పేద కుటుంబం.. పెద్ద రోగం
-
కిడ్నీలు పాడై అవస్థలు పడుతున్న తాపీమేస్త్రీ
-
రెండేళ్లుగా మంచానికే పరిమితమైన నర్సయ్య
-
మందులు కొనుగోలు చేయలేక మనోవేదన
-
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే యజమానికి పెద్ద జబ్బు వచ్చింది. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచానికే పరిమితమయ్యాడు. తన రెండు కిడ్నీలు పాడైపోవడంతో మనోవేదనకు గురవు తున్నాడు. కనీసం మందులు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో తల్లడిల్లుతున్నాడు. మానవతావాదులు సాయం అందించి తనను ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. కిడ్నీలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న తాపీమేస్త్రీ గుర్రం నర్సయ్యపై కథనం.
జనగామరూరల్ :
మండలంలోని గానుగుపహాడ్ గ్రామానికి చెందిన గుర్రం నర్సయ్య–ఎలిశమ్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు సుభాషిణి, సంపూర్ణ, కుమారుడు సుధాకర్ ఉన్నారు. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. నర్సయ్య 25 ఏళ్లుగా తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబా న్ని పోషించుకుంటున్నాడు. కూలి పనులు చేయగా వచ్చిన డబ్బులతో కొన్ని నెలల క్రితం పెద్ద కూతురు వివాహం చేశాడు. అయితే సాఫీగా సాగిపోతుందనుకున్న నర్సయ్య జీవితంలో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. రెండేళ్ల క్రితం నర్సయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సమయంలో ఆయన కాళ్లు, చేతులు, శరీర అవయవాలు బాగా వాపు రావడంతో కుటుంబసభ్యులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు చేయించారు. కాగా, వైద్యం కోసం నర్సయ్య భార్య ఎలిశమ్మ దొరికినకాడల్లా అప్పు తీసుకురావడంతోపాటు తన ఒంటిపై ఉన్న బంగారు నగలను కూడా అమ్మి సుమారు రూ.1.20 లక్షల వరకు ఖర్చు చేసింది. అయితే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత నర్సయ్య ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. అంతా బాగుందనుకుంటున్న క్రమంలో మూడు నెలల తర్వాత మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది.
వారానికి రెండుసార్లు డయాలసిస్
మెుదటిసారిలాగే అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్యను కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ చికిత్సలు అందిస్తేనే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. దీంతో నర్సయ్య భార్య, కుమారుడు, కూతుర్లు బోరున విలపించారు. ఈ క్రమంలో నర్సయ్య కుమారుడు సుధాకర్ కూలీ పనులకు వెళ్తుండగా.. భార్య ఎలిశమ్మ ఆయనకు నిత్యం సపర్యలు చేస్తోంది. ఆరోగ్యశ్రీపై వైద్యం అందుతున్నప్పటికీ మందులను కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన ఇబ్బందులకు గురవుతున్నాడు. నర్సయ్యకు వారంలో రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించేందుకు హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు, అవసరమయ్యే మందుల డబ్బులు లేక ఆయన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.