జనగణనకు ఆధార్ జోడీ
- నవంబర్‌లో ఇంటింటి సర్వే
- కుటుంబ వివరాల అప్‌డేషన్
- ఆధార్ కార్డు నంబర్ల సీడింగ్
సాక్షి, హైదరాబాద్: జనగణన తరహాలోనే మరో ఇంటింటి సర్వేకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్‌పీఆర్)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2011 జన గణన సమాచారానికి ఇప్పుడున్న తాజా మార్పులు చేర్పులను జోడించనుంది. పనిలో పనిగా ఆధార్ కార్డులను ఎన్‌పీఆర్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఆరంభమైంది.
రాష్ట్ర ప్రభుత్వం నవంబరులో ఈ సర్వే చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు ఇంటింటి సర్వే చేయాలని ప్రణాళిక విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనుంది. డిసెంబరు 31లోగా సర్వేను పూర్తి చేసి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. పది రోజుల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నివాసితుల వివరాల్లో చోటుచేసుకున్న మార్పులను కొత్తగా నమోదు చేస్తారు. నివాసితుడి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామా, జన్మ స్థలం లాంటి వివరాల్లో మార్పులుంటే సరిదిద్దుతారు. 2011 జనాభా లెక్కల్లో నమోదు కాని కుటుంబాలు, సభ్యుల వివరాలుంటే తాజాగా నమోదు చేస్తారు.
తెలంగాణలో ఇప్పటివరకు 98.5 శాతం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది. సర్వే సందర్భంగా ఆధార్ కార్డు ఇప్పటికీ అందని కుటుంబాలుంటే వారి దగ్గరున్న ఎన్‌రోల్‌మెంట్ నంబర్లతో లింక్ చేస్తారు. ఇవి రెండూ లేకుంటే.. ఆధార్‌లో నమోదు కాలేదంటూ రికార్డుల్లో పేర్కొంటారు. ఆధార్‌ని తప్పనిసరి చేయవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈ వివరాలు ఇవ్వటానికి ఎవరైనా నిరాకరిస్తే ‘నాట్ గివెన్’ అని రాయాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే తమ దగ్గరున్న ఎన్‌పీఆర్ డేటాబేస్ ప్రకారం ఉన్న చిరునామాలో ఆ కుటుంబం లేకపోతే.. సర్వే అధికారులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తారు. జనాభా లెక్కల సర్వే తరహాలోనే ఈ వివరాల సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ సీడింగ్‌తో కూడిన ఈ డేటాబేస్ అత్యంత ప్రామాణికంగా నిలుస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ కుటుంబ వివరాల అప్‌డేషన్.. ఆధార్ కార్డుల సీడింగ్ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అధికారులకు శిక్షణ ఇచ్చామని, అక్టోబరు మొదటి వారం నుంచి జిల్లా స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో శిక్షణ తరగతులను పూర్తి చేస్తామని ఆచార్య వివరించారు.