
తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరఫున ఆయన సేనాని విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించడం అనాదిగా వస్తోంది. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
9 పాళికలలో (కుండలు) శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు నవధాన్యాలతో అంకురార్పణం చేశారు. కార్యక్రమానికి సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. ఉత్సవాలు విజయవంతం కావాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు.