
వ్యక్తిగత కక్షలతోనా.. మరేదైనా?
►ఉరివేసి.. తగులబెట్టారు
► రహదారికి అరకిలోమీటర్ దూరంలో దారుణం
► లభించని ఆధారాలు..
► నిందితుల కోసం పోలీస్ వేట
ఖమ్మం జిల్లా : చెరుకూరు, ధర్మారం అటవీప్రాంతంతో దారుణం చోటుచేసుకుంది. రహదారికి అరకిలోమీటర్ దూ రంలో గుర్తు తెలియని మృతదేహం పూర్తిగా దహనమై కనిపించింది. ఏమాత్రం గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఈ శవాన్ని మంగళవారం అడవిలో కట్టెలు కొట్టుకుపోవడానికి వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పేరూరు ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాలు.. ‘శవం పూర్తిగా దహనమైంది. ఏమాత్రం ఆనవాళ్లు గుర్తు పట్టలేకుండా ఉంది. ఆడా మగ అనేదికూడా అంచనా వేయడానికి వీల్లేకుండా ఉంది.
సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారని భావిస్తున్నాం. ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. వాజేడు, పేరూరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. మనిషిని తగులబెట్టి సుమారు 20 రోజులై ఉంటుందని భావిస్తున్నాం. ఘటనాస్థలిలో లభించిన టార్చిలైట్, చెట్టు కొమ్మకు కాలివున్న లుంగీ గుడ్డ కనిపించాయి. దీనిబట్టి ఉరివేసి తగులబెట్టి ఉంటారని అంచనా వేస్తున్నాం.
వ్యక్తిగత కక్షలతోనా? మరేదైనా కారణంతో చంపారా? హత్యకు గురైన వారు స్థానికులా.. మరేదైనా ప్రాంతానికి చెందిన వారా? ఇలా రకరకాల కోణాల్లో విచారణ సాగిస్తున్నాం’ అని ఎస్సై శివప్రసాద్ వివరించారు. నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆయా స్టేషన్‌లలో మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు. ల్యాబ్‌నుంచి రిపోర్టులు వస్తేగానీ ఘటనకు సంబంధించి ఎంతో కొంత స్పష్టత వస్తుందని ఎస్సై వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఫైల్‌ను సీఐ రమణకు అప్పగిస్తామన్నారు.