కన్నపేగును కాదనుకున్నారు..
చిన్నారిని వదిలేసి ఎవరిదారిన వారు వెళ్లిన దంపతులు..
పరిగి: ఓ తల్లి కన్నపేగును వదిలేసి వెళ్లిపోయింది. ఇంటి యజమాని పాపను చేరదీసి అక్కున చేర్చుకుంది. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో వెలుగుచూసింది. దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన అమీర్, సంపూర్ణ అలియాస్ ఫాతిమాలు ప్రేమించుకున్నారు. 2014లో మతాం తర వివాహం చేసుకున్నారు. 15 నెలల క్రితం పరిగిలోని రిజ్వాన హఫీజ్ దంపతుల ఇంట్లో అద్దెకు దిగారు. రెండు నెలల తర్వాత అమీర్, సంపూర్ణ దంపతులకు పాప జన్మిం చింది. 10 నెలల క్రితం అమీర్ భార్యకు చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. పది రోజులపాటు భార్య ఎదురు చూసి నా అతడు రాలేదు.
పాపను ఎలా పోషించుకోవాలో తెలియక సంపూర్ణ కూడా పాపను వదిలేసి వెళ్లిపోయింది. ఇంట్లో గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని ఇంటి యజమానులైన రిజ్వానా బేగం, హఫీజ్ దంపతులు చేరదీసి అక్కున చేర్చుకున్నారు. వీరికి పిల్లలున్నా గతంలో చనిపోయారు. పాపను తామే పెంచుకుందామని నిర్ణయించుకొని సాకుతూ వచ్చారు. సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ఐసీడీఎస్ అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ సిబ్బంది రిజ్వానా బేగం ఇంటికి చేరుకొని వివరాలు సేకరిం చారు. ఏ సంబంధం లేకుండా పాపను పెంచుకోవడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. పాపను హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలించారు. తాము పాపను పెంచుకుంటామని మంగళవారం పరిగిలోని ఐసీడీఎస్ కార్యాలయానికి రిజ్వానా వచ్చి మొరపెట్టుకున్నారు. అయితే, పాపను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లు తెలిసింది.