వీరోజిపల్లి గ్రామల్లో భారీగా వరద నీరు చేరడంతో వందలాది ఎకరాల్లోని వరిపంట నీటమునిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వీరోజిపల్లికి తెగిపోయిన సంబంధాలు
పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి, సంగారెడ్డిపేట, జూకల్ గ్రామాలకు పేటతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామాలకు వెళ్లాలంటే టేక్మాల్ మండలం బోడగట్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీరోజిపల్లి వాగు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వల్ల వరదనీటితో పాటు రామోజిపల్లి చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.