ఆ ఇల్లు.. ఆనందాల హరివిల్లు | aa illu.. anamdala harivillu | Sakshi
Sakshi News home page

ఆ ఇల్లు.. ఆనందాల హరివిల్లు

Published Sun, Feb 26 2017 9:45 PM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

ఆ ఇల్లు.. ఆనందాల హరివిల్లు

ఆ ఇల్లు.. ఆనందాల హరివిల్లు

తీవ్రవాదలు చెరనుంచి స్వగృహానికి చేరిన డాక్టర్‌ రామ్మూర్తి
ఏలూరు అర్బన్‌ :
సెప్టెంబర్‌ 2015. లిబియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్న రోజులవి. వైద్యునిగా పనిచేసేందుకు ఆ దేశానికి వెళ్లిన ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామ శివారు దొండపాడు వాసి డాక్టర్‌ కొసనం రామ్మూర్తి అప్పటికే అక్కడ అవస్థలు పడుతున్నారు. స్వగ్రామానికి బయలుదేరేందుకు సమాయత్తమయ్యారు. అదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని.. ఏదోరకంగా ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 8న లిబియాలోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కొద్దిక్షణాల్లో విమానం ఎక్కాల్సిన ఆయనను అక్కడే మాటువేసిన ఇస్లామిక్‌ తీవ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. రోజులు గడుస్తున్నా.. రామ్మూర్తి ఇంటికి రాలేదు. ఉగ్రవాదుల చెరలో బందీ అయ్యారని తెలిసి ఆయన కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. నిరాశా.. నిస్పృహలు ఆవహించాయి. ఆశలపై చీకటి కమ్మేసిన వేళ భార్యాబిడ్డలను చూసుకోగలనా అనే ఆందోళన ఒకవైపు.. తీవ్రవాదుల చిత్రహింసలు మరోవైపు రామ్మూర్తిని వెంటాడాయి. ఆయన బతికే ఉన్నాడా.. ఇంటికి చేరే పరిస్థితి ఉందా అనే భయాందోళనలు కుటుంబ సభ్యుల్ని వెన్నాడాయి. ఎట్టకేలకు వారి 18 నెలల నిరీక్షణ ఫలించింది. డాక్టర్‌ రామ్మూర్తి ఆదివారం ఉదయం దొండపాడులోని తన ఇంటికి చేరుకున్నారు. అతన్ని చూసిన భార్యాబిడ్డల ఆనందానికి అవధులు లేవు. ఆనంద బాష్పాల నడుమ ఆ ఇల్లు ఆనందాల హరివిల్లే అయ్యింది.
 
నరకం చూశా
డాక్టర్‌ రామ్మూర్తి తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. తీవ్రవాదుల చెరలో చిక్కి 18 నెలలపాటు నరకం చూశానని చెప్పారు. తాను స్వదేశానికి తిరిగొస్తాననే ఆశ కోల్పోయానని.. బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్కిస్తూ గడిపానన్నారు. మచిలీపట్నం సమీపంలోని కప్పలగుంట గ్రామానికి చెందిన తాను 2009లో వైద్యునిగా పనిచేసేందుకు లిబియా వెళ్లినట్టు చెప్పారు. 2014లో కాంట్రాక్ట్‌ ముగిసిందని.. అక్కడి అధికారుల విజ్ఞప్తి మేరకు మరికొన్ని నెలలు అక్కడే ఉన్నానని తెలిపారు. అయితే, లిబియాలో కల్లోల పరిస్థితులు తలెత్తాయని.. 2015 సెప్టెంబర్‌ 8న స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమై విమానం ఎక్కబోతుండగా అక్కడి తీవ్రవాదులు తనను అపహరించుకుపోయారని వివరించారు. తీవ్రవాద శిబిరంలోని వారికి వైద్య సేవలందించేందుకు తనను బందీగా చేసుకున్నారని చెప్పారు. కొన్ని నెలల అనంతరం తీవ్రవాదులు, లిబియా సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయని.. ఆ ఘటనలో మూడు తూటాలు తన శరీరంలోకి దూసుకుపోయాయని వెల్లడించారు. దాంతో తాను ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నానని చెప్పారు. తీవ్రవాదులు తనను సిర్త్‌ అనే ప్రదేశంలో ఉంచి నాటు పద్ధతిలో చికిత్స అందించారన్నారు. సరైన మందులు కూడా లేవని, వైద్యం చేసే పరిస్థితి లేక తన ఎడమ చేతి మణికట్టులో దిగిన బుల్లెట్‌ను అలాగే ఉంచేశారని చెప్పారు. ఎట్టకేలకు తాను బందీగా ఉన్న ప్రాంతాన్ని ఆ దేశ సైన్యం స్వాధీనం చేసుకోవడంతో తన కష్టాలు కొంతమేర తగ్గాయని.. అక్కడి మిలటరీ అధికారులకు తన గోడు వెళ్లబోసుకోవడంతో వారు భారత రాయబార కార్యాలయ వర్గాలతో మాట్లాడించారని తెలిపారు. రాయబార శాఖ అధికారులు తక్షణం స్పందించారని.. తనను భారత్‌కు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. వారి చొరవతో ఈ నెల 25వ తేదీన ఢిల్లీ చేరుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నానని వివరించారు. అనంతరం రామ్మూర్తిని భారత రాయబార శాఖ అధికారులు విమానంలో గన్నవరం పంపించడంతో కథ సుఖాంతమైంది.
 
కుటుంబ సభ్యుల్లో ఆనందం 
డాక్టర్‌ రామ్మూర్తి క్షేమంగా ఇంటికి చేరడంతో ఆయన భార్య అన్నపూర్ణ భవాని, కుమారుడు పవన్‌కుమార్, కుమార్తె నిదిషా ఆనందం అవధులు దాటింది. ఆయన కిడ్నాప్‌ అయ్యారనే విషయం తెలిసినప్పటినుంచి తాము ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవించామని రామ్మూర్తి భార్య, బిడ్డలు చెప్పారు. ఆయన ఎలా ఉన్నారో తెలియక.. కనీసం క్షేమ సమాచారం కూడా అందక.. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వింటామో అన్న భయంతో వణికిపోయామని గుర్తు చేసుకున్నారు. ఫోన్‌ మోగినా భయంతో తల్లడిల్లిపోయేవాళ్లమని.. ఏడాదిన్నర పాటు కంటిమీద కునుకులేకుండా గడిపామని చెప్పారు. ఆయన క్షేమంగా తిరిగి రావడంతో తమకు పునర్జన్న వచ్చినట్టుందని.. దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement