బ్రహ్మోత్సవాలు: నమో నారసింహా.. | Tirumala Brahmotsavam At Fourth Day | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలు: నమో నారసింహా..

Published Thu, Oct 3 2019 11:36 AM | Last Updated on Thu, Oct 3 2019 11:36 AM

Tirumala Brahmotsavam At Fourth Day - Sakshi

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా సాగుతున్నాయి. తొలి రెండు రోజులు వాహన సేవల్లో కోలాహలం తగ్గినా మూడోరోజు కొంత సందడి కనిపించింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం ఉదయం సువర్ణ సింహ వాహనంపై వేంకట నారసింహుడి అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. గజ, తురగ, పదాతిదళాలు, కోలాటాలు, పండరి భజనలు, కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ముందు సాగుతుండగా.. జీయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం, వేద ఘోష నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. వజ్రవైఢూర్య మణిమాణిక్యాది స్వర్ణాభరణాలు, పరిమళభరిత పుష్పమాలికతో విశేషంగా అలంకృతుడైన స్వామివారిని దర్శించి అశేష భక్తజనులు పారవశ్యం చెందారు. ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రి ముత్యపు పందిరిపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగాయి. తిరుమల దివ్యక్షేత్రం విద్యుద్దీపతోరణాలు, దేవతామూర్తుల కటౌట్లతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.      
– తిరుమల 

తిరుమంజనంలో సేద తీరిన శ్రీవారు
సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం మధ్యాహ్నం ఆలయంలోని రంగనాయక మండపంలో స్నపన తిరుమంజనం సేవలో శ్రీవారు సేద తీరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, రాత్రి వివిధ వాహనాలపై విహరిస్తూ అలసిపోయే స్వామివారిని సేద తీర్చేందుకు స్నపన తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. రెండో రోజు, మూడో రోజు ఈ స్నపన తిరుమంజనం నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా రంగనాయక మండపాన్ని పరిమళభరిత పుష్పతోరణాలు, విద్యుద్దీపాలంకరణలతో అలంకరించారు. జీయంగార్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2  నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 



ఉదయం కల్పవృక్ష వాహనం 
బ్రహ్మోత్సవాల్లో  నాల్గవరోజు గురువారం ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై స్వామివారు విహరిస్తారు. కల్పవృక్షం అం టే కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుం ది. మనసారా పిలిచే భక్తులకు అడగకుం డానే వరాలు ఇచ్చే దేవదేవుడు వేంకటా ద్రివాసుడు. కల్పవృక్షం అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీరుస్తుంది. స్వామి వారు శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువు కల్పవృక్షంపై విహరించే స్వా మివారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయి. ఉదయం 9 గంటలకు వాహన సేవ ప్రారంభమవుతుంది.

రాత్రి సర్వభూపాల వాహనం బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు సమస్త భూపాలులందరికీ తానే భూపాలుడునని లోకానికి చాటుతూ సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8  నుం చి 10 గంటల వరకు ఈ వాహన సేవ జరుగుతుంది.  సర్వభూపాల వాహన సేవను దర్శిస్తే అహంకారం తొలగి శాశ్వతమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement