peddashamkarampeta
-
గుండె జబ్బు భరించలేక..
తిరుమలాపూర్ చెరువులో ఘటన అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన మహిళగా గుర్తింపు పెద్దశంకరంపేట: స్థానిక తిరుమలాపూర్ చెరువులో శనివారం అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన తెనుగు రుక్కమ్మ (65) మృతదేహం లభ్యమైంది. పెద్దశంకరంపేట ఎస్ఐ విజయరావ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున మహిళ శవం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మహిళ మృతదేహాన్ని చెరువులో నుండి వెలికితీయించారు. మృతురాలికి సంబంధించిన వివరాలు సేకరించగా అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన రుక్కమ్మగా గుర్తించామన్నారు. రుక్కమ్మ కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఉషాముళ్లపూడిలో గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోందన్నారు. గుండెకు సంబంధించిన బాధ ఎక్కువ కావడంతో ఆమె పేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటానని ఇంట్లో చెప్పి బయలుదేరిందని ఆయన తెలిపారు. బాధ ఎక్కువై తిరుమలాపూర్ చెరువులో పడి ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి, భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
గడికోటలో ఎమ్మెల్యే పూజలు
పెద్దశంకరంపేట: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పేట గడికోటలో అమ్మవారికి గురువారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి హారతి ఇచ్చారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. గడికోట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పురాతన కోటను ఎక్కి పేట అందాలను తిలకించారు. పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాయిని సంగమేశ్వర్, సర్పంచ్ జంగం శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు విజయరామరాజు, కల్హేర్ మాజీ ఎంపీపీ మల్లేషం, నాయకులు లక్ష్మణ్, పున్నయ్య, నారాయణ, దాదిగారి రాధాక్రిష్ణ, అమర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
పేటలో 78.4 మి.మీల వర్షపాతం
పొంగుతున్న వాగులు, చెరువులు నీట మునిగిన వందలాది ఎకరాల వరిపంట వీరోజిపల్లితో తెగిపోయిన సంబంధాలు పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు 78.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగుపారి ప్రవహిస్తున్నాయి. అలాగే ఉత్తులూర్ వాగు పాత వంతెనపై నుండి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం అంతా నిజాంసాగర్‌లోకి వెళ్తుండటంతో పాటు ఎగువ, సింగూరు నుంచి నీటి ఉధృతికి మండలంలోని కొత్తపేట, కొప్పోల్, జూకల్, సంగారెడ్డిపేట, వీరోజిపల్లి గ్రామల్లో భారీగా వరద నీరు చేరడంతో వందలాది ఎకరాల్లోని వరిపంట నీటమునిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరోజిపల్లికి తెగిపోయిన సంబంధాలు పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి, సంగారెడ్డిపేట, జూకల్ గ్రామాలకు పేటతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామాలకు వెళ్లాలంటే టేక్మాల్ మండలం బోడగట్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీరోజిపల్లి వాగు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వల్ల వరదనీటితో పాటు రామోజిపల్లి చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ప్లేగ్రౌండ్స్ కరువు
పేటలోని పాఠశాలలకు మైదానాలు కరువు దూరమవుతున్న వ్యాయామ విద్య మౌలిక వసుతులు లేక విద్యార్థుల అవస్థలు పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలో కెజివిబి, మోడల్‌స్కూల్‌లతో కలిపి 7 ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికి క్రీడామైదానాలు లేక పోవడంతో విద్యార్థులు వ్యాయామవిద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ప్రాథమీక విద్యతో పాటు వ్యాయామ విద్య తప్పనిసరి చేయాలని తెలుపుతు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మౌళిక సదుపాయాలను మాత్రం ఏర్పాటు చేయడం మరిచింది. ఏళ్లు గడుస్తున్నా పలు పాఠశాలల్లో మాత్రం మైదానాలు లేక పోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని ఆని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి దాదాపు 5వేల 4 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 7 ఉన్నత పాఠశాలల్లో కస్తూర్బా, మోడల్‌స్కూల్‌లతో కలిపి విశాలమైన క్రీడా మైదానాలు లేక పోవడంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. గతంలో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినా అది ఆచరణకు నోచుకోవడం లేదు. పాఠశాలలో పీఈటిలు లేక పోవడంతో విద్యార్థులు ఆటలు ఆడే పరిస్థితి కనిపించడంలేదు. అటు పీఈటిలు ఇటు క్రీడా మైదానాలు లేక పోవడంతో ఆటలు ఎలా ఆడిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాయామవిద్యకోసం సమయాన్ని కెటాయిస్తున్నా విద్యార్థులకు మాత్రం ఒరిగిందేమి లేదు. క్రీడలకు అవసరమైన నిధులు కెటాయించిక పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు క్రీడాకారులుగా ఎదగలేక పోతున్నారు. ఆయా పాఠశాలల్లో మైదానాలు లేక విద్యార్థులు ఉన్న చోటే ఆడుకుంటున్నారు. విద్యార్థులను శారీరకంగా , మానసికంగా ఎదిగేందుకు క్రీడలు దోహదం చేస్తాయి. విద్యార్థుల అవసరాలను దష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న పీఈటి పోస్టులను భర్తి చేస్తు, క్రీడా మైదాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం 250 మంది విద్యార్థులకు ఒక పీఈటి ఉండాలనే నిభందన అమలు కావడం లేదు. ప్రతీ ఏటా పాఠశాలలను మాత్రం అప్‌గ్రేడ్ చేస్తున్నా పీఈటీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఆటలలో రాణించలేకపోతున్నారు. గతంలో నిర్వహించిన మండల, తాలుకా, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.