manyamkonda
-
Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పర్యాటకులకు ఇక పండగే (ఫొటోలు)
-
మహబూబ్‌నగర్: గుర్తు తెలియని వాహనం ఢీ.. చిరుత మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని మన్నెంకొండ సమీపంలో కాకతీయ స్కూల్ వద్ద రోడ్డుపై చిరుత పులి మృత్యువాత పడింది. రోడ్డుపై చనిపోయి పడిఉన్న చిరుతను స్దానికులు గుర్తించారు. అయితే చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం తెలియటంతో ఫారెస్టు అధికారులు ఘటన స్ధలాన్ని పరిశీలించారు. చిరుత వయస్సు రెండేళ్లు ఉంటుందని చెబుతున్నారు .కాగా 12 ఏళ్ల క్రితం ఇలాగే ఓ చిరుత చనిపోయిందని స్దానికులు చెబుతున్నారు. 167 జాతీయ రహదారికి ఇరువైపుల మన్నెంకొండ, చౌదర్ పల్లి గుట్టలు ఉండటంతో తరచు చిరుతలు రోడ్డు దాటుతుంటాయని అంటున్నారు. చిరుత మృతిపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు -
తెలంగాణ తిరుపతి ‘మన్యంకొండ’
సాక్షి, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతోంది. ఉలి ముట్టని స్వామి, చెక్కని పాదాలు, తవ్వని కోనేరు స్వామివారి దేవస్థానం ప్రత్యేకత. ఆర్థికస్తోమత లేని భక్తులు తిరుపతి వెళ్లకుండా మన్యంకొండ స్వామిని దర్శించుకుంటే అంతే పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. అంతటి విశిష్టత కలిగిన మన్యంకొండ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఏటా స్వామివారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వివిధ డిపోల నుంచి మన్యంకొండ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్సవాలు తిరుపతి నుంచీ మన్యంకొండ స్టేజీ నుంచి దేవస్థానం వరకు ప్రత్యేక మినీ బస్సులను తెప్పించి నడుపుతారు. 3 కి.మీ. ఘాట్‌రోడ్డు మన్యంకొండ స్టేజీ నుంచి గుట్టపై వరకు సుమారు 3 కి.మీ. ఘాట్‌రోడ్డు ఉంది. ఎత్తయిన గుట్టపై స్వామి కొలువుదీరారు. చుట్టూ గుట్టలు, పచ్చని వాతావరణం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవస్థానానికి వచ్చే భక్తులు గుట్టపై నుంచి ఇరువైపులా నుంచి కిందికి చూస్తే చల్లని గాలి హాయిలో పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. దేవస్థానం ముందు కోనేరు ఉంది. అలాగే ఈ కోనేరుకు సమీపంలో ఉలి ముట్టని స్వామివారి పాదాలున్నాయి. ఈ పాదాలకు సమీపంలోని గుట్టపై గతంలో మునులు తపస్సు చేసిన గుహలున్నాయి. గతంలో ఇక్కడ మునులు తపస్సు చేసినందుకే ఈ ప్రాంతాన్ని మన్యంకొండగా వినతికెక్కినట్లు పురాణగాథ. అలాగే దిగువకొండ వద్ద అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. స్టేజీకి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఈ పుణ్యక్షేత్రం కొలువుదీరింది. దేవస్థానంలో ఏటా వందలాది వివాహాలు జరుగుతాయి. ఇలా వెళ్లాలి.. హైదరాబాద్ నుంచి కర్ణాటక, రాయచూర్, నారాయణపేట, ఆత్మకూర్, మక్తల్, యాద్గిర్‌కు బస్సులు మహబూబ్‌నగర్ మీదుగా మన్యకొండకు వెళ్తుంటాయి. మహబూబ్‌నగర్ నుంచి 19 కి.మీ. దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది. అలాగే రాయచూర్ నుంచి రావాలంటే హైదరాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కి మన్యంకొండలో దిగవచ్చు. స్టేజీ నుంచి గుట్టపైకి ప్రత్యేక ఆటోల సౌకర్యం ఉంది. విశేష దినోత్సవాల్లో మినీ బస్సులు గుట్టపైకి వెళ్తుంటాయి. అలాగే రైలు మార్గం ద్వారా వెళ్లే ప్రయాణికులు ఇటు కర్నూల్, అటు హైదరాబాద్ నుంచి రావాలంటే మార్గమధ్యలోని కోటకదిర రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి మన్యంకొండ స్టేజీ వరకు ఆటోలు వెళ్తుంటాయి. -
మన్యం కొండ తెలంగాణ తిరుపతి
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా... కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మన్యంకొండ దేవస్థానం. తిరుపతి వెళ్లలేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సుచేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. సుమారు 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం... ప్రత్యేకతలు. ఆహ్లాదభరిత వాతావరణం... ఎల్తైన గుట్టలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం, ఒడలు పులకింప జేసే చల్లనిగాలి, గుట్టపైనుంచి వచ్చే ఓంకారనాదం భక్తులను కట్టిపడేస్తాయి. దేవస్థానం చరిత్ర... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీరప్రాంతంలోగల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో అర్ఘ్యం వదులుతుండగా చెక్కని శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషశాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. హనుమద్దాసుల కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతోపాటు స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చిపులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం మన్యంకొండ దిగువ కొండవద్ద అలమేలు మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. స్థలపురాణం... శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానానికి 58 ఏళ్ల చరిత్ర ఉంది. 1937లో అప్పటి నైజాంసర్కార్ దేవస్థానం నిర్మాణానికి దిగువ కొండ వద్ద 42 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఎలా వెళ్లాలి..? హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగితే మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే మహబూబ్‌నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. పాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. – అబ్దుల్ మొక్తదీర్,సాక్షి, దేవరకద్ర రూరల్, మహబూబ్‌నగర్ జిల్లా -
మన్యంకొండలో వైభవంగా శేషవాహన సేవ
దేవరకద్ర రూరల్ : మన్యంకొంలోని లక్ష్మీవేంటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం అర్ధరాత్రి స్వామివారి శేష వాహనసేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతుల విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, రకరకాల పూలతో స్వామి దంపతులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చన నిర్వహించారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని పుష్కరాలకు వెళ్లే చాలా మంది భక్తులు అంతకుముందు జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని రాత్రి ఇక్కడే బస చేశారు. దీంతో మన్యంకొండలో భక్తుల రద్దీ కనిపించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి నారాయణస్వామి, సభ్యుడు మధుసూదన్‌కుమార్, ఈఓ కె.శ్రీనివాసమూర్తి, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. -
మన్యంకొండకు పోటెత్తిన భక్తులు
దేవరకద్ర రూరల్: మన్యంకొండలో లక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందేహంతో పోటెత్తింది. శ్రావణమాసంలోని రెండవ శనివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి కొన్ని వేల మంది భక్తులు స్వామి దర్శనానికి తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో మన్యంకొండ జనసంద్రాన్ని తలపించింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా దేవస్తానం ముందున్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే భక్తులు దేవస్థాన ప్రధాన ద్వారం నుంచి గర్భగుడి వరకు దర్శనానికి బారులు తీరారు. కొంత మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దేవస్థానంతో పాటు పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది భక్తులు వ్రతాలు కూడా నిర్వహించారు. విశేష దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వెంకటాచారి, చైర్మన్ ఆళహరి నారాయణస్వామి, మధుసూదన్‌కుమార్, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగం...
మన్యంకొండ (దేవరకద్ర రూరల్), న్యూస్‌లైన్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగ తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం కన్నులపండువగా జరిగింది. ముందుగా ప్రత్యేక అలంకరణలో ఉన్న వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తుల విగ్రహాలను గర్భగుడి నుంచి శేషసాయి వాహనంలో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన మండపంలో అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవింద నామస్మరణతో కల్యాణ మండపం మార్మోగింది. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రకరకాల పూలు, బంగారు అభరణాలు, నూతన వస్త్రధారణల మధ్య వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ అమ్మవారు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం అధికారులు భ క్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణమహోత్సవ ఘటాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వద్ద రకరకాల తినుబండారాలు, ఆట వస్తువులు తదితర దుకాణాలు వెలిశాయి. కార్యక్రమంలో దేవస్థానం వంశపార్యపర ధర్మకర్త అళహరి నారాయణస్వామి, ఈఓ రాఘవేంద్రరావు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు పాల్గొన్నారు.