Brahmostavalu in Tirumala
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎం కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్‌కు ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు. చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన) -
సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్రమ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు అనుగ్రహిస్తారు. చదవండి: కల్పవృక్ష వాహనంపై మలయప్ప -
కల్పవృక్ష వాహనంపై మలయప్ప
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో అభయమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమివ్వనున్నారు. చదవండి: తిరుపతి బండికి ఎగనామం -
చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు
తిరుమల: లక్షలాది భక్తుల జయజయ ధ్వానాల నడుమ 9 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. చివరి రోజైన మంగళవారం ఉదయం 3 గంటల నుంచే పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. వివిధ వాహనాలపై ఊరేగి అలసి సొలసిన శ్రీవారు తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ, పండితుల వేదఘోష, అశేష భక్త జన గోవింద నామ స్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రాళ్వార్కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. భక్తులు సైతం పుష్కరిణిలో పెద్దఎత్తున ఆచరించి పునీతులయ్యారు. వేడుకగా సాగిన ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ పాల్గొన్నారు. అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆగమ శాస్త్రోక్తంగా గరుడ పతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాల్ని ముగించారు. వచ్చిన భక్తులు 7 లక్షల పైనే.. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7.07 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గరుడ సేవ రోజున శ్రీవారి మూలమూర్తిని 92 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ పెట్టామని, 34.01 లక్షల లడ్డూలను విక్రయించామని తెలిపారు. హుండీ ద్వారా రూ.20.40 కోట్లు, వగపడి ద్వారా రూ.8.82 కోట్ల ఆదాయం లభించిందని వివరించారు. స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 3.23 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. 8 రోజుల్లో 26 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం, 13.67 లక్షల యూనిట్ల పాలు, టీ, కాఫీలను భక్తులకు అందించామని వివరించారు. గరుడ సేవ రోజున 2.47 లక్షల మందికి అన్న ప్రసాదాలు, అల్పాహారం, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5 లక్షల తాగునీటి బాటిళ్లు అందించినట్టు వెల్లడించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.50 లక్షల జియో ట్యాగ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసిన టీటీడీ అధికారులకు, సిబ్బందికి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి ధన్యవాదాలు తెలిపారు. వేడుకగా బాగ్ సవారి ఉత్సవం బ్రహ్మోత్సవాల ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం బాగ్ సవారి ఉత్సవం నిర్వహించారు. తన భక్తుడైన అనంతాళ్వారు భక్తికి మెచ్చిన స్వామివారు బ్రహ్మోత్సవాల మరునాడు అనంతాళ్వారు తోటలోకి అప్రదక్షిణంగా వెళ్లి.. తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారని ప్రతీతి. అందులో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరుమల శ్రీవారిని విజయదశమినాడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి మహాద్వారం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఈవో, అడిషనల్ ఈవోలు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో జస్టిస్ మహేశ్వరికి ఆశీర్వచనం అందించారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడిని కూడా దర్శించుకున్నారు. సమష్టి కృషితో విజయవంతం టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషితోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చక్రస్నానం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. వాహన బేరర్లు ఎంతో భక్తిభావంతో వాహనాలను మోశారని.. ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈవో, సీవీఎస్వోతోపాటు ఉన్నతాధికారులు విశేష సేవలందించారని కొనియాడారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై శ్రీవారు
-
బ్రహ్మోత్సవాలు: నమో నారసింహా..
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా సాగుతున్నాయి. తొలి రెండు రోజులు వాహన సేవల్లో కోలాహలం తగ్గినా మూడోరోజు కొంత సందడి కనిపించింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం ఉదయం సువర్ణ సింహ వాహనంపై వేంకట నారసింహుడి అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. గజ, తురగ, పదాతిదళాలు, కోలాటాలు, పండరి భజనలు, కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ముందు సాగుతుండగా.. జీయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం, వేద ఘోష నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. వజ్రవైఢూర్య మణిమాణిక్యాది స్వర్ణాభరణాలు, పరిమళభరిత పుష్పమాలికతో విశేషంగా అలంకృతుడైన స్వామివారిని దర్శించి అశేష భక్తజనులు పారవశ్యం చెందారు. ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రి ముత్యపు పందిరిపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగాయి. తిరుమల దివ్యక్షేత్రం విద్యుద్దీపతోరణాలు, దేవతామూర్తుల కటౌట్లతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. – తిరుమల తిరుమంజనంలో సేద తీరిన శ్రీవారు సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం మధ్యాహ్నం ఆలయంలోని రంగనాయక మండపంలో స్నపన తిరుమంజనం సేవలో శ్రీవారు సేద తీరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, రాత్రి వివిధ వాహనాలపై విహరిస్తూ అలసిపోయే స్వామివారిని సేద తీర్చేందుకు స్నపన తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. రెండో రోజు, మూడో రోజు ఈ స్నపన తిరుమంజనం నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా రంగనాయక మండపాన్ని పరిమళభరిత పుష్పతోరణాలు, విద్యుద్దీపాలంకరణలతో అలంకరించారు. జీయంగార్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉదయం కల్పవృక్ష వాహనం బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు గురువారం ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై స్వామివారు విహరిస్తారు. కల్పవృక్షం అం టే కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుం ది. మనసారా పిలిచే భక్తులకు అడగకుం డానే వరాలు ఇచ్చే దేవదేవుడు వేంకటా ద్రివాసుడు. కల్పవృక్షం అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీరుస్తుంది. స్వామి వారు శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువు కల్పవృక్షంపై విహరించే స్వా మివారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయి. ఉదయం 9 గంటలకు వాహన సేవ ప్రారంభమవుతుంది. రాత్రి సర్వభూపాల వాహనం బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు సమస్త భూపాలులందరికీ తానే భూపాలుడునని లోకానికి చాటుతూ సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుం చి 10 గంటల వరకు ఈ వాహన సేవ జరుగుతుంది. సర్వభూపాల వాహన సేవను దర్శిస్తే అహంకారం తొలగి శాశ్వతమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరఫున ఆయన సేనాని విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించడం అనాదిగా వస్తోంది. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 9 పాళికలలో (కుండలు) శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు నవధాన్యాలతో అంకురార్పణం చేశారు. కార్యక్రమానికి సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. ఉత్సవాలు విజయవంతం కావాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. -
అక్టోబర్ 5 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అక్టోబర్ 5 నుంచి 13వ తేదీ వరకు తిరుమల శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అఖిలాండ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. 8 రోజుల పాటు స్వామివారికి వివిధ సేవలు చేస్తారు. 5వ తేదీన ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 9న గరుడసేవ, 10న స్వామివారిని స్వర్ణ రథంపై ఊరేగిస్తారు. 13న చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ నెల 8 నుంచి 17 వరకు తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో వరసిద్ధి వినాయక ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 17 నుంచి19 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.