మిగులు రూ. 2,076 కోట్లు!
♦ ఉద్యోగుల వేతన నిధులపై రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా
♦ 1.42 లక్షల ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వం భర్తీ చేయకపోవడమే కారణం
♦ {పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల వ్యయంపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతనాల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.2,076 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలంలో ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు...వచ్చే ఏడాది మార్చి వరకు ఎంత వ్యయం చేయనున్నారనే దానిపై సీఎం చంద్రబాబు ఇటీవల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ 15 పేజీలతో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఉద్యోగుల వేతనాల కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.11,827 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు మరో రూ.16,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది.
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం రూ.30,403 కోట్లు కేటాయించగా ఇందులో రూ.28,327 కోట్లే వ్యయం అవుతుందని, రూ.2,076 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మిగులుకు ప్రధాన కారణం.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా వేల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొల గించింది. దీంతో వేతనాల కేటాయింపుల్లో ఖర్చులుపోగా మిగులు ఏర్పడుతోంది.
జీతాలేతర వ్యయంలోనూ మిగులే
జీతాలేతర వ్యయంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.225 కోట్లు మిగులుతాయని ఆర్థికశాఖ అంచనా వేసింది. జీతాలేతర వ్యయానికి బడ్జెట్‌లో రూ.2,839 కోట్లు కేటాయించారు. దీంట్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,009 కోట్లు ఖరుచ చేయగా, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రూ.1,605 కోట్లు ఖర్చవుతుందని అంచనా.