చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు | Over 7 Lakh Devotees Take Darshan Of Lord Venkateswara At Tirumala Temple During Srivari Brahmotsavam | Sakshi
Sakshi News home page

చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు

Published Thu, Oct 10 2019 4:12 AM | Last Updated on Thu, Oct 10 2019 4:12 AM

Over 7 Lakh Devotees Take Darshan Of Lord Venkateswara At Tirumala Temple During Srivari Brahmotsavam - Sakshi

చక్రస్నానం నిర్వహిస్తున్న వేద పండితులు

తిరుమల: లక్షలాది భక్తుల జయజయ ధ్వానాల నడుమ 9 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. చివరి రోజైన మంగళవారం ఉదయం 3 గంటల నుంచే పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. వివిధ వాహనాలపై ఊరేగి అలసి సొలసిన శ్రీవారు తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ, పండితుల వేదఘోష, అశేష భక్త జన గోవింద నామ స్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు.

భక్తులు సైతం పుష్కరిణిలో పెద్దఎత్తున ఆచరించి పునీతులయ్యారు. వేడుకగా సాగిన ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టి, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌ పాల్గొన్నారు. అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆగమ శాస్త్రోక్తంగా గరుడ పతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాల్ని ముగించారు. 

వచ్చిన భక్తులు 7 లక్షల పైనే.. 
బ్రహ్మోత్సవాల సందర్భంగా 7.07 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గరుడ సేవ రోజున శ్రీవారి మూలమూర్తిని 92 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. 7 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ పెట్టామని, 34.01 లక్షల లడ్డూలను విక్రయించామని తెలిపారు. హుండీ ద్వారా రూ.20.40 కోట్లు, వగపడి ద్వారా రూ.8.82 కోట్ల ఆదాయం లభించిందని వివరించారు. స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 3.23 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. 8 రోజుల్లో 26 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం, 13.67 లక్షల యూనిట్ల పాలు, టీ, కాఫీలను భక్తులకు అందించామని వివరించారు. గరుడ సేవ రోజున 2.47 లక్షల మందికి అన్న ప్రసాదాలు, అల్పాహారం, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5 లక్షల తాగునీటి బాటిళ్లు అందించినట్టు వెల్లడించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.50 లక్షల జియో ట్యాగ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసిన టీటీడీ అధికారులకు, సిబ్బందికి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి ధన్యవాదాలు తెలిపారు. 

వేడుకగా బాగ్‌ సవారి ఉత్సవం 
బ్రహ్మోత్సవాల ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం బాగ్‌ సవారి ఉత్సవం నిర్వహించారు. తన భక్తుడైన అనంతాళ్వారు భక్తికి మెచ్చిన స్వామివారు బ్రహ్మోత్సవాల మరునాడు అనంతాళ్వారు తోటలోకి అప్రదక్షిణంగా వెళ్లి.. తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారని ప్రతీతి. అందులో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. 

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌
తిరుమల శ్రీవారిని విజయదశమినాడు ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి మహాద్వారం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఈవో, అడిషనల్‌ ఈవోలు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో జస్టిస్‌ మహేశ్వరికి ఆశీర్వచనం అందించారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడిని కూడా దర్శించుకున్నారు.

సమష్టి కృషితో విజయవంతం 
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషితోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చక్రస్నానం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. వాహన బేరర్లు ఎంతో భక్తిభావంతో వాహనాలను మోశారని.. ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈవో, సీవీఎస్‌వోతోపాటు ఉన్నతాధికారులు విశేష సేవలందించారని కొనియాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement