మన్యంకొండ (దేవరకద్ర రూరల్), న్యూస్‌లైన్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగ తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం కన్నులపండువగా జరిగింది.
ముందుగా ప్రత్యేక అలంకరణలో ఉన్న వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తుల విగ్రహాలను గర్భగుడి నుంచి శేషసాయి వాహనంలో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన మండపంలో అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవింద నామస్మరణతో కల్యాణ మండపం మార్మోగింది. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
రకరకాల పూలు, బంగారు అభరణాలు, నూతన వస్త్రధారణల మధ్య వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ అమ్మవారు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం అధికారులు భ క్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణమహోత్సవ ఘటాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వద్ద రకరకాల తినుబండారాలు, ఆట వస్తువులు తదితర దుకాణాలు వెలిశాయి. కార్యక్రమంలో దేవస్థానం వంశపార్యపర ధర్మకర్త అళహరి నారాయణస్వామి, ఈఓ రాఘవేంద్రరావు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు పాల్గొన్నారు.