మన్యంకొండ దేవస్థానంలో దర్శనానికి బారులు తీరిన భక్తులు
మన్యంకొండకు పోటెత్తిన భక్తులు
Published Sat, Aug 13 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
దేవరకద్ర రూరల్: మన్యంకొండలో లక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందేహంతో పోటెత్తింది. శ్రావణమాసంలోని రెండవ శనివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి కొన్ని వేల మంది భక్తులు స్వామి దర్శనానికి తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో మన్యంకొండ జనసంద్రాన్ని తలపించింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా దేవస్తానం ముందున్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే భక్తులు దేవస్థాన ప్రధాన ద్వారం నుంచి గర్భగుడి వరకు దర్శనానికి బారులు తీరారు. కొంత మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దేవస్థానంతో పాటు పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది భక్తులు వ్రతాలు కూడా నిర్వహించారు. విశేష దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వెంకటాచారి, చైర్మన్ ఆళహరి నారాయణస్వామి, మధుసూదన్‌కుమార్, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement