అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న అనంతపురం శివారులోని టీటీడీసీలో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జీఎంఆర్ సంస్థ రక్షా అకాడమీ, ఓరియన్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందని, శిక్షణ తర్వాత బెంగళూరు, చెన్నై, విజయవాడ, ముంబయి, ఢిల్లీల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండి, టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. బయోడేటా ఫారం, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు.