tirumala srivari brahmotsavam
-
వైభవంగా గరుడోత్సవం
-
మోహినీ అవతారంలో శ్రీవారు.. భక్తులతో నిండిన గ్యాలరీలు
-
TTD: అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల,శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కాగా ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.ఈ సమావేశంలో ఎస్విబిసి సిఇఓ శ్రీ షణ్ముఖ్‌కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
-
తిరుమల: సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయం
-
భక్తుల మధ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: తిరుమలపై వేంచేసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన వాహన సేవలను మాడ వీధుల్లో నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 1న గరుడ సేవ జరుగనుందని చెప్పారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి వివరించారు. ముఖ్య నిర్ణయాలివీ ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల నిర్వహణ. తిరుమల వచ్చే భక్తులను ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా దర్శనానికి పంపే విధానం కొనసాగింపు. తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ కౌంటర్ల ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో మిగిలిన పనులను రూ.7 కోట్లతో పూర్తి చేయడానికి నిర్ణయం. రూ.2.90 కోట్లతో అమరావతిలోని శ్రీవారి ఆలయం వద్ద పూల తోటల పెంపకం, పచ్చదనం పెంపొందించేందుకు ఆమోదం. 2023వ సంవత్సరానికి 8 రకాల క్యాలెండర్లు, డైరీలు కలిపి 33 లక్షల ప్రతులు ముద్రించాలని నిర్ణయం. సప్తగిరి మాసపత్రికను 5 భాషల్లో నెలకు 2.10 లక్షల కాపీలు ముద్రించేందుకు నిర్ణయం. చెన్నైకి చెందిన భక్తురాలు డాక్టర్ పర్వతం తిరువాన్మయూర్, ఉత్తాండి ప్రాంతాల్లో రూ.6 కోట్లు విలువ చేసే రెండు ఇళ్లను శ్రీవారికి కానుకగా అందించాలని ముందుకు రాగా వాటిని స్వీకరించేందుకు ఆమోదం. అమెరికాకు చెందిన డాక్టర్ రామనాథం గుహ బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న రూ.3.23 కోట్ల విలువచేసే అపార్ట్‌మెంట్‌ను స్వామివారికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విరాళాన్ని స్వీకరించడానికి ఆమోదం. బూందీ పోటు ఆధునికీకరణపై అధ్యయనానికి ఆదేశం తిరుమల బూందీ పోటు ఆధునికీకరణకు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయం, ధరల ఖరారుకు మార్క్‌ఫెడ్ అధికారులతో అవగాహన ఒప్పందం. శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులపై ఆగమ పండితులతో చర్చించి నిర్ణయం. మావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కృష్ణారావు, పార్థసారధిరెడ్డి, మారుతీ ప్రసాద్, రాజేష్‌కుమార్‌శర్మ, మొరంశెట్టి రాములు, నందకుమార్, విద్యాసాగర్‌రావు, సనత్‌కుమార్, శశిధర్, మల్లీశ్వరి, శంకర్, విశ్వనాథ్, మధుసూదన్‌యాదవ్, సంజీవయ్య, వైద్యనాథన్ కృష్ణమూర్తి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు. అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు తిరుమల: అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఏపీఎన్ఆర్టీఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి 9 నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు సోమవారంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు నిర్వహించారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు జరిగాయి. ఈ నెల 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9న అట్లాంటా, 10న బర్మింగ్ హమ్ నగరాల్లో కల్యాణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. -
ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా చక్రస్నాన మహోత్సవం
-
కొత్త కాంతుల దసరా!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రతి మోములోనూ దసరా సంబరం శోభిల్లుతోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రమంతటా పండుగ సందడి మొదలైంది. ఊరూరా, వాడవాడలా దుర్గాదేవి విగ్రహాలు ఏర్పాటు చేసి, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నా పెద్దా అంతా దసరా వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వస్తున్న వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. కొత్త బట్టలు, ఆభరణాలు, గృహోపకరణాలు, వాహనాల కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రాష్ట్రమంతా పండుగ కళ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలకు భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు. శ్రీశైలంలో రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్న భ్రమరాంబను దర్శించుకుని భక్తులు తన్మయులవుతున్నారు. కరువు తీరా వర్షం... కర్షకుల హర్షం దాదాపు దశాబ్దం తరువాత రాష్ట్రంలో ఈ ఏడాది కరువు తీరా వర్షాలు కురిశాయి. రుతుపవనాల రాక కొంత ఆలస్యమైనా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార, పెన్నా తదితర నదులు పొంగిపొరలుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. కృష్ణానది పరవళ్లు తొక్కడంతో ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ గేట్లు మూడుసార్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదిలారు. ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను వీలైనంత ఎక్కువగా రాయలసీమలోని ప్రాజెక్టులు, జలాశయాలకు తరలించింది. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం విశేషం. కరువుకు నెలవైన అనంతపురం జిల్లాలో వర్షాలు బాగా పడడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. ప్రకృతి కరుణించడంతో రైతులు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో ఇప్పటిదాకా రికార్డుస్థాయిలో 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇక ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద ఇప్పటిదాకా 40 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎరువుల కొరత, నకిలీ విత్తనాల బెడద లేకుండా ముందుగానే జాగ్రత్త వహిస్తోంది. పోలవరంతో సహా అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధమైంది. తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు గొప్ప ఊరట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం పేద బతుకులకు గొప్ప ఊరటనిచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్‌ను దశల వారీగా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామన్న హామీని అమలు చేశారు. ఈ ఏడాది తొలి దశ కింద పింఛన్‌ను రూ.2,250కు పెంచారు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ప్రకటించారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు... ఇలా వివిధ వర్గాల ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించడం ద్వారా కొత్తచరిత్రకు నాంది పలికారు. ఆటో, ట్యాక్సీ కార్మికులకు ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేసే పథకాన్ని ఇటీవలే ప్రారంభించారు. అర్హులైన అందరి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. రూ.1,000 దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం పేదలకు ఆరోగ్య రక్షణ కల్పించింది. అమ్మఒడి పథకాన్ని 2020 జనవరి 26న ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ బిడ్డలను చదివించగలమన్న భరోసా పేద తల్లులకు వచ్చింది. ఇక పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం ద్వారా తమది మనసున్న ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరూపించారు. యువతలో నవోత్సాహం రాష్ట్రంలో యువత ఈ ఏడాది నిజమైన దసరా ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగాల విప్లవం సృష్టించారు. ఒకేసారి 4 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక 2.68 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారు. ఇకపై ప్రతిఏటా జనవరిలో రిక్రూట్మెంట్ క్యాలండర్ ప్రకటిస్తామని చెప్పారు. పల్లెలు ప్రశాంతం... పేద కుటుంబాల్లో ఆనందం మద్యం బెల్టు దుకాణాలకు చరమ గీతం పాడడంతో పల్లెసీమలు ప్రశాంతతకు మారుపేరుగా మారాయి. పేదల బతుకుల్లో చిచ్చు పెడుతున్న బెల్టు షాపులను పూర్తిగా తొలగించడం ద్వారా ముఖ్యమంత్రి తన నిబద్ధతను చాటుకున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బెల్టు షాపుల విజృంభణ వల్ల గ్రామాల్లో సామాజిక వాతావరణం దెబ్బతిని, దసరా ఉత్సవాల్లో అపశృతులు దొర్లేవి. మద్యం బెల్టు షాపులను ప్రభుత్వం పూర్తిగా తొలగించడంతో ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. పేదలు తమ కష్టార్జితాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, యువత, విద్యార్థులు, పేద, మధ్య తరగతి... ఇలా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోంది. ఈ దసరా పండుగ తమకు నిజమైన ఆనందాన్ని తెచ్చిందని జనం చెబుతుండడం విశేషం. ఈ దసరా మాకు ప్రత్యేకం ఆటో కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న రూ.10 వేలు ఇచ్చారు. దీంతో మాకు ఈ దసరా ప్రత్యేకమైనదిగా మారింది. లేదంటే నిత్యం అప్పులవాళ్ల వేధింపులతో పండగ కూడా చేసుకునేవాళ్లం కాదు. జగనన్న మా కష్టాలను దూరం చేశారు. – బోనిల ఆదినారాయణ, ఆటో కార్మికుడు, తగరపువలస, విశాఖ జిల్లా మా సంతోషాలకు కారణం జగన్ నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తి వైఎస్ జగన్. యువత ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని పాదయాత్రలో ఆయనకు విన్నవించుకున్నాం. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయం. ఉద్యోగాలు సాధించిన వారి ఇళ్లల్లో నిజమైన పండుగ ఇది. జగనన్న ఇచ్చిన వరమే మా సంతోషాలకు కారణం. – జె.నవీన్ పాటి, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా మేలే జరుగుతోంది ఐదేళ్లుగా సాగుకు నీళ్లు లేక అవస్థలు పడ్డాం. కొత్త ప్రభుత్వం వచ్చాక అంతా మేలే జరుగుతోంది. సోమశిలలో పుష్కలంగా నీరొచ్చింది. రబీ సాగుకు సిద్ధమవుతున్నాం. నెల్లూరు జిల్లా నుంచే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తుండడం సంతోషకరం. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – వెడిచర్ల హరిబాబు, రామదాసుకండ్రిగ, నెల్లూరు జిల్లా నిజమైన పండుగ వచ్చింది మా జీవితంలో నిజమైన పండుగ వచ్చింది. గ్రామ సచివాలయంలో ఉద్యోగం సాధించా. ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. ఇది చాలా గర్వించదగ్గ విషయం. జీవితంలో ఇంతటి ఆనందం ఎçప్పుడూ పొందలేదు. ఇదంతా వైఎస్ జగన్ పుణ్యమే. జగనన్న మా జీవితంలో నిజమైన పండుగ తెచ్చారు. – భావన, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వి.కోట, చిత్తూరు జిల్లా -
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, జీవో జారీ
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అలాగే గత పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. త్వరలో కొత్త బోర్డు సభ్యుల నియామకం చేపట్టనుంది. కాగా నూతన చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గరుడ ఆళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. -
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
శ్రీవారి సేవల పేరిట ఘరానా మోసం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిషేకాలు చేయిస్తానని నమ్మించి వృద్ధులను మోసం చేసిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆనం రాజ్‌కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. అమీర్‌పేట డివిజన్ శివ్‌భాగ్‌కు చెందిన సుకుమార్‌రెడ్డితో అతడికి పరిచయం ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతోనే తిరుపతిలో అభిషేక పూజలు, దంపతులకు శేషవస్త్రాలను దగ్గరుండి ఇప్పిస్తానని నమ్మించాడు. అభిషేక పూజకు రూ.2500, శేషవస్త్రాల బహుకరణకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన సుకుమార్ ముందుగా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత అతను నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవచ్చని స్నేహితులు, బంధువులకు చెప్పడంతో మరో 15 మంది రాజ్‌కుమార్‌రెడ్డికి డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా దర్శనం చేయించకపోగా పత్తా లేకపోవడంతో సుకుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కన్నుల పండువగా శ్రీవారి చక్రస్నానం
-
సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు
-
సాక్షి ‘ఫన్ డే’ ఆవిష్కరణ
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ‘బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండ నీరాజనం’శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్ డే’పుస్తకాన్ని గురువారం చిన్నశేషవాహనం ఊరేగింపులో ఆవిష్కరించారు. టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక సంచిక తీసుకొచ్చిన ఘనత సాక్షి యాజమాన్యానికే దక్కిందని కొనియాడారు. తిరుమలేశుని లీలా వైభవం, కంటి మీద కునుకేలేని స్వామి, ఆలయంలోని కైంక ర్యాలు, చారిత్రక నేపథ్యం, భక్తులకు టీటీ డీ కల్పించే సౌకర్యాలు, కొత్త మార్పులతోపాటు అరుదైన ఫొటోలతో ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలతో వెలువడిన ‘ఫన్ డే’సంచిక విశ్లేషణాత్మకంగా ఉందన్నారు. సాక్షి యాజమాన్యం, విలేకరుల బృందాన్ని ఈవో అభినందించారు. ఫండే బుక్‌ను ఆవిష్కరిస్తున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ..చిత్రంలో సాక్షి ప్రతినిధులు -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరఫున ఆయన సేనాని విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించడం అనాదిగా వస్తోంది. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 9 పాళికలలో (కుండలు) శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు నవధాన్యాలతో అంకురార్పణం చేశారు. కార్యక్రమానికి సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. ఉత్సవాలు విజయవంతం కావాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. -
హంసపై వైకుంఠనాథుడు
తిరుమల/కాణిపాకం : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో గురువారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) ఆవిష్కరించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా సీనియర్ కాద్రిపతి నరసింహాచార్యులు క్రతువును, పతాకావిష్కరణ చేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులపాటు సప్తగిరి క్షేత్రంలో ఉంటూ దేవదేవుని ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలతో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ కాగా, బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయన సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు సీఎంకు పట్టువస్త్రంతో తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. పెద్దశేషుడిపై శ్రీనివాసుడు తిరుమల బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు శేషవాహనం మీద ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వారిని వాహన మండపంలో బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర, సుగంధ పరిమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 8 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. వాహనసేవ ముందు భజన బృందాల సంకీర్తనలు భక్తులను అలరించాయి. పుష్పాలంకరణ, విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం, పురవీధులు స్వర్ణకాంతులీనాయి. హంసపై వైకుంఠనాథుడు బ్రహ్మోత్సవాల రెండో రోజు శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మలయప్ప స్వామి హంస వాహనాన్ని అధిరోహించి సర్వ విద్యాప్రదాయని అయిన సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి నాందిగా కంకణం ధరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి కంకణం ధరించాలి. కాణిపాకంలోనూ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఈఓ పి.పూర్ణచంద్రరావు, చైర్మన్ వి. సురేంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖ నక్షత్రం, తులా లగ్నంలోని శుభగడియల్లో ఉ.9.30–10.15 గంటల మధ్య ఆలయ అర్చక, వేదపండితులు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూషిక పటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం రాత్రి సిద్ధి బుద్ధి సమేత ఉత్సవమూర్తులను హంస వాహనంపై పురవీధుల్లో భక్తులను ఊరేగించారు. -
శ్రివారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
-
12 నుంచి 21 వరకు ప్రత్యేక, బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. 3న గోకులాష్టమి ఆస్థానం.. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబర్ 3న రాత్రి 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం వేడుకగా నిర్వహించనున్నారు. -
స్వామికి కునుకే కరువాయెరా..!
కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు.ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. యేళ్ల తరబడి ఆ స్వామికి కంటిమీద కనుకు కష్టమైపోయిందంటే ఆశ్చర్యం ఉంది కదూ..!! అవును.. పూర్వం వేళ్ల మీద లెక్క పెట్టే భక్తజనం రావటంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. తిరుమలకొండ మీద సౌకర్యాలు పెరిగాయి. భక్తులు పెరిగారు. క్యూలు పెరిగాయి. వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనటంలో అతిశయోక్తిలేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్త జనులకు దివ్యాశీస్సులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరికలేకుండా అనుగ్రహిస్తున్నారనటంలో ఆవంతైనా అనుమానం లేదు. మన స్వామికి కంటి మీద కనుకు లేకపోవడానికి కారణ విశేషాలేమిటో తెలుసుకోవాల్సిందే మరి!! నాటి కుగ్రామం నుండి ప్రపంచ స్థాయి క్షేత్రంగా విరాజిల్లుతూ.. ∙1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టిరోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండకు రెండు ఘాట్రోడ్ల ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి. ∙ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేలసంఖ్యకు పెరిగారు. రోజూ వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70 వేలు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి రూ.2.5 నుండి రూ.3 కోట్లకు చేరుకున్నాయి. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు లక్షన్నర కోట్లరూపాయలకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు.∙నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమలకొండకు ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ కీర్తించేవారు. మహనీయులెందరో..! ∙తిరుమల „ó త్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవ రాయరులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమవంతుగా సేవలు, సౌకర్యాలు కల్పించారు. ∙ఇక ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారెందరో ఈక్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటారు. బ్రిటిష్ చట్టాలపైనే దేవస్థానం పునాదులు రెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పొచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయనటానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. ∙1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ కమిషనర్‌తోపాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. ∙చివరి మహంతు ప్రయాగ్‌దాస్ దేవస్థాన కమిటీకి తొలి అధ్యక్షులుగా 1933 నుంచి 1936 వరకు సేవ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 మంది అ«ధ్యక్షులు, స్పెసిఫైడ్ అథారిటీ ప్రత్యేక పాలనాధికారులుగా పనిచేశారు.∙ధర్మకర్తల మండళ్లలోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరాను గుణంగా భక్తులకు బస కోసం సత్రాలు, కాటేజీలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. తొలినాళ్లలో పగటిపూటే స్వామి దర్శనం ∙1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి.∙కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే వేయికాళ్ల మండపం, ఆలయ నాలుగు మాడ వీధుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవికావు. మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని కళ్లార్పకుండా తనివితీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు. ఘాట్రోడ్ల నిర్మాణంతోనే భక్తుల పెరుగుదల ఈ పరిస్థితులలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థ్థర్ హూప్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్‌రోడ్‌కు రూపకల్పన చేశారు.∙1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు, తర్వాత నల్లరంగు బుడ్డ బస్సులు (చిన్న బస్సులు) ఈ మొదటి ఘాట్‌రోడ్డులోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ∙1951 నవంబర్ నెల మొత్తానికి కలిపి శ్రీవారి దర్శనానికి దేవస్థానం బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య 27,938 మంది, 1953, ఏప్రిల్‌లో 52,014 మంది మాత్రమే. ∙1961, నవంబర్ మొత్తంగా తిరుమల ఘాట్‌రోడ్డులో 1,986 కార్లు, బస్సులు, 81 మోటారు సైకిళ్లు తిరిగాయి.∙తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్‌రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు వేరుపడ్డాయి. ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగటంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది.∙రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి రావటంతో రోజుకు పదివేల మంది భక్తులు పెరిగారు. టీటీ డీ రవాణా సంస్థ వాహనాల బదులు 10.8.1975 నుండి రెండు ఘాట్‌రోడ్లపై ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరగటంతో ఆమేరకు భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు, రోజుకు 3,200 ట్రిప్పులు సాగిస్తూ.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నాడు నిమిషాల్లోనే దర్శనం.. నేడు రోజు పైబడి... ∙1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు.∙మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 5 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్‌రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారు 10 వేలకు పెరిగింది. తిరుమలలో పాతపుష్కరిణి కాంప్లెక్స్ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీంతో 1990 నాటికి రోజుకు 20 నుంచి 25 వేలు, 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు పెరిగింది.∙2003 నాటికి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. క్యూలైన్లు పెరిగాయి. భక్తుల నిరీక్షణ సమయం రెండు రోజులకు పెరిగింది. 2010 నాటికి రోజువారీ భక్తుల సంఖ్య 60 వేలకు చేరింది.∙ఇలా 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో ఈ సంఖ్య 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లు, 2015లో 2.46 కోట్లు, 2016లో 2.66 కోట్లమంది భక్తులు వచ్చారు. ∙ఇక ఈ యేడాది 8 నెలలకే సుమారు 2 కోట్లు చేరగా, ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.∙స్వామి దర్శనానికి రోజువారిగా పోటెత్తే భక్తులకు ఈ రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 64 కంపార్ట్మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో భక్తులు నిరీక్షించటం రివాజుగా మారింది. ∙పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000 సంవత్సరంలో దర్శనానికి సుదర్శనం కంకణ విధానం, ఆన్లైన్ రిజర్వేషన్పద్ధతిని రూపకల్పన చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ–దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు, ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డతోపాటు వారి తల్లిదండ్రులకు ‘సుపథం’ ద్వారా అనుమతిస్తున్నారు. ∙2010వ సంవత్సరంలో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం (ప్రస్తుతం టైంస్లాట్ విధానం) ఆరంభించారు.∙అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆలైన్ టైంస్లాట్‌లో మాత్రమే టికెట్ల అమ్మకం చేస్తున్నారు. ∙ఆలయ మహద్వారం నుండి (పస్తుతం దక్షిణ మాడవీధి నుంyì) వికలాంగులు, 65 ఏళ్ల వయసు నిండిన వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులను అనుమతించారు.∙ఇక సిఫారసులతో రూ.500 టికెట్ల వీఐపీ దర్శనాలు, అన్ని రకాల ఆర్జితసేవా టికెట్లతో ప్రత్యేక దర్శనాలు.. ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు పది రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. కోనేటిరాయని కునుకు పదినిమిషాలే! ∙మహంతుల కాలం (1843 నుంచి 1933)లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి. ∙2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుమని పదినిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించటం లేదు. ∙ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం ఆరు గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలివైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిష్టంగా 6 గంటలపాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు.∙ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటలపాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ∙ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా స్వామికి విరామం ఇవ్వటం లేదు. ఏకదాటిగా 22 గంటలపాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. ∙దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. భక్తుల రద్దీ...రద్దీ.. ∙భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో, పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాల్లో కోత విధించటం, స్వామికి విరామం లేకుండా చేయటం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితుల హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!! -
శ్రీ వేంకటేశ్వర వైభవం
ద్వాపర యుగం చివరి రోజుల్లో ధర్మం అడుగంటింది. అధర్మం పెచ్చుమీరింది. లోకం అంతటా అశాంతి, అలజడి, హింస ఆవరించాయి. ప్రజల్లో మాంసభక్షణ పెరిగింది. మద్యపానం నిత్యకృత్యంగా మారింది. దుర్భర పరిస్థితుల్లో లోకం అల్లాడసాగింది. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం భగవంతుడు అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. మానవాళి శ్రేయస్సు కోసం యజ్ఞం చేయాలని యోగులు, మునిపుంగవులు, మహర్షులు, దేవతలు సంకల్పించారు. అయితే, యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోయాలనే ధర్మసందేహం వారిలో కలిగింది. ముందుగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పో, ఎవరు ఉత్తమోత్తముడో తేల్చుకున్న తర్వాతే వారికి ఆ యజ్ఞఫలాన్ని ధారపోయాలని నిర్ణయించారు. లోక కల్యాణం కోసం చేపడుతున్న ఈ మహత్కార్యాన్ని నిర్వహించాల్సిందిగా భృగు మహర్షిని కోరారు దేవతలు. పరమ భాగవతోత్తముడైన భృగు మహర్షి దేవతల కోరికను మన్నించాడు. ‘మహా మహిమాన్వితులైన త్రిమూర్తులను పరీక్షించి, వారిలో ఎవరు సర్వశక్తి సత్వగుణ సంపన్నులో, జగత్కల్యాణ కారకులెవరో తేల్చి చెప్పడం దుస్సాధ్యమైన పని. నా ప్రయత్నంలో భవిష్యత్తులో జరగబోయే లోకకల్యాణం గోచరిస్తోంది. ఈ మహత్కార్యంలో నేను నావంతు పాత్ర పోషించడం సుకృతమే కదా!’ అని తలపోస్తూ నడుస్తున్నంతలోనే సత్యలోకం చేరుకున్నాడు భృగుమహర్షి. సత్యలోకంలో ఆయన అడుగుపెట్టే సమయానికి సువిశాల దివ్య సభా భవనంలో సరస్వతీ సమేతుడై కొలువుదీరిన బ్రహ్మ తన చతుర్ముఖాలతో నాలుగు వేదాలనూ వల్లిస్తున్నాడు. మరోవైపు తన మనో సంకల్పంతోనే సకల చరాచర జగత్తునూ సృష్టిస్తూ ఉన్నాడు. సరస్వతీదేవి వీణ మోగిస్తోంది. భృగు మహర్షి వినమ్రుడై బ్రహ్మకి సాష్టాంగ ప్రణామం చేశాడు. స్తోత్రగానంతో కీర్తించాడు. బ్రహ్మ ఆయనను గమనించలేదు. ఆయన ప్రార్థనను ఆలకించలేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. ఎప్పటికైనా బ్రహ్మ తనను చూడకపోతాడా అనే ఉద్దేశంతో భృగుమహర్షి స్తోత్రాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఎంతకీ బ్రహ్మ తనను పలకరించకపోవడంతో భృగు మహర్షికి సహనం నశించింది. ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మదేవుడు పలకడం లేదని, ఇది తనకు తీరని అవమానమని భావించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘ఎంతటి సృష్టికర్త అయినా ఈ బ్రహ్మదేవుడు రజోగుణంతో నిండి ఉన్నాడు. ఇతడిలో సత్వగుణం లేశమైనా లేదే! ఇతడు ఇక లోకానికి మేలేమి చేయగలడు? దేవతలలో సర్వోన్నత స్థానం పొందడానికి, మహర్షులు సమర్పించే యజ్ఞఫలాన్ని అందుకోవడానికి ఇతడు అర్హుడు కాదు’ అని తలపోసి, ‘బ్రహ్మకి భూలోకంలో ఆరాధనలు, పూజలు లేకుండుగాక’ అని శపించి, అక్కడి నుంచి కైలాస మార్గం పట్టాడు భృగు మహర్షి. కైలాస దర్శనం సత్యలోకంలో బ్రహ్మ తనకు చేసిన అవమానానికి అశాంతితో రగిలిపోతూనే కైలాసం వైపు పయనం సాగించాడు భృగు మహర్షి. కైలాసం ముంగిట అడుగుపెడుతూనే ద్వారపాలకుడైన నందీశ్వరుడు ఆయనను అడ్డగించాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారని, ఎవరూ లోనికి ప్రవేశించరాదని చెప్పాడు. అసలే కోపంతో ఉన్న భృగు మహర్షికి నందీశ్వరుడి మాటలు మరింతగా కోపం తెప్పించాయి. ఉచితానుచితాలను మరచి నందీశ్వరుడిని పక్కకు నెట్టి, లోపలకు ప్రవేశించాడు. తమ ఏకాంతానికి భంగం కలిగిస్తూ దురుసుగా లోపలకు ప్రవేశించిన భృగువును చూసి పరమశివుడు శివమెత్తి నర్తిస్తూ త్రిశూలంతో అతడిని పొడవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంతలో పార్వతీదేవి పరమశివునికి అడ్డు నిలిచి, వారించింది. ‘ప్రభూ! విచక్షణాజ్ఞానం లోపించిన ఈ మహర్షిని దయతో క్షమించి విడిచిపెట్టండి’ అని ప్రార్థించింది. సమయానికి పార్వతీదేవి అడ్డు పడటంతో భృగు మహర్షి ప్రాణాలు దక్కాయి. ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఆయన బయటపడ్డాడు. ‘ఈ పరమేశ్వరుడు తామసగుణంతో నిండి ఉన్నాడు. ఇలాంటివాడు దేవతలలో సర్వోన్నత స్థానం ఎలా పొందగలడు? ఇతడికి యజ్ఞఫలాన్ని పొందే అర్హత లేదుగాక లేదు’ అని నిర్ణయించుకున్నాడు. ‘ఇతడు భూలోకంలో స్థాణువై, లింగాకారంలో మాత్రమే పూజలు పొందు గాక!’ అని శపించాడు. ఇక అక్కడి నుంచి వైకుంఠం వైపు బయలుదేరాడు. వైకుంఠ ప్రవేశం సత్యలోకంలో, కైలాసంలో ఎదురైన అనుభవాలతో తీవ్ర మనస్తాపం చెందిన భృగు మహర్షి ఆలోచనలు కొనసాగుతుండగా వైకుంఠానికి చేరుకున్నాడు. క్షీరసముద్రంలో శ్రీమహావిష్ణువు శేషతల్పంపై అరమోడ్పు కనులతో తన్మయావస్థలో శయనించి ఉండగా, ఆయన హృదయంపై శ్రీ మహాలక్ష్మి తలవాల్చి మైమరచి గడుపుతున్న మధుర క్షణాలవి. అలాంటి రసవత్తర సమయంలో వైకుంఠంలో అడుగుపెట్టిన భృగుమహర్షి శ్రీమహావిష్ణువుకు సాష్టాంగ ప్రణామం ఆచరించి, స్తోత్రాలతో కీర్తించసాగాడు.బాహ్యప్రపంచాన్ని శ్రీమహాలక్ష్మితో సరస సంభాషణలతో మునిగినట్లుగా భ్రమింపజేస్తూ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమహావిష్ణువు పరాకు ప్రదర్శించాడు. భృగు మహర్షి రాకను గమనించనట్లుగానే శ్రీమహాలక్ష్మిని మరింతగా అక్కున చేర్చుకున్నాడు. అప్పటికే బ్రహ్మదేవుని వద్ద, పరమేశ్వరుని వద్ద పరాభవం పొందిన భృగుమహర్షికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన మహాలక్ష్మి పక్కకు తొలగింది. విసురుగా వచ్చిన మహర్షి కాలు శ్రీహరి వక్షస్థలాన్ని బలంగా తాకింది. మహర్షి పాదతాడనంతో శ్రీమహావిష్ణువు వెంటనే శేషపాన్పుపై నుంచి తటాలున లేచాడు. కోపంతో ఊగిపోతున్న భృగుమహర్షికి ప్రణామం చేశాడు. మునివర్యుని రాకను గమనించని తన ఏమరుపాటును మన్నించమని ప్రాధేయపడ్డాడు. ఆయనను సగౌరవంగా తోడ్కొని వచ్చి, శేషపాన్పుపై కూర్చుండబెట్టాడు. భృగు మహర్షి పాదాల చెంత కూర్చుని, పాదాలను ఒత్తుతూ, ముని పాదంలో ఉన్న అజ్ఞానంతో కూడిన కంటిని చిదిమివేశాడు. పాదంలోని కన్ను శ్రీహరి చేతుల్లో చితికిపోవడంతో భృగుమహర్షికి అహంకారం, అజ్ఞానం అడుగంటాయి. కాలితో తన్నిన తన తప్పిదానికి క్షమించమని కోరుతూ శ్రీహరిని పరిపరి విధాల స్తుతించాడు. త్రిమూర్తులలో శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమోన్నతుడు. పరమ శ్రేష్ఠుడు. సత్వగుణ సంపన్నుడు అని, ఆయన మాత్రమే మహర్షులు నిర్వహించే యాగఫలాన్ని స్వీకరించడానికి అన్నివిధాలా యోగ్యుడని తీర్మానించాడు. శ్రీహరి పురుషోత్తమ తత్వాన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ వైకుంఠం నుంచి భూలోకానికి పయనమయ్యాడు. నారదుడి ఆనతి మేరకు, మహర్షుల ప్రార్థనలపై ముల్లోకాలకు స్వయంగా వెళ్లి, త్రిమూర్తులలోకెల్లా వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు మాత్రమే సర్వోన్నతుడైన వాడని నిగ్గు తేల్చుకున్నట్లు ప్రకటించాడు. భృగుమహర్షి మాటలకు సంతోషించిన మునీశ్వరులందరూ ఘనంగా యాగాన్ని నిర్వహించారు. యాగఫలాన్ని శ్రీమహా విష్ణువుకు సమర్పించారు. ఆదిలక్ష్మి భూలోక పయనం తన నివాసస్థలమైన శ్రీహరి వక్షస్థలాన్ని భృగు మహర్షి కాలితో తన్ని అపవిత్రం చేయడాన్ని శ్రీమహాలక్ష్మి ఎంతమాత్రం సహించలేకపోయింది. ‘ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన మునీశ్వరుడిని నా స్వామి దండించకపోగా, తనతో సమానంగా శేషపాన్పుపై సగౌరవంగా కూర్చోబెట్టాడు. అంతటితో ఊరుకున్నాడా? తనను తన్నినందుకు అతడి పాదాలు కందినవేమోనని పరామర్శిస్తూ ఆ పాదాలను ఒత్తడమా! ఇది మరింత మనోవేదన కలిగిస్తోంది’ అని తలపోస్తూ అవమాన భారంతో దహించుకుపోయింది శ్రీమహాలక్ష్మి. మునిపాద తాడనంతో అపవిత్రమైన స్వామి హృదయంలో ఇక తనకు స్థానం లేదని తీవ్ర మనస్తాపంతో వైకుంఠాన్ని వీడి భూలోకానికి బయలుదేరడానికి సిద్ధపడింది. తనను విడిచి వెళ్లవద్దని మహావిష్ణువు ఎంతగానో వేడుకున్నాడు. అయినప్పటికీ మహాలక్ష్మి శాంతించలేదు. తీవ్రమైన కోపంతో, తీరని దుఃఖభారంతో స్వామి ప్రార్థనలను లెక్కచేయకుండా వైకుంఠాన్ని వీడి భూలోకాన్ని చేరుకుంది. భూలోకంలో పుణ్యస్థలమైన కొల్హాపురమనే చోట ఒంటరిగా తపస్సు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉంది. శ్రీమహావిష్ణువు వైరాగ్యం వైకుంఠంలో తనను అనునిత్యం సేవిస్తూ ఆనందింపజేసే తన ఇల్లాలు శ్రీమహాలక్ష్మీదేవి అర్ధంతరంగా తనను విడిచి వెళ్లడాన్ని శ్రీమహావిష్ణువు ఎంతమాత్రం భరించలేక పోయాడు. తన హృదయేశ్వరి లక్ష్మీదేవి లేని వైకుంఠంతో ఇక పనేమిటని వైరాగ్యానికి లోనయ్యాడు. ‘లక్ష్మీ..! లక్ష్మీ..!’ అంటూ వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి తరలివచ్చాడు. ఆమె కోసం భూలోకమంతా వెతికి వేసారిపోయాడు. అయినా ఆమె జాడ కానరాలేదు. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠానికి వెళ్లడం వ్యర్థమనిపించింది. లక్ష్మీదేవి జాడకోసం వెదుకుతూ చివరకు వేంకటాచల పర్వతానికి చేరుకున్నాడు విష్ణువు. చింతచెట్టు తొర్రలో తలదాచుకున్న స్వామి వేంకటాచల పర్వతసానువులలో తిరుగుతూ ఉన్న శ్రీమహావిష్ణువుకు అక్కడ ఒక పుష్కరిణి కనపడింది. దానికి దక్షిణాన విశాలమైన చింతచెట్టు గోచరించింది. చెట్టు కింద విశాలమైన పుట్ట కనిపించింది. ఆ చింతచెట్టును, ఆ చెట్టు కింది పుట్టను విష్ణువు కోసమే బ్రహ్మ సృష్టించాడు. దిక్కు తెలియక తిరుగుతున్న విష్ణువు బాగా అలసిపోయినాడు. అలా అలసి పోయిన స్వామికి చింతచెట్టు తన చల్లని నీడలో సేదతీర్చుకొమ్మని పిలిచినట్లుగా తోచింది. అంతే! ఆనందంతో విశాలమైన ఆ చింతచెట్టు కిందికి చేరాడు. చెట్టు కిందే వున్న పుట్టలోని తొర్రలో తలదాచుకున్నాడు. అలా ఆ తొర్రలోనే తలదాచుకుంటూ కాలం వెళ్లదీయసాగాడు. గోపాలికగా శ్రీమహాలక్ష్మి, గోవుగా బ్రహ్మ... శ్రీమహావిష్ణువు కారడవిలో చింతచెట్టు కింది పుట్టలో తలదాచుకుని ఆకలిదప్పులతో అలమటిస్తూ ఉన్న విషయాన్ని కొల్హాపురంలో కొలువై ఉన్న శ్రీమహాలక్ష్మి బ్రహ్మాది దేవతల ద్వారా తెలుసుకుని బాధపడింది. అయితే, స్వామి వద్దకు వెళ్లడానికి మాత్రం ససేమిరా అన్నది. శ్రీనివాసుని ఆకలి దప్పులు తీర్చడానికి బ్రహ్మ, శివుడు స్వయంగా ప్రార్థించడంతో వారి కోరికను మన్నించింది. బ్రహ్మదేవుడు గోవుగా, శివుడు దూడగా మారగా, లక్ష్మీదేవి గోపాలికగా మారింది. బ్రహ్మ మహేశ్వరులు గోవుగా, దూడగా చోళరాజు గోశాలలోని పశువుల మందలో చేరారు. శ్రీనివాసుని ఆకలి తీర్చిన గోవు చోళరాజు పశువుల కాపరి ప్రతిరోజూ మందతో పాటు కొత్తగా వచ్చిన ఆవును, దూడను కూడా మేతకు తోలుకుపోయేవాడు. మేతకు వెళ్లిన కొత్త ఆవు, దూడతో కూడా పశువుల మందను వదిలి, కాపరి కళ్లు గప్పి అడవిలోని చింతచెట్టు కింద పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుని వద్దకు వెళ్లి ధారగా పాలు కార్చేది. పుట్టలోని దేవుడు ఆ పాలను కడుపారా తాగుతూ తృప్తి చెందేవాడు. పాలను వదిలిన తర్వాత మళ్లీ యథాప్రకారం ఆవు, దూడ తిరిగి మందలో చేరి రాజుగారి గోశాలకు చేరుకునేవి. ఇలా కొంతకాలం సాగింది. శ్రీనివాసునిపై గొల్లవాని గొడ్డలి వేటు ఎంతకాలమవుతున్నా కొత్తగోవు ఏమాత్రం పాలు ఇవ్వకపోతుండటంతో రాణివారు గొల్లవానిపై కోపించి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజుగారు గొల్లవాణ్ణి పిలిపించి, అతడిని కొరడాతో కొట్టించారు. ఆవునూ దూడనూ జాగ్రత్తగా గమనించాలని హెచ్చరించారు. రాజుగారి హెచ్చరికతో ప్రాణభీతి చెందిన గొల్లవాడు కొత్త ఆవునూ దూడనూ జాగ్రత్తగా గమనించసాగాడు. మధ్యాహ్న సమయంలో అతడికి ఒక విచిత్ర సన్నివేశం కనిపించింది. ఆవు, దూడ మందను విడిచిపెట్టి కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లడం చూశాడు. అతడు కూడా వాటిని అనుసరించాడు. ఆవూ దూడా పుష్కరిణి సమీపానికి చేరుకున్నాయి. ఆవు పుట్టను ఎక్కి దాని బొరియలోకి పాలను ధారగా విడువసాగింది. అది చూసిన గొల్లవానికి కోపం కట్టలు తెంచుకుంది. దొంగచాటుగా వెనుక నుంచి వచ్చి ఆవుపై చేతిలో ఉన్న గొడ్డలి ఎత్తి గట్టిగా కొట్టాడు. అలికిడికి బెదిరిన ఆవు పక్కకు తప్పుకోవడంతో పుట్టలో దాగిన శ్రీనివాసుడు గభాలున పైకి లేచాడు. అంతే! గొడ్డలి వేటు శ్రీనివాసుని నుదుటికి తాకింది. నెత్తురు ధారగా చిమ్మింది. నుదుట నెత్తురోడుతూ కనిపించిన శ్రీనివాసుడిని చూస్తూ దిమ్మెరపోయిన గొల్లవాడు భయభ్రాంతుడై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఆవు పరుగెత్తుకుంటూ చోళరాజు ఆస్థానానికి వెళ్లి కన్నీరు కారుస్తూ అంబారావాలు చేసింది. చోళరాజుకు శాపం ఆవు అంబారావాలు చేస్తుండటంతో ఏమైందో ఏమోనని ఆందోళన చెంది ఆవు వెంట నడిచాడు చోళరాజు. ఆవుతో పాటే గొల్లవాడు చచ్చిపడి ఉన్న పుట్ట దగ్గరకు చేరుకున్నాడు. అంతలో పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుడు పైకి వచ్చి ‘‘ప్రజలు, సేవకులు, భార్యా బిడ్డలు చేసిన పాపాలు ప్రభువుకు చెందుతాయి. అందువల్ల ఈ దుష్కృత్యానికి ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి. నీవు ఈ క్షణమే పిశాచ రూపాన్ని పొందెదవుగాక’’ అని శపించాడు. శ్రీనివాసుడి శాపానికి చోళరాజు ఎంతగానో తల్లడిల్లాడు. ‘‘స్వామీ! తెలియక జరిగిన దోషానికి ఇంతలా శపించడం నీకు తగునా? నీవే నాకు దిక్కు... శాప విముక్తిని సెలవివ్వు’ అని ప్రాధేయపడ్డాడు. ఆశ్రిత వత్సలుడైన శ్రీనివాసుడు కరుణించి, ‘‘రాజా! కొద్దికాలంలోనే ఆకాశరాజు తన కూతురు పద్మావతిని నాకిచ్చి పరిణయం చేస్తాడు. అల్లుడినైన నాకు ఆ రాజు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా ఇస్తాడు. నేను ఆ కిరీటాన్ని ధరించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది’’ అని సెలవిచ్చాడు. వెంటనే చోళరాజు పిశాచమై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతలో అక్కడ చచ్చిపడి ఉన్న గొల్లవాని బంధువులు ఏడుస్తూ వచ్చి స్వామివారి వద్ద మొర పెట్టుకున్నారు. శ్రీనివాసుడు వారికి అభయమిస్తూ ‘‘భూలోకంలో నన్ను తొలిసారిగా దర్శించిన వ్యక్తి ఆ పశువుల కాపరి. ఇక మీదట కలియుగాంతం వరకు ఇతని సంతతి వారైన మీకు ప్రతిరోజూ నా తొలి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను’’ అంటూ వరమిచ్చాడు. భూ వరాహస్వామికి దాన శాసనపత్రం గొల్లవాని వల్ల కలిగిన గాయాన్ని మాన్పుకోవడానికి వనమూలికల కోసం వెదుకుతున్న శ్రీనివాసునికి ఆది వరాహస్వామి కనిపించాడు. శ్రీనివాసుడి రాకకు ముందు చాలాకాలం కిందటే వరాహస్వామి ఆ క్షేత్రంలో స్థిరపడ్డాడు. వరాహస్వామికి తన దీనగాథను విన్నవించుకున్నాడు శ్రీనివాసుడు. తాను ఆ క్షేత్రంలో ఉండటానికి నూరు అడుగుల స్థలాన్ని ఇమ్మని ప్రార్థించాడు. వరాహస్వామి శ్రీనివాసుడి కోరికను సమ్మతించాడు. అయితే, తానిచ్చే నూరు అడుగుల స్థలానికి పైకం చెల్లించాలని కోరాడు. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ అయినా లేదని, అందుకు ప్రతిఫలంగా తన వద్దకు దర్శనార్థం వచ్చే భక్తుల చేత ‘మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం’ వంటి ఏర్పాటును కట్టడిగా చేయిస్తానని శ్రీనివాసుడు వాగ్దానం చేస్తూ దాన శాసనపత్రం కూడా రాసి ఇచ్చాడు. అందుకు వరాహస్వామి అంగీకరించి, స్వామి పుష్కరిణికి దక్షిణ తీరంలో శ్రీనివాసునికి స్థలాన్ని ధారాదత్తం చేశాడు. శ్రీనివాసుడి దీనగాథను ఆలకించిన ఆదివరాహస్వామి వకుళమాలిక అనే యోగినిని శ్రీనివాసుడికి సేవ చేయమని ఆదేశించాడు. వరాహస్వామి ఆనతిపై వకుళమాత శ్రీనివాసుడిని కన్నకొడుకులా సేవించసాగింది. ఎవరీ వకుళమాత శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడిని పొత్తిళ్ల నాటి నుంచి కంటికి రెప్పలా సాకింది యశోద. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించడమే కాకుండా, వివిధ సందర్భాలలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను, మహిమలను కన్నులారా తిలకించి ఆనందించింది. రాక్షసుల వల్ల చిన్ని కృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందేమోనని ఆమె తల్లడిల్లేది. కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. వారి వద్దనే అతడికి వివాహాది కార్యక్రమాలన్నీ జరిగాయి. శ్రీకృష్ణుడికి స్వయంగా వివాహం చేసే భాగ్యానికి నోచుకోలేదని యశోద చింతాక్రాంతురాలైంది. ఆమె మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! మాతృమూర్తివి అయిన నీవు బాధపడితే ఈ కృష్ణుడికి మనుగడే లేదు. ఇప్పుడు పెంచి పెద్ద చేసిన చేతులతో నీవే స్వయంగా నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నాను. కలియుగంలో వేంకటాచలంపై నీవు యోగినిగా ఉన్న సమయంలో నేను శ్రీనివాసుడనే పేరుతో నీ వద్దకు చేరుతాను. అప్పుడు నీ చేతుల మీదుగానే నా వివాహం జరిపించి ఆనందించే భాగ్యాన్ని పొందగలవు’’ అని వరమిస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల యశోదాదేవి కలియుగంలో వకుళాదేవిగా అవతరించింది. అప్పటి శ్రీకృష్ణుడే నేడు శ్రీనివాసుడిగా అవతరించి వేంకటాచలానికి చేరి వరాహస్వామి అండదండలతో అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి వకుళమాత శ్రీనివాసుని ఆలనాపాలనా చూస్తూ తృప్తిగా కాలక్షేపం చేయసాగింది. పద్మావతిని రక్షించిన శ్రీనివాసుడు వరాహక్షేత్రంలో వకుళమాత సేవలో శ్రీనివాసుడు మహలక్ష్మిని మరచిపోయి, కొండలు కోనలు తిరుగుతూ కాలం వెళ్లబుచ్చసాగాడు. కొంతకాలానికి ఒకరోజు శ్రీనివాసుడు విల్లంబులు చేత ధరించి గుర్రం మీద స్వారీ చేస్తూ వనవిహారం చేయసాగాడు. ఇంతలో ఆ కారడవిలో ‘రక్షించండి!.. రక్షించండి!’ అనే ఆర్తనాదాలు వినిపించాయి. ఆర్తనాదాలు వినిపించిన దిశగా శ్రీనివాసుడు విల్లంబులను చేతబూని తన గుర్రాన్ని పరుగులు పెట్టించాడు. అక్కడ ఒక మదపుటేనుగు తరుముతుండగా కొందరు కన్యలు ప్రాణభీతితో ఆర్తనాదాలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తూ కనిపించారు. వెంటనే శ్రీనివాసుడు ‘‘గజేంద్రా! అని బిగ్గరగా గర్జిస్తూ విల్లును గురిపెట్టి ఆ ఏనుగు ఎదుటకు వెళ్లాడు. ఆ గర్జనకు బెదిరిన ఏనుగు వెనుదిరిగి అడవిలోకి పారిపోయి, ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోయింది. తృటిలో తప్పిన ప్రాణాపాయం నుంచి తేరుకుని అయోమయంగా దిక్కులు చూస్తున్న యువతుల వద్దకు వెళ్లాడు శ్రీనివాసుడు. వారి మధ్య చుక్కలనడుమ చందమామలా మెరిసిపోతున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె అందచందాలకు పరవశుడై రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తూ నిలుచుండిపోయాడు. ఆ యువతి కూడా తనను ఏనుగు బారి నుంచి కాపాడిన శ్రీనివాసుడిని చూస్తూ నివ్వెరపోయింది. ఆయన రూపానికి, తేజస్సుకు మంత్రముగ్ధురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది. పద్మావతి శ్రీనివాసుల ప్రేమానురాగాలు వారిద్దరి వాలకాన్ని గమనించిన చెలికత్తెలు ఆందోళనతో భయపడుతూ శ్రీనివాసుడిని గట్టిగా వారిస్తూ్త ‘‘ఎవరయ్యా నీవు’’? ఆమె ఎవరనుకున్నావు? ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న మా మహారాజు ఆకాశరాజుగారి గారాలపట్టి పద్మావతిదేవి. అంతఃపుర కన్యలు విహరించే ఈ వనంలో పరపురుషులు ప్రవేశించడం నిషిద్ధం. పద్మావతిని చూడటం చాలా తప్పు. వెళ్లు... వెళ్లు! తొందరగా... ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో! ఇంకా ఏమిటి అలా కొరకొర చూస్తావు... మేం చెప్పేది వినిపించడం లేదా? వినిపించినా అర్థం కావడం లేదా? మా రాజభటులు వస్తే నీ సంగతి ఇక అంతే!’’ అని చెలికత్తెలు శ్రీనివాసుడిని చుట్టుముట్టి, బెదిరింపులతో అతడిని అక్కడి నుంచి వెడలగొట్ట చూశారు. అంతలో పద్మావతి వారిని వారిస్తూ... ‘‘ఆయన మనలను ఏనుగు బారి నుంచి రక్షించి మన ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడు. ఆయనను తూలనాడటం తగదు. అసలు ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలుసుకోండి’’ అని తన చెలికత్తెలను కోరింది. పద్మావతి చొరవకు చెలికత్తెలు ఆశ్చర్యపోతూనే శ్రీనివాసుని చెంతకు వెళ్లి అతనిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘‘ఎవరయ్యా నువ్వు? నీ పేరేమిటి? ఊరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? నీ కులమేది? గోత్రమేది?’’ అని అడిగారు. శ్రీనివాసుడు చిరునవ్వులు చిందిస్తూ... ‘‘నా తండ్రి వసుదేవుడు. తల్లి దేవకీదేవి. అన్న బలరాముడు. నన్ను శ్రీకృష్ణుడంటారు. వశిష్ఠ గోత్రానికి చెందినవాణ్ణి. ఈ అందాల భరిణను తొలిచూపులోనే ప్రేమించాను. మీరంతా అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ చెలికత్తెలు వారిస్తున్నా పద్మావతిని సమీపిస్తూ ఆమె కౌగిలి కోసం చేతులు చాపాడు. శ్రీనివాసుడి చేష్టలు శ్రుతిమించి రాగాన పడుతుండటాన్ని గమనించిన పద్మావతి చెలికత్తెలు అతన్ని మాటలతో వారించే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకపోవడంతో రాళ్లతో దాడి చేసి వెంటబడి తరిమి తరిమి కొట్టారు. పద్మావతిని ఊహించుకుంటూ మైమరపులో ఉన్న శ్రీనివాసుడు ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు. పద్మావతి చెలికత్తెల రాళ్ల దాడిలో గాయాల పాలయ్యాడు. నెత్తురోడుతున్న దేహంతోనే పద్మావతిని పదేపదే వెనక్కు తిరిగి చూస్తూ వేంకటాద్రికి చేరుకున్నాడు. శ్రీనివాసునిపై వకుళమాత మాతృప్రేమ పొద్దున్నే వెన్నముద్దలైనా తినకుండా శ్రీనివాసుడు పరగడుపున ఎక్కడికి వెళ్లాడోనని ఆలోచిస్తూ వకుళమాత ఎదురు చూస్తూ వుంది. ఇంతలో తనువంతా నెత్తురోడుతున్న గాయాలతో బాధతో మూలుగుతూ వస్తున్న శ్రీనివాసుణ్ణి చూసి వకుళమాత ఆందోళన చెందింది. ఆతృతతో ఎదురేగి, శ్రీనివాసుని చేయి పట్టుకొని నడిపించుకుని వస్తూ ‘‘ఒళ్లంతా ఈ దెబ్బలేమిటి?, అసలు ఏం జరిగింది! ఏ దుర్మార్గులు చేశారీ పని? ఏం జరిగిందో చెప్పరా కన్నయ్యా’’ అని కన్నీళ్లు పెట్టుకొంది. తన చీర కొంగును చించి గాయాలకు కట్లు కట్టింది. గాయాల బాధకు సన్నగా మూలుగుతున్న శ్రీనివాసుడు, తల్లిని మభ్యపెట్టడం తగదని భావించి జరిగిన కథంతా పూస గుచ్చినట్లుగా వకుళమాతకు చెప్పాడు. నారాయణవనం పరిసర ఉద్యాన వనంలో విహరిస్తున్న ఆకాశరాజు కూతురు పద్మావతిదేవిని చూశానని, ప్రేమించానని, ఆమె కూడా తన ప్రేమలో పడిందనీ, ఇక ఆమెను తాను వివాహమాడనిదే బతకలేనని చెప్పాడు.‘‘నాయనా! శ్రీనివాసా! నీవే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివనే సంగతి మరచినట్లున్నావు. దివ్యపురుషుడవైన నీవు సామాన్య మానవుడిలా మానవకాంతను ప్రేమించడం, ఆమె లేకుంటే బతకలేననడం వింతగా ఉంది. అలా చెప్పడం నీవంటి వాడికి ఎంతవరకు సమంజసమో ఆలోచించు’’ అంటూ అనునయించింది వకుళమాత. ‘‘నీవన్నది సత్యమే! నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనైతికంగా ప్రవర్తించను తల్లీ! నేను చూసిన ఆకాశరాజు కూతురు పద్మావతి నీవు తలచినట్లు సామాన్య వనిత కాదు. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి అంశతో భూలోకంలో నన్ను వివాహమాడటానికే అయోనిజగా అవతరించిన కారణజన్మురాలు’’ అంటూ పద్మావతి గాథను తల్లితో ఇలా చెప్పాడు... వేదవతే మాయాసీత ‘‘త్రేతాయుగంలో రామావతార సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోయాడు. సీతను ఎత్తుకుపోతున్న రావణుడికి అగ్నిదేవుడు అడ్డుపడి ‘రావణా! నీవు తీసుకుపోతున్నది అసలైన సీత కాదు. శ్రీరాముని భార్య అయిన సీత నా వద్ద ఉన్నది. ఈమెను విడిచిపెట్టి నా వద్దనున్న సీతను తీసుకువెళ్లు’’ అని చెప్పి ఆమెను అగ్నిప్రవేశం చేయించి తన వద్ద భద్రంగా రక్షించాడు. ఆమెకు బదులుగా తన వద్దనున్న వేదవతిని సీతగా మభ్యపెట్టి రావణుడికిచ్చి పంపాడు. అగ్నిదేవుడి మాటలు నమ్మిన రావణుడు వేదవతిని తీసుకుపోయి లంకలో బంధించాడు. రావణ సంహారం తర్వాత రాముడు లంకలో ఉన్న సీతను స్వీకరించాడు. అయితే, లోకనింద రాకుండా ఉండటానికి సీతను అగ్నిప్రవేశం చేయించాడు. అప్పుడు అగ్ని నుంచి ఇద్దరు సీతలు వెలుపలకు వచ్చారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన రాముడు ‘‘వీళ్లిద్దరూ ఎవరు? వీరిలో నా భార్య సీత ఎవరు?’ అని ప్రశ్నించాడు. అగ్నిదేవుడు తాను సీతను తన దగ్గర భద్రంగా కాపాడి మాయసీత అయిన వేదవతిని రావణుని వద్దకు పంపిన విషయాన్ని వివరించాడు. ‘‘సీతకు బదులుగా వేదవతి లంకలో నానా కష్టాలను అనుభవించింది. సీత మాదిరిగానే నిన్నే తన భర్తగా భావించింది. అందువల్ల సీతతో పాటు మాయసీత అయిన వేదవతిని కూడా భార్యగా స్వీకరించు’’ అని సూచించాడు. అగ్నిదేవుని మాటపై వేదవతిని భార్యగా స్వీకరించాలని సీత కూడా కోరింది. అయితే, రాముడు అందుకు తిరస్కరించాడు. ‘‘ఈ అవతారంలో ఒకటే మాట, ఒకటే బాణం, ఒకే భార్య... అనే వ్రత నియమానికి కట్టుబడి ఉన్నాను’’ అని బదులిచ్చాడు. కలియుగంలో వేదవతి కోరిక తీర్చగలనని మాట ఇచ్చాడు. కలియుగంలో తాను శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు వేదవతి ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరిస్తుందని, అప్పుడు తాను ఆమెను దేవేరిగా స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు. అప్పటి శ్రీరాముడే ఇప్పుడు శ్రీనివాసుడిగా వచ్చాడు, నాటి వేదవతి నేడు ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించింది’’ అని శ్రీనివాసుడు చెప్పాడు. ‘‘శ్రీనివాసా! నీవు చెప్పిన వృత్తాంతం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకూ పద్మావతి తండ్రి ఆకాశరాజు ఎవరు తండ్రీ!’’ అని ప్రశ్నించింది. పూర్వజన్మలో ఆకాశరాజు పూర్వం మాధవుడనే బ్రాహ్మణుడు కుంతల అనే స్త్రీతో సంబంధం పెట్టుకొని పాపం చేశాడు. అతడు ఆ పాప విముక్తి కోసం వేంకటాద్రికి వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. అక్కడే భగవంతుని కోసం తపస్సు చేశాడు. ఎంతకూ దేవుడు ప్రత్యక్షం కానందుకు చింతిస్తూ ప్రాణత్యాగానికి తలపడ్డాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై ‘‘వచ్చే జన్మలో పాండవ వంశంలో సుధర్ముడనే రాజుకు పుత్రునిగా పుట్టి ఆకాశరాజు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపిణి అయిన కన్యక నీకు పుత్రికగా లభిస్తుంది. ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తావు. నీ కీర్తి వెలుగుతుంది’’ అని వరమిచ్చాడు. ఆ బ్రాహ్మణుడే ఆకాశరాజు. ఇతడి భార్య ధరణీదేవి మహాపతివ్రత. వీరికి ఎంతకాలమైనా సంతానం కలగనందున జ్యోతిషుల సూచనతో పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ సమయంలో భూమిని దున్నుతుండగా, నాగేటి చాలులో బంగారు పెట్టె దొరికింది. అందులో సహస్రదళాల బంగారు పద్మం ఉంది. ఆ పద్మంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న పసిపాప కనిపించింది. పద్మంలో దొరికినందున ఆమెకు పద్మావతిగా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు. యవ్వనవతి అయి అద్భుత సౌందర్యంతో విరాజిల్లుతూ చెలికత్తెలతో వనవిహారం చేస్తున్న ఆ పద్మావతినే నేను చూశాను. ఆమెను చూసినప్పటి నుంచి నా మనస్సు అగమ్యగోచరంగా ఉంది తల్లీ!’’ అంటూ శ్రీనివాసుడు చెప్పగా మైమరచి విన్న వకుళమాత... ‘నాయనా! శ్రీనివాసా! నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు’’ అని అడిగింది. పెళ్లి రాయబారం! ‘‘అమ్మా! వకుళమాతా! నీవు నారాయణవనం చక్రవర్తి ఆకాశరాజు వద్దకు వెళ్లి ఆయన కూతురు పద్మావతిని నాకు ఇచ్చి వివాహం చేయాలని అర్థించు తల్లీ! లోక కల్యాణం కోసం నీవు ప్రయత్నించే ఈ కార్యం తప్పక నెరవేరుతుంది. ముందుగా ఈ పర్వత మూలలో వెలసిన కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాల’’ని తల్లిని కోరాడు. శ్రీనివాసుడు తనపై ఉంచిన కార్యభారానికి ఆనందించిన వకుళమాత, కపిలతీర్థంలో స్నానమాడి, కామాక్షీసమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీనివాసుని కల్యాణాన్ని శుభస్య శీఘ్రంగా నెరవేర్చాలని ప్రార్థించింది. అక్కడి నుంచి నారాయణవనానికి బయలుదేరింది. దారిలో శుక మహర్షి ఆశ్రమాన్ని, అక్కడకు చేరువలోని అగస్త్యేశ్వరుడిని దర్శించుకుంది. అక్కడినుంచి నారాయణవనానికి చేరుకుంది వకుళమాత. ఎరుకలసానిగా శ్రీనివాసుడు తన వివాహం కోసం తల్లి వకుళమాతను నారాయణవనానికి పంపిన శ్రీనివాసుడు, వెంటనే తన రూపురేఖలను మార్చుకుని, ఎరుకలసాని వేషం ధరించాడు. ‘‘ఎరుక సెబుతానమ్మ! ఎరుక! ఎరుకమ్మో ఎరుక!’’ అంటూ వయ్యారాలు పోతూ నారాయణపుర వీథుల్లో తిరుగసాగాడు. పద్మావతి జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెకు ఏదైనా భూతం పట్టుకుందేమో! ఎన్ని చికిత్సలు చేస్తున్నా జ్వరం తగ్గడం లేదెందుకోనని దిగులుగా ఆలోచిస్తున్న ధరణీదేవికి ఎరుకలసాని అరుపులు వినిపించాయి. వెంటనే ఆమె ఎరుకలసానిని అంతఃపురానికి పిలిపించింది. ఎరుకతెకు ఎదురుగా పద్మావతిని కూర్చోబెట్టి ఎరుక చెప్పమని కోరింది. ఎరుకలసాని రూపంలోని శ్రీనివాసుడు పద్మావతి ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘కొండదేవర మీద ఆన! ఉన్నది ఉన్నట్టు సెబుతాను తల్లె! ఈ క్షణం నుంచే నీ బిడ్డ కుదుటబడుతుంది. నీ బిడ్డ చేతిని కొండమీది ఆదినారాయణుడు అందుకొన్నాడె తల్లె! వాడు కూడా ఈ బొమ్మ మీద మోజు పడ్డాడె తల్లె! జెరం తగ్గి బిడ్డ బతికి బట్టగట్టాలంటే కొండ మీద ఉన్న ఆదిదేవునికిచ్చి మనువు సెయ్యాలె తల్లె! నేను సెప్పేది సత్తెమే తల్లె! కొండ దేవర మీద ఆన! తొందర్లోనే నీ బిడ్డ లగ్గమవుతాది!’’ అంటూ శ్రీనివాసుడు పద్మావతి చేతిని స్పృశిస్తూ ఆమె మనసును మరింత ఊరిస్తూ వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే వకుళమాత వచ్చింది. అగస్త్యేశ్వరునికి అభిషేకం చేయించి, తీర్థప్రసాదాలను తీసుకొచ్చిన చెలికత్తెలు పద్మావతీదేవికి వాటిని అందించారు. తమ వెంట వచ్చిన వకుళమాతను రాణి ధరణీదేవికి పరిచయం చేశారు. వకుళమాత రాజ దంపతులకు నమస్కరించి, శ్రీనివాసుడు వనవిహారం చేస్తున్న పద్మావతిని మోహించాడని, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని, అందువల్ల పద్మావతి కూడా కారణ జన్మురాలని వారికి ఎరుకపరచింది. వకుళమాత మాటలకు ఆకాశరాజు దంపతులు ఆనందపరవశులయ్యారు. శ్రీనివాసుడికి పద్మావతిని ఇచ్చి వివాహం చేయడానికి అంగీకారం తెలిపారు. త్వరలోనే ముహూర్తాన్ని నిశ్చయించి, వివాహం జరిపించగలమని తెలిపారు. వకుళమాత అక్కడి నుంచి సెలవు తీసుకుని వరాహక్షేత్రానికి చేరుకుని, శ్రీనివాసుడికి తీపి కబురు తెలియజేసింది. పద్మావతీ శ్రీనివాసుల వివాహ నిశ్చయం వకుళమాత వెళ్లిన వెంటనే పద్మావతీ శ్రీనివాసుల కల్యాణానికి ముహూర్తం నిశ్చయించాలని కోరుతూ దేవగురువు బృహస్పతిని, శుక మహర్షిని ఆకాశరాజు ఆహ్వానించాడు. ఆకాశరాజు కోరికను మన్నించిన వారిద్దరూ గ్రహగతులను పరిశీలించి, రాబోయే వైశాఖ శుక్ల దశమి, శుక్రవారం నాటి ఉత్తర ఫల్గుణీ శుభ నక్షత్రంలో వివాహ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా నిశ్చయించారు. వెంటనే శుభలేఖను తయారు చేశారు. ఆకాశరాజు కోరికపై బృహస్పతి ఆ శుభలేఖను శుకమహర్షికి ఇచ్చి, శ్రీనివాసుని వివాహానికి ఆహ్వానించాల్సిందిగా ఆదేశించాడు. శుకమహర్షి శ్రీనివాసునికి ఆ శుభలేఖను అందించాడు. శుకమహర్షిని సాదరంగా సత్కరించిన శ్రీనివాసుడు, శుభలగ్నానికి బంధుమిత్రులతో తరలి రాగలనని తెలిపి సాగనంపాడు. ముక్కోటి దేవతల సాక్షిగా.. శుకమహర్షి వివాహ లగ్నపత్రికను ఇచ్చి వెళ్లిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో తన వివాహ ఏర్పాట్లు చూడటానికి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించాడు. శ్రీనివాసుని ఆహ్వానంపై బ్రహ్మ, మహేశ్వర, ఇంద్రాది ముక్కోటి దేవతలు, వశిష్ఠ వామదేవ విశ్వామిత్ర, కశ్యప, భరద్వాజాది సకల మహర్షులు వేంకటాచలానికి చేరుకున్నారు. ఇలా వస్తున్న వారందరికీ శ్రీనివాసుడు సాదరంగా ఆహ్వానించి గౌరవ సత్కారాలు అందజేశాడు. తన వివాహాన్ని తిలకించేందుకు వచ్చిన వారు విడిది చేయడానికి వీలుగా విశ్వకర్మ చేత వివాహపురాన్ని నిర్మించాలని శ్రీనివాసుడు ఇంద్రుడిని ఆదేశించాడు. అలాగే, ఆకాశరాజు పాలిస్తున్న నారాయణవనంలో పద్మావతీ శ్రీనివాసుల వివాహార్థమై ఘనంగా రత్నస్తంభాలతో ఒక వివాహ వేదికను కూడా విశ్వకర్మ నిర్మించాడు. శ్రీనివాసుడి కల్యాణ వేడుకల్లో దేవతలందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క బాధ్యతను నిర్వర్తించారు. ఇంతలో శ్రీనివాసుడు సూర్యభగవానుని పిలిచి, ‘‘నీవు మహాలక్ష్మి వేంచేసి ఉన్న కొల్హాపురానికి వెళ్లు. శ్రీనివాసుడు నీ వియోగం వల్ల అస్వస్థుడై ఉన్నాడని అసత్యం చెప్పి ఆమెను పిలుచుకు రావాలి’’ అని ఆదేశించాడు. శ్రీనివాసుని ఆనతిని శిరసావహించిన సూర్యుడు కొల్హాపురానికి వెళ్లి లక్ష్మీదేవిని వేంకటాచలానికి తోడ్కొని వచ్చాడు. శ్రీనివాసుని చూసి లక్ష్మీదేవి ఆనంద పరవశురాలైంది. వేంకటాచలమంతా దేవతలతో నిండి కోలాహలంగా ఉండటంతో విశేషమేమిటని ప్రశ్నించింది. అంతట శ్రీనివాసుడు ‘‘త్రేతాయుగంలో నీ ఆనతి ప్రకారం అప్పటి వేదవతిని ఈనాడు పద్మావతిగా వివాహమాడుతున్నాను. నాటి నీ కోరిక తీరే వేళ ఆసన్నమయింది. అందుకే నిన్ను పిలిపించాను’’ అని చెప్పగా, లక్ష్మీదేవి సంతోషిస్తూ శ్రీనివాసుని పెండ్లికుమారుడిగా అలంకరించడానికి ఉద్యుక్తురాలైంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి మున్నగువారు శ్రీనివాసునికి అభ్యంగనస్నానం చేయించారు. కుబేరుడు ఇచ్చిన నూతన వస్త్రాభరణాలను అలంకరించి, పెండ్లికొడుకును చేశారు. శ్రీనివాసుడు తమ కులదైవమైన శమీ వృక్షాన్ని కుమారధార తీర్థంలో దర్శించుకుని, దాని కొమ్మను వరాహస్వామి ఆలయ సమీపంలో ప్రతిష్ఠించాడు. వివాహానికి తరలి వెళ్లే ముందు ఇక్కడ వేంచేసి ఉన్న కోట్లాది మంది దేవగంధర్వ ఋష్యాదులకు అన్న సంతర్పణ కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందని బ్రహ్మదేవుడు శ్రీనివాసుని కోరాడు. అయితే, శ్రీనివాసుడు తన వద్ద ధనం ఏమాత్రం లేదని, ఇప్పుడు ఇంత ఖర్చు ఎలా భరించగలనని దిగులుపడ్డాడు. ఇంతలోనే శివుని సలహాపై తేరుకుని కుబేరుని ఏకాంతంగా పిలిచి, తన పెళ్లికి కావలసిన ధనాన్ని అప్పుగా ఇవ్వమని కోరాడు శ్రీనివాసుడు. అప్పు ఇవ్వడానికి అంగీకరించిన కుబేరుడు రుణపత్రం రాసి ఇవ్వమని అడిగాడు. సరేనన్న శ్రీనివాసుడు పుష్కరిణి పశ్చిమ తీరాన ఉన్న అశ్వత్థ వృక్షం కింద కూర్చుని రుణపత్రాన్ని ఇలా రాయించాడు. ‘‘కలియుగంలో హేవిళంబనామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి దినాన కుబేరుని వద్ద నుంచి నా వివాహార్థమై రామముద్రలు కలిగిన పద్నాలుగు లక్షల నిష్కాలను వడ్డీ చెల్లించే విధాంగా రుణం స్వీకరించడమైనది. వివాహం జరిగిన ఈ ఏడాది మొదలు కొని వెయ్యేళ్లలోగా రుణాన్ని వడ్డీతో సహా తీర్చగలనని నేను రాసి ఇస్తున్న రుణపత్రం ఇది. దీనికి చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదటి సాక్షి. త్రినేత్రుడైన పరమశివుడు రెండవ సాక్షి. మేము కూర్చున్న అశ్వత్థ వృక్షం మూడవ సాక్షి’’ అంటూ బ్రహ్మదేవుని చేత రుణపత్రాన్ని రాయించాడు. రుణం దొరికి ఆర్థిక సమస్య పరిష్కారం కావడంతో శ్రీనివాసుడు వెంటనే అగ్నిదేవుడిని పిలిచి అందరికీ భోజన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. స్వామి ఆనతిపై అగ్నిదేవుడు పుష్కరిణిని అన్నపాత్రగా, పాపనాశన తీర్థాన్ని పప్పుపాత్రగా, ఆకాశగంగను పరమాన్నపాత్రగా, దేవతీర్థాన్ని భక్ష్యాల పాత్రగా, పాండవ తీర్థాన్ని చారు పాత్రగా, మిగిలిన దివ్యతీర్థాలను పిండివంటల పాత్రలుగా చేసుకుని రుచికరమైన వంటలు చేశాడు. వాటన్నింటినీ అహోబిల లక్ష్మీనరసింహస్వామికి నివేదన చేసిన తర్వాత పాండవ తీర్థం నుంచి శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలకు వడ్డనలు చేశారు. విందు ముగిసిన తర్వాత దేవ యక్ష గంధర్వ రుషి గణాలతో శ్రీనివాసుడు నారాయణ వనానికి తరలి వెళ్లాడు. ఆకాశరాజు వారందరినీ భక్తిగౌర -
నేత్ర ద్వారాలు తెరవాల్సిందే
సాక్షి, తిరుమల: పోటెత్తుతున్న భక్తుల దర్శన సౌకర్యార్థం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని వెండి వాకిలికి అటుఇటుగా నేత్రద్వారాలు తెరవాల్సిన అవసరం ఉందని, దానివల్ల భక్తులు సులువుగా లోపలికి, బయటకు వెళ్లి వచ్చే అవకాశముందని ఆలయ ఓఎస్డి పి. శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి అన్నారు. దేవదేవుడు తలుచుకుంటే నేత్రద్వారాలు ఆపేశక్తి ఎవరికీ లేదని.. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొట్టమొదటి ఆలయ సన్నిధి ప్రాకారం మినహా మిగిలిన ఆలయ ప్రాకారాలన్నీ కొత్తగా నిర్మాణం చేసుకున్నవేనని ఆయన వివరించారు. అంకుర్పాణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే... నాడు నిలువ నీడలేని స్వామి.. శ్రీ వేంకటేశ్వర స్వామివారు పూర్వపు రోజుల్లో చింత చెట్టుకింద ఉండేవారట. నిలువ నీడలేని రోజుల్లో అడవి జాతి మనుషులు వారి పద్ధతుల్లో పూజించేవారు. స్వామిపై సూర్య, చంద్రుల నీడ పడుతోందని ఆళ్వారుల కీర్తనల ద్వారా వెల్లడైంది. అంటే స్వామికి గుడి లేదన్నది విస్పష్టం. ఆ తర్వాత ‘‘నీ ముంగిట తొలి గడపగా ఉండాలి’’ అని కీర్తించిన కులశేఖరాళ్వారు మాటలతో గర్భాలయం వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత గర్భాలయం ఆనుకునే నిర్మాణాలు, ఆనంద నిలయం వచ్చి ఉండవచ్చు. గరుడాళ్వార్ తర్వాత నిర్మాణాలన్నీ కొత్తవే.. స్వామి కొలువైన సన్నిధి ప్రాకారం మినహా మిగిలినవన్నీ కొత్త నిర్మాణాలే. తొలిరోజుల్లో గరుడాళ్వార్ వెనుకనే ధ్వజస్తంభం, కొబ్బరికాయలు కొట్టే అఖిలాండం ఉండేవి. భక్తులు పెరగడంతో వాటిని 13వ శతాబ్దం తర్వాత సంపంగి ప్రాకారం వెలుపలకు తరలించారు. ఆ తర్వాత ఆలయంలో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఆలయంలోనే అనేక మార్పులు, చేర్పులతో కొత్త నిర్మాణాలు వచ్చాయి. పూజకు మాత్రమే ఆగమం.. తిరుమల శ్రీవారి కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారమే సాగుతున్నాయి. ఆ కైంకర్యాల్లో ఎలాంటి లోపాల్లేవు. ఆగమం కేవలం పూజకు మాత్రమే సంబంధం. నిర్మాణాల్లో మార్పులు చేర్పులు.. ఏది మంచి, ఏది చెడు చూడాల్సింది శిల్ప నిపుణులు, స్తపతులు మాత్రమే. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా భయపడను? 1996లోనే అప్పటి ఆలయ ఆగమ విద్వాంసులు మాడంబాక్కం శ్రీనివాసులు తిరుమల ఆలయంలో నేత్రద్వారాలు తెరుచుకోవటం శ్రేయస్కరమన్నారు. ఆగమ పండితుల మధ్య సమన్వయం లేకపోవడం, రాజకీయ కారణాలతో అది ఆగింది. కొండలతో కూడుకున్న తిరుమల లాంటి ఆలయ నిర్మాణాల్లో ఆగమం చూడకూడదు. ఆగమం పట్టించుకుంటే తిరుమల ఆలయం ఇంత స్థాయిలో విస్తరించి ఉండేదా? పెరుగుతున్న భక్తుల కోసం మార్పులు చేయవచ్చు. నా నలభై ఏళ్ల అనుభవంతోనే చెబుతున్నా.. భక్తుల కోసం స్వామి పూజ, స్వామి సన్నిధి మినహా ఇతర ఆలయాల్లోని నిర్మాణాల్లో ఎన్ని మార్పులు చేసినా తప్పులేదు. వాహన సేవలూ మార్చవచ్చు భక్తుల కోసం కొంతకాలంగా గరుడ వాహనం ఊరేగింపు సమయాన్ని రాత్రి 9 గంటలకు బదులు రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించునే అవకాశం కలుగుతోంది. ఇదే తరహాలో మిగిలిన వాహన సేవలూ మార్చవచ్చు. వాహన సేవల సమయాలను ఆగమంలో చెప్పలేదు. అలాగే, సహస్ర దీపాలంకార సేవ సమయం కూడా మార్చుకోవచ్చు. ఇకపోతే.. స్వామి తలపై భక్తులు ప్రయాణించకూడదన్న భావనతోపాటు రాజకీయ కారణంతో తిరుమల రోప్‌వే ప్రాజెక్టు ఆగింది. కొండ మీద సెల్ టవర్లు, వంతెనలు సైతం నిర్మించినందున రోప్వేకూ ఎలాంటి అభ్యంతరం లేదు. -
కట్టెదుర వైకుంఠం కాణాచయినా కొండ
♦ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ ♦ తొమ్మిది రోజులు వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు ♦ విద్యుద్దీపకాంతులీనుతున్న తిరుమల తిరుమల ఇదో ఇల వైకుంఠం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అర్చామూర్తిగా స్వయంభువుగా కొలువై ఉన్నారు. గోవిందా అని పిలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడు. ఆయన అభయహస్తంమన ఆపదలన్నీ తీరుస్తుంది. నిరంతర వేదఘోష, వివిధ వాహన సేవలు, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత, నాట్య, హరికథ, భజన, కోలాట బృందాల కోలాహలంతో తిరుమల అలరారుతూ ఉంటుంది. ఈ విశ్వమూర్తికి జరిగే బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల వైభవమే వేరు. ఈ నెల 23 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తిరుమలక్షేత్ర ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనం. –సాక్షి ప్రతినిధి, తిరుపతి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు (శుక్రవారం) అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు.. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా నేటి సాయంత్రం విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 పాళికలలో– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవ ధాన్యాలతో అంకురార్పణం చేస్తారు. రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శనివారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.48 నుంచి 6 గంటల్లోపు మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సర్వం సిద్ధం చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకరరావు, టీటీడీ సీవీఎస్వో రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు శ్రీవారికి ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు శనివారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య పట్టువస్త్రాలను శ్రీవారికి సమర్పించి దర్శనం చేసుకుంటారు. స్వయంభువుగా వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆదివరాహ క్షేత్రంగా భాసిల్లే వేంకటాచలంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభువుగా అవతరించారు. ఆనంద నిలయంలో అర్చా మూర్తిగా అవతరించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యమంగళ విగ్రహాన్ని క్షణకాలమైనా వీక్షించాలని గోవిందా..గోవిందా అంటూ వర్షాన్ని..చలిని లెక్క చేయకుండా విచ్చేసే భక్తులను ఆపదమొక్కులవాడు తరింపజేస్తున్నాడు. సృష్టి, స్థితి, లయ కారకుడైన శ్రీమహా విష్ణువు స్వరూపమైన శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్క క్షణకాలమైనా వీక్షించాలని లక్షలాది మంది భక్తులు నిత్యం క్షేత్రానికి వస్తుంటారు. ఆలయ గోపురాలు, మండపాలు, çపురాతన రాతిస్తంభాలు, ప్రాకారాలు, మంగళవాయిద్య ఘోషలు, శంఖనాథాలు, వేద మంత్రోచ్ఛరణలతో అనునిత్యం తిరుమల క్షేత్రం పవిత్రధామంగా విరాజిల్లుతోంది. లక్ష్మీదేవిని వెదకుతూ వేంకటాచలానికి.. భృగుమహర్షికి గర్వభంగాన్ని కలిగించిన మహావిష్ణువు తనపై అలకపూని వైకుంఠం వీడిన లక్ష్మీదేవిని వెదకుచూ భూలోకంలోని వేంకటాచల పర్వతాన్ని చేరుకుంటాడు. మనశ్శాంతి కోసం తింత్రిణీ వృక్షం కింద తపస్సు చేస్తు న్న క్రమంలో గొల్లవాని గొడ్డలివేటు కారణంగా స్వామి వారి తలకు గాయమవుతుంది. సరైన ఔషధం కోసం శ్రీనివాసుడు వనంలో తిరుగుతుండగా ఆ ప్రాంతానికి అధిపతి అయిన వరాహస్వామి ఎదురై శ్రీనివాసుడిని తేరిపార చూసి మహా విష్ణువుగా గుర్తిస్తారు. ఆ తరువాత వకుళాదేవి దగ్గర కొంతకాలమున్న శ్రీనివాసుడు వేటాడుతూ వెళ్లి నారాయణవనంలో ఆకాశరాజు కుమా ర్తె శ్రీపద్మావతీ అమ్మవారిని చూసి పరమానంద భరితుడవుతాడు. వకుళాదేవిని రాయబారిగా పంపి పద్మావతిని వివాహమాడి తిరుమల కొండపై కొలువై ఉన్నారు. కలియుగాంతం వరకూ కొండ మీదనే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని వేంకటేశుడు వరాహస్వామికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిత్య కల్యాణం..పచ్చతోరణం మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఆనందనిలయం పేరి ట పెద్ద ఆలయాన్ని నిర్మించారు. తొండమాన్ చక్రవర్తి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య తిరుమలలో నివసించి స్వామి వారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఆ తరువాత పూజలు, ప్రత్యేక కైంకర్యాల్లో వేగం పెరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం విశేషంగా రూపుదిద్దుకుం ది. మొదటి ఈఓగా పనిచేసిన అన్నారావు ఆలయ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలకు రూపకల్పన చేశారు. తిరుమల సమగ్ర స్వరూపం తిరుమల ఆలయం సముద్ర మట్టం కంటే 2,820 అడుగుల ఎత్తులో ఉంది. 1945కి ముందు తిరుమలలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సిఎస్ ఉండేది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సిఎస్. రానురాను వాహనాలు, భక్తులు పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రత 16, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. 4,500మంది ఉద్యోగులు టీటీడీలోని 38 విభాగాలకు చెందిన 4500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకేసారి 40 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా తిరుమలలో సత్రాలు, గదులు, మఠాలు, అతిథి గృహాలు, ప్రత్యేక కాటేజీలు నిర్మించారు. కొండపై 16 చోట్ల కల్యాణకట్టలు, రెండు చోట్ల అన్నదాన సత్రాలు ఉన్నాయి. తిరుమల చరిత్ర తెలుసుకుందా.. 1. శ్రీవారి ఆలయంలో మూలమూర్తితో పాటు భోగశ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూ దేవి సమేత శ్రీమలయప్పస్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉంటారు. వీరినే పంచబేరాలు అంటారు. 2. శ్రీవారి ఆలయం మహాద్వారానికి కింది భాగంలో అటూ, ఇటూ పుష్ఫాలను ధరించిన శంఖనిధి, పద్మనిధి అనే నిధి దేవతల విగ్రహాలు ఉంటాయి. 3. శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరానికి నాలుగుసార్లు చక్రస్నానం నిర్వహిస్తారు. అనంత పద్మనాభ చతుర్థశి, బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజుల్లో చక్రస్నానం నిర్వహిస్తారు. 4. క ్రీ.శ. 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశీయులు స్వామి పుష్కరిణికి మెట్లు నిర్మించారు. పుష్కరిణి మధ్యలో ఉన్న పవిత్ర నీరాళి మండపాన్ని క్రీ.శ.1468లో సాళువ నరసింహరాయులు నిర్మించారు. 5. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ కోసం ఉపయోగించే ధర్భలతో చేసిన తాడు 1.5 అంగుళాల మందం, 300 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. 6. 1933లో తొలిసారి టీటీడీ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పడింది. 7. 1944లో ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ తిరుమలకు బస్సు సౌకర్యం ఉండేది. ఫస్ట్‌క్లాస్ టికెట్ ధర రూ.2. రెండవ క్లాస్ ధర రూ.1.4 అణాలు. 8. పాపవినాశనం డ్యాం నిర్మాణానికి 1950 జులై 30న మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ కృష్ణకుమార్ సిన్హా శంకుస్థాపన చేశారు. 1964లో గోగర్భం డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. 9. 1978లో టీటీడీ పరిపాలనా భవనం నిర్మాణం పూర్తయింది. పరిపాలన మొత్తం ఒకేచోట నుంచి మొదలైంది. 10. 944కి ముందు తిరుమల కొండపైకి భక్తులు గుంపులు గుంపులుగానే నడిచే వెళ్లేవారు. ఎందుకంటే పులుల భయం. ఎప్పుడు ఏ సమయంలో క్రూరమృగాలు దాడి చేస్తాయోనని భయపడేవారు. బలమైన ముల్లుగర్రలు, బరిశెలు చేతబట్టుకుని నడిచి వెళ్లేవారు. 11. ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు నిత్యం 250 కిలోల పూలను వినియోగిస్తారు. కొండకు చేరుకునే మార్గాలు 1. అలిపిరి ఘాట్ రోడ్ దీన్ని 1944లో వేశారు. అప్పటి ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీన్ని డిజైన్ చేశారు. మొదట్లో కాలినడకన, తర్వాత ఎడ్లబండ్లపై భక్తులు కొండకు చేరుకునే వారు. అలిపిరి మార్గంలో కాలినడకన భక్తులు 9 కిలోమీటర్ల పొడవున్న మార్గంలో 3550 మెట్లు ఎక్కుతూ తిరుమల చేరుకోవాలి. ఒకవేళ రోడ్డు మార్గాన వెళితే 22 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. 2. శ్రీవారిమెట్టు శ్రీనివాసమంగాపురానికి రెండు కిలో మీటర్ల దగ్గరలో కొం డకు దక్షిణాన శ్రీవారి మెట్టు ఉంది. 2.1 కిలోమీటర్ల పొడవున 2388 మెట్లు ఎక్కితే తిరుమల చేరుకోవచ్చు. ఆకాశరాజు కుమార్తె పద్మావతీ అమ్మవారిని వివాహం చేసుకుని వేంకటాచలం వెళ్తూ శ్రీనివాసుడు శ్రీనివాసమంగాపురంలో కొన్నాళ్లు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి స్వామి వారు ఈ మార్గాన్నే తిరుమల చేరుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 3. అన్నమయ్యమార్గం వైఎస్సార్ కడప జిల్లా మామండూరు నుంచి అటవీ మార్గం లో కాలి బాట మార్గం ఉంది. ఈ మార్గం గుండా నడిచే వెళితే తిరుమల కొండ మీదున్న పారువేట మందిరం దగ్గరకు చేరుకుంటాం. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి శ్రీవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. అన్నమయ్య ఈ మార్గం నుంచే ఆలయానికి వచ్చారు. తిరుమలకు బస్ చార్జీలు ♦ తిరుపతి నుంచి తిరుమలకు సాధారణ బస్సుచార్జి రూ. 53, డీలక్స్ మినీ బస్సు చార్జి రూ.58 ♦ రిటన్ టికెట్‌తో కలిపి (తిరుపతి నుంచి తిరుమల, తిరుమల నుంచి తిరుపతి) రూ.96 ♦ ప్రైవేట్ జీపులు, ట్యాక్సీలు రూ.60 -
బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
తిరుమల: శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు 2,700 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. గరుడసేవకు అదనంగా మరో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నాం. వేడుకల్లో తప్పిపోయిన వారి కోసం ట్యాగింగ్ సిస్టమ్, దొంగలకు చెక్ పెట్టేందుకు పిన్స్ సిస్టమ్‌లను వాడునున్నాం. వేడుకలను కంట్రోల్ రూం నుంచి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తాం. గరుడ సేవనాడు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించమని ఎస్పీ తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు లక్ష విస్తరాకులు
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వినియోగం కోసం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు లక్ష విస్తరాకులను పంపారు. సుమారు 50 మంది భక్తులు ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి ప్యాసింజరు రైలులో లక్ష విస్తరాకులతో తిరుమలకు పయనమయ్యారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఈ విస్తర్లు అందజేస్తారు. ఆరేళ్లుగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్ష విస్తరాకులను అందజేస్తున్నామని అప్పారావు తెలిపారు. -
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం
-
ఉత్సవ ప్రియునికి నీరాజనం
– కల్పవక్ష, రాత్రి సర్వభూపాల వాహనాల్లో ఊరేగిన మలయప్ప – శ్రీవారికి కానుకగా అందిన శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ గొడుగులు – కన్యాకుమారి వయోలిన్, కదిరిగోపాల్నాథ్ శాక్సోఫోన్ వాయిద్య నీరాజన కోలాహలం – మాడవీధుల్లో కళాకారుల సందడి సాక్షి,తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవం కన్నులపండువగా సాగుతోంది. మలయప్ప ఉభయదేవేరులు శ్రీదేవి, భూదేవి సమేతంగా పూటకో వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తు కనువిందు చేస్తున్నారు. గురువారం ఉదయం కల్పవక్షం, రాత్రి సర్వ భూపాల వాహనాలపై దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. ఉత్సవాల ప్రారంభం తర్వాత మొదటి మూడు రోజులు భక్తుల రద్దీ కొంత తక్కువగా కనిపించినా నాలుగో రోజు సందడి పెరిగింది. ఉదయం కల్పవక్ష వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. నాలుగు మాడ వీధుల్లో వాహనసేవలు తిలకించేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు నిండుగా కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో అంతకంటే ఎక్కువ స్థాయిలో భక్తులు కనిపించారు. శ్రీవిల్లిపుత్తూరు నుండి పుష్పమాలలు, చెన్నయ్ నుండి గొడుగులు శ్రీవారికి కానుకగా అందటం నాల్గో రోజు ప్రత్యేకత. సాయంత్రం 6 గంటలకు కుమారి కన్యాకుమారి వయోలిన్, కదిరి గోపాల్నా«ద్ శాక్సోఫోన్ వాయిద్య కచేరి భక్తులను అలరించింది. ఆ తర్వాత ఉత్సవమూర్తులు సహస్రదీపాలంకార సేవలో స్వామి వేయి నేతిదీపాల వెలుగులో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్ప ప్రదర్శన శాలకు భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు భక్తుల నుంచి విశేష ఆధరణ లభిస్తోంది. పెరిగిన రద్దీ వల్ల గురువారం సాయంత్రం 6గంటల వరకు సుమారు 52,985 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నదానం, క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద సుమారు 60 వేల మందికిపైగా అన్న ప్రసాదం అందజేశారు. కళాబందాల ప్రదర్శనల హోరు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కతిక శోభ భక్తులను కట్టిపడేస్తున్నాయి. వాహన సేవల ముందు భాగంలో సంగీత, సాంస్కతిక కళా బందాలు ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కర్నాటక నుంచి వచ్చిన హిందూస్తాని భజన బందాలు డప్పు వాయిద్యం భక్తులను ఉర్రూతులూగించాయి. భజన బందాల కళాకారులు నత్యాలు, డబ్బు వాయిద్యాలు, తాళం వేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ ఆధ్యాత్మికానందంలో ఓలలాడించారు. -
హంస వాహనంపై పరమహంస
-
ఆరంభం .. ఆనంద నిలయుని బ్రహ్మోత్స సంబరం
– శాస్త్రోక్తంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ – ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన సేనాపతి విష్వక్సేనుడు – నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం – శ్రీవారికి పట్టువస్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరపున విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుక నిర్వíß ంచడం అనాదిగా వస్తున్న ఆచారం. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవే„ì స్తూ తిరిగి ఆలయంలోనికి చేరుకున్నారు. యాగశాలలో లలాట, బహు, స్తన పునీత ప్రదేశంలో భూమి పూజ(మృత్సంగ్రహణం) నిర్వహించారు. తొమ్మిది పాళికలలో(కుండలు)– శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు.. మొదలగు తొమ్మిది రకాల నవధాన్యాలు మొలకొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం (బీజావాపం) అంటారు. ఈ కార్యక్రమానికి సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. ఉత్సవాలు విజయవంతం కావాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. తర్వాత రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఈనెల 11వ తేది వరకు ఉదయం 9 నుంచి 11 గంటలు , రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ సాక్షాత్కరించనున్నారు. ఐదోరోజు రాత్రి 7.30 గంటలకే గరుడ వాహనం స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇక ఎనిమిదో రోజు రథోత్సవంలోనూ, చివరి తొమ్మిదో రోజు చక్రస్నానంలో స్వామివారు సేద తీరుతారు. నేడు శ్రీవారికి సీఎం పట్టువస్రాలు సమర్పణ తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడి సీఎం బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేషవాహనసేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. శ్రీవారి ఆలయం గుభాళింపు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలు, దేదీప్యమాన విద్యుత్ అలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల కోసం బందోబస్తు సిబ్బంది తిరుమలకు చేరుకున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. -
స్వామి సేవకు వేళాయెరా!
* రెండువేల ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుమలేశుని ఆలయంలో అర్చక వ్యవస్థకు 1800 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి ఆత్మసాక్షాత్కారంగా విఖనసముని తొలిసారిగా పూజా కైంకర్యాలు నిర్వహించినట్టు ఐతిహ్యం. ఆ తర్వాత ఆలయంలో మొదటిసారిగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ్ దీక్షితులు వేంకటేశుడికి పూజాకైంకర్యాలు నిర్వహించారు. తర్వాత కౌశిక గోత్రానికి చెందిన శ్రీనివాస దీక్షితులు వచ్చారు. 1996 వరకు శ్రీవారి ఆలయంలో అర్చక మిరాశి వ్యవస్థ కొనసాగింది. ఆలయ వ్యవహారాలు, నగల రక్షణ బాధ్యత వీరి చేతుల్లోనే ఉండేది. * 1977 నుంచి ప్రస్తుతం భరద్వాజ గోత్రంలో అర్చక పైడిపల్లి, అర్చక గొల్లపల్లి, కౌశిక గోత్రంలో అర్చక పెద్దింటి, అర్చక తిరుపతమ్మగారి అనే నాలుగు కుటుంబాలు శ్రీవారి ఆలయంలో అర్చక వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. * భరద్వాజ గోత్రానికి చెందిన అర్చక గొల్లపల్లి రమణ దీక్షితులు, పైడిపల్లి శ్రీనివాస నారాయణ దీక్షితులు, కౌశిక గోత్రానికి చెందిన పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు, అర్చక తిరుపతమ్మగారి శ్రీనివాస నరసింహ దీక్షితులు ఇప్పుడు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. * వీరు వేకువజామున 1గంటకు నిద్రలేస్తారు. చల్ల నీటి స్నానం చేసి మడికట్టుకుంటారు. ద్వాదశి ఊర్వపుండ్రాళ్లు (నామాలు) పెట్టుకుంటారు. * అర్చక నిలయంలో కొలువైన విఖన స ముని వద్ద ప్రార్థన చేస్తారు. సన్నిధి గొల్ల దివిటీ చేతబట్టి అర్చకులను ఆలయానికి తీసుకెళుతారు. జీయర్ ఆదేశాలతో సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తీస్తారు. గోవింద గోవింద అంటూ అర్చకులు ఆలయ ప్రవేశం చేస్తారు. * గర్భాలయంలో కైంకర్య పూజా విధులు నిర్వహిస్తున్నందున మూలమూర్తిపై ఎక్కడ నోటి గాలి, లాలాజలం పడుతుందో? అని శిరోవస్త్రం (నోటికి వస్త్రం కట్టుకుంటారు). * జీయర్ ఇచ్చే పుష్పాలను స్వామికి అలంకరించి, హారతులు సమర్పిస్తారు. వారపు, పర్వదినాల్లో విశేష అలంకరణ చేస్తారు. వేకువజామున 2.30 గంటలకు సుప్రభాతంలో మేల్కొలుపు నుంచి తిరిగి అర్ధరాత్రి 1.30 గంటలకు పవళింపు (ఏకాంత) సేవ వరకు నిత్య కైంకార్యల్లోనూ అర్చకులు పాత్ర విశేషంగా ఉంది. ఇలా అర్చకులు స్వామి సేవకులుగా సపర్యలు చే స్తూ పరమానందం పొందుతున్నారు. -
మహంతులే మార్గదర్శకులుగా...
ఐదువందల ఏళ్ళ కిందట ఢిల్లీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని ‘క్రేడల్క్రేల’ గ్రామంలో రామానంద మఠం ఉండేది. ఆ మఠాధిపతి అభయ ఆనంద్జీ. ఈయన శిష్యుడే హథీరాంజీ. దక్షిణభారత దేశ యాత్రలో భాగంగా వేంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వర స్వామిని అయోధ్య రాముడి అంశగా భక్తితో కొలుస్తూ ప్రసన్నం చేసుకున్నాడు. బావాజీ భక్తికి ముగ్ధుడైన స్వామి నిత్యం ఆనంద నిలయం దాటి హథీరాం మఠం విడిదికి వెళ్లి, బావాజీతో పాచికలాడేవారట. అయితే ఆటలో తానే ఓడిపోయి భక్తుని గెలిపిస్తూ ఆనందించేవారట. తిరుమలలో హథీరాంజీ స్థాపించిన మఠం ఆలయానికి ఆనుకుని ఆగ్నేయదిశలో ఉంది. 90 ఏళ్ల మహంతుల పాలన క్రీ.శ.13వ శతాబ్దం తర్వాత విజయనగర రాజులు, ఆ తర్వాత 1843 ముందు వరకు ఈస్టిండియా కంపెనీ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలన సాగింది. 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు 90 ఏళ్లపాటు ఆలయ పాలన హథీరాం మఠం మహంతుల చేతుల్లోనే సాగింది. 1843 జూలై 10 తేదీన హథీరాం మఠం తరపున శ్రీవారి ఆలయానికి తొలి ధర్మకర్తగా మహంత్ సేవాదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆణివార ఆస్థానం రోజున బ్రిటీషు ప్రభువుల నుండి శ్రీవారి ఆలయ ఆస్తిపాస్తులు, స్వామికి అలంకరించే తిరువాభరణాలు, ఉత్సవమూర్తులు, ఉత్సవ వర్ల ఊరేగింపులో వాడే వాహనాలు, కైంకర్యాల్లో వినియోగించే పురాతన వస్తువులు, వస్త్రాలు, పాత్రలు, ఆలయానికి సంబంధించిన అన్ని రికార్డులు సేవాదాస్కు అప్పగించారు. ఇందుకు తార్కాణంగానే తిరుమల ఆలయ లెక్కల అప్పగింతలు వంటి కార్యక్రమాలన్నీ ‘ఆణివార ఆస్థానం’ రోజునే నిర్వహించే ఆచారాన్ని టీటీడీ అమలు చేస్తుండటం విశేషం. మహంతుల అధికారిక ముద్ర ‘విష్వక్సేన’ మహంతుల అధికారిక ముద్ర (సీలు) విష్వక్సేనుడు. సేవాదాస్ హయాంలోనే పుష్కరిణిలోని ‘జలకేళి మండపోత్సవం’ పేరుతో తెప్పోత్సవం ప్రారంభించారు. రెండవ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న ధర్మదాస్ తిరుపతి కపిలతీర్థం పుష్కరిణి, సంధ్యావందన మండపాన్ని జీర్ణోద్ధారణ చేశారు. 1878లో తిరుమల ఆలయంలోని పడికావలి గోపురం (మహద్వార గోపురం)కు మరమ్మతులు చేయించారు. ప్రయాగదాస్ హయాంలో అభివృద్ధి వేగవంతం మహంతుల పాలనలో చివరి విచారణకర్తగా బాధ్యతలు చేపట్టిన మహంత్ ప్రయాగదాస్ హయాంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన వేగవంతం అయ్యాయి. 1900 సంవత్సరం నుంచి 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే వరకు 33 సంవత్సరాల పాటు ఆయన పాలన సాగింది. ఆ కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, పనులు నేటి తరం టీటీడీ పాలకులకు కూడా మార్గదర్శకంగా నిలిచాయి. 1908లో ఆనంద నిలయం శిఖరంపై బంగారు కలశాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా తిరుమలకు వచ్చేందుకు ప్రధాన మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాట మార్గాలు అభివృద్ధి చేశారు. జంతుదాడుల నుంచి రక్షించుకోవటంతోపాటు వెలుతురు కోసం అటవీ కాలిబాటల్లో వాషింగ్టన్ (ఆధునిక బల్బులు) విద్యుత్ బల్పులు ఏర్పాటు చేయించారు. అలిపిరిమార్గంలో గాలిగోపురం నిర్మించారు. తిరుమల, తిరుపతిలో ధర్మసత్రాలు నిర్మించారు. రహదారులు, తాగునీరు, శుభ్రత, ఆరోగ్యం, వైద్య సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించి పనులు వేగవంతం చేయించారు. పరిపాలన సౌలభ్యం కోసం తిరుపతిలో పాత హుజారు ఆఫీసు నిర్మాణం, మద్రాసులో దేవస్థానం ముద్రణాలయం, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర ఉన్నత పాఠశాల నిర్మాణం, వేదపాఠశాల విస్తరణ, ఓరియంటల్ కళాశాల, ఆయుర్వేద పాఠశాల నిర్మాణాలు చేపట్టారు. మూలమూర్తి, ఉత్సవమూర్తులకు ఆభణాలు, కిరీటాలు వంటి విలువైన నగలు తయారు చేయించారు. దేవాలయాల శిలాశాసనాలు పరిశోధన చేయించారు. 1933లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేయటంతో మహంతుల పాలన ముగిసింది. శ్రీవారికి మహంతుల ‘నిత్యహారతి ’ మహంతు బాబాజీ పేరుతో తిరుమల ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలో గోక్షీర నివేదనం, నవనీత హారతి సమర్పించే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ నాటి నుంచి నేటి హథీరాం మహంత్ అర్జున్‌దాస్ లేదా మఠానికి చెందిన సాధువులు/బైరాగులు ప్రతిరోజూ వేకువజాము సుప్రభాతవేళకు ముందు ఆలయానికి వెళ్లి సంప్రదాయంగా హారతి అందజేస్తున్నారు. ఇక గోకులాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు హథీరాంమఠానికి విడిదికి వచ్చి ప్రత్యేక పూజలందుకుంటారు. మఠం మహంతుకు ఆలయ మర్యాదలు పరివట్టం, తీర్థం, శఠారి మర్యాదలు అందజేస్తారు. మహంతుల కాలంలోనే స్థానికులకు కొండమీద స్థలాలు అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తిరుమలకొండ మీద ఆలయంలో పనుల నిర్వహణ కోసం సిబ్బంది కొరత ఉండడంతో సదుపాయాల్లేక భక్తులు ఇబ్బంది పడేవారు. దాంతో మహంతులు చొరవ తీసుకుని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర సమీప గ్రామ ప్రాంతాల్లో దండోరా వేసి అక్కడివారిని తిరుమలకు రప్పించారు. వారికి స్థలాలను, అనుభవ హక్కులు ఇచ్చారు. స్థిరనివాసం కల్పించారు. వ్యాపారాలకు అనుమతులిచ్చారు. కొండకు వచ్చే భక్తులకు అండగా ఉంటూ జీవనం సాగించుకునేందుకు స్థానికులకు మహంతులు భరోసా ఇచ్చారు. విచారణ కర్త పాలన కాలం సం. 1. మహంతు సేవాదాస్ 1843-1864 21 2. మహంతు ధర్మదాస్ 1864-1880 16 3. మహంతు భగవాన్‌దాస్ 1880-1890 10 4. మహంతు మహావీర్‌దాస్ 1890-1894 04 5. మహంతు రామకృష్ణదాస్ 1894-1900 06 6. మహంతు ప్రయాగదాస్ 1900-1933 33 రూ.వేల కోట్లలో మఠం ఆస్తులు హథీరాం మఠం నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని అనధికారిక లెక్కలు. ప్రధానంగా తిరుమల, తిరుపతిలో మఠాలతోపాటు ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. మఠం నిర్వహణా బాధ్యతను 1962 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ నిర్వహిస్తోంది. మఠాధిపతిగా అర్జున్‌దాస్ హథీరాం మఠం మహంతుగా అర్జున్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో మహంతుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన్ను బాధ్యతల నుండి తప్పించింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో 2007లో తిరిగి మఠం మహంత్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి మహంత్ అర్జున్‌దాస్ కొనసాగుతున్నారు. -
తరాలు మారినా... సంప్రదాయాలు మారలేదు!
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి కైంకర్యంలో ఎన్నెన్నో సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఉత్సవ ప్రియుడైన స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తులు వందలయేళ్లుగా ప్రత్యేక కానుక లు సమర్పిస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. వీటిలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ నుండి గొడుగులు, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల సంస్థానం నుండి ఏరువాడ జోడు పంచెలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. వాటి విశేషాల గురించి తెలుసుకుందామా!! తరాలుగా తిరుమలేశుని సేవలో చెన్నయ్ గొడుగులు తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నయ్ (నాటి చెన్నపట్నం) నుండి గొడుగులు సమర్పించే సంప్రదాయం వందలయేళ్లుగా వస్తోంది. చెట్టియార్లు, హిందూధర్మార్థ ట్రస్టుతోపాటు ఎన్నెన్నో కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. నాడు దివిటీ వెలుగుల్లో... సౌకర్యాలు అంతగా లేని నాటి రోజుల్లో దివిటీల వెలుగుల ఎడ్లబండ్లు, కాలినడకన ఊరేగింపుగా తీసుకొచ్చేవారట. దశాబ్దమున్నరకాలంగా గొడుగుల సమర్పణలో అనేకరకాల వివాదాలు చోటు చేసుకోవటంతో తిరుమల ఆలయ మర్యాదలు లేకుండా కేవలం భక్తులు గొడుగులు సమర్పిస్తే తీసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా అనేకమంది భక్తులు శ్రీవారికి ఛత్రిలు సమర్పిస్తున్నారు. ఇందులో హిందూ ధర్మార్థ సమితి గత 12 ఏళ్లుగా గొడుగులు సమర్పించే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. * శ్రీవారి బ్రహ్మోత్సవం తొలిరోజు చెన్నయ్‌లోని చెన్నకేశవాలయం నుంచి 11 గొడుగులతో భక్తబృందం కాలినడకన బయలుదేరుతారు. తొలుత తిరుచానూరు అమ్మవారికి రెండు గొడుగులు సమర్పిస్తారు. తర్వాత గరుడసేవ రోజున ఆలయం వద్ద మరో 9 గొడుగులు సమర్పిస్తారు. స్వామివైభవం, దర్పానికి ప్రతీకగా ఆలయాల్లో గొడుగులను వాడే సంప్రదాయాన్ని వెయ్యేళ్ల క్రితమే భగవద్రామానుజులవారు ఆరంభించినట్టు చరిత్ర. 4 నుండి10 అడుగుల ఎత్తు వరకు... శ్రీవారికి సమర్పించే గొడుగులను 4 నుండి 10 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. గరుడసేవ కోసం 10 అడుగులు, ఇతర వాహనాలకు 9 అడుగులు, సూర్య, చంద్రప్రభ వాహనాలకు 7.5 అడుగులు, బంగారు తిరుచ్చి వాహనాలకు 4 నుండి 6 అడుగుల ఎత్తులో తయారు చేస్తారు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుండి రూ.50 వేల వరకు ధర పలుకుతాయి. వీటి అలంకరణకు వెండి కలశాలు, ఇతర సామగ్రి వాడతారు. తరతరాలుగా గొడుగుల తయారీలోనే... తిరుమలతోపాటు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలకు గొడుగులు తయారు చేసే కుటుంబాలలో ప్రధానంగా చిన్నస్వామి షా కుటుంబాన్ని చెప్పొచ్చు ఈయన పూర్వీకులది మహారాష్ర్టలోని సౌరాష్ట్ర ప్రాంతం. వలసల ద్వారా చెన్నయ్‌లోని చింతాద్రిపేటలోని అయ్యామెదలువీధిలో స్థిరపడ్డారు. చిన్నస్వామి కుమారుడు స్వామి షా, మనుమలు గజేంద్రషా, సుబ్రమణి షా. ఈ కుటుంబ సభ్యులు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మూడు నెలల ముందు చెన్నయ్ ప్యారిస్‌లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో గొడుగుల తయారీపై దృష్టిపెడతారు. ఇలా తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ), మధుర మీనాక్షి, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, తిరువళ్లూరు వీర రాఘవస్వామి, కాంచీపురం వరదరాజస్వామి, చెన్నయ్‌లోని పార్థసారథి స్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల, నెల్లూరు రంగనాథ స్వామి ఆలయాలకు కూడా వీరు గొడుగులు సమర్పించారు. * పూర్వం వీటిని కాగితంతో తయారు చేసేవారట. తాజాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పద్ధతి, డిజిటల్, బోల్డ్ సిల్క్, ప్యూర్సిల్క్ పద్ధతుల్లో గొడుగులు సిద్ధమవుతున్నాయి. వాటిపై ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల బొమ్మల అల్లికలు చేస్తున్నారు. ఊరేగింపులో ఉత్సవమూర్తి పక్కనే గొడుగులు ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడతారు. లోకకల్యాణం కోసమే గొడుగుల సమర్పణ లోకకల్యాణం కోసం పదకొండేళ్ల్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో వీటిని తీసుకొస్తాం. మార్గంలో అడుగడుగునా పూజలు అందుకుంటాయి. ఈ గొడుగులు స్వామి వారికి సమర్పించటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని పెద్దల విశ్వాసం. ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని దీక్షగా నిర్వహిస్తున్నాం. ఈ యజ్ఞానికి టీటీడీ యాజమాన్యం సంపూర్ణంగా సహకరిస్తోంది. - ఆర్ఆర్. గోపాలన్ చైర్మన్, హిందూ ధర్మార్థ ట్రస్టు మహద్భాగ్యం తిరుమల వెంకన్నను దర్శించుకోవడమే మహాభాగ్యం. అటువంటి స్వామికి మరింత దర్పాన్ని తీసుకొచ్చే గొడుగులను మా ఇంటి నుండి తీసుకు వెళ్లటం మహద్భాగ్యం... గర్వకారణంగా, పూర్వజన్మ సకృతంగా భావిస్తాం. - గజేంద్రషా, చెన్నయ్ పూర్వజన్మ సుకృతం ఈ భాగ్యం పూర్వజన్మసుకృతం. ఇంతకంటే ఆనందం లేదు. తిరుపతికి వెళ్లినప్పుడు స్వామి ఊరేగింపులో మా చేత తయారైన గొడుగుల చూసి ఆనందించే క్షణాలు విలువ చెప్పలేము. - సుబ్రమణి షా, చెన్నయ్ జగన్మోహనుడి అలంకరణలో శ్రీవిల్లిపుత్తూరు పుష్పమాలలు, చిలుక ప్రతియేటా బ్రహ్మోత్సవం గరుడ రోజున శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి అమ్మవారికి అలంకరించిన పూలమాలలను తిరుమలేశునికి అలంకరించటం సంప్రదాయం. ♦ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి శ్రీమహావిష్ణువును శ్రీకృష్ణునిగా, తనను గోపికగా భావించి రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు పాశురాలను గానం చేశారు. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను పరిణయమాడారు. నాటినుంచి గోదాదేవి (ఆండాళ్)గా ప్రసిద్ధి పొందారు ♦ దానికి గుర్తుగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో నెలరోజులపాటు సుప్రభాతం బదులు గోదాదేవి ‘తిరుప్పావై’ పఠిస్తారు. ♦ బ్రహ్మోత్సవం ఐదోరోజు అలంకార ప్రియుడైన మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శ్వేతవర్ణ పట్టు శేషవస్త్రం, శిఖపై కొప్పు, వజ్రాలు పొదిగిన బంగారు వాలు జడ, ఎదపై పచ్చలహారం, కుడిచేతిలో బంగారు చిలుకను, ఎడమవైపు శ్రీవిల్లిపుత్తూరు చిలుకను ధరించి ఆసీనులై జగన్మోహనాకారంగా భక్తలోకాన్ని సమ్మోహపరుస్తూ దివ్యమంగళరూపంలో దర్శనమివ్వటం సంప్రదాయం ♦ ఐదోరోజు రాత్రి ఉత్కృష్టైమైన గరుడవాహన సేవలో గర్భాలయ మూలవిరాట్టుకు అలంకరించే మకర కంఠి, లక్ష్మీహారం, సహస్ర నామమాల ధరించి మలయప్పస్వామి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడిపై ఊరేగుతూ అశేష భక్తజనాన్ని అనుగ్రహిస్తారు. అదేసందర్భంగా గోదాదేవి పనుపున శ్రీవిల్లి పుత్తూరు ఆలయం నుండి వచ్చిన తులసిమాలలు అలంకరిస్తారు. -
ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు
తెలంగాణాప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడుపంచెలు సమర్పించటం సంప్రదాయం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ జోడు పంచెలు గద్వాల్ సంస్థానం నుండి కానుకగా అందే సంప్రదాయం నాలుగు వందల యేళ్ల నుండి నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఏరువాడ జోడు పంచెలంటే? ఏరు అంటే నదీపరివాహక ప్రాంతం అని అర్థం. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణానది మధ్య ఉంది. ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడుపంచెలు తయారు చేయటం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి. గద్వాల సంస్థానాధీశుల వారసత్వం గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయం. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు. 41 రోజుల పాటు దీక్షతో జోడు పంచెలు గద్వాల సంస్థానాధీశుల విజ్ఞప్తి మేరకు ఐదేళ్లుగా గద్వాల లింగంబాగ్ కాలనీలోని చేనేత పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కరుణాకర్ తన ఇంటిమీద తయారు చేశారు. వీటిని ఇప్పటికే సిద్ధం చేశారు. * సాక్షాత్తు కలియుగ దేవదేవునికి అలంకరించే వ స్త్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మగ్గంతో ఐదుమంది సహచర చేనేత కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల షణ్ముఖ రావు, కరుణాకర్, మేడం రమేష్‌తో కలసి సిద్ధం చేశారు. * మొత్తం 41 రోజుల పాటు దీక్షతో ఈ జోడు పంచెలు తయారు చేశారు. 11 గజాల జోడు పంచెలు గద్వాల ఏరువాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. 15 అంగుళాల వెడల్పు అంచుతో తయారు చేశారు. ఈ జోడు పంచెలపై రాజకట్టడాల గుర్తుగా ఎనిమిది కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా తయారు చేశారు. ఒక్కోపంచెను తయారు చేయడానికి 20 రోజులు పడుతుంది. బ్రహ్మోత్సవాల్లో మూలమూర్తికి అలంకరణ గద్వాల సంస్థానం నుండి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం. పూర్వజన్మసుకృతం గద్వాల సంస్థానం ఆచారం ప్రకారం మా ఇంట్లో తయారైన జోడుపంచెలు సాక్షాత్తు తిరుమల గర్భాలయ మూలమూర్తి అలంకరణకు వాడుతుండటం మా పూర్వజన్మసుకృతం. ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేము. - మహంకాళి కరుణాకర్ -
నిజరూప దర్శన భాగ్యం
దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు గురువారం మాత్రమే దక్కుతుంది. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా స్వామి నిరాడంబర స్వరూపంతో దర్శనమిస్తారు. గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని అంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డ (పరివీటం, పరివేష్ఠనం) తో నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు స్వామి. ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్థ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. ఆ రోజంతా భక్తులు శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహ ద్భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాల బదులు 24/ 4 కొలతలు గల పట్టుధోవతి ధరింపచేస్తారు. 12/ 2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాను చుడతారు. మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలో నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తారు. భక్తుల్లో కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారికి గోచరిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు. -
స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి
ఆపదమొక్కులవాడికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. నిత్యపెళ్లికొడుకైన ఆ స్వామి సన్నిధిలో వివాహబంధంతో ఒక్కటవుతుంటాయి కొత్తజంటలు. మరికొందరు భక్తులు నామకరణం, అన్నప్రాశసన, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం, కేశఖండన, ఉపనయనం, సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తూ తరిస్తున్నారు భక్తకోటి. ఇందుకు టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణ వేదిక కేంద్రమైంది. పురోహిత సంఘం తిరుమలలో సనాతన హైందవ సంప్రదాయానికి లోబడి వైదిక కర్మలు నిర్వహించేందుకు టీటీడీ పౌరోహిత సంఘం ఉంది. ఇక్కడ నిష్ణాతులైన పురోహితులు ఉన్నారు. మొత్తం 120మంది పౌరోహితులు, మంగళవాయిద్యాలు వాయించటం, చెవిపోగులు కుట్టడం వంటి వాటిలో నాయీ బ్రాహ్మణుల 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకన్న సన్నిధిలో ముహూర్తంతో పనిలేదు! దేవదేవుని సన్నిధి అయిన తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. బాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. ఇలా తిరుమలలో రోజూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. శుభలగ్నాలతో పనిలేకుండా కూడా పెళ్లి వేడుకలు సాగుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఉచిత ‘కల్యాణం’ భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరైన వివాహ బంధం పటిష్టతకు టీటీడీ గట్టి పునాదులు వేసింది. అదే తరహాలోనే ‘కల్యాణం’ పేరుతో కొత్త పథకానికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శ్రీకారం చుట్టారు. వివాహానికి కావాలసిన వాటినన్నిటినీ ఉచితంగా సమకూర్చుటం వల్ల ధార్మిక ప్రచారంతోపాటు మానవసేవకూ మార్గం ఏర్పడుతుందని టీటీడీ భావించింది. * తిరుమల కల్యాణవేదిక పౌరోహిత సంఘం కేంద్రంగా 2016, ఏప్రిల్ 25 నుండి ‘కల్యాణం’ పథకానికి శ్రీకారం చుట్టారు. పురోహితుడు, మంగళవాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో విద్యుత్ చార్జీలకు రూ.860 వసూలు చేసే విధానాన్ని రద్దు చేశారు. * వివాహం సందర్భంగా శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల క్యూలైను నుండి కొత్తజంటలతోపాటు వారి అమ్మానాన్నలు, బంధుమిత్రులు మొత్తం 6 మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటకు శ్రీవారి ప్రసాద బహుమానంగా పది చిన్న లడ్డూలు అందజేస్తారు. * చట్టప్రకారం వధూవరులు మేజరై ఉండాలి. వారి వయసు తెలిపే 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపాలి. పెళ్లికి పెద్దల అంగీకారం ఉండాలి. వధువు, వరుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు హాజరు కావాలి. * ఫొటోమెట్రిక్ పద్ధతిలో అందరూ వేలి ముద్రలు వేసి రిజిస్టర్ చేసుకున్నాకే పెళ్లి వేడుక నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత ఎస్‌ఎంసీలోని 232 కాటేజీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. * పౌరోహిత సంఘంలో సామూహిక పెళ్లి వేడుక నిర్వహించుకునేందుకు టీటీడీ కొత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌక ర్యం కల్పించింది. www.ttdseva online.com ద్వారా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. * తిరుమలలో 23 మఠాలు, ప్రైవేట్ సత్రాలు, టీటీడీకి సంబంధించిన శంకుమిట్ట కాటేజీ (ఎస్ఎంసీ) 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీ (టీబీసీ) 2 కల్యాణ మండపాల్లోనూ పెళ్ళిళ్లు చేసుకోవచ్చు. వీటికి మాత్రమే నగదు చెల్లించాలి? టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణవేదికలో వివాహాలు మాత్రం ఉచితం. అయితే, మిగిలిన వాటికి నగదు చెల్లించాలి. వీటి నిర్వహణకోసం కేవలం గంట ముందు వచ్చి నగదు చెల్లించి రశీదు పొందితే చాలు టీటీడీ అవసరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నగదు చెల్లింపు వివరాల్లోకి వెళితే..., ఉపనయనం:రూ.300, చెవులు కుట్టించడం: రూ.50, అన్నప్రాశన-రూ.200, నామకరణం-200, కేశఖండన-రూ.200, అక్షరాభ్యాసం:రూ.200, సత్యనారాయణ స్వామి వ్రతం:రూ.300, నవగ్రహ హోమం: రూ.300, రూ.100, ప్రార్థనావివాహం-రూ.200. నామకరణం హిందువులు నిర్వహించే షోడ శ కర్మలలో నామకరణం, అన్నప్రాశన, కర్ణవేధ, కేశఖండన, అక్షరాభ్యాసం, ఉపనయనం అతిముఖ్యమైనవి. వీటన్నింటినీ వెసులుబాటును బట్టి ఇండ్లలోనూ, లేదా ఎవరికి ఎక్కడ మొక్కుబడి ఉంటే అక్కడి దేవాలయాలలోనూ నిర్వహిస్తుంటారు. అయితే తిరుమలలో ఆయా కార్యక్రమాలు చేయిస్తామని మొక్కుకున్నవారు తిరుమలకు వచ్చి, ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడాన్ని ఒక వేడుకగా నిర్వహించుకోవడం పరిపాటి. ముఖ్యంగా తమ పిల్లలకు ఏవైనా గండాలు లేదా ఆపదలు కలిగితే, అటువంటప్పుడు వారు సవ్యంగా ఉంటే ఆయా కార్యక్రమాలను తిరుమల స్వామివారి సన్నిధిలో జరిపించుకుంటామని మొక్కుకుంటారు. స్వామి వారి అనుగ్రహంతో వారికి ఆ గండాలు లేదా ఆపదలు గడిచి, గట్టెక్కిన తర్వాత తిరుమల వచ్చి మొక్కుబడులు తీర్చుకోవడం పరిపాటి. సాధారణంగా ఈ కార్యక్రమాలను తిరుమల పౌరోహిత సంఘంలో నిర్వహిస్తారు. అలా నిర్వహించుకోవడాన్ని స్వామివారి ఆశీస్సులతో కూడిన అనుగ్రహంగా, తమ అదృష్టంగా భక్తులు భావిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం దక్షిణాది రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేయించే సంప్రదాయం ఉంది. ఈ పూజకు చాలా ఆదరణ ఉంది. విష్ణుమూర్తి అంశయైన శ్రీ సత్యనారాయణస్వామి అంటే హిందువులందరికీ అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లా అన్నవరంలో సుప్రసిద్ధ సత్యనారాయణస్వామి దేవాలయం ఉంది. అనేకమంది కుటుంబంతో సహా ఆ దేవాలయానికి వెళ్లి అక్కడ సత్యనారాయణస్వామి వ్రతం, పూజలు చేస్తారు. ఈ కార్యాన్ని తిరుమల పౌరోహిత సంఘంలోనూ నిర్వహిస్తారు. ప్రార్థనా వివాహం (మరుమాంగల్యం) హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జంటలకు అనేక రకాల దోషాల నివారణ కోసం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. వివాహం జరిగినా సంతానం లేకపోతేనో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలవంటి కారణాలతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. తొలుత కొత్తమాంగల్యం ధరిస్తారు. అనంతరం వివాహం సందర్భంగా కట్టిన తొలి మంగళసూత్రాన్ని శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. అలా చేయడం వల్ల వివాహబంధంలోని ఆటంకాలు తొలగినట్లుగా భావిస్తారు. -
భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే!
ధార్మిక సంస్థ అయిన టీటీడీ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతోపాటు ఎన్నెన్నో సామాజిక, సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. టీటీడీ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు భక్తులకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. కొండ కు వచ్చే ప్రతి భక్తుడు ఉచితంగా భోజనం చేయడానికి అన్నదానం, కార్పొరేట్ వైద్యం అందుకోలేని నిరుపేద రోగుల కోసం ప్రాణదానం, కన్నవారి ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కోసం బాలమందిరం, నా అన్నవాళ్ళు లేని వృద్ధుల పునరావాసం కోసం కరుణాధామం, వినికిడి శబ్దానికి నోచుకోని చెవిటి చిన్నారుల కోసం శ్రవణం ప్రాజెక్టుల ద్వారా ధార్మికసంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రాథమికస్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు విద్యాదానం, ఆసుపత్రుల ద్వారా నిరుపేదలకు ఉచితవైద్యం అందిస్తోంది. ఇందుకోసం వెంకన్న భక్తులు పెద్దమొత్తంలో విరాళాలు సమర్పిస్తూ టీటీడీ పథకాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వేల రూపాయలతో ప్రారంభమైన అనేక పథకాలు నేడు సుమారు రెండువేల పైబడటం విశేషం. టీటీడీ పథకాల కోసం భక్తులు ఇచ్చే విరాళాల మొత్తానికి భారత ఆదాయపన్ను చట్టం అధికరణం 80(జి) కింద పన్ను మినహాయింపు ఉంది. రూ.లక్ష,ఆపైన విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ తిరుమలలో బస, శ్రీవారి దర్శనం, ప్రత్యేక బహుమానాలు అందజేస్తోంది. టీటీడీ ఈవో పేరుతోనే డీడీ, చెక్‌లు ఈ ట్రస్టులకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్న దాతలు డిమాండ్ డ్రాఫ్టు, చెక్కులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి పేరుతో సమర్పించాలి. ♦ రూ. కోటి, అంతకుమించి విరాళాలిచ్చేదాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.2,500 అంతకుమించి అద్దెతో వీఐపీ సూట్ కేటాయిస్తారు. దీనిని ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా పొందవచ్చు. ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా వీఐపీ బ్రేక్ కల్పిస్తారు. మూడు రోజులపాటు సుప్రభాత దర్శనం కల్పిస్తారు. దాత అభీష్టం మేరకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందజేస్తారు. సంవత్సరంలో ఓసారి ప్రసాదంగా పది పెద్ద లడ్డూలు, పది మహాప్రసాదం ప్యాకెట్లు ఇస్తారు. ♦ సంవత్సరానికి ఒకసారి ఒక శాలువా, ఒక రవికగుడ్డ బహూకరిస్తారు. ♦ దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన వెండి పతకంతో పాటుగా ఒక ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు. ♦ దాతలు తమ పేరుతో విరాళం ఇస్తే ఆ దాత జీవితకాలం; సంస్థలు, సమిష్టి దాతలతో విరాళం ఇస్తే 20 సంవత్సరాల పాటు టీటీడీ సదుపాయాలు అందుతాయి. ఈ పథకానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. దాత కోరిన విధంగా ఒకసారి శ్రీనివాస మంగాపురంలో సర్వకామప్రద లక్ష్మీ శ్రీనివాస మహాయజ్ఞం నిర్వహిస్తారు. లక్ష, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు... ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో ఒకరోజు రూ.100 అద్దె గది ఉచితంగా కేటాయిస్తారు. ♦ దాత, కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో ఒకరోజు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ ఏడాదిలో ఒకసారి ఆరు చిన్నలడ్డూలు, శాలువా, జాకెట్టు పీస్ బహూకరిస్తారు. ♦ రూ.ఐదు లక్షలు, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు... ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో మూడు రోజులు డోనర్స్ కౌంటరులో ఉచిత లేదా అద్దె చెల్లింపు ప్రాతిపదికపై వీఐపీ వసతి కల్పిస్తారు. ♦ దాతకు, అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), మూడు రోజులు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ సంవత్సరంలో ఒకసారి పది చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక రవిక బట్ట బహూకరిస్తారు. దాతకు మొదటిసారి శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకం, ఐదు మహాప్రసాదం ప్యాకెట్లు అందజేస్తారు. రూ.పది లక్షలు, అంతకు మించి... ♦ దాతకు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.500 అద్దె వీఐపీ సూట్ గది యేటా మూడు రోజులు ఉచితంగా కేటాయిస్తారు. ♦ దాతకు, వారి కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో మూడు రోజులు బ్రేక్ లేదా ప్రారంభ సమయంలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ సంవత్సరంలో ఒకసారి ప్రసాదంగా ఇరవై (20) చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక జాకెట్టు పీస్ బహూకరిస్తారు. ♦ దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకంతో పాటుగా ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు. వ్యక్తిగత దాతలు సదుపాయాలిలా పొందాలి ♦ దాతలు సంబంధిత ట్రస్టు ద్వారా పొందిన పాసు పుస్తకాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద చూపించాలి. ♦ దాతతోపాటు ఐదు మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. వారి వివరాలు ముందస్తుగా పేర్కొనవలెను. వారి ఫొటో గుర్తింపు కార్డులను చూపించాలి. ♦ పాసుపుస్తకం, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఆ దాతపేరుతోనే ఇస్తారు. ♦ ప్రతిసంవత్సరమూ దాత జీవిత సర్టిఫికేట్‌ను దాతల విభాగం, టీటీడీకి సమర్పించాలి. ♦ దాత ఏవైనా కారణాలచేత తిరుమలకువచ్చి ప్రసాదాలు, బహుమానాలు, దర్శనాలు స్వీకరించలేకపోతే వారి లైఫ్ సర్టిఫికేట్, సంతకంతో కూడిన గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత వ్యక్తికి సూచించినట్లయితే వారికి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ వివరాలు ముందస్తుగా తిరుమలలోని దాతల విభాగంలో తెలిపి, వారి అనుమతి పొందాలి. ♦ దాతతోపాటు పేర్కొన్న న లుగురు సభ్యుల పేర్లు జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే తగిన కారణాలు తెలిపి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనుమతితో మార్పు చేసుకోవచ్చు. ♦ ముందస్తుగా దాతలకు తెలపకుండానే పై సవరణలలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవడానికై టీటీడీకి సర్వహక్కులు కలవు. కంపెనీల, ట్రస్టులు, సంస్థలు సదుపాయాలిలా పొందాలి ♦ పాతపద్ధతి ప్రకారం, ఐదుగురు సభ్యులతో కూడిన కంపెనీ, ట్రస్టు, సంస్థలకు ఈ క్రింద పేర్కొన్న షరతులు వర్తిస్తాయి. ♦ కేవలం డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు, మేనేజింగ్ట్రస్టీ, ఎవరైనా భాగస్వాములు, ఉద్యోగస్థులు వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఈ సదుపాయాలు వర్తిస్తాయి. ♦ డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు లేక కంపెనీ సెక్రటరీ, మేనేజింగ్ ట్రస్టీ లేక సంస్థలోని ఇతరసభ్యులు కేవలం ఐదుమంది పేర్లను పేర్కొంటూ గుర్తింపు పత్రాలు జతపరచి అధికారిక పత్రాలు సమర్పించాలి. ఈ పత్రాలను 15 రోజులలోపు తిరుమలలోని దాతల విభాగంలో అందజేసి ముందస్తు అనుమతి పొందాలి. ♦ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, మేనేజింగ్ ట్రస్టీలు, భాగస్వాములు, ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు తగు గుర్తింపుకార్డు చూపించగలిగితేనే వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఇట్టి సంస్థలు మనుగడలోనే ఉన్నట్లు దాతల విభాగానికి తగు పత్రాల్ని సమర్పించాలి. ♦ ఈ సంస్థలకు సంబంధించిన పై వారు ఏ కారణం చేతనైనా తిరుమలకు వచ్చి దర్శనం, ప్రసాదం, బహుమానం తీసుకోని ఎడల ఆ సంస్థలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను, అధికారిక గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత సంతకంతో ఎవరికి ఆ సౌకర్యాలు కలుగజేయాలో తిరుమలలోని దాతల విభాగానికి ముందే తెలుపుతూ వారి నుండి ఉత్తర్వులు ముందే పొందాలి. ♦ దాత ఆ సంస్థలకు సంబంధించిన చిరునామాతో విరాళాలు ఇచ్చినపుడు వారికి ఆ సంస్థల పేర్లతోనే పాసుపుస్తకం, ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ సవరణలు 05-11-2011 తర్వాత విరాళాలిచ్చిన దాతలకు వర్తిస్తాయి. ♦ విరాళాలను డిమాండు డ్రాప్టు లేదా చెక్కు ద్వారా మాత్రమే అందజేయాలి. డీడీతో పాటుగా దాత రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జతచేస్తూ, దాత కు సంబంధించిన వివరాలు అంటే- దాతతో కలుపుకుని ఐదుగురి కుటుంబ సభ్యులపేర్లు, బంధుత్వం, వారి వయస్సు, చిరునామా తెలియజేయాలి. ♦ తిరుమలలో విరాళాలను ఇవ్వడానికి (చెక్కు లేదా డిమాండ్ డ్రాప్టు ద్వారా మాత్రమే) ఉపకార్యనిర్వహణాధికారి కార్యాలయం, డోనార్ సెల్, టీటీడీ, తిరుమల వద్ద సంప్రదించండి. (ఫోను నెంబర్లు- 0877-2263472, 3727) టీటీడీ ట్రస్టులివి... 1. శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు 2. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు 3. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు 4. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు 5. శ్రీ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస సంస్థ (బర్డు) 6. శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు 7. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు 8. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం 9. శ్రీ వేంకటేశ్వర పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ ట్రస్టు 10. శ్రీ వేంకటేశ్వర బాలమందిరం ట్రస్టు -
శ్రీవారి సేవలో తరించిన హైందవేతరులు
సనాతన హైందవ క్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హిందువులతోపాటు హైందవేతరులు కూడా సేవించి తరించారు. వారు నిర్దేశించిన వాటిలో చాలావరకు టీటీడీ కూడా అనుసరిస్తూ భక్తులకు విశిష్ట సేవలు అందిస్తోంది. శ్రీవారి ఆలయంలో మన్రో గంగాళం ♦ మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉన్న సర్ థామస్ మన్రో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతని కార్యదర్శుల్లో ఒకరు తిరుమలేశునికి మొక్కుకోమని సలహా ఇచ్చారు. ఆ సలహాను స్వీకరించటంతోనే మన్రో కడుపునొప్పి తగ్గింది ♦ మొక్కుని తీర్చుకునేందుకు ప్రతిరోజూ ఒక గంగాళానికి సరిపడా మిరియాల పొంగలిని భక్తులకు ప్రసాదంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన్రో. అందుకోసం మన్రోగంగాళం పేరుతో, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు తాలూకా, కోటబయలు అనే గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించేలా ఒక శాశ్వత నిధి ఏర్పాటు చేశారు ♦ ఆ నిధితో ఏర్పాటు చేసిన ప్రసాదాల పంపిణీ వ్యవస్థ తిరుమల ఆలయంలో నేటికీ నిర్విఘ్నంగా అమలవుతోంది. వెంకన్నపై లార్డ్ విలియమ్స్ భక్తి విశ్వాసాలు ♦ బ్రిటిష్ప్రభుత్వంలోని ఉన్నతాధికారి లార్డ్ విలియమ్స్ దీర్ఘకాలిక రోగంతో బాధపడేవాడట. తనకు నయమైతే శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తానని మొక్కుకొనమన్న ఓ హిందూ అధికారి సూచన మేరకు విలియమ్స్ స్వామివారికి దణ్ణం పెట్టుకున్నాడట. ఆ వ్యాధి ఆ రోజు నుండి క్రమంగా నయమైంది ♦ దాంతో లార్డ్ విలియమ్స్ ‘చలిపండిలి’ పేరుతో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే కాలిబాటలోని తొలిమైలులో (నేరేడు మాకుల ప్రాంతం) చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కాలినడకలో వచ్చే భక్తుల దాహార్తిని తీర్చింది ♦ ఈ సేవను ఇప్పటికీ టీటీడీ కొనసాగిస్తోంది ♦ షేక్ హుస్సేన్ అనే భక్తుడు తన తాత, తండ్రుల సంకల్పం మేరకు స్వామివారికి ఒక్కొక్కటి 23 గ్రాముల బరువు కలిగిన 108 బంగారుపూలను బహూకరించారు. ప్రతి మంగళవారం గర్భాలయ మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఈ బంగారు పుష్పాలే వాడతారు ♦ స్వామి సన్నిధిలో బీబీ నాంచారమ్మ అనే మహ్మదీయ భక్తురాలు సేవ చేసినట్టు చరిత్ర. ఈమె భక్తి పారవశ్యంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొగలు చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ చిత్రాలు ఉన్న 500 నాణేలతో ఉన్న దండను శ్రీవారికి సమర్పించారు ♦ కింగ్‌జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో మరో హారాన్ని తయారు చేశారు. 1972కు ముందు ఈ హారాలనే వినియోగించేవారు నాదస్వర చక్రవర్తి షేక్ చినమౌలానా ♦ నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. ఆయన ఏకైక కుమార్తె వీవీ జాన్ కుమారులు షేక్ ఖాసీం, షేక్ బాబు తిరుమలేశుని ఆలయం నాదస్వర విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు. -
బ్రహ్మాండపతికి బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కో వాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో భక్తులను కటాక్షిస్తాడు. వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అంకురార్పణతో ఆరంభం... వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీతప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తనప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) -నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారు. సింహవాహనం మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానే నంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మంచిముత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలనే స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలురు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ, సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహ పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయామోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. గరుడవాహనం స్వామివారి వాహనం గరుత్మంతుడు. ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. గజ వాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభ వాహనం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ రెండు వాహనసేవల ద్వారా స్వామి లోకానికి తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరోరూపమైన చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘరోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. -
సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించి సుమారు రెండుసంవత్సరాలవుతోంది. ఈ రెండేళ్ల పాలన కాలంలో ఆయన ఎన్నెన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. స్వామిని సందర్శించు కోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతోదూరం నుంచి వచ్చే సామాన్య భక్తులకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు, వారికి సకల సదుపాయాలను కల్పించేందుకు రకరకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వాటి అమలులో కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాక్షి ఫన్డే ప్రత్యేకసంచికతో ఆయన పంచుకున్న అనుభూతులు, అనుభవాల సమాహారమిది... టీటీడీ ఈవోగా దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు కదా, దీనిపై మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా బయటప్రాంతంలో పనిచేయటానికి, ధార్మిక సంస్థలో పనిచేయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన సంస్థను నడిపించటం కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ పరిధి దాటకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నాము. సామాన్య భక్తులకు టీటీడీ సదుపాయాలు అందాలన్న లక్ష్యంతోనే ధార్మిక సంస్థ కార్యక్రమాలు సాగుతున్నాయి. అదే సందర్భంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికీ ప్రాధాన్యత ఇస్తున్నాము. 2015లో రెండు బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించారు కదా, ఈసారి ఏ మార్పులు తీసుకొస్తారు? గత ఏడాది వచ్చిన రెండు బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించాం. ఈసారి కూడా ఉత్సవాల్లో మార్పులు ఉండవు కానీ, గతంలో జరిగిన లోపాలను సవరించుకుంటూ, వాహన సేవల్లో ఉత్సవమూర్తిని భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు పెంచాం. అదేసమయంలో ఆలయంలో మూలవర్ల దర్శనమూ త్వరగా లభించేలా ఏర్పాట్లు చేశాం. గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారట..? నిజమే! వాహన సేవలు ఉదయం 9 నుండి 11 గంటలవరకు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహించటం సంప్రదాయం. విశేషమైన గరుడవాహనసేవను దర్శించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం కేవలం గరుడ వాహన సేవను రాత్రి 8 గంటలకే నిర్వహించటం దశాబ్దకాలంగా అమలవుతోంది. ప్రస్తుతం అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించడం అసాధ్యం. పోనీ 8 గంటల నుండి అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిస్తే ఆలయంలో ఏకాంతసేవ నిర్వహణకు అడ్డంకులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పండితుల సూచన మేరకు రాత్రి 7.30 గంటలకే వాహనసేవ ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ విధానం వల్ల లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవను దర్శించే అవకాశం ఉంది. ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలు తీరు ఎలా ఉంది? చక్కగా ఉంది. దీనివల్ల భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. తోపులాటలు తగ్గాయి. స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 10 శాతానికి పైగా పెరిగింది. ఆలయంలో ఈ మూడు క్యూలైన్ల విధానం అమలుపై మరింత దృష్టి పెట్టాం. తోపులాటలు లేకుండా, సంతృప్తికరమైన దర్శనం కల్పించడంలో ఉన్న అవకాశాలన్నింటినీ తప్పక అమలు చేస్తాం. మరి రూ. 300 టికెట్ల ఆన్లైన్ బుకింగ్..? రూ.300 టికెట్లకు విశేష స్పందన ఉంది. ఇలా టికెట్లు పొందిన భక్తులకు కేవలం రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది. ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా 2015-2016 మధ్యకాలంలో 57,12,737 మంది టికెట్లు పొందారు. వారంతా స్వామిని సంతృప్తిగా దర్శించుకున్నారు. టికెట్లు పొందినవారిలో తమిళనాడు 32.40 శాతం, ఆంధ్రప్రదేశ్ 24.77 శాతం, కర్ణాటక 14.75 శాతం ఉంది. దక్షిణభారతదేశంలో 85.36 శాతం, మిగిలిన ప్రాంతంలో 14.64శాతం బుకింగ్ జరిగింది. పోస్టాఫీసుల ద్వారా 2,42,634 టికెట్లు పొందారు. మొత్తం 109 దేశాల్లోని ప్రవాస భారతీయల్లో అత్యధికంగా ఈ రూ.300 టికెట్ల అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుపథం ద్వారా సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్, గల్ఫ్ దేశాల్లో మొత్తం 65, 864 మంది ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి... ఇంటర్నెట్ ద్వారా భక్తులకు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతోపాటు ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవాటికెట్లు విడుదల చేస్తున్నాం. * ఆన్లైన్లో ముందస్తుగా గదులు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. ఆక్యుపెన్సీ శాతాన్ని బాగా పెంచాం. భక్తులకు సదుపాయంతోపాటు స్వామికి ఆదాయం కూడా పెరిగింది. * తిరుమలలోని పీఏసీ-1, 2, 3, 4 తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నాం. దాతలకు, ముందస్తుగా గదులు బుక్ చేసుకునే భక్తులకు డిపాజిట్‌ను రద్దు చేశాం. టీటీడీకి విరాళాలు అందిస్తున్న దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించాం. దాతలు 48 గంటలలోపు డిజిటల్ పాసుపుస్తకం పొందేలా, ట్రస్టుల వారీగా ఇ-రిజిస్ట్రేషన్ చేసుకునేలా సౌకర్యం కల్పించాం. తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు టీసీఎస్ సహకారంతో నెక్ట్స్‌జెన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. సేవా టికెట్లు, గదుల ముందస్తు బుకింగ్ గడువును 60 నుంచి 90 రోజులకు పెంచాము. భక్తులు సులభంగా కానుకలు సమర్పించేందుకు ఈ-హుండీ ప్రవేశ పెట్టాం. దీనిద్వారా కానుకలు సమర్పించే భక్తులకు పేమెంట్గేట్ వే చార్జీలు (కమీషన్ చార్జీలు) రద్దు చేశాం. 2015, మార్చి 21న ప్రారంభమైన ఈ-పబ్లికేషన్స్‌లో 3700 గ్రంథాలున్నాయి. * 5 భాషల్లో వెలువడుతున్న సప్తగిరి మాస పత్రికను 2016, జనవరి నెల నుండి రంగుల్లో అందిస్తున్నాం. శ్రీవేంకటేశ్వరస్వామికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకోసం డీమ్యాట్ ఖాతా ప్రారంభించాం. టీటీడీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలనుకుంటున్న భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: 1800425333333, 18004254141 అందుబాటులో ఉంచాం. వీటితోపాటు కొత్తగా వాట్స్ యాప్ నంబరు: 9399399399, ఈ-మెయిల్: Helpdesk@tirumala.org ప్రవేశపెట్టాం. శ్రీనరసింహస్వామి సన్నిధి ఎదురుగా గల లక్ష్మీదేవి విగ్రహం వద్ద నూతన హుండీని, ఆలయం ఎదురుగా శ్రీవారి వెండి, బంగారు, రాగి డాలర్ల విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి శిలావిగ్రహాలను రెండు నెలల్లో, పంచలోహ విగ్రహాలను మూడు నెలల్లో తయారు చేసి దరఖాస్తు చేసుకున్న వారికి అందించేందుకు ఏర్పాట్లు చేశాం. రాతి విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆలయాలకు ఉచితంగా, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై అందిస్తున్నాం. అదేవిధంగా పంచలోహ విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ, కాలనీల్లోని ఆలయాలకు 90 శాతం సబ్సిడీపై ఇతరులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం భక్తులకోసం కొత్తకాంప్లెక్స్ను పూర్తిచేశాం. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం లగేజి డిపాజిట్ కౌంటర్, అల్పాహారం, టీ, కాఫీ తదితర వసతులను ఏర్పాటు చేశాం. ఇదే తరహాలోనే కాలినడక భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కాంప్లెక్స్ నిర్మించాం. ఆధునిక వసతులు కల్పిస్తాం. తిరుపతి, తిరుమలలోని అన్ని వసతిగృహాల్లో పరిశుద్ధ తాగునీటి కోసం ఆర్వో జలప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశాం. శ్రీవారి భక్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అల్పాహారం అందిస్తున్నాం. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే హాళ్లను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేశాం. భక్తుల సౌకరార్థం గాలి, వెలుతురు, పరిశుభ్రత మెరుగ్గా ఉండేలా వేచి ఉండే గదిని, టోకెన్ మంజూరు కౌంటర్లను ప్రారంభించాం. కల్యాణవేదికలో వివాహాలు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రారంభించాం. కల్యాణంలో పాల్గొనే వారికి వసతి, దర్శనం, లడ్డూప్రసాదాలను ఉచితంగా ఇస్తున్నాం. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో రూ.40 కోట్ల వ్యయంతో అదనంగా ఎనిమిది ఆపరేషన థియేటర్లు, ఓపీ బ్లాక్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. స్విమ్స్‌లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఏటా రూ.25 కోట్లు ఆర్థిక సాయం అందించాం. మధురైలోని అరవింద నేత్ర వైద్యశాల శాఖను ఏర్పాటు చేసేందుకు తిరుపతిలో స్థలాన్ని కేటాయించాం. ఈ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్వీబీసీ కి నూతన స్టూడియో, పరిపాలనా భవనాలను రూ.14.70 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తాం. త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్‌ను ప్రారంభిస్తాం. భవిష్యత్ ప్రాధాన్యతాంశాలు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచటం; అదే సందర్భంలో వీఐపీలకు వారి స్థాయిని బట్టి ప్రోటోకాల్ నిబంధనలు చక్కగా అమలు చేయటం. తిరుమలలో యాత్రిసదన్లను అభివృద్ధి చేయటంతోపాటు వాటి సంఖ్యను పెంచటం. తిరుమల క్షేత్రంలో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే చర్యలు అమలు చేయటం. భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదాలు వితరణ చేయటం. నీటి ఆదాను పెంచటం. వృథానీటిని సమృద్ధిగా ఉద్యానవనాలకు వినియోగించటం. విద్యుత్ వాడకంలో భాగంగా ఎల్ఈడీ బల్బుల వినియోగం పెంచడం. సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావడం, తద్వారా పర్యావరణానికి మేలు జరిగే చర్యలు చేపట్టడం. -
భక్తులే సేవకులు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు భక్తులే సేవ చేసే మహద్భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ‘శ్రీవారి సేవ’ పేరుతో 2000వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 195 మందితో ప్రారంభమైన ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో గతపదహారేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మందికి పైగా సేవకులు సాటి భక్తులకు విశేష సేవలందించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు సాటి భక్తులే సేవలందించే మహదవకాశాన్ని శ్రీవారి సేవ పేరుతో టీటీడీ కల్పిస్తోంది. సేవకులుగా నమోదు ఎలా చేసుకోవాలి? శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకోవాలంటే నెల ముందుగా ‘ప్రజాసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానాలు, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్, తిరుపతి-517501, ఫోన్ నంబరు: 0877-2264392’ చిరునామాకు లేఖ రాయాలి. పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ తరహాలో సాధారణ సేవకు కూడా ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించారు. నమోదు చేసుకున్న వారిని సేవకు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు (ప్రొసీడింగ్స్) కాపీతోపాటు దరఖాస్తు పత్రం పంపుతారు. లేదా మొబైల్ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపుతారు. డ్రెస్‌కోడ్: పురుషులు: తెలుపురంగు దుస్తులు - స్త్రీలు: మావిచిగురంచుతో కూడిన నారింజరంగు చీర, మావిచిగురంచు రవిక శ్రీవారి సేవకులకు మార్గదర్శకాలు శ్రీవారి సేవకుల వయస్సు 18 నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి సేవకు వచ్చే వారి సేవకులందరూ ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) కాపీ సమర్పించాలి దరఖాస్తులకు పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు జత చేసి సేవాసదన్‌లో సమర్పించాలి సేవకులకు కాషాయ రంగు స్కార్ఫ్‌లు అందజేస్తారు. విధుల్లో ఉన్నప్పుడు శ్రీవారి సేవ స్కార్ఫ్‌లు ధరించాలి. సేవాకాలం ముగిసిన వెంటనే వాటిని తిరిగి సేవాసదన్‌లో అప్పగించాలి సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. కనీసం ఆరుగంటలపాటు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల ముందే సేవకు హాజరై శిక్షణ తీసుకోవాలి ఎల్లప్పుడూ ‘గోవింద’ నామాన్ని స్మరిస్తూ, సాటి భక్తులను కూడా ‘గోవిందా, శ్రీనివాసా’ అని సంబోధించాలి తిరునామం, తిలకం లేదా కుంకుమ, చందనం బొట్టు ధరించాలి సాటి భక్తులలోనే స్వామివారిని దర్శిస్తూ అంకితభావంతో సేవ చేయాలి శ్రీవారి సేవలో నిర్దేశించిన నియమ నిబంధనలు ఏదేని పరిస్థితుల్లో శ్రీవారి సేవకులు అతిక్రమిస్తే వారిని రెండేళ్ళ వరకు సేవకు అనుమతించరు తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి సేవకులకు శిక్షణ తరగతులు జరుగుతాయి. 24 విభాగాల్లో శ్రీవారి సేవ: తిరుమలలో ప్రధానంగా 24 విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీటిలో నిఘా, ఆరోగ్య, అన్నదానం, ఉద్యానవనాలు, వైద్య, లడ్డూప్రసాదం, శ్రీవారి ఆలయం, రవాణా, కళ్యాణకట్ట, పుస్తక విక్రయ శాలలతోపాటు మరికొన్ని ఉన్నాయి. అందించే సేవలివి: టీటీడీ పరిపాలనలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ సేవ ఎంతో దోహదం చేస్తోంది స్వామి దర్శనానికి వచ్చే క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులరద్దీని క్రమబద్ధీకరిస్తారు క్యూలైన్లు, కంపార్ట్మెంట్ల లో వేచి ఉండే భక్తులకు ఆహారం, మంచినీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు భక్తులు వెంట తెచ్చుకున్న లగేజీని, బ్యాగులను స్కాన్ చేస్తారు ఉద్యానవన విభాగంలో పూలమాలలు తయారు చేస్తారు పుస్తక విక్రయశాలల్లో పర్యవేక్షిస్తారు దర్శన క్యూలైన్లు, వైద్యశాలల్లో వయోవృద్ధులకు, రోగులకు సహకరిస్తారు ఉచిత చిన్న లడ్డూలు తయారు చేస్తారు లడ్డూ టోకెన్లు మంజూరు చేస్తారు వృత్తి నిపుణులైన వైద్యులు, ఇంజనీర్లు, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇతర నిపుణులు అవసరమైనపుడు ఆయా విభాగాల్లో సేవలందిస్తున్నారు. ఇతర సేవా విభాగాలు: సాధారణ సేవతో పాటు టీటీడీ కొన్ని అర్హతలు, మార్గదర్శకాలు పాటిస్తూ పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ లాంటి ప్రత్యేక సేవలు ప్రవేశపెట్టింది. పరకామణి సేవ: శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను పరకామణి సేవకులు లెక్కించాల్సి ఉంటుంది. 2012లో ప్రారంభించిన ఈ సేవలో 2016, జూన్ 23 వరకు 402 బృందాల్లో 42,558 మంది సేవలందించారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో లడ్డూ కౌంటర్లలో 2013, జనవరి 13న ప్రారంభమైన సేవలో 2016, జూన్ 23 వరకు 359 బృందాల్లో 18,014 మంది సేవలందించారు. సేవకులకు టీటీడీ ప్రత్యేక వసతులు బస: పురుషులు, మహిళలు కలిపి మొత్తం 2300 మంది శ్రీవారి సేవకులకు బస ఉంది. శ్రీవారి సేవాసదన్‌లో సుమారు 700 మంది పురుష సేవకులకు, పీఏసీ-3లో 1600 మంది మహిళా సేవకులకు బస ఉంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, వైకుంఠ ఏకాదశి లాంటి రద్దీ రోజుల్లో 5000 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తారు. ఇందుకోసం అదనంగా పీఏసీ-2లో కొన్ని గదులను కూడా ఆ సమయంలో వినియోగిస్తారు. వారం రోజుల పాటు తోటి భక్తులకు సేవ చే స్తే ఎనిమిదోరోజు సుపథం మార్గం గుండా శ్రీవారి ఉచిత దర్శనం కల్పించి, రాయితీపై లడ్డూలు అందజేస్తారు. తిరుపతిలో శ్రీవారి సేవ 2014, మార్చి7న తిరుపతిలోని విష్ణునివాసం వసతిగృహంలో శ్రీవారి సేవ కార్యాలయం ప్రారంభించారు ఇప్పటివరకు 49,988 మంది శ్రీవారి సేవకుల సేవలందించారు. తిరుపతిలో మూడు షిప్టుల్లో శ్రీవారి సేవకులకు సేవావిధులు నిర్వహించాలి టీటీడీ స్థానిక ఆలయాలతోపాటు అన్నప్రసాదం, గోసంరక్షణశాల, మార్కెటింగ్ విభాగం, కేంద్రీయ వైద్యశాల, రిసెప్షన్ విభాగం, విష్ణు నివాసంలో ఎస్కలేటర్ వద్ద సేవలందిస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, కోదండరామాలయం, లక్ష్మీనారాయణస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవలందిస్తున్నారు. శ్రీసత్యసాయి సేవాసమితి శిక్షణ: శ్రీవారి సేవకుల్లో సేవానిరతి, ధర్మచింతన మరింతగా పెంచడం ద్వారా భవిష్యత్తులో వారిని హిందూ ధర్మ రథసారథులుగా తీర్చిదిద్దాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తిలో అత్యున్నత ప్రమాణాలతో భక్తులకు సేవలందిస్తున్న శ్రీసత్యసాయి సేవాసమితి సహకారంతో తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవకులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ సమయంలో ధ్యానం, భజన, 30 నిమిషాలపాటు ‘సేవ’ ప్రాశస్త్యంపై తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఉపన్యాసం ఉంటుంది. సేవకులు భక్తులతో మెలిగే విధానం, తిరుమలలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు టీటీడీలో విభాగాలవారీగా అందించాల్సిన సేవలపై టీమ్ లీడర్లకు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆ టీమ్ లీడర్లు గ్రూపులోని సేవకులకు అవగాహన కల్పిస్తారు. రూ.70 కోట్లతో సేవాసదన్: తిరుమలలో సుమారు 4 వేల మంది సేవకులకు బస కల్పించేలా రూ. 70 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో త్వరలో శ్రీవారి సేవాసదన్ నిర్మించనున్నారు. వీఐపీలూ శ్రీవారి సేవకులే! శ్రీవారి సేవలో సాధారణ భక్తులే కాకుండా వీఐపీలు కూడా పాలు పంచుకున్నారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, జస్టిస్ ఈశ్వరయ్య, సినీహీరో చిరంజీవి కుటుంబ సభ్యుల వంటి వివిధ రంగాలకు చెందిన ఎందరెందరో దిగ్గజాలు శ్రీవారి సేవలో పాల్గొని సాటి భక్తులకు సేవ చేశారు. ఈ సేవలను మరింతగా విస్తరిస్తాం..! భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇందులో రైతులు, వ్యాపారులు, యువత, మహిళలు, ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, బ్యాంకర్లు... ఇలా ఎవరికి వారు స్వామి సన్నిధిలో ఏడు రోజుల పాటు సాటి భక్తులకు సేవచేసి అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నారు. పదహారేళ్లకాలంలో ఏడున్నర లక్షలమంది స్వచ్ఛందంగా భక్తులు సేవ చేసిన ఘనత టీటీడీకే దక్కింది. ఈ స్వచ్ఛంద సేవాకార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని సంకల్పించాము. - కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుమల జేఈఓ -
స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తిరుమల
నిత్య జనసందోహంతో కూడిన తిరుమల క్షేత్రంలో టీటీడీ కార్పొరేట్ స్థాయిలో పరిశుభ్రత అమలు చేస్తోంది. టీటీడీతోపాటు ఔట్ సోర్సింగ్ సంస్థలతో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే ఏర్పాట్లు చేసింది. కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్కి తిరుమల ఎంపిక కావడంతో ప్రభుత్వరంగ సంస్థలు కోలిండియా, ఓఎన్జీసీ సామాజిక బాధ్యతగా నిధులు మంజూరు చేస్తున్నాయి. తిరుమలలో చేపట్టాల్సిన పలురకాల అభివృద్ధి పనులకు అవసరమైన రూ.26 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసింది మురుగు నీటి శుద్ధి ద్వారా సమకూరిన 5 ఎంఎల్డీ నీటిని తిరిగి ఉద్యానవనాలు, శ్రీగంధం మొక్కలు, ఘాట్రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకానికి వాడుతున్నారు. ఇందుకోసం రూ.6 కోట్లు, ఘనవ్యర్థాల నిర్వహణకు రూ.1.5 కోట్లు, ప్రస్తుత విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చేందుకు రూ.5.5 కోట్లు ఖర్చవుతోంది కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ కార్ల వినియోగానికి రూ.6 కోట్లు ఖర్చవుతుంది భక్తులకు పరిశుద్ధ తాగునీటిని అందించడానికిగానూ మరో 20 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చవుతోంది. ఈ పనులు పూర్తి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. -
ఆభరణాల ఆనందనిలయుడు
బంగారు, వజ్ర. వైఢూర్య, మరకత, మాణిక్యాదుల అభరణాలు అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలిచిన భక్తుల కోర్కెలు తీరుస్తూ తిరుమల ఆలయంలో కొలువైనాడు. నాడు ఆకాశ రాజు నుంచి నేటి వరకు స్వామివారికి సమర్పించిన అమూల్యమైన ఆభరణాలు కానుకల రూపంలో స్వామి ఖజానాలో చేరిపోతున్నాయి. సాక్షాత్తూ స్వామికి అలంకరించే ఆభరణాలతోపాటు బాంకుల్లో డిపాజిట్ల రూపంలోని సుమారు 11 టన్నుల పైబడి బంగారం నిల్వల మదింపు అమూల్యం. ఆభరణాల జాబితాను టీటీడీ సిద్ధం చేసి భద్రపరిచింది. అందులో గర్భాలయ మూలమూర్తి అలంకరణలో అతిముఖ్యంగా 120, ఉత్సవవరులైన శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామివారికి 383 ఆభరణాలు వాడుతున్నారు. ఆ జాబితాలోని ఆభరణ విశేషాలేమిటో తెలుసుకుందాం!! మూలవర్ల అలంకరణకు విశేష ఆభరణాలు ≈ బంగారు పీతాంబరం, బంగారు కవచం - 19.410 కేజీలు ≈ నవరత్నాలు పొదిగిన పెద్ద కిరీటం - 13.374 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన వామ్చెట్ బంగారు కటి హస్తం - 8.129 కేజీలు ≈ బంగారు సాలిగ్రామాల హారం - 8.150 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన బంగారు కత్తి - 7.420 కేజీలు ≈ 108 బంగారు శంఖాలు - 6.100 కేజీలు ≈ వైకుంఠ హస్తం చైనుతో సహా - 5.908 కేజీలు ≈ మకర కంఠి మొదటిభాగం - 5.616 కేజీలు ≈ బంగారు గొడుగు - 5.530 కేజీలు ≈ జెమ్చెట్ శంఖు - 4.013 కేజీలు ≈ జెమ్చెట్ చక్రం - 4.077 కేజీలు ≈ జెమ్చెట్ రెండు కర్ణపత్రాలు - 3.100 కేజీలు ≈ రెండు బంగారు నాగాభరణాలు - 3.320 కేజీలు ≈ పచ్చలు, తెలుపు, ఎరుపు రాళ్లు పొదిగిన బంగారు కిరీటం - 3.145 కేజీలు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఆభరణాలు ≈ మలయప్పస్వామివారి బంగారు కవచాలు - 3.990కేజీలు ≈ శ్రీదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.400 కేజీలు ≈ భూదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.430 కేజీలు ≈ పద్మపీఠం - 2.869కేజీలు ≈ కొలువు శ్రీనివాసమూర్తి బంగారు తోరణం - 2.090 కేజీలు ≈ బంగారు పద్మాలు - 2.313 కేజీలు ≈ నూతన యజ్ఞోపవీతం - 2.043 కేజీలు ≈ 108 లక్ష్మీ డాలర్ల హారం - 2.560 కేజీలు ≈ బంగారు చేతి గంట - 2.794 కేజీలు ≈ కెంపులు పొదిగిన వైకుంఠ హస్త నాగాభరణం - 2.100 కేజీలు ≈ కెంపులు పొదిగిన బంగారు కఠికాహస్త - నాగాభరణం - 2.070 కేజీలు ≈ రత్నాలు పొదిగిన వజ్ర కవచ కిరీటం - 2.750 కేజీలు ≈ వజ్రాల కిరీటం - 2.935 కేజీలు ≈ బంగారు బిందె - 2.370 కేజీలు ≈ బంగారు గిన్నెలు - 2.080 కేజీలు ≈ బంగారు గోముఖ పళ్లెం - 2.085 కేజీలు ≈ శ్రీరాములవారి బంగారు ధనుస్సు, ఇతర ఆభరణాలు - 1.202 కేజీలు ≈ బంగారు తట్ట - 1.029 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు నడుము వజ్రకవచం - 1.831 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు కంఠ వజ్రకవచం - 1.661 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు పాదపద్మ వజ్రకవచం - 1.495 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు వెనుక వజ్రకవచం - 1.837 కేజీలు ≈ సీమ కమలాలు పొదిగిన హారం - 1.020 కేజీలు ≈ మకర కంటి రెండవ భాగం - 1.552 కేజీలు ≈ బంగారుపళ్లెం - 1.195 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన బంగారు కాసుల దండ - 1.955 కేజీలు ≈ సీమకమలాలు, పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కిరీటం - 1.893కేజీలు ≈ మకర కంటి మూడవ భాగం - 1.434 కేజీలు ≈ బంగారు చెంబు - 1.020 కేజీలు ఠి బంగారు బెత్తం - 1.380 కేజీలు ≈ రత్నాలు చెక్కిన బంగారు కిరీటం - 1.185 కేజీలు ≈ రాళ్లకొండై బంగారు కిరీటం - 1.365 కేజీలు ≈ బంగారు కి రీటం - 1.190 కేజీలు జి బంగారు బిందె-1.995కేజీలు ≈ ఉత్సవవర్ల బంగారు కిరీటం-1.170 కేజీలు తిరుమల ఆలయంలో ఆభరణాల లెక్కలివి ♦ శ్రీవారి మూలమూర్తి ఆభరణాలు - 120 ♦ ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్ప ఆభరణాలు-383 ♦ రాఘోజీ వారి తిరువాభరణాల రిజిస్టర్- 07 ♦ వెంకటగిరి రాజావారి తిరువాభరణాల రిజిస్టర్ - 11 ♦ వెండి ఆభరణాలు - 223 ♦ రాగి, ఇత్తడి, బంగారు తాపడం చేసిన వస్తువులు - 17 ♦ ముల్లెలు - 09 ♦ శ్రీవారి భాష్యకార్ల ఆలయానికి సంబంధించిన ఆభరణాలు, వస్తువులు -13 ♦ రికార్డు రూములోపల గల ఆభరణాలు - 08 ♦ తిరుమల శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చెందిన ఆభరణాలు - 28 తిరుపతి, అనుబంధ ఆలయాల్లో ⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు వస్తువులు-128 ⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన వెండి వస్తువులు-253 ⇒ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని బంగారు, రత్నాల ఆభరణాలు-162 ⇒ అమ్మవారి వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు-97 ⇒ అమ్మవారి ఆలయంలోని లోహవిగ్రహాలు, శిలా విగ్రహాలు - 23 ⇒ అమ్మవారి ఆలయంలోని రాగి, ఇత్తడి వస్తువులు-33 ⇒ తిరుచానూరు ఆలయంలోని శ్రీసుందరరాజ స్వామి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-44 ⇒ శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-73 ⇒ పంచలోహ విగ్రహాలు-148 ⇒ కార్వేటి నగరంలోని శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-78 ⇒ వేణుగోపాలస్వామి వారి బంగారు తాపడం చేసిన ఉత్సవ మూర్తుల ఆభరణాలు, వస్తువులు-31 ⇒ నగరిలోని కరియ మాణిక్యస్వామి ఆలయంలోని ఆభరణాలు వస్తువులు-36 ⇒ బుగ్గ అగ్రహారంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-13 ⇒ నారాయణవనం శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, సంబంధిత ఆలయాలలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-92 ⇒ నారాయణవనం శ్రీ అవనాక్షమ్మ ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-13 ⇒ నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి, రాగి ఆభరణాలు-54 ⇒ తిరుపతి పాదాల మండపంలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆభరణాలు బంగారు, వెండి, రాగి ఆభరణాలు-71 ⇒ తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలోని బంగారు, రాగి ఆభరణాలు -47 ⇒ వెండి ఆభరణాలు వస్తువులు-92 ⇒ శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు ఆభరణాలు-112 - వెండి, రాగి వస్తువులు-20 ⇒ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని రుషికేష్ ఆంధ్రా ఆశ్రమానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు-167 ⇒ అప్పలాయగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-56 ⇒ వాయల్పాడులోని శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-77 శ్రీవారి ఆభరణాల విశేషాలెన్నెన్నో... ⇒ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయలు తిరుమలదేవుడికి వెలకట్టలేనన్ని ఆభర ణరాశులను కానుకగా సమర్పించారు. ఇతర సామ్రాజ్యాలపై దాడులకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ రాయలవారు స్వామివారిని దర్శించుకుని అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. వాటిలో అతిముఖ్యమైనవి. ⇒ 13.360 కిలోలు బరువుగల 3,308 కారెట్లు కలిగిన నవరత్న కిరీటం, త్రిసర హారం, మూడుపేటల నెక్లెస్, ఇంద్రనీలాలు, గోమేధికాలు, మాణిక్యాలు, కర్పూర హారతి కోసం 25 వెండిపళ్ళాలు, శ్రీవారి ఏకాంత సేవకు అవసరమైన 374 క్యారెట్ల బరువుగల రెండు బంగారు గిన్నెలు. బంగారు తీగె, రత్నాలతో చేసిన కంఠాభరణాలు, బంగారు కత్తి, రత్నాలు, మణులు పొదిగిన ఒర, ఎర్రలు, పచ్చలు పొదిగిన 132 క్యారెట్లు బరువున్న కత్తి, పచ్చలతో తయారు చేసిన పిడి కత్తి, మణులతో తయారు చేసిన పిడికత్తి ఒర, 87 క్యారెట్ల బరువుగల మణుల పతకం. శ్రీవారికి టీటీడీ తయారు చేయించిన ఆభరణాలు... వజ్రకిరీటం - 1940 వజ్రాల హారం - 1954 వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు - 1972 వజ్రాల కటిహస్తం - 1974 వజ్రాల కిరీటం - 1986 (బరువు 13.360 కేజీలు, అప్పటి విలువ రూ.5 కోట్లు) ⇒ శ్రీవారికి ఉన్న అరుదైన ఆభరణాల్లో గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు. ⇒ స్వామివారికి అధికారికంగా ముఖ్యమైన ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటితోపాటు వినియోగంలోలేని పురాతన కిరీటాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రకిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఒకేరకమైన ఆభరణాలు రెండు నుంచి మూడు సెట్లలో అనేక ఆభరణాలు ఉన్నాయి. -
వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు
ధర్మానికి హాని కలిగినపుడు భగవంతుడు అవతరిస్తాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కలియుగంలో ధర్మోద్ధరణకు శ్రీమహావిష్ణువు ఉద్యుక్తుడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీరామునికి లక్ష్మణుడిగా సేవలందించిన తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిని భగవద్రామానుజులుగా అవతరింపజేసి ధర్మరక్షకుయ్యాడు. కారణజన్ముడైన రామానుజుడు ధర్మరక్షణకు బీజాలు నాటి, సనాతన హైందవ ధర్మరక్ష ణతోపాటు సాంఘిక అసమానతలను రూపుమాపి సమతాభావాన్ని చాటారు. వైదిక ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. తిరుమల క్షేత్రాన్ని విష్ణుక్షేత్రంగా నిరూపించారు. విశిష్టాద్వైత సిద్ధాంతంతో భక్తి మార్గాన్ని విస్తృతం చేశారు. శ్రీభాష్యాది గ్రంథాలతో ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించారు. కేశవసోమయాజి, కాంతిమతి దంపతులకు శ్రీరామానుజులు క్రీ.శ. 1017వ సంవత్సరంలో పింగళనామ సంవత్సరం చిత్తిర (మేష) మాసం ఆర్ద్రానక్షత్రంలో కంచి సమీపంలోని శ్రీపెరుంబుదూరులో జన్మించారు. వీరి మేనమామ తిరుమలనంబి (శ్రీశైలపూర్ణులు). ఆయన తిరుమల నుంచి శ్రీపెరుంబుదూరు వచ్చి, బాలునిలోని దివ్య తేజస్సు, లక్షణాలు గుర్తించి ‘ఇైళె యాళ్వార్’ (రామానుజుడు- లక్ష్మణుడు) నామకరణం చేశారు. ఐదేళ్లకు అక్షరాభ్యాసం, ఎనిమిదేళ్లకు ఉపనయనం చేశారు. వేదాది విద్యలన్నీ కారణజన్ముడైన రామానుజునికి కరతలామలకాలయ్యాయి. పదహారేళ్ల ప్రాయంలో ఆయనకు వివాహం జరిగింది. భార్య పేరు రక్షకాంబ. రామానుజులు కంచిలో యాదవప్రకాశుల దగ్గర వేదాంత విద్యను అభ్యసించారు. రామానుజుడి మేధావిలాసానికి పెద్దలు ముచ్చటపడేవారు. యాదవప్రకాశులు ఉపనిషత్ వాక్యాలకు చెప్పే వ్యాఖ్యానాలను రామానుజులు నిశితంగా గమనించేవారు. కొన్ని సందర్భాల్లో యాదవప్రకాశుల వివరణ సమంజసంగా తోచనప్పుడు తానే బుద్ధియుక్తంగా వివరణ ఇచ్చేవారు. అత్యుత్తమ శిష్యుడు ఆచార్యులు ఎంతటి కఠిన పరీక్ష పెట్టినా, దానికి నిలవడం ఉత్తమ శిష్య లక్షణం. గోష్ఠీపురం (తిరుక్కొట్టియూర్) అనే ఊరిలో గోష్ఠీపూర్ణులు (తిరుక్కొట్టియూర్ నంబి) వద్ద శ్రీకృష్ణ చరమ శ్లోకం ‘సర్వధార్మాన్ పరిత్యజ్య’ అనే గీతాశ్లోకంలోని అపూర్వ అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయని రామానుజులు తెలుసుకున్నారు. వాటిని స్వయంగా గ్రహించేందుకు తిరుక్కోట్టియార్ వెళ్లారు. నంబి మాత్రం రామానుజుడిని పరీక్షించారు. ‘‘ఈసారి కాదు, మళ్లీ రండి’’ అంటూ పద్దెనిమిది పర్యాయాలు పరీక్షించినా.. ఏమాత్రం విసుగు చెందకుండా రామానుజుడు శ్రీరంగం నుంచి తిరుక్కోట్టియూర్కు వెళ్లి నంబికి విశ్వాసానికి కల్గించారు. తర్వాత వారి ద్వారా చరమశ్లోకార్థాలను గ్రహించి, అత్యుత్త్తమ శిష్యుడిగా ప్రఖ్యాతి గడించారు. ఆదర్శవంతమైన ఆచార్యుడు తాను నేర్చిన విద్యను శిష్యులకు కూలంకషంగా ఉపదేశించడం ఉత్తమ ఆచార్య లక్షణం. తిరుక్కొట్టియూర్ నంబి చరమ శ్లోకార్థాలను ఉపదేశించేటపుడు, యోగ్యతను పరీక్ష చేయకుండా వాటిని ఎవ్వరికీ చెప్పవద్దని రామానుజుల దగ్గర ప్రమాణం చేయించుకొన్నారు. కానీ, తనకు ఆంతరంగిక శిష్యులు కూరేశులు, దాశరథికి ఆ అర్థాలను తెలుపకుండా ఉండలేనని, అందుకు అనుజ్ఞ ఇవ్వవలసినదని ప్రార్థించారు. నంబి సమ్మతిని పొంది తర్వాత వారికి ఉపదేశించారు. సహ జనులపై సమతాభావం కర్ణాటకలోని వైష్ణవ క్షేత్రం మేల్కోటె. అక్కడి అర్చామూర్తి మరుగున పడిపోయిన విషయాన్ని భగవానుడు స్వప్నంలో రామానుజులకు సాక్షాత్కరింపజేయగా, మేల్కోటెను పాలించే విష్ణువర్ధనుడి సహకారంతో ఆ మూర్తిని కనుగొని, ఆలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ కృషిలో తమకు సహకరించిన వారు ఆలయప్రవేశార్హత లేనివారుగా పరిగణింపబడే ఒక తెగ వారిపట్ల కృతజ్ఞత వ్యక్తీకరించారు. వారికి సంవత్సరంలో ఒకనాడు ఆలయంలో ప్రవేశించి, స్వామిని దర్శించుకొనే అవకాశాన్ని కల్పించారు. కాంచీపూర్ణులనే యామునుల శిష్యులు బ్రాహ్మణేతర కులానికి చెందినవారు. వారి శుద్ధమైన జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని రామానుజులవారు గుర్తించారు. కానీ, ఆకాలంలో సమాజంలోని కట్టుబాటును ఆచరించిన నంబి సున్నితంగా తిరస్కరించినా రామానుజులు మాత్రం సమతావాదాన్ని వీడలేదు. ప్రతిదినం కావేరీనదిలో స్నానం చేసి తిరిగి వచ్చేటపుడు రామానుజులు ధనుర్దాసు చేతిని ఆసరాగా తీసుకుని తిరిగి వచ్చేవారట. సకలశాస్త్ర పండితుడు శాస్త్రాలు అధ్యయనం చేయడం వేరు, అంశాల అనుకూల తర్కాలు ప్రయోగించి వాదించడం వేరు. ఈ సామర్థ్యం రామానుజులకు మెండుగా ఉండేది. తిరుమల ఆలయంలోని అర్చామూర్తి శ్రీవేంకటేశ్వరుడు శంఖచక్రహస్తుడై ఉండేవాడు కాడు. ఈ కారణంచేత తిరుమలలోని మూర్తి ఎవరు? అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించి, యథార్థ నిర్ణయం చేయడం కోసం తిరుమల ప్రాంతాన్ని పాలించే యాదంరాజు రామానుజులను ఆహ్వానించటంతో తిరుపతికి వచ్చారు. పురాణాగమాలు, ఆళ్వార్ల ప్రబంధాల ప్రమాణాల ప్రకారం ‘‘తిరుమలలోని మూర్తి శ్రీవేంకటేశ్వరుడే’’ అని నిరూపించారు. ఈ వాదప్రతివాదాలన్నీ రామానుజుల శిష్యులై న అనంతాచార్యులు తన ‘శ్రీవేంకటాచలేతిహాసమాల’ అనే గ్రంథంలో విశదీకరించారు. రచనా నైపుణ్యం రామానుజులు గొప్ప కవి కూడా. గీతాభాష్యంలో, శ్రీ భాష్యంలో, వేదార్థ సంగ్రహంలో పలుచోట్ల గల రామానుజుల సూక్తులు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. రామానుజులు బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరంగా భాష్యాన్ని విరచించి, దాన్ని కాశ్మీర్‌లోని శారదాపీఠానికి సమర్పించారు. శారదాదేవి దానిని శిరసావహించి, ‘‘భాష్యమంటే మీదే భాష్యం. మీరే భాష్యకారులు. ఇకపై మీ భాష్యం శ్రీ భాష్యమనే పేరులో ఖ్యాతి పొందుతుంది.’’ అని ప్రశంసించి, హయగ్రీవుల అర్చామూర్తిని రామానుజులకు బహూకరించారు. ఇతర సంప్రదాయానికి చెందిన విద్వాంసులు సైతం రామానుజుల శ్రీభాష్య రచనలోని మాధుర్యాన్ని మెచ్చుకుని ‘శ్రీవైష్ణవకాదంబరి’ అనే బిరుదుతో ప్రశంసించడం శ్రీ భాష్య ఘనతను, విశిష్టతను వ్యక్తం చేస్తున్నది. ద్రావిడభాషా ప్రావీణ్యం రామానుజులకు ద్రావిడభాషలో పాండిత్యం లేదని, అందువల్లనే వారు తమ గ్రంథాలను సంస్కృతంలో మాత్రమే రచించారని, ద్రావిడ గ్రంథాన్ని దేనినీ రచించలేదని కొందరి వాదన. కానీ. ఆళ్వార్ల ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రచించిన శ్రీవైష్ణవ గురు పరంపరలోని పలువురు పూర్వాచార్యులచే తమ వ్యాఖ్యలలో నూటికిపైగా గల సందర్భాలలో రామానుజులు ఆయా ఆళ్వార్ల పాశురాలను విలక్షణమైన రీతిలో అన్వయించారు. అపూర్వమైన అర్థాలను తెలిపారు. ఇవన్నీ రామానుజుల వారి ద్రావిడ భాషాపాండిత్యానికి, సందర్భోచిత సమన్వయ సామర్థ్యానికి చిహ్నాలు. ఆలయ నిర్వహణలో సంస్కరణలు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయ కైంకర్య నిర్వహణలో రామానుజుల కాలానికి ముందు పలు లోపాలు ఉండేవి. తన శిష్యుడైన కూరేశులద్వారా రామానుజులు ఆలయ నిర్వహణలో పలు సంస్కరణలు చేపట్టారు. ఆ విధంగానే తిరుమల ఆలయంలో కూడా పలు ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను సంస్కరించి సరిచేశారు. మేల్కోటె ఆలయంలో కూడా 52 మంది శ్రీవైష్ణవ కుటుంబాలను ద్రావిడ దివ్యక్షేత్రాలనుంచి రప్పించి, వారిని ఆయా సేవలలో నియమించారు. ఇప్పటికీ అక్కడ ఆ వ్యవస్థ కొనసాగుతుండటం విశేషం. సింహాచలం, శ్రీకూర్మం, అహోబిలం మొదలైన క్షేత్రాల్లోనూ తగిన సంస్కరణలను చేశారు. వైష్ణవాలయాల్లో జీయర్ వ్యవస్థకు పునాది రామానుజులు తిరుమల ఆలయంలో పలు సమయాచారాలను సంస్కరించారు. వ్యవస్థను సుస్థిరం చేశారు. వాటి నిర్వహణ బాధ్యతను తమ శిష్యులైన అనంతాచార్యులకు అప్పగించి, శ్రీరంగానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి అనంతాచార్యులు వృద్ధులైనందున, ఆ బాధ్యత కోసం అనంతాచార్యుల శిష్యులైన విష్వక్సేన ఏకాంగి అనే బ్రహ్మచారిని నియమించారు. ఆయనకు సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు. శ్రీ వేంకటనాథ శఠగోపయతి అనే పేరు పెట్టి, ఆలయ కైంకర్య బాధ్యతను అప్పగించారు. శ్రీవైష్ణవ సన్యాసికి తమిళంలో ‘జీయర్’ అని పేరు. మొదట ఒక జీయర్ను మాత్రమే నియమించినా, తర్వాత ఆ జీయర్‌కు ఉత్తరాధికారి(చిన్నజీయర్)గా ఇంకొకరిని కూడా నియమించారు. తర్వాత ఈ విధమైన జీయర్ వ్యవస్థ శ్రీరంగం, తిరునారాయణపురం (మేల్కోటై)లో, కంచిలో కూడా ఏర్పడిన ఈ వ్యవస్థ ఈనాటికీ ఈ క్షేత్రాలలో కొనసాగుతోంది. జీయర్ పర్యవేక్షణలో ఆ ఆలయాల సమయాచారాల నిర్వహణ సాగుతుండటాన్ని నేటికీ గమనించవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో .. వైకుంఠంలో ఆదిశేషుడుగా, తర్వాత త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరామునిగా, కలియుగంలో భగవద్రామానుజులుగా అవతరించారు. తన నూట ఇరవై ఏళ్ల ధార్మిక జీవనంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రాచీనమైన వైష్ణవమతాన్ని ఉద్ధరించారు. సంఘం చేత వెలివేయబడిన నిమ్న కులాలవారికి శ్రీవైష్ణవ మత స్వీకార అర్హతను కలిగించి, దాదాపు సహస్రాబ్ది కిందటే సాంఘిక సంస్కరణలకు నాంది పలికారు. సనాతన వైదిక సంస్కృతి, హైందవ ధర్మాన్ని పరిపుష్టం చెయ్యడానికి ఆసేతు హిమాచలం పర్యటించారు. శ్రీవైష్ణవ సిద్ధాంతానుసారంగా వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఎన్నో వైష్ణవ ఆలయాలను, శ్రీవైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేశారు. ఆయా క్షేత్రాల్లో, ఆలయాల్లో అస్తవ్యస్తంగా, అసమగ్రంగా ఉన్న పూజలు, ఉత్సవాలు, ఆగమశాస్త్రాల నియమానుసారం సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దారు. తిరుమల వేంకటాచల క్షేత్రంలో అర్చనాది కార్యక్రమాలను, ఉత్సవాలను పటిష్ఠం చేశారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠనాథుడైన శ్రీనివాసుడే సాలగ్రామ శిలామూర్తిగా వెలిశాడని, ఆ స్వామే మళ్లీ విఖనస మహర్షిగా అవతరించి, తన అర్చనా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, వైఖానస ఆగమం ప్రకారమే పూజలు జరిపి తీరాలని నిర్ణయించారు. శేషాచలక్షేత్రానికీ శేషాంశంతో అవతరించిన రామానుజులవారికీ విడదీయరాని, విడదీయలేని దివ్య అనుబంధం పెనవేసుకుంది. మోకాళ్లతో పాకుతూ తిరుమల కొండకు తిరుమలకొండ సాక్షాత్తూ ‘శ్రీనివాస పరబ్రహ్మ’ అని ఆళ్వార్లు కీర్తించారు. వాళ్లలో కొందరు తిరుపతికి వచ్చినా, కొండ కింద నుంచే నమస్కరించారు. వాళ్ల అభిప్రాయాన్ని రామానుజులు కూడా గౌరవించి, అనుసరించారు. కొండను పాదాలతో తొక్కుతూ వెళ్లకూడదని నిశ్చయించారు. గురువు తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వారు, ఆలయంలో జరిగే అర్చనాదులు తీర్చదిద్దాలంటూ చేసిన అభ్యర్థన మేరకు భగవద్రామానుజులవారు కేవలం మూడుసార్లు మాత్రమే తిరుమల కొండపైకి వచ్చారు. అది కూడా మోకాళ్లతో పాకుతూ కఠోరదీక్షతో మాత్రమే కొండ మీదకు వెళ్లారు. శ్రీనివాసుడికి శంఖచక్రాలంకరణ పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తికి శత్రువుల నుంచి రక్షణగా శ్రీవేంకటేశ్వరస్వామి తన శంఖుచక్రాలను బహూకరించారు. మళ్లీ తిరిగి ఇవ్వడానికి రాగా, వాటిని ఈ కలియుగంలో ధరించనంటూ స్వామి స్వీకరించలేదు. అందువల్ల శంఖుచక్రాలు లేని తిరుమలలోని అర్చామూర్తి శివుడని వీరశైవులు వాదించారు. వారి వాదనను రామానుజులు ఖండించారు. వక్షఃస్థల మహాలక్ష్మితో విరాజిల్లుతూ ఉన్న ఈ స్వామివారికి, తన తపశ్శక్తి చేత శంఖుచక్రాలను స్వయంగా స్వామివారే ధరించునట్లు చేసి ఆ అర్చామూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశఅయిన శ్రీవేంకటేశ్వర స్వామివారే అని నిరూపించారు. తిరుమలను వైష్ణవ క్షేత్రంగా ప్రతిష్ఠించిన ఘనత శ్రీరామానుజులవారిదే. బంగారు వ్యూహలక్ష్మి శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ని భక్తులందరూ దర్శించడం కుదరదు. అందుకే రామానుజులు ‘బంగారు లక్ష్మి’ ప్రతిమను అలంకరింపజేశారు. ఆనాటినుంచి నియమబద్ధంగా వక్షఃస్థల లక్ష్మితో కూడి ఉన్న శ్రీనివాసునికి శుక్రవారంనాడు మాత్రమే అభిషేకం జరగాలని నిర్ణయించి అమలు చేయించిన ఘనత రామానుజుల వారిదే. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలల అలంకరణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో ఐదవ రోజున గరుడోత్సవంనాడు శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి ధరించిన పూలమాలను తెచ్చి శ్రీవారికి ధరింపజేసే ఏర్పాటుతోపాటు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ ధరించిన పూలమాలను, కనుమ పండుగ రోజున గోదాకళ్యాణం రోజున తిరుమలకు తెచ్చి శ్రీవారికి సమర్పించే ఏర్పాటును రామానుజులవారు చేశారు. తిరుమల శ్రీస్వామి పుష్కరిణి ఒడ్డున ప్రాచీనమైన యోగ నరసింహస్వామి శిలావిగ్రహం పూజాపురస్కారాలు లేకుండా ఉండేది. ఆ మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠింపజేసి, నిత్యనివేదనాదులను ఏర్పాటు చేశారు శ్రీరామానుజులు. గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ రామానుజుల వారు తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత ఆ ఆలయం ఉత్తరోత్తరాభివృద్ధిని కాంక్షిస్తూ, గోవిందరాజస్వామికి దక్షిణ దిక్కులో గోదాదేవిని ప్రతిష్ఠించారు. ఆ ఆలయం చుట్టూ నాల్గు విశాలమైన వీథులను ఏర్పరిచారు. అక్కడే ఆలయ పరివారానికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఏయే దిక్కులలో ఎవరెవరు నివసించాలో, ధాన్యాగారం ఏ దిశలో ఉండాలో.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవస్థీకరించారు. తిరుపతి నగర నిర్మాణ కౌశలం కపిలతీర్థంలో నాలుగు మూలలా శ్రీసుదర్శన చక్రయంత్ర స్తంభాలు ప్రతిష్ఠించారు. దానిని ‘చక్రత్తాళ్వార తీర్థం’గా మార్పుచేయడంతో పాటు, తిరుపతికి గోవిందరాజస్వామి, కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ‘చక్రత్తాళ్వార్ తీర్థం’లో ‘చక్రస్నానం’ అనే ‘అవబృధస్నానం’ జరిగే ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. ఇలా తిరుమల, తిరుపతి ఆలయాలలో అర్చనాది కార్యక్రమాలను, ఆలయ వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తరాల వారికి అందించిన ఘనత రామానుజాచార్యుల వారికి దక్కుతుంది. రామానుజ పరంపరే జీయర్ల వ్యవస్థ తిరుమల శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాలు, టీటీడీ పరిపాలన నిర్వహణలో మూడు రకాల వ్యవస్థలు అమలవుతున్నాయి. శ్రీరామానుజాచార్యులు నెలకొల్పిన జీయంగార్ల వ్యవస్థ ఆలయంలో నేటికీ ప్రామాణికంగా అమలవుతోంది. ఇక భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులు, ఇతర విధాన నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ తీసుకునే నిర్ణయాలను అమలు చేయించడం కోసం కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేస్తోంది. తిరుమలలో జియ్యంగార్ల వ్యవస్థ ఇలా.. తిరుమలేశుని ఆలయంలో పూర్వం రాజులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పూజాకార్యక్రమాలను అమలు జరిపారు. రామానుజుల హయాం నుంచి తిరుమల ఆలయంలో పూజా కైంకర్యాలకు నిర్దిష్ట విధానాలను అమలు చేశారు. వైఖానస ఆగమం ప్రకారం ఆలయ నిర్వహణ జరిపించడం, స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే బాధ్యతను అర్చకులు నిర్వహించటం, అర్చకులంతా వైఖానసులై ఉండేలా చూడటం, అర్చకులు నిర్వహించే నిత్యపూజాకైంకర్య కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించడానికి రామానుజాచార్యులు జీయంగార్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు. జీయంగార్లు అంటే సన్యాసులు కారు. ఈ పదవికి వచ్చేవరకు సంసార సాగరాన్ని ఈదిన వారినే చినజీయర్ (ఉత్తరాధికారి)గా ఎంపిక చేస్తారు. ఈ జీయర్ వ్యవస్థలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీరు సన్యాసధర్మాలను తప్పక ఆచరించాలి. మఠం పరిపాలన శ్రీవారి ఆలయంలో వేకువజాము సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుండి రాత్రి ఏకాంతసేవ ముగిసే వరకు అన్నిరకాల పూజాకార్యక్రమాలను పెద్ద జీయర్, చిన్నజీయర్ లేదా వారి ప్రతినిధులైన ఏకాంగులు దగ్గరుండి పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలుకొని అన్ని రకాల వస్తువులను వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందజేస్తారు. జీయంగార్ల మఠాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల కోసం టీటీడీ ఏటా కోటిన్నర రూపాయలు కేటాయిస్తోంది. ఈ వ్యవస్థలో పెద్ద జీయంగార్, చిన జీయంగార్, ఏకాంగులు, అధ్యాపకులు ఉంటారు. జీయర్ స్వరూపమిది.. పెద్ద జీయంగార్: ఆలయ పూజాకార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడు. చిన్న జీయంగార్: పెద్ద జీయంగారికి ప్రధాన సహాయకుడిగా పని చేస్తారు. అధ్యాపకులు, ఏకాంగులు: బ్రహ్మచారులైన వీరు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. వీరు వేద పాఠాలు చదువుతారు. పెళ్లయిన వారు కూడా ఉండవచ్చు. వీరు జీయంగార్లకు సహాయకులుగా పనిచేస్తారు. తొలిపూజ, తొలి నివేదనం, తొలి దర్శనం వేంక టాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందుకే ‘ఆదివరాహక్షేత్రం’ అనీ, ‘శ్వేత వరాహక్షేత్రం’ అని తిరుమల పేరు పొందింది. నిత్యం తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనాదుల క్షేత్రంలోని పూర్వసంప్రదాయాన్ని రామానుజులవారు పునరుద్ధరించారు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, భూదేవిని ఉద్ధరించి ఇక్కడే నిలిచాడు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీనివాసుడు వచ్చి తాను కలియుగాంతం వరకు ఇక్కడ ఉండడానికి వంద అడుగుల స్థలం దానంగా ఇమ్మని కోరుతూ, అందుకు ప్రతిఫలంగా యుగాంతం వరకు ‘తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనం’ వరాహస్వామికి జరిగేటట్లుగా పత్రం రాసిచ్చాడు. ఈ క్షేత్ర సంప్రదాయం నిర్విఘ్నంగా అమలు జరిగేలా రామానుజులు ఇక్కడి విధివిధానాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో సన్నిధి భాష్యకారులు సన్నిధి అంటే ‘తిరుమల శ్రీవారి సన్నిధి’ అని అర్థం. ఆలయం విమాన ప్రదక్షిణ మార్గంలో ‘సన్నిధి భాష్యకారులు’గా రామానుజాచార్యులవారు కొలువై ఉన్నారు. శ్రీవారి కొప్పెర(హుండీ)కి ఎదురుగా తాళ్లపాక అరకు పక్కగా ‘సన్నిధి భాష్యకారుల’ను దర్శించవచ్చు. శ్రీవారికి నివేదనం జరిగిన ప్రతిసారీ శ్రీవారి సన్నిధి భాష్యకారులకు నివేదింపబడుతుంది. దీనిని 12వ శతాబ్దంలో అనంతాళ్వారులు శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించారు. తణ్ణీరముదు ఉత్సవం తిరుమలలోని పాపవినాశం నుంచి తీర్థజలాన్ని తెస్తున్న తిరుమలనంబికి శ్రీనివాసుడు బోయ యువకుడిగా అడ్డుపడి ‘నీళ్లివ్వు’ అన్నాడు. ‘శ్రీస్వామివారి కైంకర్యం కోసం తీసుకెళ్లే జలాన్ని ఇవ్వకూడదు’ అన్నాడు. కానీ, ఆ బోయవాడు వెనకనే నడుస్తూ, తన బాణంతో తిరుమలనంబి తలమీదనున్న కుండకు రంధ్రం చేసి దానినుండి జాలువారే నీటిని తాగాడు. ఖాళీ అయిన కుండను గమనించిన తిరుమలనంబి వెనక్కు తిరిగి బోయవాణ్ణి చూచి ‘ఎంత పాపం చేశావు.. ఇప్పటికే ఆలస్యమైంది. తీర్థాన్ని మళ్లీ తేవాలి కదా?’ అని చింతించారు. ‘తాతా! బాధపడకు. ఇదిగో ఈ కొండవాలులో చూడు. స్వచ్ఛమైన జలం ఉంది’ అంటూ బాణంతో కొట్టాడట. బాణం వల్ల పడిన రంధ్రం నుండి ఎగిసిపడిన జలాన్ని తీసుకొని తిరిగి బోయవానికోసం చూడగా అతడు అదృశ్యమయ్యాడట. దీనికి గుర్తుగా నేటికీ అదే రోజున తిరుమలలో ‘తణ్ణీరముదు ఉత్సవం’ జరుగుతుంది. దీన్ని కూడా రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు. తిరుచానూరు పంచమి ప్రతి సంవత్సరం కార్తిక శుద్ధపంచమినాడు అనగా ‘శ్రీ అలమేలుమంగ’ అవతరించిన ‘తిరుచానూరు పంచమి’ రోజున మాత్రం తిరుమల శ్రీవారి పూలమాలలు, పసుపు, కుంకుమలతో కూడిన సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పంపాలనే సంప్రదాయాన్ని కూడా రామానుజులవారే ఏర్పాటు చేశారు. మోకాళ్ల పర్వతంలో కొలువైన త్రోవ భాష్యకారులు భగవద్రామానుజులవారు శ్రీభాష్య గ్రంథాలను విరచించటంతో భాష్యకారులుగా ప్రసిద్ధి పొందారు. యాత్రలో మూడుమార్లు పాదాలతో తిరుమల కొండమెట్లను తొక్కకుండా మోకాళ్లతో మాత్రమే దేకుతూ, కొండకు వచ్చారు. అలా వెళుతున్న సమయంలో ‘మోకాళ్ల మెట్టు’ దగ్గర కొద్దిసేపు వారు విశ్రాంతి తీసుకొన్నారు. అందుకు గుర్తుగా ఆ తరువాతి కాలంలో ఆ దివ్య స్థలంలో రామానుజులవారి విగ్రహం ప్రతిష్టింపబడింది. వారినే ‘త్రోవభాష్యకారులు’ అని అంటారు. త్రోవభాష్యకారులకు ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి నివేదనలు చేస్తారు. జనబాహుళ్యంలోకి రామానుజ తత్వం వైష్ణవ భక్తాగ్రేసరుడు రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ రూపొందించటం అభినందనీయం. రామానుజతత్త్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. - సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ సహస్రాబ్ది ఉత్సవాలు ఆచార్య పరంపరలో అగ్రగణ్యులు భగవద్రామానుజులు ఏర్పరచిన పూజా విధానాలే నేటికీ తిరుమలలో కొనసాగుతున్నాయి. ఆ మహనీయుడు అవతరించి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేవస్థానం తరఫున ఏడాదిపాటు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. 108 దివ్యదేశయాత్రలు, ధార్మిక ప్రవచనాలు, గ్రంథ ప్రచురణలు వంటి కార్యక్రమాల ద్వారా రామానుజుల భక్తితత్త్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళుతున్నాము. - డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ఈవో ఏడాదిపాటు సహస్రాబ్ది ఉత్సవాలు రామానుజాచార్యులవారి సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈ ఏడాది మే 10న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా సంచార ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. రథం వెనుక వైపు శ్రీవేంకటేశ్వర స్వామివారు, రామానుజులవారు, పక్కభాగంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, రామానుజులవారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మే 10న ప్రారంభించిన ఈ సంచార రథం 108 దివ్యదేశాలలో పర్యటించి, రామానుజ తత్వానికి ప్రచారం కల్పించనుంది. తిరుమలలో బాగ్ సవారీ ఉత్సవం శ్రీనివాసుడు పుష్పాలంకార ప్రియుడు. ఈ క్షేత్రంలోని పూలన్నీ శ్రీవారి పూజకే వినియోగించాలని క్షేత్ర సంప్రదాయం. పుష్పకైంకర్యం కోసం అనంతాళ్వార్ అనే శిష్యుణ్ణి శ్రీరంగం నుంచి తిరుమలకు రప్పించారు పరమభక్తాగ్రేసరులైన రామానుజాచార్యులు. పుష్పకైంకర్యం కోసం తోటను పెంచాడు అనంతాళ్వారు. ఆ తోటను చూడడానికి రాత్రిపూట శ్రీనివాసభగవానుడు, లక్ష్మీదేవితోపాటు వచ్చి తోటను పాడుచేశాడు. దాన్ని గమనించి రాత్రిపూట కాపుకాసిన అనంతాళ్వారు వారిద్దరినీ బంధించాడు. కాని స్వామి తప్పించుకొని పోగా, లక్ష్మీదేవిని కట్టివేసి, స్వామిని వెంబడిస్తూ పరుగెత్తాడు. ఆలయానికి అప్రదక్షిణంగా పరుగెత్తి, పరుగెత్తి చివరకు పూలతోట దగ్గరకే వచ్చి స్వామి అదృశ్యమయ్యాడు. లక్ష్మీదేవి మాత్రం చెట్టుకు బంధింపబడి ఉందని సంతోషించాడు. ఇంతలో తెల్లవారింది. ఆలయంలో స్వామివారి వక్షఃస్థలంలో లక్ష్మీదేవి కనిపించలేదని అర్చకులు ఆందోళనపడగా, శ్రీస్వామివారు ‘అనంతాళ్వారులు ఆమెను పూలతోటలో బంధించాడని, సగౌరవంగా పిలుచుకొని రమ్మని’ చెప్పాడు. వారు ఆలయం చేరుకోగానే, అమ్మవారు అదృశ్యమై శ్రీవారి వక్షఃస్థలం చేరుకొంది. ఈ గాథను స్మరిస్తూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ‘బాగ్సవారి ఉత్సవం’ ఏర్పాటు చేశారు రామానుజులవారు. ‘బాగ్’ అంటే తోట. సవారీ అంటే వ్యాహ్యాళి. తోటకు వెళ్లే ఉత్సవం కనుక ఇది ‘బాగ్సవారీ’ అంటారు. ఆ రోజు శ్రీనివాసుడు దేవేరులతో ఆలయానికి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు వెళ్లి పూజాకైంకర్యాలు అందుకుని, తిరిగి ఆలయం చేరుకుంటారు. శంషాబాద్‌లో 216 అడుగుల పంచలోహ సమతామూర్తి - వేయేళ్ల సందర్భంగా స్ఫూర్తికేంద్రం తెలంగాణాలో హైదరాబాద్నగరం శంషాబాద్‌కు సమీపంలోని శ్రీరామాపురం వద్ద 216 అడుగుల ఎత్తున శ్రీరామానుజుల పంచలోహ విగ్రహం (సమతామూర్తి) రూపకల్పన సాగుతోంది. స్వామి వారికి వెయ్యేళ్లు నిండుతున్న సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి నేతృత్వంలో ‘శ్రీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్థాపన జరుగుతోంది. వచ్చే ఏడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నిర్మాణం పనులు 2022 నాటికి పూర్తయ్యేలా నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే లక్ష్యంతో 2014లో పనులు ప్రారంభించారు ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1000 కోట్లు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 216 అడుగులు. ఈ విగ్రహం చైనాలోని నాన్జింగ్లో సిద్ధమవుతోంది. దాదాపు 1500 విడిభాగాల్లో మొత్తం సుమారు 700 టన్నుల బరువుతో సిద్ధమవుతోంది. విగ్రహ పీఠం భాగంలో 36 ఏనుగు బొమ్మలు ఉంటాయని, వాటిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుందని, ఈ పీఠంపై 108 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని, ఆయన చేతిలోని త్రిదండం 135 అడుగులు ఉంటుందని స్థపతి డీఎన్వీ ప్రసాద్ తెలిపారు. విజయకీలాద్రిపై 108 అడుగుల సుధామూర్తి ప్రతిపాదన విజయవాడలోని విజయ కీలాద్రి పర్వతంపై 108 అడుగుల ఎత్తై రామానుజుల సుధామూర్తి (సిమెంట్ విగ్రహం) ఏర్పాటు చేయాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు సంకల్పించారు. విగ్రహస్థాపన ప్రణాళిక దశలోనే ఉంది. ఇదే పర్వతం మీదున్న శిథిలావస్థకు చేరిన శ్రీవేంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి, భూ వరాహస్వామి, శ్రీకృష్ణ స్వామి, సుదర్శన చక్రత్తాళ్వారు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, వైకుంఠ పెరుమాళ్, అష్టలక్ష్మి ఆలయాల జీర్ణోద్ధారణకు చేశారు. -
పోలీసులు ఉక్కిరి బిక్కిరి
నేడు కేంద్ర మంత్రి,రేపు సీఎం రాక, 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు విధుల ఒత్తిడితోసతమతం తిరుపతి క్రైం : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పనిచేస్తున్న పోలీసులు ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక వైపు నేరాల సంఖ్య పెరగడం, మరోవైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పనిభారం పెరి గి ఒత్తిడికి గురవుతున్నా రు. నగరంలో శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసే లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుపతి వస్తున్నారు. 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. దీంతో ఇంట్లో వారితో కూడా గడపలేకుండా పోతున్నారు. వీఐపీల తాకిడి ఆధ్యాత్మిక జిల్లా కావడంతో నిత్యం వీఐపీల తాకిడి ఉంటోంది. అదేవిధంగా ఏదో ఒక విషయంపై రాజ కీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేస్తుం టారు. వీటికితోడు నేరాలతో పోలీసులపై పని భారం అమాంతం పెరిగిపోయింది. ప్రముఖల రక్షణ కోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. జిల్లాలో ఏ సంఘటనలు చోటు చేసుకున్నా అటువైపు పరుగులు తీయాల్సి వస్తోం ది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకాక ముందే వీఐపీల పర్యటనతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటకెక్కిన వారాంతపు సెలవు జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువ కావడంతో వారాంతపు సెలవు ఇస్తామని గతంలో అధికారులు చెప్పారు. అమలు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు జిల్లాకు నెలకు రెండుసార్లయినా వస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒక మంత్రి, ఏదో ఒక కమిటీ సభ్యులు వస్తూనే ఉంటారు. దీంతో ఎర్రటి ఎండలో పోలీసులు నిలబడి డ్యూటీ చేయాల్సిందే. 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ తేదీ నుంచి 11 వరకు జరగనున్నాయి. బందో బస్తులో 30 మంది డీఎస్పీలు, 65 మంది సీఐలు, 220 మంది ఎస్ఐలు, 470 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1700 మంది పీసీలు, 500 మంది హోంగార్డులు, 200 మంది మహిళా పీసీలు, 500 మంది మహిళా హోంగార్డులు, 15 టీమ్‌లకు చెందిన ఏఆర్, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది పాల్గొననున్నారు. అప్పటి వరకు ఈ హడావుడి తగ్గే అవకాశం లేదు. -
శ్రీవారికి గద్వాల పంచెలు
ఏరువాడ పంచె.. సంప్రదాయం శోభించే తిరుమలేషుడి బ్రహ్మోత్సవాల్లో జోడు పంచెల ధారణ మొదటిరోజు శ్రీవారికి అలంకరణ 41రోజులుగా నిష్టతో నామాల మగ్గంపై తయారీ గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచే కొనసాగుతున్న ఆనవాయితీ గద్వాల: కలియుగ ప్రత్యక్ష దైవం..అలంకార ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరస్వామికి, గద్వాల చేనేత పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఏటా నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఏరువాడ జోడు పంచెలను అలంకరిస్తారు. ఆ తర్వాతే వార్షిక బ్రహ్మోత్సవాలైనా, నవరాత్రి ఉత్సవాలైనా ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏరువాడ జోడు పంచెలను గద్వాల చేనేత కార్మికులే తయారు చేస్తుండటం విశేషం. దాదాపు 135ఏళ్లుగా ఇక్కడి చేనేత కార్మికులు ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలను అందజేస్తున్నారు. ఇందుకోసం శ్రావణ మాసంలో నేత పనిని ప్రారంభించి, మండల కాలం ఎంతో శ్రమించి వీటిని తయారు చేస్తారు. దేశం నలుమూలల నుంచి శ్రీవారికి ఎన్నో విలువైన కానుకలు అందుతున్నప్పటికీ వీటన్నింటిలోకెల్లా విలువైన కానుకను తెలంగాణ నుంచి అందుతుండటం ఇక్కడి చేనేత కార్మికులు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తారు. దేశంలోని ఏ చేనేత పరిశ్రమకు దక్కని ఖ్యాతి గద్వాల చేనేత పరిశ్రమకు దక్కిందని, అందుకే శ్రీవారి దయతో గద్వాల చేనేతకు దేÔ¶ , విదేశాల్లో ఇంత పేరుందని ఇక్కడి కార్మికుల నమ్మకం. ప్రతిఏటా గద్వాలలో తిరుమల శ్రీవారి కోసం తయారు చేస్తున్న ఏరువాడ జోడు పంచెలపై ఈ ఆదివారం ప్రత్యేక కథనం.. జోడు పంచెల ప్రాముఖ్యం.. గద్వాల సంస్థానం నుంచి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గద్వాల సంస్థానాధీశులు సాంప్రదాయబద్ధంగా నేత మగ్గంపై జోడు పంచెలను ఇక్కడి కార్మికులతో తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేసే ఆచారానికి వందేళ్లకు పూర్వమే శ్రీకారం చుట్టారు. ఏరువాడ జోడు పంచెలను ప్రతి ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అందించేందుకు గాను ఇక్కడి చేనేత కార్మికులు శ్రావణ మాసం ప్రారంభంలో చేనేత పనిని మొదలు పెడతారు. నేత పూర్తయిన అనంతరం వాటిని సాంప్రదాయం ప్రకారం మడతపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించేందుకు గాను గద్వాల సంస్థానాధీశుల తరపున ఇక్కడి చేనేత పనిని పర్యవేక్షించే మహంకాళి కర్ణాకార్ ఈ జోడు పంచెలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ జోడు పంచెలను తొలి రోజున శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించి, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సంస్థానాధీశుల కాలం నుంచి.. గద్వాల సంస్థానంలో కళలకు, కళాకారులకు ఎంతో ఆదరణ లభించేదని సాహితీ చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగానే చేనేత కళాసాంప్రదాయాన్ని కూడా గద్వాల సంస్థానంలో వికసింపజేసేందుకు నాటి సంస్థానాధీశులు కృష్ణరాంభూపాల్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(కాశీ)లో నేత పనిలో ఇక్కడివారికి శిక్షణ ఇప్పించి గద్వాలలో చేనేత పరిశ్రమ స్థిరపడేందుకు దోహదపడ్డారు. ఈ కాలంలోనే ఇక్కడి చేనేత పరిశ్రమ నుంచి గద్వాల సంస్థానం కానుకగా ఏరువాడ జోడు పంచెలు తయారు చేయించే విశిష్టమైన సాంప్రదాయానికి నాంది పలికారు. దీనిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అలంకరించే ఏర్పాట్లు చేశారు. అప్పటినుంచి నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. నామాల మగ్గంపై తయారీ.. శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను ప్రత్యేక మగ్గంపై తయారు చేస్తారు. గతంలో గుంత మగ్గంపై నేసేవారు. ప్రస్తుతం ఫ్రేమ్ మగ్గంపై తయారు చేస్తున్నారు. ముగ్గురు కార్మికులు ఒకేసారి నేసేలా ఉండటం ఈ ఫ్రేమ్ మగ్గం ప్రత్యేకత. దీనిని నామాల మగ్గం అని పిలుస్తారు. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మండలకాలం పడుతుంది. ఈ సమయంలో నేత కార్మికులు ఎంతో నిష్టతో సంప్రదాయబద్ధంగా నేత పనిని కొనసాగిస్తారు. సహజంగా నేత మగ్గాలను ఇద్దరు కలిసి ఒకేసారి నేస్తారు. నామాల మగ్గాన్ని మాత్రం ముగ్గురు కార్మికులు ఒకేసారి నేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేసినా నేత ముందుకు సాగదు. తెలిసీతెలియక తప్పులు జరిగితే మగ్గం దగ్గరికి వచ్చేసరికి తమకు ఆ విషయం పరోక్షంగా తెలుస్తుందని, అందువల్లే అత్యంత జాగ్రత్తగా మసలుకుంటామని చేనేత కార్మికులు చెబుతున్నారు. జోడు పంచెల తయారీ మొదలుకుని వాటì ని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్న ఇంట నిత్యపూజలు, గోవింద నామస్మరణ చేస్తూ పనికి ఉపక్రమిస్తే గానీ అనుకున్న సమయానికి పంచెలు తయారుకావని కార్మికులు అంటున్నారు. జోడు పంచెల విశేషం.. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన ఏరువాడ జోడు పంచెలను శ్రీవారి మూలవిరాట్‌కు అలంకరించడం విశేషం. ఒక్కో పంచె 11గజాల పొడవు, ఇరువైపులా 11 ఇంచుల అంచుతో కంచుకోట కొమ్మ నగిషితో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగివున్న సాంకేతికపరమైన అంశం. సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం సంస్థానాధీశుల కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని వారి వంశస్తులు కొనసాగిస్తున్నారు. మైసూరు, గద్వాల సంస్థానధీశులు తిరుమలేషుడి సేవకు ప్రత్యేకత ఇచ్చారు. ఈ ఏడుకొండలవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపచేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఐదేళ్లుగా తన నివాసంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వంగా ఉంది. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. – మహంకాళి కర్ణాకర్ -
అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల : అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వివరించారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వివరించారు. -
కల్పవృక్షవాహనంపై కల్పవల్లి
-
బంగారు తిరుచ్చిపై మలయప్ప దర్శనం
-
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు : సిఫార్సులు రద్దు
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక, వీఐపీ దర్శనం, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అలాగే 18వ తేదీన గరుడ సేవ, 22వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమంతో ఉత్సవాలు అంకురార్పణ జరగనుంది. ఈ వేడుకలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. అందులోభాగంగా మంగళవారం సాయంకాల వేళలో విష్వక్సేనుడు ఆలయ పురవీధుల్లో ఊరేగుతారు. అనంతరం యాగశాలలో భూమిపూజ చేస్తారు. 9 పాళికలలో నవధాన్యాలతో అంకురార్పణ చేస్తారు. -
14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి 22 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తిరుమలతిరుపతి దేవస్థానం జేఈవో కె. శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో శ్రీనివాసరాజు విలేకరుతో మాట్లాడుతూ... ఈ బ్రహ్మోత్సవాలలో సామన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేసినట్లు... అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కుదించినట్లు ఆయన వివరించారు. గరుడ వాహనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. రేపటి నుంచి పాఠశాలకు దసరా సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే 17వ తేది అర్దరాత్రి 12 గంటల నుండి 20వ తేది ఉదయం 10గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించనివ్వమని తిరుపతి పట్టణ ఎస్పీ గోపినాథ్ తెలిపారు. -
అనంత తేజోమయుడు
-
తెల్లదొరలూ... వెంకన్న సేవకులే
రెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులే. ఆ మాటకొస్తే ఆలయ పాలనా పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయి. దేవస్థానం రికార్డులే అందుకు ఆధారం. 1801 నుండి 1843 వరకు బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా పాలకుల హయాంలోనే ఆలయ పాలనకు కఠిన నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతులు అమలయ్యాయి. నేటికీ తిరుమల ఆలయం, టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది 1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు. టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు దిట్టం: శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు. కైంకర్యపట్టీ: తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీ దారులు, జియ్యర్ సిబ్బంది విధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చే శారు. దీనిప్రకారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి. బ్రూస్‌కోడ్: బ్రిటీష్ ప్రావిన్షియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డెరైక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచీగా ఉంది. సవాల్- ఇ-జవాబు: శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలువేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్- ఇ-జవాబు పట్టీగా పిలుస్తారు. పైమేయిషి ఖాతా: ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషి అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది. జీవో ఎంఎస్ నెంబరు 4429 తేది:23.09.1940, జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చ.కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి పాలనాదక్షతకు నిదర్శనం. సాక్షి, ఫన్డే కవర్‌పై ముద్రించిన శ్రీ వేంకటేశ్వరస్వామి బంగారు ఆభరణాల చిత్రం తయారీకి టీటీడీ ఆభరణాల నుండే విడి భాగాల చిత్రాలను సేకరించి రూపొందించడమైనది. కవర్-బుక్ డిజైన్: కుసుమ -
వికాస కేంద్రాలుగా విదేశీ ఆలయాలు
ఆలయ సంస్కృతి ఒక్క భారత దేశంలోనే కాకుండా ఖండాంతరాలలో వ్యాపించి సమస్త మానవాళికి సంజీవనిగా వెలుగొందుతోంది. లోకకల్యాణం కోసం దే శదేశాల్లో కూడా ఆలయాలు విస్తరిస్తూ అక్కడివారిలో ప్రేమామృతాన్ని పంచే ఆధ్యాత్మిక కేంద్రాలుగా బాసిల్లుతుండటం విశేషం. దక్షిణభారత దేశ శిల్పరీతుల్లో శ్రీమహావిష్ణువు అంశలైన శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడుతోపాటు కుమారస్వామి (మురుగన్), వినాయకుడు, శివపార్వతులు, ఆంజనేయస్వామి, నవగ్రహాల ఆలయాలు అధికంగా కనిపిస్తాయి. వీటితోపాటు ఉత్తర భారతదేశ శిల్పరీతుల్లో ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు, స్వామినారాయణ్ ఆలయాలు విదేశాల్లో ఉన్నాయి. నాటి శిల్పకళా వైభవ రీతులకు దర్పం అలనాటి కళింగ, చోళ, పల్లవ, పాండ్య, కాకతీయ రాజుల నాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీకలుగా నిలిచిన శిల్పకళా నిర్మాణం రీతుల్లోనే విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించారు. వైష్ణవ, శైవ ఆగమ రీతులకు లోబడి పునాది నుంచి విమానప్రాకారం వరకు అన్నీ ఆగమ శాస్త్ర, వాస్తు సంబంధంగానే నిర్మించారు. నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా గర్భాలయం, శయన మండపం, ముఖమండపం, ప్రాకారాలు, ధ్వజ స్తంభం, పుష్కరిణి వంటివి తప్పక ఏర్పాటు చేయటం విశేషంగా చెప్పవచ్చు. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేకంగానూ, ఒకే భవంతిలో వివిధ అంతస్తుల్లోనూ వివిధ దేవతా మూర్తులను ఆగమోక్తంగా ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సమాజ హిత కేంద్రాలుగా... * విదేశాల్లోని ఆలయాల్లో కేవలం పూజలు, ఉత్సవాలే కాకుండా సమాజ హితం కోసం అనేక ఆధ్యాత్మిక, కళా, సాంస్కృతిక, నైతిక, సామాజిక, విద్య, ఆరోగ్య, మానసిక వారధులుగా ఆలయాలు పనిచేస్తున్నాయి. * ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ వంటి ఆధ్యాత్మికవేత్తల మరెందరితోనూ తరచు ఆధ్యాత్మిక, వేదాంతిక ప్రసంగాలు, ప్రవచనాలు చేయిస్తూ అక్కడి జనంలో తాత్విక చింతన, భక్తి, ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తున్నారు. * ప్రత్యేకించి సెలవురోజుల్లో యోగా శిక్షణా తరగతులు నిర్వహించి మానసిక రుగ్మతలను, ఎన్నో దీర్ఘకాలిక జబ్బులను నియంత్రిస్తుంటారు. * సనాతన భారతీయ నృత్య, సాంస్కృతిక సంపదలైన కూచిపూడి, భరతనాట్యం, ఆలయ భజన, హరికథ వంటి ఎన్నో భక్తి, సంగీత కళాసంప్రదాయాల్ని నేటి తరానికి అందించటం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. * హెల్త్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్ర ద్ధ కనబరచేలా విలువైన సూచనలు ఇచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పరుస్తారు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఆలయాల వద్ద తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ మొదలగు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మాతృభాషను బోధిస్తారు. * ప్రత్యేకంగా ధ్యానంపై శిక్షణ ఇచ్చి మానసిక స్వాంతన చేకూరుస్తారు. ఆలయాల్లో ఆడిటోరియం, లైబ్రరీ, డైనింగ్ హాలు, మీడియా సెంటర్ ఏర్పాటు చేసి నిత్యం అనుకూల వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రస్టీల చేతుల్లో ఆలయ నిర్వహణ * విదేశాల్లోని ఆలయాలు దాదాపుగా ట్రస్టీల చేతుల్లో నిర్వహింపబడుతున్నాయి. నిర్ణీత గడువులో జరిగే ఎన్నికల్లో ట్రస్టీలను ఎన్నుకుంటారు. ఏడాదికి సరిపడా కార్యక్రమాలు రూపొందించి పక్కాప్రణాళికతో అమలు చేస్తారు. * భక్తులకు సలహాలు, అన్నదానం, ఆర్థిక సంబంధ విషయాలు, హిందూధర్మ పరిరక్షణ, మానవతా విలువల్ని సంరక్షించటం, గ్రంథాలయాల్లో శాస్త్రగ్రంథాలు సమకూర్చటం, మానవసంబంధాలు కొనసాగించటం, సామాజిక సేవాకార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారు. విదేశాల్లోని ఆలయాల్లో ఏడాది పొడవునా ఉత్సవాలు * విదేశాల్లోని ఆలయాలు సాధారణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు, పూజలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక, కాలపట్టికను సిద్ధం చేసుకుంటాయి. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. * ప్రతి ఏడాది దసరా నవరాత్రుల్లోనూ, కార్తీక మాసంలోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వాహన సేవల్ని, రథం ఊరేగింపు, చక్రస్నానం కూడా నిర్వహిస్తారు. * అలాగే మకర సంక్రాంతి, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, కృష్టాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, మహాశివరాత్రి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. కృష్ణుని జీవితంలోని ప్రధాన ఘట్టాలైన రాధామాధవ రాసలీల, గోవర్ధనగిరిని తన చిటికనవేలితో ఎత్తటం, అలనాడు పూతనను సంహరించటం వంటి ప్రధాన ఘట్టాలు కళ్లకు కట్టే విధంగా కళాప్రదర్శనలు ఇవ్వటం ద్వారా నేటితరాలకు నాటి భక్తితత్వాన్ని, ఆధ్యాత్మికత అమృతసారాన్ని నాటి తరం నుంచి నేటితరానికి అందిస్తుండటం ముదావహం. స్వామినారాయణ్, ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల సందడి * ఉత్తర భారత దేశ సంస్కృతిలో భాగంగా అంతర్జాతీయంగా స్వామి నారాయణ్ ఆలయాలు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌కు చెందిన రాధాకృష్ణమందిరాలు ఎక్కువ దేశాల్లో విస్తరించాయి. విదేశీ ఆలయాల్లో టీటీడీ శ్రీనివాస కల్యాణాలు * ఖండాంతరాల్లోని ప్రవాస భారతీయ భక్తులకూ స్వామి వైభవాన్ని చాటేలా ‘శ్రీనివాస కల్యాణం’ నిర్వహిస్తూ వారిలో భక్తి చైతన్యాన్ని నింపుతోంది టీటీడీ. పంచలోహ విగ్రహ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామికి తిరుమల ఆలయ తరహాలోనే స్వామి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. ఈ పంచలోహ విగ్రహాలను టీటీడీ తయారు చేసి నిర్వాహకులకు నగదుపై ముందుగానే అందజేస్తుంది. మహ్మదీయుల నాదస్వరార్చన ప్రపంచ నాదస్వర చక్రవర్తిగా ప్రఖ్యాతి గాంచిన పద్మశ్రీ షేక్ చినమౌలానాకు శ్రీవారి ఆలయంతో అపారమైన అనుబంధం ఉంది. ఆలయంలో అనేక కైంకర్య కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో నాదస్వర కచ్చేరి చేసేవారు మౌలానా. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో నాద నీరాజనంతో స్వామిని స్తుతించారు. అలాంటి విద్వాంసుడి ఏకైక కుమార్తె వీవీ జాన్ బిడ్డలైన మనుమలు షేక్ ఖాసిం, షేక్ బాబులు తాతగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తిరుమలేశుని ఆలయ నాదస్వర విద్వాంసులుగా సేవలు అందిస్తూ మత సామరస్యాన్ని చాటుతుండటం విశేషం. తాత చలవతోనే వెంకన్న సేవాభాగ్యం ‘‘మా తాత మౌలానా గారు ప్రపంచ నాదస్వర చక్రవర్తి. మాకు చిన్నతనంలోనే నాదస్వరంలో నడకలు నేర్పారు. ఆ సంగీత సమ్రాట్ నేర్పిన నడకల వల్లే నేడు శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలిగింది. మతాలకు అతీతంగా వెంకన్నసేవలో తరిస్తున్నాం. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. ఇది పూర్వజన్మసుకృతం. ’’ - షేక్ ఖాసిం, షేక్ బాబు, నాదస్వర విద్వాంసులు, అన్నదమ్ములు వారి సేవ అనిర్వచనీయం పద్మశ్రీ షేక్ చినమౌలానా మనమలు షేక్ ఖాసిం, షేక్ బాబు సేవ అనిర్వచనీయం. స్వామివారి ఉత్సవాల్లో విధిగా పాల్గొని తమ జ్ఞానవిద్య, సంగీత విద్యను స్వామికి సేవా రూపంలో అందిస్తూ కొలుస్తున్నారు. ఆ కుటుంబంపై స్వామి వారి కృప ఎల్లవేళలా ఉంటుంది. - డాక్టర్ కేవీ రమణాచారి, టీటీడీ పూర్వపు ఈవో షేక్ హుస్సేన్ అనే భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించిన 108 బంగారు పుష్పాలతోనే ప్రతి మంగళవారం గర్భాలయంలోని మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన, ప్రత్యేక వారపు సేవ చేస్తుండటం విశేషం. -
నెట్టింట్లోంచే తిరుమల యాత్ర
తిరుమలలో నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఆధునిక, సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఇంట్లో నెట్ ఉంటే చాలు... ఆన్లైన్లోనే స్వామి దర్శనం, బస, సేవలను బుక్ చేసుకునేలా నిబంధనలు సులభతరం చేసింది. తిరుమలలో రూ.300 టికెట్ల కేటాయింపుల్లేవు... ఆన్లైన్ లోనే 26వేల టికెట్లు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కేటాయింపులో మార్పు వచ్చింది. 2009 నుండి తిరుమలలోనే టికెట్లు కేటాయించేవారు. ఇటీవల పూర్తిగా రద్దు చేశారు. ఆ కోటాలో రోజు కేటాయించే 26 వేల టికెట్లను ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తున్నారు. ఓ కుటుంబంలోని భక్తుల్లో ఒకరు తమ ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేయాలి. మొదటి వ్యక్తితోపాటు మిగిలినవారి పేర్లు నమోదు చేసుకోవాలి. * అదే టికెట్టుపై ఒకరికి రెండు లడ్డూలు ఇస్తారు. అదనంగా మరో రెండు లడ్డూలు కావాలంటే దర్శన టికెట్ల బుకింగ్ సందర్భంలోనే మరో రూ.50 చెల్లించి రెండు లడ్డూ టికెట్లు తీసుకునే సదుపాయం కల్పించారు. స్వామి దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఆ టికెట్లపై భక్తులు లడ్డూలు పొందే అవకాశం ఉంది. * ఆన్‌లైన్‌తోపాటు టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లోనూ, మండల పోస్టాఫీసుల్లోనూ రూ.300 దర్శన టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇటీవల టీటీడీ ఏపీ, తెలంగాణలోని 2500 పోస్టాఫీసుల ద్వారా రోజుకు 5 వేల టికెట్ల వరకు పొందే అవకాశం కల్పించింది.. * ఈ రూ.300 టికెట్లను ప్రతిరోజూ 56 రోజులకు ముందు కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఖాళీలను బట్టి భక్తులు తమకు నచ్చిన తేదీల్లో టికెట్లు రిజర్వు చేసుకునే సౌకర్యం కల్పించారు. * ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పది టైం స్లాట్లలో టికెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. * ఇక ఇదే విధానంలో రూ.50 సుదర్శనం టికెట్లు రోజుకు 4 వేలు కేటాయిస్తున్నారు. వీరికి రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల్లోపు మూడు టైం స్లాట్లలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు. సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి * శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది. టీటీడీ ఆలయ దర్శనం కోసం... * చిత్తూరుజిల్లా వ్యాప్తంగా టీటీడీ ఆలయాలు ఉన్నాయి. ఇందులో అనాదిగా దేవస్థానం నిర్వహించే ఆలయాలతోపాటు స్థానికంగా పూజలందుకుంటూ టీటీడీకి అప్పగించిన ఆలయాలు ఉన్నాయి. వీటి సందర్శన కోసం దేవస్థానం సొంతంగా ఏపీ టూరిజం బస్సులతో ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసింది. తక్కువ టికెట్ల ధరతో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఏడెనిమిది ఆలయాలు సంద ర్శించే అవకాశం కల్పించింది. ఆ ప్రత్యేక ప్యాకేజి టూర్ వివరాలేమిటో తెలుసుకుందాం! తిరుపతిలోని స్థానిక ఆలయాలు * శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు శ్రీకోదండరామస్వామి ఆలయం, తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయం, తిరుపతి శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయం, తొండవాడ. ప్యాకేజీ: టికెట్టు ధర రూ.100. (నాన్ ఏసీ- 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు) బస్సు బయలుదేరే స్థలం, సమయం: శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి. ఉ. 6 నుండి మ.1 గంటల వరకు ప్రతి ఒక గంటకు. చిత్తూరు జిల్లాలో దర్శించే ఆలయాలు * శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, కార్వేటినగరం శ్రీవేదనారాయణస్వామి ఆలయం, నాగలాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట శ్రీకరియమాణిక్యస్వామి ఆలయం, నగిరి శ్రీఅన్నపూర్ణాసమేత కాశీవిశ్వేరస్వామి ఆలయం, బుగ్గ, కార్వేటినగరం శ్రీవల్లికొండేశ్వర స్వామి ఆలయం, సురుటుపల్లి, నాగలాపురం అదనపు వివరాలకు: 0877-2289120, 2289123, 09848007033 ప్యాకేజీ: టికెట్టు ధర రూ.200. (నాన్ ఏ.సీ), 300(ఏ.సీ) 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు) బస్సు బయలుదేరే స్థలం: శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం తిరుపతి. ఉ. 8 నుండి మ. 9 గంటలకు భక్తులు ఇలా టీటీడీ సమాచారం తెలుసుకోవచ్చు: టీటీడీ కాల్సెంటర్లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 0877-22 33333, 2277777, 2264252 టీటీడీ వెబ్సైట్: www.tirumala.org www.tirupati.org ఈమెయిల్:www.tirumala.org www.tirupati.org సేవలు, వసతి ఆన్లైన్ బుకింగ్: www.tirumala.org www.tirupati.org టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877-2263472 ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో (0877-2263261) ఫోన్‌చేసి నేరుగా ఈఓతో టీటీడీ పరిధిలో తమకు ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల విరాళం అన్నప్రసాదాల తయారీకోసం రోజుకు టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాలకు 0877-226458 నెంబర్లో సంప్రదించవచ్చు. దాతలకు బస, దర్శనంలో కోటా టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలు టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్:087722-63472,2263727కు సంప్రదించవచ్చు. టీటీడీ పౌరోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే... భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి. వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాస్‌పోర్టు, ఓటరు కార్డు... వంటి వాటిల్లో ఫొటో గుర్తింపు కార్డు నకలును అందజేయాలి. -
ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు
కోర్కెలు తీర్చే కొండలరాయునికి భక్తిశ్రద్ధలతో సామాన్య భక్తులు సమర్పించే ముడుపులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందుకు సాగుతోంది. అలాంటి ధార్మిక సంస్థలో పారదర్శక పాలనతోపాటు అన్ని విభాగాల సేవల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సామాన్య భక్తులకు మరింత చేరువ కావాలని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు సంకల్పించారు. కొత్తవాటికి, వివాదాంశాల జోలికెళ్లకుండా ఉన్నవాటిని మరింత లోతుగా అధ్యయనం చేసి లోపాలను సవరించి కొత్త జవసత్వాలతో ముందుకు నడిపించాలని భావిస్తున్న టీటీడీ ఈవో ‘సాక్షి ఫన్డే’తో పంచుకున్న మనోభావాలివి... ♦ టీటీడీ ఈవోగా బ్రహ్మోత్సవాల బాధ్యత తీసుకోవడంపై ఎలాంటి అనుభూతి ఉంది? దేవదేవుని సన్నిధిలో వీఐపీ, సామాన్యుడు అన్న తేడా ఉండదు. దేవుని ముందు అందరూ సమానమే. ధార్మిక సంస్థ టీటీడీ కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సామాన్యుడే మాన్యుడు అన్న లక్ష్యంతో సాగిపోతున్నాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదేవుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించే బాధ్యత రావటం అదృష్టంగా భావిస్తున్నా. ఆ అనుభూతి చెప్పలేనిది. అంతకంటే బాధ్యతతో పనిచేయాలని సంకల్పించాము. ♦ ధార్మిక సంస్థలోని వివిధ విభాగాల సేవల్ని భక్తులకు ఎలా చేరవేయబో తున్నారు? టీటీడీలో అనేక విభాగాలున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా భక్తులకు సేవ చేస్తుంటాయి, మరికొన్ని పరోక్షంగా సేవలందిస్తాయి. వీటిలో కొన్ని భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే, మరికొన్ని ధర్మప్రచారం ద్వారా స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని చాటటం, మానవ సంబంధాలు- నైతిక విలువలు పెంపొందించటం ద్వారా యువతను ధార్మికత దిశగా తీసుకెళుతుంటాయి. రిసెప్షన్, ఆలయం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, ధర్మప్రచారంలో భాగంగా శ్రీనివాసకల్యాణోత్సవాలు, శుభప్రదం, మనగుడి, వైభవోత్సవాలు, సప్తగిరి మాసపత్రిక, శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ వంటి ఎన్నెన్నో విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఇలా అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భక్తుడి కేంద్రంగా సేవలందించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. అన్ని విభాగాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే భక్తుడికి టీటీడీ సేవలు సత్వరంగా లభిస్తాయి. ♦ ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలుతో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం చక్కగా అమలు చేస్తున్నాం. భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. గతంలో భక్తుల మధ్య ఉండే తోపులాటలు తగ్గాయి. గతంలో కంటే స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 5నుండి 10 శాతం వరకు పెరిగింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. హుండీ కానుకలు కూడా 10 శాతం వరకు పెరగటం శుభపరిణామం. ♦ రూ.300 టికెట్లు, రూ.50 సుదర్శనం వంటి ఆన్లైన్ దర్శనాలు ఎలా అమలవుతున్నాయి? రూ.300 టికెట్ల ఆన్లైన్ దర్శనాలు సజావుగా అమలవుతున్నాయి. రోజుకు 26వేలు రూ.300 టికెట్లు, మరో 4వేల వరకు రూ.50 సుదర్శనం టికెట్లు కేటాయిస్తున్నాం. భక్తుల నుంచి స్పందన విశేషంగా ఉంది. ఆ టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు వచ్చినట్టుగాను, తిరిగి వెళ్లినట్టుగాను తెలియటం లేదంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్నాయో ఇక చెప్పనక్కరలేదు. దీనివల్ల సిఫారసు దర్శనాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ♦ లడ్డూ నాణ్యత, రుచి విషయంలో స్వామి భక్తులు కొంత ఆవేదనతో ఉన్నారు? దిట్టాన్ని సవరించి భక్తుల కోర్కె తీరుస్తారా? స్వామి దర్శనం తర్వాత అంత ప్రాధాన్యత లడ్డూకు ఉంది. నాణ్యత, రుచికరమైన లడ్డూలు శుచిగా తయారికీ కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి, చక్కెర, ఇతర పప్పు దినుసులన్నీ కూడా నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు కలిగిన వాటినే వినియోగిస్తున్నాం. రోజూ 3 లక్షలకు తగ్గకుండా లడ్డూలు తయారు చేస్తున్నాం. భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లలోనే లడ్డూ టోకెన్లు పొందే సౌకర్యం కల్పించాం. ♦ భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు మీరు ఏమి చేయదలిచారు? ఆలయ నిర్వహణాంశాల్లో వివాదాల జోలికి వెళ్లము. ఉన్న వాటిని ఎలా అభివృద్ధి చేయాలో ఆ దిశగా యోచన చేస్తాం. దేనికైనా సమయం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది. భవిష్యత్‌లో మార్పులు మాత్రం తప్పవు. ♦ పరిపాలన సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా? పాలనలో సంస్కరణల కంటే ఉన్నవాటిని మెరుగుపరచటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆయా విభాగాల్లో అమలు చేసేవాటిలోనే నిర్దిష్ట విధానాలను ప్రవేశ పెట్టాము. బస, కల్యాణకట్ట, అన్నప్రసాదం వంటి విభాగాలను సులభతరం చేయటం వల్ల భక్తులకు మరింత చేరువయ్యాయి. రిసెప్షన్ విభాగాల్లో గదుల వేకెన్సీ రిజర్వు తగ్గించాం. గదుల కేటాయింపుల్లో పారదర్శక విధానాల వల్ల ఆక్యుపెన్సీ 110 శాతానికి పెరిగింది. గదుల అద్దె ఆదాయం కూడా మరో 13 శాతం వరకు పెరిగింది. కల్యాణ కట్టల్లోనూ 15 నుండి 20 శాతం భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించే అవకాశాలు పెరిగాయి. ♦ వేయికాళ్ల మండపాన్ని ఎలా నిర్మించబోతున్నారు? చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నిర్మించాలని సంకల్పించాం. దేవదేవుని ఉత్సవాలకు అనువుగా చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మికత ఉట్టిపడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయానికి నైరుతి దిశలో నారాయణగిరి ఉద్యాననవంలో నిర్మిస్తాం. భక్తులు మండపాన్ని దర్శించేలా పూర్వవైభవాన్ని పునరుజ్జీవింప చేస్తాం. ♦ టీటీడీ ఈవోగా మీ ప్రాధాన్యతాంశాలేమిటి? స్వామిదర్శనం కోసం తిరుమల కొండమీద కొచ్చిన సామాన్య భక్తుడి నుంచి వీఐపీ వరకు ఉపయోగించుకునే విధంగా యాత్రిసదన్లు అభివృద్ధి చేయటమే నా తొలి ప్రాధాన్యత. ఒకేచోట అనువైన మరుగుదొడ్లు, స్నానపు గదులు, లాకర్లు, తలనీలాలు సమర్పించే సౌకర్యాలు కల్పించాలి. నాల్గు యాత్రిసదన్లను అభివృద్ధి చేస్తే గదులు కోరుకునే భక్తులు తగ్గుతారు. రూ.300 టికెట్లు పొందిన భక్తులు యాత్రిసదన్లు ఉపయోగించుకునే విధంగా వందశాతం పరిశుభ్రతతో అభివృద్ధి చేస్తాం. తిరుమలలో నీటి ఇబ్బందులు న్నాయి. వాటిని తగ్గించేందుకు చర్యలు చేపడతాం. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతినీటి బొట్టును వినియోగించుకునేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వర్షపు నీటిని తిరిగి వాడుకునే విధంగా హార్వెస్టింగ్ చేయాలని భావిస్తున్నాం. గోగర్భం డ్యాము కింద అదనంగా చెక్ డ్యాము నిర్మిస్తాం. వాటర్‌ను ట్రీట్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తాం. అది పూర్తయితే సుమారు నాలుగు నెలలపాటు అదనంగా నీరు లభించే అవకాశం ఉంది. ఇక పవర్ విషయానికి వస్తే ఎల్ఈడీ బల్బుల వినియోగానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల అలంకరణలతోపాటు సాధారణ రోజుల్లోనూ ఎల్ఈడీ లైట్లనే వినియోగిస్తాం. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. సోలార్ విద్యుత్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెండు బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి? అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఒకటి వార్షిక, మరొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. రెండింటినీ అంగరంగవైభవంగా నిర్వహిస్తాం. ఏలోటూ రానివ్వం. * బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారికి ప్రయాణం, బస, కల్పిస్తాం. ఆలయంలో మూలవిరాట్టు దర్శనంతోపాటు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తాం. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. * ప్రత్యేకించి గరుడ వాహనం, చక్రస్నానంపై ఎక్కువ దృష్టిపెట్టాం. గరుడ వాహనంపై మలయప్పస్వామిని దర్శించేందుకు వచ్చే అశేష జనవాహిని సంతృప్తిగా స్వామిని దర్శించే ఏర్పాట్లు చేశాం. వాహనాన్ని బాగా రద్దీ ఉండే ప్రాంతాల్లో తిప్పుతూ భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తాం. * టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఆర్టీసీ విభాగాల మధ్య సమన్వయం పెంచాం. అందరికీ బాధ్యతలు అప్పగించాం. అమలయ్యేలా ప్రత్యేక ఆదేశాలిచ్చాం. అందరూ ఒకే మాటమీద ఉంటూ అన్నీ విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాం. * ఆలయ నాలుగు మాడ వీధుల్లో అన్నప్రసాదం, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. వాహన సేవను శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలు చేస్తాము. అధునాతన కెమెరాలు వినియోగిస్తాం. వాహన సేవ విశిష్టతను తెలిపేందుకు అనుభవజ్ఞులైన వ్యాఖ్యాతలను ఏర్పాటు చేస్తాం. * ఉత్సవాల్లో ఉత్సవమూర్తుల అలంకరణకు, వాహన సేవల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అలంకారాల్లో ఏలోటూ రానివ్వకుండా చూసుకోవలసిందిగా సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చాం. * భక్తులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అందుకోసం అనుభవ జ్ఞులైన కళాకారుల్ని ఎంపిక చేశాం. -
భక్తుల కురులూ సిరులే!
వెంకన్నకు భక్తులు సమర్పించే వెంట్రుకలతో విదేశీ వాణిజ్యమా? అనిఆశ్చర్యపోకండి. ఇది నిజం.. సాక్షాత్తు వెంకన్న సన్నిధిలో నిత్యం భక్తులు సమర్పించే తలనీలాలు టీటీడీకి ఏటా సుమారు రూ.200 కోట్లకుపైగా విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నాయి. అనాదిగా వస్తున్న తలనీలాల మొక్కుల ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలోనూ భక్తకోటి బ్రహ్మరథం పడుతున్నారు. పురాణాల్లో తలనీలాల మొక్కుల ప్రస్తావన * తీర్థక్షేత్రాల్లో విధిగా తలనీలాల మొక్కులు చెల్లించుకోవాలని పద్మ పురాణం చెబుతోంది. తలనీలాలు సమర్పించుకోవడం ద్వారా తెలిసో తెలియకో చేసిన కర్మలన్నీ తొలగి పోతాయి. మనిషిలో స్వతహాగా ఉండే అహం తొలగి సన్మార్గంలో నడిచేందుకు తలనీలాల మొక్కులు దోహద పడతాయి. అందుకే పిల్లల పుట్టువెంట్రుకల్ని పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల్లోనే తీయిస్తారు. * 1803కు ముందునుండే తిరుమలలో తలనీలాలు తీసే ఆచారం ఉండేది. చంటిబిడ్డలు, వృద్ధులు స్త్రీ- పురుష లింగ భేదం లేకుండా స్వామికి తలనీలాల మొక్కులు చెల్లిస్తారు. ఏడాదిలో 1.16 కోట్ల మంది... * ప్రపంచంలోనే అతిపెద్ద క్షౌరశాలగా ప్రసిద్ధి పొందిన తిరుమలలో రెండు ప్రధాన కల్యాణ కట్టలతోపాటు కాటేజీలు, అతిథి గృహాలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద మరో 9 చిన్న కల్యాణకట్టలు ఉన్నాయి. * సాధారణ రోజుల్లో 30 వేలు, రద్దీ రోజుల్లో 60 వేలు పైబడి భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇలా నెలకు సరాసరి 9.7 లక్షలు, ఏడాదికి 1.15 కోట్ల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 13వతేదిన రికార్డు స్థాయిలో 73వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించటం విశేషం. ఇలా ఏటా టీటీడీకి సుమారు 360 టన్నుల వెంట్రుకలు సమకూరుతున్నాయి. * తిరుమలతోపాటు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పరిధిలో టీటీడీ కల్యాణ కట్టలు పనిచేస్తున్నాయి. ఇక్కడ రోజూవారీగా సుమారు 300 మంది తలనీలాలు సమర్పిస్తున్నారు. తలనీలాల సేకరణ ఇలా... గుండు కొట్టే సమయంలోనే వెంట్రుకల నాణ్యతను క్షురకులు గుర్తిస్తారు. గుండు కొట్టించుకునేందుకు స్త్రీలు వస్తే వారి జుట్టును ముడి వేస్తారు. కార్యక్రమం పూర్తయినతర్వాత భక్తుల చేతనే ఆ వెంట్రుకల్ని హుండీలో వేయిస్తారు. మిగిలినవాటిని కూడా మరోహుండీలో వేస్తారు. తర్వాత వాటిని తిరుమలలోనే ప్రధాన కల్యాణకట్టపై ఉండే గిడ్డంగులకు తరలిస్తారు. అక్కడ వెంట్రుకల్లో తేమ లేకుండా ఆరబెడతారు. తర్వాత రంగు, పొడవు, నాణ్యత లెక్కన ఆరు రకాలుగా విభజిస్తారు. ఈ-వేలంతో పెరిగిన ఆదాయం * 1933లో టీటీడీ ఏర్పడక ముందు ఆలయ నిర్వాహకులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా కల్యాణకట్టలను నిర్వహించేవారు. * తర్వాత 1985, ఏప్రిల్ 6న తలనీలాల కోసం టీటీడీ అధికారికం గా కల్యాణకట్టలు ప్రారంభించింది. ఈ సందర్భంగా సమకూరే తలనీలాలను సాధారణ టెండర్ ప్రక్రియలో విక్రయించే వారు. దీనిద్వారా టీటీడీకి ఆదాయం అంతగా వచ్చేది కాదు. దాంతో 2011లో అప్పటి టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పారదర్శకంగా అంతర్జాతీయ స్థాయిలో తలనీలాలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన మెటీరియల్ ట్రేడ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ)తో సంప్రదింపులు జరిపారు. రూ.810 కోట్ల విదేశీ మారకద్రవ్యం తొలిసారిగా సెప్టెంబరు 22, 2011 టీటీడీ ఈ-వేలంలో తలనీలాలు విక్రయించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెల మొదటి గురువారం ఈ-వేలం ప్రక్రియలో వెంట్రుకలను విక్రయిస్తున్నారు. 2015 ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు మొత్తం 15 విడతల ఈ వేలం ద్వారా టీటీడీకి రూ.810 కోట్లు ఆదాయం సమకూరింది. తమిళులే టాప్! తిరుమలేశునికి తలనీలాల మొక్కు చెల్లించే విషయంలో పక్కనే ఉన్న తమిళనాడు వాసులే టాప్‌గా నిలుస్తున్నారు. రెండోస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు, తర్వాత వరుసగా కర్ణాటక, మహారాష్ర్ట (నాండేడ్, శిరిడీ) భక్తులు అధికంగా వస్తూ స్వామికి తలనీలాల మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాజ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని భక్తులు అధికంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నా వారిలో తలనీలాలు సమర్పించే భక్తులు తక్కువనే చెప్పవచ్చు. విశ్వ విపణిలో వెంట్రుకలతో వాణిజ్యం * వెంట్రుకలు ప్రధానంగా వ్యవసాయం, మందుల తయారీ, నిర్మాణ రంగం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో వాడతారు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో రారాజుగా వెంట్రుకల్ని డిజైన్లు, కాస్మొటిక్స్‌లో వినియోగిస్తున్నారు. ఫ్యాషన్ డిజైన్లలో సాటిలేని దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్‌తోపాటు నైజీరియా వంటి చిన్న దేశాలు కూడా వెంట్రుకలు కొనుగోలు చేసే దేశాల్లో ముందు వరుసలో ఉన్నాయి. చారిత్రక నేపథ్యం * క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలోనే ఈజిప్టులో నాటక రంగాల్లో వెంట్రుకలతో తయారు చేసిన విగ్గులు వాడినట్టు చరిత్ర. ఆనాడు వాడిన విగ్గులు నేటికీ చెక్కు చెదరకపోవటం వెంట్రుకల నాణ్యత, వాటిలోని ఔషధగుణాలకు నిదర్శనమని తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో... * వెంట్రుకలు భూమిలో కలసి పోవటం వల్ల రసాయనిక వాయువులైన కార్బన్, నైట్రోజన్, సల్ఫర్‌తోపాటు టాక్సిక్ వాయువులైన అమ్మోలియా, కార్బన్ సల్ఫేట్, హైడ్రోజన్ సల్ఫేట్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువుల విడుదలకు కారణమవుతుంది. * బయో డీగ్రేడబుల్ వస్తువుగా, వర్మీ కంపోస్టుగా వాడటానికి వెంట్రుకలు చాలా ఉపయోగం. పొట్టిరకం, ముడి రకానికి సంబంధించిన వెంట్రుకలతో ఎరువులు తయారు చేస్తారు. * జంతువుల పేడలో నైట్రోజన్ 0.2 శాతం మాత్రమే ఉండగా, మనుషుల వెంట్రుకల్లో మాత్రం అత్యధికంగా 16 శాతం నైట్రోజన్ ఉంటుంది. దాంతోపాటు సల్ఫర్, కార్బన్, చెట్లు ఎదగడానికి దోహదపడే మరో 20 రకాల పోషక పదార్థాలుంటాయి. వెంట్రుకల ఎరువుతో అధిక దిగుబడి * చైనా వ్యవ సాయంలో జంతువుల పేడతోపాటు వెంట్రుకల్ని కూడా కలిపి వాడటం వల్ల ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి సాధించారు. ఒక్కసారి వెంట్రుకల ఎరువు వేస్తే కనీసం మూడేళ్లపాటు ఇతర ఎరువుల అవసరం లేకుండానే పంటలు పండించి మంచి దిగుబడి సాధించవచ్చని చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిరూపించారు. * పెట్రోల్ బావులు, చమురు శుద్ధి కర్మాగారాల్లో వాడకం * వెంట్రుకలకు ఉండే పటిష్టత, మన్నిక దృష్ట్యా వాటితో తయారు చేసిన పరికరాలనే పెట్రోల్ బావుల్లోనూ, చమురు శుద్ధి కర్మాగారాల్లోనూ వాడతుంటారు. నూనె శుద్ధిచేయడానికి ఫిల్టర్‌గా వాడతారు. నీటిని శుభ్రం చేసే పరిశ్రమల్లోనూ వాడతారు. * అంతరిక్ష పరిశోధనలకు వాడే క్రయోజెనిక్ ఇంజన్లలో ఇంక్యులేషన్ (పైపొర)గా వాడతారు. గ్లాస్ ఫైబర్ కంపోజిట్ కంటే వెంట్రుకలతో తయారు చేసిన ఇంక్యులేషన్ చాలా చవకగాను, మన్నికగా ఉండటం వల్ల క్రయోజనిక్ ఇంజన్ల విడిభాగాల్లో వాడుతుంటారు. * అమెరికా, ఫిలిఫైన్స్ వంటి దేశాల్లో నూనె కర్మాగారాల్లో వెంట్రుకలతో తయారు చేసిన పరికరాలనే వాడతారు. మన్నికతోపాటు నూనె పీల్చే గుణం లేకపోవటం, ఫినాల్, పాదరసం, రాగి, కాడ్మియం, వెండి వంటి రసాయన పదార్థాలను ఒడిసి పట్టుకునే గుణం కూడా ఉండటమే ఇందుకు కారణం. కీలకమైనా ఫార్మా పరిశ్రమల్లోనూ... * వెంట్రుకల్లో 20 రకాల పోషక విలువల గల అమినో ఆమ్లాలు ఉన్నాయి. సిస్టైన్, లిజైన్, ఇసోలిసిన్, వాలిన్ మొదలగు పోషకాలున్నాయి. హైడ్రాలసిస్ పద్దతి ద్వారా వెలికి తీయవచ్చు. * ఈ సిస్టైన్ పోషకాన్ని కాస్మొటిక్స్, ఫార్మారంగాల్లో (మందుల తయారీ) ప్రధానంగా గాయాలు మాన్పడానికి యాంటీసెప్టిక్‌గా వాడతారు. * చత్తీస్‌ఘడ్‌లో గాయాలకు వెంట్రుకలతో కాల్చిన బూడిదను ఔషదంగా వాడతారు. తద్వారా శాశ్వతంగా గాయం మానటం, రక్తస్రావాన్ని నిలిపివేయటం జరుగుతుంది. * సర్జరీలో కుట్లు వేయడానికి మానవ శరీరానికి బాగా సూట్ అవుతుంది. ఎలాంటి ప్రతిచర్యలు ఉండవు, మన్నికతోపాటు ముడి వేయడానికి అనుకూలత ఉన్న కారణంగా వైద్యరంగంలో విరివిగా వాడతారు. * పశువుల రక్తస్రావాన్ని నిరోధించటంలోనూ, మూత్ర విసర్జన సమస్యల పరిష్కారంలోనూ వాడతారు. * శతాబ్దాల కిందట యూరప్ దేశాల్లో సూక్ష్మసర్జరీల్లో కూడా, చాలా సున్నితమైన వాటిల్లో కూడా వెంట్రుకల వాడకం ఉంది. * కణ ఉత్పత్తి, ప్రొటీన్, కెరాటిన్ ఉత్పత్తి మొదలగు జీవ ఉత్పత్తులు తయారు చేయడానికి కణ పునరుజ్జీవనా నికి, వెంట్రుకలతో తయారు చేసిన ప్రొటీన్నే ఉపయోగిస్తారు. * ఆసియా ఖండం వారి వెంట్రుకలు నల్లగా ఉండటం వల్ల సిస్టైన్ ఆమ్లం సమృద్ధిగా లభిస్తుంది. * హైడ్రాలసిస్ అనే ప్రక్రియ ద్వారా కెరాటిన్ అనే ప్రొటీన్‌ను వెంట్రుకల నుంచి తయారు చేయవచ్చు. వివిధ దేశాల్లో ... * మారిషస్‌లో ఎలుకల నివారణకు, అమెరికాలో జింకల కట్టడికి, ఇండియాలో ఎలుగుబంట్ల నివారణకు వెంట్రుకలతో చేసిన వస్తువులు వాడుతుంటారు. * విగ్గులు, జుత్తు అతికించే ఫ్యాషన్ పరిశ్రమల్లోనూ ... * వెంట్రుకలతో విగ్గుల తయారీ పరిశ్రమ, జుత్తు అతికించే పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. * 1970 కాలంలో సింథటిక్ ఫైబర్‌తో తయారు చేసిన విగ్గులను ప్రత్యామ్నాయంగా వాడారు. కానీ, నాణ్యత, మన్నిక, సహజత్వం దృష్ట్యా తర్వాత కాలంలో వెంట్రుకలే విగ్గులుగా వాడతారు. * చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, ఇటలీ వంటి దేశాలు విగ్గులు ఎగుమతి చేస్తాయి అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, కొరియా దేశాల్లో విగ్గులు అధికంగా కొనుగోలు చేస్తారు. * మనదేశంలోని ఢిల్లీ నగరంలో జ్యాలాపురి పరిశ్రమ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. దేశంలో ఇదే అతిపెద్ద వెంట్రుకల పరిశ్రమ. పర్యావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతంలోకి తరలించారు. * పొడవు వెంట్రుకలతో కాస్మొటిక్స్ (విగ్గులు, జుత్తు అతికించే వస్తువులు), దారాలు అల్లుతారు. * 2010 సంవత్సరంలో భారత దేశం ఒక మిలియన్ కిలోల తలనీలాలు ఎగుమతి చేసి రూ.238 మిలియన్ డాలర్లు సంపాదించింది. * వెంట్రుకల్లో ‘రెమి’ అనేరకం నాణ్యైమైంది. దాని రంగు, మన్నిక, తత్వం వంటి గుణాల కారణంగా రెమీ వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువ. పరిశోధకులు, వివిధ హెయిర్ డై పరిశ్రమలలో కాస్మొటిక్ బ్రష్‌లు తయారు చేయడానికి ఇదే రకం వెంట్రుకలే వాడుతుంటారు. నిర్దిష్ట విధానాల అమలుతోనే ఆదాయం * తలనీలాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉందని గుర్తించాము. అందుకు తగ్గట్టుగా టెండర్ విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ టెండర్ విధానాన్ని మార్పు చేశాం. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా వెంట్రుకల అమ్మకానికి ఈ-వేలం విధానాన్ని అమలు చేశాం. ఈ- వేలంలో అమ్ముడైన వెంట్రుకల్ని అప్పగించేంతవరకు ప్రత్యేక జాగ్రత్తలు అమలు చేశాం. గతంలో ఏటా రూ.40 కోట్లు వచ్చే ఆదాయం పారదర్శకత అమలు చేయటం వల్ల రూ.240 కోట్లు దాటింది. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. - కేఎస్ శ్రీనివాసరాజు, జేఈవో, తిరుమల భక్తకోటికి బోలెడంత భద్రత * ఒళ్లు తెలియని భక్తిపారవశ్యంతో దూరాభారమూ, వ్యయప్రయాసలూ అలుపూసొలుపూ వేళాపాళా ఎరుగకుండా నిత్యం పరవళ్లు తొక్కుతుండే భక్తజనానికి టీటీడీ విజిలెన్స్, పోలీసు బలగాలు భద్రతను కల్పించాయి. భక్తులు ఎలాంటి చీకూ చింతాలేకుండా తీర్థయాత్రను పరిపూర్ణం చేసుకునే సౌలభ్యం కల్పించాయి. * టీటీడీ ముఖ్య భద్రత, నిఘా అధికారి నేతృత్వంలో ఆలయానికి ఆర్మ్డ్ ఫోర్సు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు కాపలాగా పనిచేస్తాయి. మహాద్వారం నుండి ఆనంద నిలయ ప్రాకారం వరకు విజిలెన్స్ తప్ప మిగిలిన సిబ్బంది అధునాతన ఆయుధాలతో 24 గంటలూ షిఫ్టుల పద్ధతిలో పహారా కాస్తారు. ఇక ఆలయానికి నాలుగు దిశల్లోనూ గస్తీ (ఔట్‌పోస్టు)ల్లో ఉంటారు. పోలీసు ఔట్‌పోస్టులను కూడా ఆలయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేకంగా తయారు చేసారు. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద కూడా భద్రత సిబ్బంది విధుల్లో ఉంటారు. * స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను భద్రతా సిబ్బంది వైకుంఠం నుంచి ఆలయం వరకు పలు దశల్లో తనిఖీ చేస్తారు. భక్తులు వెంట తీసుకెళ్లే చిన్న చేతిసంచులను సైతం వదలకుండా పరిశీలించేందుకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. * వైకుంఠం నుంచి ఆలయం వరకు అడుగడుగునా అధునాతన సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా నిఘా సిబ్బంది ఆలయంలోకి వెళ్లేవారి కదలికల్ని నిశితంగా పరికిస్తారు. ఆలయంలోకి వెళ్లే సరుకులను కూడా తనిఖీ చేసిన తర్వాతే ఆలయంలోకి తరలిస్తారు. * ఆలయంలో విధుల్లో ఉండే భద్రతా సిబ్బంది ఆలయ సంప్రదాయాలను అనుసరించి జంతుచర్మాలతో కాకుండా నూలుదారంతో తయారు చేసిన బెల్ట్‌లు ధరిస్తారు. ఆలయ పరిసరాల్లో పాదరక్షలు ధరించరు. అశుభ కార్యాలు జరిగిన సందర్భాల్లో ఆలయంలో విధినిర్వహణకు వెళ్లరు. * సాధారణ పోలీసు విభాగాలు, నేర పరిశోధన విభాగాలు, నిఘా, భద్రతా విభాగాలు కూడా భక్తులకు, ఆలయానికి అదనంగా భద్రత కల్పిస్తాయి. * ఇక దేశంలో ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సుమారు 40 మంది మెరికల్లాంటి యువ కమాండోల అక్టోపస్ దళం ఎల్లప్పుడూ ఆలయాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. వీరంతా సాధారణ దుస్తుల్లో భక్తుల మధ్య సంచరిస్తుంటారు. * తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలను, ప్రయాణీకులను, లగేజీని తనిఖీ చేసేందుకు తిరుపతిలోని అలిపిరి, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రాల్లోనూ, అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో వచ్చే దారుల్లోనూ తనిఖీ వ్యవస్థ ఉంది. కాలిబాటల్లో 24 గంటలూ పనిచేసే గూర్ఖా వ్యవస్థ కూడా ఉంది. * ఇక బ్రహ్మోత్సవాల సమయంలో సాధారణ బలగాలతోపాటు జాతీయ విపత్తుల నివారణ సంస్థ తరపు సిబ్బంది కూడా తమవంతు సేవలందిస్తారు. -
నేటి జీవన వేదం
వేద వ్యాప్తికి తిరుమలలోని వేద విజ్ఞానపీఠం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. వేద ధర్మాలు కొనసాగించటం, పరమాత్మ తత్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లటం, తిరుమల దేవాలయంలో స్వామికి జరిగే నిత్య పూజా కైంకర్యాలు, ఉత్సవాదులు విశేషంగా నిర్వహించేందుకు, వేదభూమిలో భవిష్యత్ పండిత అవసరాలు తీర్చటమే లక్ష్యంగా వేద పాఠశాల కార్యాచరణతో ముందుకు సాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద విద్యార్థుల జీవనానికి సంపూర్ణ భరోసా ఇస్తోంది. అందులో భాగంగా వేదపాఠశాలలో విద్యార్థిగా రికార్డుల్లో నమోదు చేసుకున్న రోజునే 12 ఏళ్ల కోర్సు చేసే వేదవిద్యార్థికి రూ.3 లక్షలు టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చే స్తుంది. 2007 ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలోని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్సు పూర్తి అయ్యేనాటికి ఆ విద్యార్థికి సుమారు రూ.9 లక్షల దాకా అందుతోంది. ఇక ఎనిమిదేళ్ల కోర్సులో భాగంగా ఆగమ- స్మార్త- ప్రబంధ విద్యార్థులకు రూ. లక్ష డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి కాగానే వడ్డీతో కలిపి ఆ విద్యార్థులకు అందజేస్తారు. వేదం: ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం (తైత్తిరీయశాఖ), కృష్ణ యజుర్వేదం (మైత్రాయణి శాఖ), సామవేదం (కౌధమ శాఖ, జైమినిశాఖ), అధర్వణ వేదం. ఏడేళ్లు, పన్నెండేళ్ల వేద విద్య కోర్సుల్లో మొత్తం 300 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అడ్మిషన్ పొందాక టీటీడీ విద్యార్థిపేరుతో రూ.3 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది. ఏడేళ్ల కోర్సుతో రూ.6 లక్షలు, పన్నెండేళ్ల కోర్సు తర్వాత రూ.9 లక్షల నగదు అందిస్తోంది. దివ్యప్రబంధం: ఈ విభాగంలో మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఎనిమిదేళ్ల కోర్సులో చేరే విద్యార్థిపేరుతో రూ.లక్ష డిపాజిట్ చేసి, పూర్తయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు. ఆగమాలు: వైఖానస, పాంచరాత్ర, చాత్తాద శ్రీవైష్ణవ , శైవ, తంత్రసారాగమా ల్లో మొత్తం 300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కోర్సుల్లో చేరే విద్యార్థి పేరుతో రూ.లక్ష డిపాజిట్ చేసి కోర్సు పూర్తి అయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు. స్మార్తం: ఋగ్వేద, శుక్ల యజుర్వేద, కృష్ణయజుర్వేద, వైఖానస స్మార్త కోర్సుల్లో 300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కోర్సులో చేరే విద్యార్థి పేరుతో లక్ష డిపాజిట్ చేసి కోర్సు పూర్తయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు. వేద విద్యార్థులకు ఇతర సౌకర్యాలు ఏడాదిలో నాలుగు జతల వస్త్రాలు, పుస్తకాలు, చాపలు, శాలువ, భోజనం పళ్లెం, గ్లాసు ఇస్తారు. ప్రతి నె లా సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరినూనె, విద్యా, వైజ్ఞానిక యాత్రలు, దేవాలయాల సందర్శనకు తీసుకెళతారు. ధనుర్మాసం, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో స్వామి దర్శనం, విద్యార్థి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తీసుకెళతారు. పాఠశాలల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బాట్మెంటన్ క్రీడాంశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తిరుమల ఆలయంలో నిర్వహించే నిత్య ఉత్సవాల తరహాలో విద్యార్థుల చేతుల మీదుగా మాదిరి ఉత్సవాలు నిర్వహిస్తారు. టీటీడీ వేద పాఠశాలల్లో వివిధ విభాగాల కోర్సులు పూర్తి చేసిన 90 శాతం విద్యార్థులు టీటీడీ పరిధిలోనే స్థిరపడి ఉపాధి పొందుతున్నారు. మిగిలినవారు దేశ విదేశాల్లోని ప్రముఖ ఆలయాల్లో అర్చకులు, పండితులుగా జీవనం సాగిస్తున్నారు. 1884 నుంచి 2015 వరకు అంటే 131 ఏళ్లలో టీటీడీ వేద పాఠశాలల ద్వారా కోర్సులు పూర్తిచేసి సుమారు 20 వేల మంది వేద పండితులు, అర్చకులు, పౌరోహితులుగా ఉపాధి పొందుతున్నట్టు టీటీడీ రికార్డుల ద్వారా తెలుస్తోంది. మరికొందరు విదేశాల్లో అర్చకవృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. నేటి పెద్ద జీయరైన గోవింద రామానుజ జీయర్ స్వామి నాటి వేద పాఠశాల విద్యార్థే. శ్రీవారి కైంక ర్య బాధ్యతలు పర్యవేక్షించే ప్రస్తుత ఆలయ పెద్ద జీయరు, మూడేళ్ల క్రితం పరమపదించిన శ్రీరంగ రామానుజ జీయరు స్వామివారు కూడా వేదపాఠశాల విద్యార్థులే! ఇదే తరహాలో ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరెందరో విద్యార్థులు అత్యున్నత స్థానాల్లో ఉండటం విశేషం. -
బ్రహ్మోత్సవాలే కాదు...జగత్కల్యాణోత్సవాలు
వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవ ణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను జరిపించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. సౌర, చాంద్రమానాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. వైఖానన ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణ నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు లేకుండా అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఈసారి అధిక భాద్రపద మాసం రావటం వల్ల బ్రహ్మోత్సవ సుముహూర్తం ఓ నెల ముందుకు వచ్చింది. అంకురార్పణ వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీతప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)-నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు. హంసవాహ నం రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమెన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారని ఐతిహ్యం. సింహవాహనం మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వారాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వ భూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కార మిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహ పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. గరుడవాహనం ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు. హనుమంత వాహ నం ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతు భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. గజ వాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభ వాహనం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసి పోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరోరూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. వెండిరథం వెలుగులు కనుమరుగు వెంకన్న సన్నిధిలో వెండిరథం వెలుగులు కనుమరుగయ్యాయి. మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో తిరుమలేశునికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తొలిసారి జరిగే వార్షిక బ్రహ్మోత్సవం ఎనిమిదోనాడు కొయ్యతేరుపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వెండిరథం ఊరేగించటం సంప్రదాయం. అలాగే, ఏటా వార్షిక వసంతోత్సవాలలో రెండోరోజు వెండిరథంపై ఉత్సవమూర్తులు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంప్రదాయం 1992 వరకు సాగింది. తర్వాత శ్రీవారికి కొత్తగా స్వర్ణరథం సిద్ధం చేశారు. అప్పటి నుంచి వెండిరథానికి బదులు స్వర్ణరథాన్ని ఊరేగిస్తున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వెండిరథాన్ని తప్పనిసరిగా ఊరేగించాలని అర్చకులు, పండితులు చెబుతున్నారు. స్వర్ణరథం అలంకార ప్రాయంగా మాత్రమే చూడాలని పండితులు చెబుతున్నారు. కొత్త వెండిరథం అవసరమని పండితుల సూచనతో ఆ దిశగా టీటీడీ అడుగులు వేసినా ఇంతవరకు సఫలం కాలేదు. స్వామి సేవలో స్వర్ణరథం 1992లో తయారు చేసిన స్వర్ణరథం సుమారు 21 ఏళ్లపాటు సేవలందించింది. క్రమేణా అది మసకబారడంతో మాజీ టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో మరొక స్వర్ణరథాన్ని తయారు చేయాలన్న సంకల్పం 2013 నాటికి కార్యరూపం దాల్చింది. తిరుమలలోని మ్యూజియంలో ప్రత్యేకంగా వర్క్‌షాపు ఏర్పాటు చేసి కొత్త స్వర్ణరథాన్ని సిద్ధం చేశారు. ఇది భారతదేశంలోనే అతిపెద్దది. 32 అడుగు ల ఎత్తు. 30 టన్నుల బరువు గల ఈ రథానికి మొత్తం 74 కిలోల మేలిమి బంగారం వాడారు. 18 అంగుళాల మందంతో కూడిన 2900 కిలోల రాగి పై తొమ్మిదిసార్లు స్వర్ణతాపడం చేశారు. బీహెచ్ఈఎల్ సంస్థ రూపొందించిన హైడ్రాలిక్ చక్రాలతో సరికొత్త హంగులతో స్వర్ణరథాన్ని తీర్చిదిద్దారు. వైఖానస ఆగమోక్తంగా కొత్త స్వర్ణరథానికి సంప్రోక్షణ, వైదిక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పను రథపీఠంపై వేంచేపు చేశారు. తొలిసారిగా 2013, అక్టోబరు 10వ తేది గరుడ వాహన సేవ సందర్భంగా రథరంగ డోలోత్సవం నిర్వహించారు. స్వర్ణకాంతుల స్వర్ణరథంలో దేవదేవుడైన స్వామివారు, అమ్మవార్లతో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అప్పటి నుంచి ఉత్సవాల్లో కొత్త స్వర్ణరథం భాగమైంది. -
వెంకన్న క్షేత్రం... విహంగ వీక్షణం
తిరుమల ఆలయానికి రెండువేల సంవత్సరాలకు పైగా చారిత్రకనేపథ్యం ఉంది. కాలిబాట, డోలీలు, ఎడ్లబండ్లపై యాత్రికులు ఏడుకొండెలెక్కి తిరుమలకొండకు చేరేవారు. అప్పట్లో వేళ్లమీదలెక్కపెట్టేజనమే. వేయికాళ్ల మండపంలో నిద్రచేసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లేవారు. 1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. అప్పటి ఆలయ బాధ్యతలు నిర్వహించే అన్నారావు, భారత ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ సర్ ఆర్థర్హూప్ నేతృత్వంలో 1945 ఏప్రిల్10న తొలిఘాట్రోడ్డు ఏర్పాటైంది. తర్వాత 1973లో రెండో ఘాట్‌రోడ్డు రావటంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టీటీడీ తిరుమల ఆలయానికి చుట్టూ 10 చ.కి.మీ. విస్తీర్ణంలో సౌకర్యాలు పెంచుతూ వస్తోంది. ఫలితంగా భక్తుల సంఖ్య నేడు లక్ష దాటుతుండటం విశేషం. ఇటీవల శేషాచలంలో ఏర్పడిన అగ్నికీలల్ని ఆర్పేందుకు టీటీడీ, భారత ప్రభుత్వం హెలికాఫ్టర్లు వినియోగించారు. అప్పట్లో తీసిన తిరుమల విహంగ వీక్షణలో అరుదైన చిత్రమిది. 1. భూ వరాహస్వామి ఆలయం-తొలి దర్శనం అందుకునే వేల్పు 2. పుష్కరిణి- ప్రకృతిసిద్ధంగా ఆవిర్భావం 3. ఆనందనిలయం-8వ శతాబ్దానికి పూర్వం 4. వెండివాకిలి గోపురం-12వ శతాబ్దం 5. మహద్వార గోపురం-13వ శతాబ్దం 6. హథీరామ్ మహంతుమఠం-17వ శతాబ్దం 7. నాలుగు మాడ వీధులు-19వ శతాబ్దం 8. పాత అన్నప్రసాద భవనం-1980 9. మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్-1985 10. కొత్త కల్యాణకట్ట -1985 11. ఆస్థాన మండపం -1985 12. రాంభగీచా అతిథిగృహాలు-1985 13. వరాహస్వామి అతిథిగృహాలు-1993 14. సప్తగిరి సత్రాలు-1996 15. రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2003 16. కొత్త అన్నప్రసాద భవనం ప్రారంభం-2010 17. నందకం అతిథిగృహం-2010 18. పాపవినాశం ప్రవేశ తోరణం 19. నారాయణగిరి పర్వతశ్రేణులు 20. శ్రీనివాసమంగాపురం 21. చంద్రగిరి ఊరు 22. కొండమీద చంద్రగిరి కోట 23. పద్మావతి అతిథి గృహాల ప్రాంతం 24. ఆళ్వారు చెరువు 25. శ్రీవారి వసంత మండపం 26. నారాయణగిరి ఉద్యానవనం 27. పౌరోహిత సంఘం, కళ్యాణవేదిక -
వారపు సేవల్లో ఉత్సవాల వేల్పు
బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవాల వైభవం నయనానందకరం. ప్రతి ఏటా స్వామికి 450 ఉత్సవాలు నిర్వహిస్తారు. వేకువ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య సేవల్లో స్వామి భక్తకోటికి దర్శనమిస్తూ పరవశింపచేస్తాడు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకో ప్రత్యేక సేవలో స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన * శ్రీ మలయప్పకు ప్రతి సోమవారం ఉదయం జరిగే ప్రధానసేవ విశేషపూజ. ఆలయంలోని నిత్య కల్యాణోత్సవ మండపంలో దీనిని ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు. * ఉభయ దేవేరులతో స్వామి శ్రీపీఠం (తిరుచ్చి)పై ఆశీనులై ఛత్రచామర బాజాభజంత్రీలు, వేద పారాయణలతో ఆనంద నిలయాన్ని వీడి కల్యాణోత్సవ మండపానికి చేరుకుంటారు. * ఉత్సవమూర్తులకు అలంకారాలు, పట్టువస్త్రాలు సడలిస్తారు. స్నానవస్త్రాలు ధరింపచేసి స్నానపీఠంపై తూర్పు ముఖంగా వేంచేపు చేస్తారు. * దీక్షాధారులైన వైఖానస అర్చకులు వేదికపై నవకలశాలను, హోమగుండంలో అగ్నిని ప్రతిష్ఠిస్తారు. పుణ్యాఃవచనంతో స్థల శుద్ధి, పరిసర శుద్ధి చేస్తారు. కంకణ ప్రతిష్ఠ చే సి ఉత్సవమూర్తులకు అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలతో కంకణాలు సమర్పిస్తారు. * ఆర్జితం చెల్లించిన గృహస్తులతో సంకల్పం చేయిస్తారు. నవకలశ పూజ నివేదన, పూర్ణాహుతి సమర్పిస్తారు. ఆ హోమ తిలకాన్ని ఉత్సవమూర్తులకు ధరింప చేస్తారు. అనంతరం భక్తులకూ పంచిపెడతారు. * తర్వాత స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి, మలయప్పను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. * మంగళవాయిద్యాలు, వేదఘోష నడుమ శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత ఆవుపాలతో, ఆ తర్వాత శుద్ధజలంతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సమయంలో వేదపండితులు పురుష సూక్తం, శ్రీసూక్తం, భూ నీలా సూక్తాలు, పంచ సూక్తాలు పఠిస్తారు. * చివరగా నవకలశాలలోని జలంతో సహస్రధారాభిషేకం చేస్తారు. ఆ జలాన్ని అర్చకులు తాము ప్రోక్షణ చేసుకుని, భక్తులకూ ప్రోక్షణ చేస్తారు. * అనంతరం తెరల మాటున ఉత్సవమూర్తులను నూత్నవస్త్రంతో తుడిచి పట్టువస్త్రం, పూలమాలతో అలంకరిస్తారు. పెద్దవడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు నివేదిస్తారు. తెరలు తీసి కర్పూర నీరాజనం సమర్పిస్తారు. హారతి అయిన తర్వాత సేవలో పాల్గొన్న భక్తులకు ఉత్తరీయం లేదా రవిక గుడ్డ,పెద్దలడ్డూ, వడ అందజేస్తారు. చివరగా భక్తులందరికీ మూలవిరాట్టు దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు. టికెట్టు ధర రూ.600. అష్టదళ పాదపద్మారాధన- * తిరుమల తిరుపతి దేవస్థానం (1933- 1984) ఆవిర్భవించి యాభైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1984లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. అందుకు గుర్తుగా ఈ అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన 108 బంగారు కమలాలను హైదరాబాద్‌కు చెందిన ఓ మహ్మదీయ భక్తుడు స్వామికి కానుకగా సమర్పించారు. * సేవకు ముందుగా ఆర్జితసేవ గృహస్తులను ‘కులశేఖరపడి’ గడప నుండి బంగారువాకిలి వరకు కూర్చోబెడతారు. * అర్చకులు గర్భాలయ మూలమూర్తికి అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పిస్తారు. స్వామి పాద పద్మాల చెంత కూర్చుని అర్చనకు సిద్ధమవుతారు. ఆలయ పెద జీయంగార్ అందించిన బంగారు పద్మాలను స్వీకరించి అష్టోత్తర శతనామాలతో స్వామి పాద పద్మాలకు అర్చన చేస్తారు. * స్వామి పాదపద్మాలపై ఉన్న తులసిదళాలను స్వీకరించి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చతుర్వింశతి నామావళితో అర్చన పూర్తి చేసి గంధధూపం సమర్పిస్తారు. ఆవునేతి తో తడిపిన 27 వత్తులు గల వెండి దీపపుసెమ్మెతో స్వామికి నక్షత్ర హారతి, నైవేద్యాలు సమర్పిస్తారు. కర్పూర నీరాజనంతో స్వామి పాదపద్మాలు, వైకుంఠ హస్తం, చక్రం, స్వామి ముఖారవిందం, తిరునామాలు, శంఖం, కటిహస్తం, పాదపద్మాలు, నందక ఖడ్గం, వక్షస్థల మహాలక్ష్మికి సమర్పిస్తారు. * ఆర్జిత గృహస్తులకు ఉత్తరీయం లేదా రవిక గుడ్డ, రెండు పెద్ద లడ్డూలు, రెండు వడలు అందజేస్తారు. టికెట్టు రూ.1250. ప్రాచీనం... సహస్ర కలశాభిషేకం * తిరుమల ఆలయంలో నిర్వహించే సేవల్లో సహస్ర కలశాభిషేకం అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన సేవగా చెప్పవచ్చు. ప్రతి బుధవారం బంగారు వాకిలిలో ప్రధాన సేవగా నిర్వహిస్తారు. * ఆలయంలో మూలమూర్తి (ధ్రువమూర్తి), మనవాళప్పెరుమాళ్ (భోగశ్రీనివాసమూర్తి), కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి, మలయప్ప... ఐదు రకాల మూర్తులను పంచబేరాలుగా పిలుస్తారు. * సహస్ర కలశాభిషేకంలో భోగ శ్రీనివాసమూర్తితోపాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు పాల్గొంటారు. * క్రీ.శ.614 నాటిదిగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని వైఖానస ఆగమం ప్రకారం కౌతుకమూర్తి అనీ, పురుషబేరం అనీ పిలుస్తుంటారు. * గర్భాలయంలో మూలమూర్తికి ఈశాన్యదిశలో ఉండే భోగ శ్రీనివాస మూర్తికి నిత్యం ఆకాశగంగ తీర్థంతో అభిషేకిస్తారు. ఎప్పుడూ బంగారు వాకిలి దాటి బయటకు తీసుకురారు. సహస్ర కలశాభిషేకం కోసం ఒక్క బుధవారం మాత్రమే గంటామండపానికి తీసుకొస్తారు. * దక్షిణదిశలో స్నానపీఠంపై ఉత్తరాభిముఖంగా ఉభయదేవేరులతో మలయప్ప, ఉత్తరదిశలో స్నానపీఠంపై దక్షిణాభిముఖంగా విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు. వీరికి మధ్యలో తూర్పున అభిముఖంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని ఆసీనుల్ని చేస్తారు. ఆయనకు గర్భాలయ మూలవిరాట్టును అనుసంధానిస్తూ బంగారు తీగ లేదా పట్టుదారంతో కడతారు. దీనినే ‘సంబంధ కూర్చం’ అంటారు. * నేలపై ధాన్యం (వడ్లు)పోసి, 1008 వెండికలశాలను సుగంధద్రవ్యాలు కలిపిన జలంతో నింపి ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేనుడి పక్కన ‘నవకలశాలు’ ఏర్పాటు చేస్తారు. ఆగ్నేయదిశలో ‘యజ్ఞవేదిక’ ఏర్పాటు చేస్తారు. ఆర్జితసేవాగృహ స్థులను ఆసీనుల్ని చేస్తారు. * మంగళ ధ్వనుల నడుమ దీక్షాధారులైన వైఖానస అర్చకులు ఘంటానాదంతో హోమగుండంలో అగ్నిప్రతిష్టాపన చేస్తారు. కలశాన్ని ప్రతిష్టించి పుణ్యతీర్థ జలాలు ఆవాహనం చేసి ధూపదీప కర్పూర నీరాజనాలిచ్చి అక్షతారోపణం చేస్తారు. కలశంలోని పవిత్ర జలాన్ని అన్ని వైపులా చల్లుతూ పుణ్యాహవచనం పూర్తి చేస్తారు. * శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్ఘ్యపాద్యాచమనాది అనుష్టాన క్రియలు, తులసి సమర్పించి కంకణధారణ చేస్తారు. తర్వాత శ్రీదేవి, భూదేవి, మలయప్ప, విష్వక్సేనులవారికి కంకణధారణ చేస్తారు. * సంకల్పసహితంగా ముక్కోటి దేవతలను ఉద్దేశించి హోమం చేస్త్తారు. ధాన్యంపై ప్రతిష్టించిన సహస్ర కలశాలు, పీఠంపై ప్రతిష్టించిన నవకలశాలకు ఆవాహనాది క్రియలు చేసి ధూపదీప హారతులు సమర్పిస్తారు. * హోమగుండం వద్ద అప్పాలు, శుద్ధాన్నం నివేదన చేసి హోమాన్ని నిర్వహిస్తూ పూర్ణాహుతి చేస్తారు. హోమ తిలకాన్ని శ్రీభోగ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి, మలయప్ప, విష్వక్సేనులవారికి సమర్పిస్తారు. భక్తులకూ అందజేస్తారు. * మంగళవాయిద్యాలు, వేద పండితుల పంచసూక్తాల నడుమ సహస్ర కలశాలలోని శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనద్రవ్యాలతో భోగ శ్రీనివాసమూర్తికి, విష్వక్సేనులవారికి అభిషేకిస్తారు. చివరగా అన్ని మూర్తులకు తులసిమాలలు అలంకరించి నవ కలశాలలోని జలంతో బంగారుపళ్లెంతో సహస్రధారాభిషేకం చేస్తారు. * తర్వాత ఆ పవిత్రజలాన్ని ముందుగా అర్చకులు చల్లుకుని, జీయంగార్, ఏకాంగి, భక్తుల మీద చల్లుతారు. తర్వాత తెరలమాటున పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి, క్షీరాన్నం, అప్పాలతో నివేదన సమర్పిస్తారు. అనంతరం తెరలు తొలగించి అక్షతారోపణతో కర్పూర నీరాజనం సమర్పించి మూర్తులను ఆనంద నిలయంలోకి వేంచేపు చేస్తారు. చివరగా భక్తులకు మూలవిరాట్టు దర్శన భాగ్యాన్ని కల్పించి, ఉత్తరీయం లేదా రవికగుడ్డ, పెద్దలడ్డూ, వడ, రెండు అప్పాలు, రెండు దోశలు, అన్నప్రసాదాలు అందజేస్తారు. టికెట్టు ధర రూ.850. నేత్ర దర్శనం * తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం ఓ విశిష్టత ఉంది. మూలమూర్తి దర్శనం, నివేదనలు, అలంకారాలు ఈ రోజు విభిన్నంగా ఉంటాయి. ప్రతి గురువారం వేకువ జామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా నిరాడంబర రూపంతో దర్శనమిస్తారు. * ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు తిరునామం (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. భక్తులకు స్వామి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం ఆ రోజు మాత్రమే కలుగుతుంది. గురువారం నాటి ఈ దర్శనాన్నే నేత్రదర్శనం అంటారు. * ఆ రోజు ఆభరణాల బదులు పట్టుధోవతిని, పట్టు ఉత్తరీయాన్ని ధరింపజేస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి పట్టువస్త్రాన్ని చుడతారు. బంగారు శంఖుచక్రాలు, కర్ణభూషణాలు, సాలిగ్రామహారాలను అలంకరిస్తారు. మెడలో హారం, కాళ్లకు కడి యాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. అన్నరాశి నైవేద్యమే తిరుప్పావడసేవ * శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రతి గురువారం రెండో అర్చన తర్వాత నివేదనోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనినే ‘తిరుప్పావడసేవ’ అనీ, అన్నకూటోత్సవం అనీ అంటారు. స్వామికి బంగారువాకిలి వద్ద నుండి నేరుగా సమర్పించే అన్ననివేదన ఇది. * బంగారు వాకిలి ముందు గరుడాళ్వారుకు ఎదురుగా నాలుగు స్తంభాల మధ్య వెదురు చాపలపై 6 బస్తాల బియ్యం (450 కిలోలు) తో తయారు చేసిన పులిహోరను ‘రాశి’గా పోస్తారు. స్తంభాలకు చుట్టూ తెరలు కట్టి ఈ అన్నరాశిని పెద్ద శిఖరం లాగా దానికి చుట్టూ ఎనిమిది దిక్కులా చిన్న శిఖరాలు గా తీర్చిదిద్దుతారు. ఈ రాశి ముందు ధూపదీప నైవేద్యాలు, నీరాజనం సమర్పిస్తారు. * జిలేబి, తేనెతొళ (మురుకు), దోసె, అప్పలం, పాయసం, లడ్లు, వడలు వంటి ప్రసాదాలను మూలవిరాట్టు దృష్టి పడేలా కులశేఖరపడి వద్ద ఉంచి నైవేద్యం, మంగళహారతి సమర్పిస్తారు. * వేద పండితులు శ్రావ్యంగా పఠించే శ్రీనివాస గద్యంతో సప్తగిరులు పులకిస్తాయి. శ్రీనివాసగద్యం పూర్తికాగానే బంగారువాకిలి నుండే మూలమూర్తికి, తర్వాత అన్నరాశికి హారతి సమర్పిస్తారు. . తర్వాత పులిహోర రాశిని భక్తులకు వితరణ చేస్తారు. గృహస్థులను మూలవిరాట్టు దర్శనానికి అనుమతిస్తారు. * ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికగుడ్డ, ప్రసాదాలు అందజేస్తారు. టికెట్ ధర రూ.850. పూలంగి సేవలో పెరుమాళ్లు... * ప్రతి గురువారం సాయంత్రం మూలవిరాట్టుకు నిర్వహించే తోమాల సేవనే పూలంగి సేవ అంటారు. * సాయం సమయంలో వైఖానస అర్చకులు శుచిస్నాతులై సన్నిధిగొల్ల వెంటరాగా ఆలయానికి చేరుకుంటారు. * జీయంగార్లు, ఏకాంగి ‘యమునోత్తరై’ అను ‘పూల అర’లో సిద్ధంగా ఉంచిన పూలు, పూలమాలల్ని పెద్ద వెదురుబుట్టలను బాజా భజంత్రీల తో, ఛత్రచామర మర్యాదలతో సన్నిధికి ఊరేగింపుగా తీసుకొస్తారు. * అర్చకులు స్వామికి అలంకరించిన ఆభరణాలు తీసివేసి, బంగారు తీగెలతో కూడిన ముఖమల్ వస్త్రాన్ని ధరింప చేస్తారు. అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పించి పూలంగి, తోమాల సేవలు నిర్వహిస్తారు. జీయంగార్లు, వైష్ణవాచార్యులు, దివ్యప్రబంధాన్ని గానం చేస్తారు. * పూలమాలల్ని శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరిస్తారు. ఈ అలంకరణలో స్వామివారు పూల అంగీని ధరించినట్టు కనువిందుగా దర్శనమిస్తారు. స్వామివారు గురువారం రౌద్రంగా ఉంటారని, ఆ రౌద్రాన్ని తగ్గించి శాంతింప చేయడానికే పూలంగిసేవ నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు. దివ్యమంగళ స్వరూప దర్శన భాగ్యం! * ప్రతి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారికి జరిగే విశేషసేవ ‘అభిషేకం’. * అర్చకులు మూలవిరాట్టుకు నమస్కారం చేసి, అభిషేకానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించి సంకల్పం, అష్టోత్తర శతనామార్చన చేస్తారు. స్వామికి నొసటన ఉండే పచ్చకర్పూరపు నామాన్ని తగ్గించి సూక్ష్మంగా ఉంచుతారు. ఆభరణాలు, పట్టువస్త్రాలను తీసివేసి, స్నానవస్త్రంగా తెల్లని కౌపీనాన్ని ధరింప చేసి, దంతధావన అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పించి శిరసాదిగా పునుగు తైలాన్ని అలది వెండి గంగాళాల్లో బంగారు బావి జలాన్ని సిద్ధం చేస్తారు. * జీయంగార్లు, అర్చకులు గర్భాలయంలోకి చేరుకోగా, అధికారులు, భక్తులు కులశేఖర పడి నుంచి బంగారు వాకిలి వరకు కూర్చుంటారు. * జీయంగార్, అర్చకులు స్వామికి, వక్షస్థల మహాలక్ష్మికి నమస్కరించి అభిషేక సమర్పణకు అనువుగా వరద హస్తం దగ్గర నిలుస్తారు. * తొలుత జీయంగార్లు బంగారు శంఖంతో ఆకాశగంగ తీర్థాన్ని అర్చకులకు అందిస్తారు. వారు పురుష సూక్తాన్ని పఠిస్తూ స్వామి శిరస్సుపై అభిషేకిస్తారు. వేద పండితులు పంచసూక్తులు, పంచోపనిషత్తులు పారాయణం చేస్తారు. * తర్వాత ఆవుపాలతో శిరసాది పాదాల వరకు అభిషేకిస్తారు. తర్వాత బంగారు బావి శుద్ధజలంతో అభిషేకించి, పసుపు ముద్దలను వక్షస్థల మహాలక్ష్మికి సమర్పిస్తారు. * అనంతరం స్వామికి కర్పూరం, చందనం, కుంకుమపువ్వు శిరసాదిగా అద్దుతారు. ఈ నలుగు విధానాన్ని ‘ఉద్వర్తనం’ అంటారు. ఆ తర్వాత ఇచ్చే హారతిలో ముఖారవిందం, శంఖుచక్రాలు, వరద కటి హస్తాలు, పాదాలు, నందక ఖడ్గం, వక్షస్థల మహాలక్ష్మి.. ఇలా అంగాంగాలతో స్వామి దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించి ఆనంద పరవశులవుతారు. జలాభిషేకంతో జాలువారుతున్న తీర్థాన్ని ‘శ్రీపాద తీర్థం’ అంటారు. అనంతరం స్వామి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేస్తారు. తరువాత బంగారు బావి జలంతోనూ, ఆకాశగంగ తీర్థంతోనూ స్వామిని అభిషేకించి ఆ తీర్థాన్ని పాత్రలో సేకరిస్తారు. * ఈలోగా పండితులు వేద పారాయణం పూర్తి చేస్తారు. తెరవేసి వస్త్రంతో స్వామికి తడిలేకుండా తుడుస్తూ ఉండగా జీయంగార్ ద్రవిడ వేదంలోని ‘నీరాట్టం’ పది పాశురాలు గానం చేస్తారు. * ఆ సమయంలో అర్చకులు తెరలమాటున స్వామికి సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని అంతరీయంగాను, పండ్రెండు మూరల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగానూ ధరింప చేస్తారు. తర్వాత ఆభరణాలు అలంకరించి పట్టువస్త్రంతో శిరస్సుకు కిరీటంగా చుడతారు. నుదుట పచ్చకర్పూరంతో తిరునామం తీర్చిదిద్దుతారు. * తర్వాత వెన్న, పంచదారతో నివేదన చేసి తాంబూలం సమర్పిస్తారు. ఆ తర్వాత ‘పచ్చ కర్పూరపు హారతి’ సమర్పిస్తూ తెరను తొలగించి, భక్తులకు అభిషేక తీర్థాన్ని, ‘శ్రీపాదరేణువు’అనే మహాప్రసాదాన్ని వితరణ చేస్తారు. టికెట్టు ధర రూ.750. వస్త్రాలు సమర్పించే వస్త్రాలంకార సేవ * అభిషేకసేవలో మూలవిరాట్టుకు ధరింప చేసే వస్త్రాలను భక్తులే సమర్పించేందుకు ప్రత్యేకంగా వస్త్రాలంకార సేవ టికెట్టు టీటీడీ ప్రారంభించింది. టికెట్టు ధర రూ.12.250. నిజపాదాల దర్శనం.. భక్తకోటి జన్మధన్యం * ప్రతి శుక్రవారం శ్రీ స్వామి నిజపాదాల దర్శనభాగ్యం భక్తులకు కలుగుతుంది. అభిషేకసేవలో పాల్గొనే భక్తులతోపాటు నిజపాద సేవాటికెట్లు కలిగిన వారికీ ఈ మహద్భాగ్యం దక్కుతుంది. దేవతల కోసం ‘బ్రహ్మస్థలం’ * తిరుమల ఆలయంలో పంచ భూతాలు, దేవగణాలు, అష్టదిక్పాలకులు నిత్యం స్వామిని సేవించేందుకు వీలుగా గర్భాలయం నుంచి ముఖమండపం తప్పిస్తే మిగిలిన మూడు ప్రాకారాల్లోనూ ఎక్కువభాగం ‘బ్రహ్మస్థలం’గానే ఆలయ నిర్మాణం సాగిందని పండితులు, అర్చకులు చెబుతున్నారు. * ఆలయాల గోపురాలు, విమాన ప్రాకారాలు ప్రకృతిసిద్ధంగావచ్చే భూకంపాల వంటి వైపరీత్యాలను తట్టుకునే శక్తికోసమే అలాంటి నిర్మాణాలు చేపడుతుంటారని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. * సాధారణంగా వైష్ణవం, శైవం వంటి శాఖలు తమ ఆలయాలు నిర్మించే సందర్భంలో ఆయా ధర్మాలను అనుసరించి వాస్తును కూడా పరిగణనలోకి తీసుకునే నిర్మాణం పనులు చేస్తారు. * పురాతన గృహాల్లోని మధ్య భాగంలోఎక్కువ ఖాళీస్థలం వదిలేవారు. దాన్ని బ్రహ్మ స్థలంగా పరిగణిస్తారు. అక్కడ దేవ తలు కొలువై ఉంటారట. అందుకే ఆ బ్రహ్మస్థలంలో తులసి మొక్క నాటి పూజలు చేస్తారు. అక్కడికే నేరుగా పంచభూతాలు ఆవాహన అవుతుంటాయి. భగవంతుడు ముఖద్వారం నుంచి కాకుండా నేరుగా ఆకాశమార్గం నుంచి నేరుగా బ్రహ్మస్థలానికి చేరుకుని పూజలందుకుంటారని పురాణాలు విశదీకరిస్తున్నాయి. ధ్వజారోహణంలో దర్భతాడు... హిందూ ధర్మంలో దర్భను పవిత్రంగా భావిస్తారు. అంతటి పవిత్రమైన దర్భతోనే ధ్వజారోహణంలో ధర్మతాడు (కొడితాడు) సిద్ధం చేస్తారు. 1.5 అంగుళాల మందం, 300 అడుగుల పొడవుతో దర్భలను తాడుగా పేనుతారు. దర్భలతోనే రెండు మీటర్ల వెడల్పు, ఆరుమీటర్ల పొడవుతో 12 చదరపు మీటర్ల చాపను సిద్ధంచేస్తారు. చాపను ధ్వజస్తంభం (కొడిస్తంభం)కు అమర్చి, దారంతో చుడతారు. దర్భను ఇంతకుముందు వరకు టీటీడీ అటవీశాఖ వెంకటగిరి ప్రాంతంలో సేకరించేవారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా అవసరమైన దర్భ లభించేది కాదు. పవిత్రకార్యానికి వాడే దర్భను పెంచటంలోనూ శుభ్రత పాటించే పరిస్థితులు సన్నగిల్లాయి. దీంతో బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణం కోసం పవిత్రమైన దర్భను పెంచే విషయంలో టీటీడీ అటవీశాఖా డీఎఫ్‌వో ఎన్వీ శివరామ్‌ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈమేరకు ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉద్యానవనంలో మంచినీరు, సేంద్రియ ఎరువులు వాడి దర్భను పెంచారు. దానిని పవిత్ర కార్యాలకు వినియోగిస్తున్నారు. పుష్కరిణి నిత్య హారతి ఆలయానికి ఉత్తర ఈశాన్యదిశలో పుష్కరిణి ఉంది. 1.5 ఎకరాల వైశాల్యమున్న ఈ కోనేరు మధ్యలో క్రీ.శ 1468లో సాళ్వ నరసింగరాయలు నివాళీ మండపాన్ని నిర్మించారు. క్రీ.శ.15వ శతాబ్దంలో పుష్కరిణికి తాళ్ళపాక వారు మెట్లను నిర్మించి నివాళీ మండపాన్ని బాగు చేయించారు. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో నిర్వహిస్తారు. ఫాల్గుణ మాసంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. స్వామి పుష్కరిణికి హారతి ఇచ్చే సంప్రదాయానికి 2008లో అప్పటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈఓ కేవీ రమణాచారి శ్రీకారం చుట్టారు. నాటినుంచి ప్రతిరోజూ సాయంసంధ్యాసమయంలో మలయప్ప సాక్షిగా పుష్కరిణి నిత్య హారతి అందుకుంటోంది. -
చీమల పుట్ట నుంచి సిరుల గిరుల వరకు
శేషాచల గిరులపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి శతాబ్దాల తరబడి చీమలపుట్టలో దాగి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రకృతిలో సేద తీరాడు. నాటి ‘తిరువేంగడమే’ నేటి ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి చైతన్యానికి దర్పణమైనతిరుమల పుణ్య క్షేత్రం. పూర్వం స్వామి ఆలయాన్ని తొలిసారిగా తొండమాన్ చక్రవర్తి కట్టించాడని, ఆ తర్వాత పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు దశలవారీగా అభివృద్ధి చేశారని చరిత్ర. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు సజీవ సాక్ష్యమైన తిరుమల కోవెల భక్తుల కోర్కెలు తీర్చే కల్పవక్షంగా భాసిల్లుతోంది. పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, వేంకటేశ్వరస్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అని పిలిచేవారు. ఈ తిరువేంగడం అనే కొండ తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది. క్రీ.పూ.1వ శతాబ్దంలో తిరుమలలో చీమలపుట్ట చేత కప్పబడిన స్వామివారి విగ్రహాన్ని తొండమాన్ చక్రవర్తి తొలిసారిగా దర్శించి ఆ శిలామూర్తి చుట్టూ ఓ చిన్నమండపాన్ని కట్టించాడట. ఆ మండపంలోనే స్వామి చాలా కాలంపాటు భక్తుల చేత పూజలందుకొంటూ ఉండేవారని చరిత్ర. క్రీ.శ.8వ శతాబ్దకాలంలో ఆళ్వారులు శ్రీనివాసుని వైభవ కీర్తిని తమ కీర్తనల ద్వారా నలుదిశలా చాటారు. కులశేఖరాళ్వారు ఎన్ని జన్మలెత్తినా సరే స్వామివారి గడప/లేక పీఠంగానైనా ఉండాలంటూ ఓ పాశురం ద్వారా తన భక్తిని చాటుకున్నాడట. శిలామూర్తి చుట్టూ గర్భగృహం తిరుమళి కేశికై ఆళ్వారు, కులశేఖరాళ్వారుల మధ్యకాలంలో నిర్మించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. అప్పటి వాతావరణ పరిస్థితుల కారణంగా ‘తిరువేంగడం’ కొండ మీదకు వెళ్లడం కష్టంగా ఉండటంతో వైష్ణవ భక్తులు వెండితో శ్రీవారి ప్రతిరూపాన్ని ‘తిరుచోగినూర్’ (నేటి తిరుచానూరు)లో ప్రతిష్టించి అక్కడే గుడికట్టారట. క్రీ.శ. 8 -10వ శతాబ్దంలో గర్భగృహం, అంతరాళం నిర్మాణం ఆళ్వారుల కాలంలో తమిళదేశంలో శైవమతం విస్తృతమైంది. అక్కడి నుంచి తిరుచానూరుకూ విస్తరించింది. దీంతో క్రీ.శ.9వ శతాబ్దంలో తిరుమలలో నామమాత్రంగా ఉన్న చిన్నగుడిని విస్తరించే పనులు చేపట్టార ట. అందులో భాగంగా క్రీ.శ.945లో గర్భగృహం నిర్మించారు. ఇక్కడి శేషాచల కొండల్లోని రాళ్లను పలకలుగా పగులకొట్టి వాటితోనే గర్భగృహంతోపాటు అంతరాళం పూర్తి చేశారు. ఇందుకు ఆధారంగా ఆలయంలోని మొదటి ప్రాకారంలో ఉత్తరపు గోడపై ఒకటవ కొప్పాత్ర మహేంద్ర పర్మాన్ శాసనం ఉంది. దీనికి ముందున్న అర్ధమండపం (ప్రస్తుత శయన మండపం), అంతరాళం (ప్రస్తుతం రామన్మేడై/ రాములవారి మేడ)తో కలిపి లోపలి ప్రాకారంలోని మొదటి సముదాయంగా నిర్మించారు.క్రీ.శ.10వ శతాబ్దంలో గర్భాలయానికి ప్రాకారం నిర్మాణం 10వ శతాబ్దం, ఆ తర్వాత కాలంలో ఆలయ నిర్మాణం, దశలవారీగా అభివృద్ధి జరిగింది. గర్భగృహ ఆవరణకు గోడకు చుట్టూ మరొక గోడ (ప్రాకారం) నిర్మించినట్టు పరిశోధకుల విశ్లేషణ. తర్వాత క్రీ.శ.12-13 శతాబ్దాల మధ్య కాలంలో ఆలయానికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రీ.శ.1262లో సుందర పాండ్యుడు ఆనంద నిలయ విమానం మీద కలశానికి బంగారు పూత పూయించాడట. తర్వాత వీర నరసింగరాయలు దేవాలయం మరింత ప్రకాశవంతంగా కనిపించేలా బంగారుపూత పూయించాడట. విజయనగర శిల్పరీతులలో తిరుమామణి మండపం క్రీ.శ.13వ శతాబ్దంలో ఆలయానికి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, నూతన నిర్మాణాలు చేపట్టారు. తర్వాత క్రీ.శ.1417లో మల్లన్న (మాధవదాసు) తిరుమామణి మండపం (ప్రస్తుతం బంగారుమేడ/ బంగారు వాకిలి)ను నాలుగు వరుసల్లో 16 రాతి స్తంభాలతో నిర్మించారు. ఈ మండపం పడమట దిశలో ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి. ఇదే మండపాన్నే ముఖమండపం, ఆస్థాన మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపంలోని శిల్పాలన్నీ విజయనగర శిల్పరీతులలో ఉన్నాయి. ఈ మండపం తూర్పుదిశలో నమస్కార భంగిమలో మూలమూర్తికి అభిముఖంగా గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. దీన్నే గరుడ మండపం అని కూడా పిలుస్తారు. 12శ శతాబ్దంలో రెండవ గోపురం, విమాన ప్రదక్షిణం క్రీ.శ.1209 సంవత్సరం ఆలయంలో నాటికి రెండవ గోపురం (నిర్మాణంలో ఇదే తొలిగోపురం అయినప్పటికీ ప్రస్తుత ఆలయంలో రెండవదిగా కనిపిస్తుంది) నిర్మాణం చేపట్టారు. ఈ గోపురం దాటి ఆలయంలోని స్వామివారి గర్భాలయం విమానానికి నాలుగు దిశల్లో ఉన్న ప్రాకారాన్ని విమాన ప్రదక్షిణం/ విమాన ప్రాకారం అంటారు. ఇదే ప్రాకారాన్ని అనుసరించి మరొక ప్రాకారంలో కొన్ని రాతి చెక్కడాలు, మండపాలు, చిన్నచిన్న దేవతా సన్నిధులు నిర్మించారు. ఈ ప్రాకారంలో ఆగ్నేయ దిశలో వంటశాల నిర్మించారు. క్రీ.శ.16లో పడమట దిశలో పెద్దమండపం నిర్మించారు (ప్రస్తుతం కానుకలు లెక్కించే పరకామణిగా ఈ మండపాన్ని వినియోగిస్తున్నారు). శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల్లో ఎక్కువ రోజులు ఉత్సవమూర్తులను ఈ మండపంలోనే ఉంచుతారు. ఇదే ప్రాకారంలోనే ఉత్తర దిశలో తాళ్లపాక అన్నమాచార్యుల అర, ఆ తర్వాత రామానుజ (భాష్యకార్ల) సన్నిధి ఏర్పాటైంది. ఇదే క్రమంలో నృసింహ స్వామికి, వరదరాజస్వామికి కూడా ఆలయాలు నిర్మించారు. క్రీ.శ.13 నుండి మహద్వార గోపురం, సంపంగి ప్రదక్షిణం ఆలయ ప్రవేశ ద్వారమైన మహద్వారంపై నిర్మించిన గోపురాన్ని‘ మహద్వార గోపురం’, ‘ సింహద్వార గోపురం’ , ‘పడికావలి గోపురం’ అనే వివిధ పేర్లతో పిలుస్తారు. తమిళంలో ‘పెరియ తిరువాశల్’ అంటే పెద్దవాకిలి అని అర్థం. ఈ గోపురాన్ని క్రీ.శ.13వ శతాబ్దం నుండి అంచెలంచెలుగా నిర్మించారు. మహద్వారాన్ని ఆనుకుని 16 రాతి స్తంభాలతో కృష్ణరాయ మండపాన్ని నిర్మించారు. ప్రతిమామండపంగా ప్రసిద్ధి పొందిన ఈ మండపంలో విజయనగర శిల్ప సంప్రదాయం కనిపిస్తుంది. స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగించిన తర్వాత ఈ ప్రతిమా మండపంలోకి కొంత సమయం పాటు వేంచేపు చేసే సంప్రదాయం నేటికీ అమల్లో ఉంది. ఈ మండపానికి ఉత్తరదిక్కున అద్దాల మండపం, దక్షిణదిక్కులో రంగనాయక మండపం నిర్మించారు. క్రీ.శ.1320-1360 మధ్య మహ్మదీయుల దండయాత్రల వల్ల తమిళదేశంలోని శ్రీరంగక్షేత్రంలోని శ్రీరంగనాథుని విగ్రహాలు ఇక్కడ దాచి ఉంచడం వల్ల ఈ మండపం రంగనాయక మండపంగా ప్రసిద్ధి పొందింది. క్రీ.శ.15వ శతాబ్దంలో ధ్వజస్తంభ మండపం నిర్మించారు. ఇదే మండపంలోని రాతిపీఠంపై ఎత్తై దారు స్తంభమే ధ్వజస్తంభం. క్రీ.శ.1470లో విజయనగర చక్రవర్తి సాళ్వ నరసింహ రాయలు తన భార్య, ఇద్దరు కుమారులు, తనపేరుతో సంపంగి ప్రాకారం, ఇతర మండపాలు నిర్మించారు. ఇక వైష్ణవ భక్తుడైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని మరింత విస్తరించారు. క్రీ.శ.1513 నుండి 1521 మధ్యకాలంలో ఏడుసార్లు తిరుమలయాత్ర చేసి స్వామి అలంకరణకు వెలకట్టలేని వజ్రవైఢూర్య మరకత మాణిక్యాది ఆభరణాలిచ్చారు. ఆలయ నిర్వహణ బాధ్యతను పోషించారు. అనుక్షణం శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రణమిల్లుతున్నట్టుగా రెండు చేతులు జోడిస్తున్నట్టుగా ప్రతిమా మండపంలో తిరుమలాదేవి, చిన్నాదేవితో ప్రతిమలు ఏర్పాటు చేయించారు. ఆగమం ప్రకారం ఆలయ దక్షిణ దిశలోని మండపాల్లోనే కల్యాణోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. పడమట దిశలోని మండపాల్లో గిడ్డంగులుగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఆలయం కాలానుగుణంగా అప్పటి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తూన్నా.. ప్రాకారాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. నాడు వందల్లో ... నేడు వేలల్లో 1945, ఏప్రిల్ 10 మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండో ఘాట్‌రోడ్డు వచ్చేనాటికీ ఈ సంఖ్య సుమారుగా 8 వేలకు చేరింది. 1980లో రోజుకు పదిహేనువేలు, 1990 నాటికి రోజుకు 20 నుంచి 25వేలు, 1995 నాటికి 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు, 2010 నాటికి ఈ సంఖ్య 60 వేలకు చేరింది. ప్రస్తుతం 2015లో సెలవులు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు, ఒక్కోసారి సాధారణ దినాల్లోనూ ఈ సంఖ్య లక్ష దాటుతోంది. నిర్మాణ పరంగా 60 వేల మందికే సంతృప్తికర దర్శనం.. ఆలయంలో ఉన్న స్థలాభావ పరిస్థితుల వల్ల కులశేఖరడి (మూల మూర్తికి పది అడుగుల దూరం) నుంచి రోజుకు 27 వేల మంది భక్తులకు దర్శనం కల్పించవచ్చు. ఈ పరిస్థితులు క్రీ.శ. 2000 సంవత్సరానికి ముందు వరకు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 2004 వరకు రాములవారి మేడ (లఘుదర్శనం/ 35 అడుగుల దూరం) నుంచి రోజుకు 45 వేల వరకు భక్తులకు దర్శనం కల్పించేవారు. ఇక 2004 నుండి ఘంటా మంటపంలోని ద్వారపాలకులైన జయ విజయుల (మహాలఘు/ 60 అడుగుల దూరం) నుంచి వేగంగా క్యూలైన్లను నెడుతూ 70 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు. తోపులాటల్ని నివారించేందుకు టీటీడీ సన్నిధిలో మూడు క్యూలైన్ల విధానం అమలు చేసింది. ప్రస్తుత విధానంలో 60 వేల మంది భక్తులకు మాత్రమే మూలమూర్తి దర్శనాన్ని సంతృప్తికరంగా కల్పించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు దాటితే తోపులాటలు నిత్యకృత్యమయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ రెట్టింపుస్థాయిలో వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా. పూజాకైంకర్యాలు తగ్గించొద్దు: పండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం తిరుమల ఆలయంలో కనిష్టంగా 6 గంటలపాటు గర్భాలయ మూలమూర్తి పూజా కైంకర్యాలకు సమయం కేటాయించాలి. మరోవైపు పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్వామి దర్శనం కల్పించాల్సి ఉంది. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినం, బ్రహ్మోత్సవాల్లో ఒకటి రెండు గంటల మినహా మిగిలిన సమయాన్ని భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాల్సి వస్తోంది. ఈ కారణంగా స్వామి పూజల్లో కోత పడుతోంది. అలా చేయటం శ్రేయస్కరం కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. స్వామి దర్శనం కోసం భక్తకోటి... 1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. 1945, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్‌రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారుగా 8 వేలకు పెరిగింది. 1980లో రోజుకు పదిహేను వేలు, 1990 నాటికి రోజుకు 20 నుంచి 25వేల , 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు , 2010 నాటికి ఈ సంఖ్య 60 వేలకు చేరింది. 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లమంది భక్తులు వచ్చారు. ఇక ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలో సుమారు 1.8 కోట్లు దాటింది. భవిష్యత్‌లో ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. నేత్రద్వారాల ఏర్పాటుకు ఆగమం అభ్యంతరం ఆలయ నిర్మాణం ఆగమ నిబంధనలకు లోబడి జరిగింది. శ్రీవారి పోటెత్తుతున్న భక్తులందరికీ సత్వరంగా స్వామి దర్శనం కల్పించాలంటే వెండి వాకిలి ప్రాకారానికి నేత్రద్వారం తెరవాలన్న ప్రతిపాదన రెండు దశాబ్దాల నుంచి నలుగుతూనే ఉంది. దీని ప్రకారం వెండివాకిలికి అటుఇటూ 20 అడుగుల దూరంలో రెండు ద్వారాలు తెరవాల్సి ఉంది. ఈ నేత్రద్వారాల నుండి లోనికి, వెలుపలకు పంపడం ద్వారా ఎలాంటి తోపులాటలు లేకుండా చేయాలన్నదే దీని సారాంశం. పనిలో పనిగా ఆనంద నిలయ ప్రాకారానికి కూడా ప్రత్యేక ద్వారం తెరవాలని కూడా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిప్రకారం రాములవారి మేడకు ముందున్న స్నపన మంటపం దక్షిణదిశ ప్రాకారానికి కొత్తగా ప్రత్యేకద్వారం ఏర్పాటు చేయాలి. వీఐపీ అయినా, సామాన్యుడైనా భక్తులందరికీ 35 అడుగుల దూరం నుంచే సంతృప్తికరమైన దర్శనం కల్పించి వైకుంఠ వాకిలి వద్ద బంగారు బావి సమీపం వరకు భక్తులను వెలుపలకు పంపాలన్నదే మరో ఉద్దేశం. దీనివల్ల జయవిజయలను దాటి లోనికి వెళ్లిన భక్తులు తిరిగి అదే మార్గంలో రాకుండా సులభంగా కొత్త ప్రత్యేకద్వారం నుంచి వెలుపలకు పంపవచ్చు. ఈ ద్వారాలు అమల్లోకి వస్తే భక్తులందరికీ సంతృప్తికర దర్శనంతోపాటు రోజుకు లక్ష మందికి పైబడి దర్శనం కల్పించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఆ మేరకు 2010లో అప్పటి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ఎక్కువ మంది భక్తులకు స్వామి దర్శనం కల్పించాలనే సంకల్పంతో దర్శనంలో కొత్త విధానాలతో పాటు ఆలయ ఆగమాలకు అభ్యంతరం లేకుండా చూడాలని జాతీయ స్థాయిలో చర్చకు లేవదీశారు. అందులో భాగంగా 2010 నవంబర్ 20, 21వ తేదీల్లో జాతీయ స్థాయి సదస్సును తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. అందులో ఆగమ పండితులు, అర్చకులు, టీటీడీ పూర్వపు ఈఓలు, ఆలయం తో ముడిపడిన అనువజ్ఞుల చేత ఉపన్యాసాలు ఇప్పించారు. సదస్సు విజయవంతం అయినప్పటికీ ఆలయంలో కొత్త దర్శన విధానాలపై, నేత్రద్వారాలు, ప్రత్యేక ద్వారాలపై ఆగమ పండితులు తిరస్కరించారు. మరోసారి 2012లో అప్పటి టీటీడీ ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా నేత్రద్వారాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినా, అమలు చేయలేక పోయారు. ఏది ఏమైనా స్వామివారి దర్శనం కోసం పరితపిస్తున్న భక్తజనావళికంతటికీ విమర్శలకు, శాస్త్రవిరుద్ధతకు తావులేకుండా సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పించవలసిన ప్రధాన బాధ్యత టీటీడీ మీద ఉన్న ప్రధాన కర్తవ్యం. క్రీ.శ. మొదటి శతాబ్దం నాటి త మిళ గ్రంథం ‘శిలప్పాదిగారం’లో తిరుమల ఆలయ ప్రస్తావన ఉంది. క్రీ.శ. 614 సంవత్సరంలో పల్లవ రాణి సమవాయి (పెరిందేవి) గర్భాలయానికి జీవోద్ధరణ చేసినట్టు చరిత్ర. గర్భాలయం తర్వాత కొన్నేళ్ళకు ఆనంద నిలయంపై విమాన గోపురాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. క్రీ.శ.1262 నాటికే విమాన గోపురం సంపూర్ణంగా ఉన్నట్టు శాసనాధారం. కన్వేయర్ బెల్ట్‌ల ద్వారానే సరుకులు, బూంది-లడ్డూ పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ప్రసాదాల తయారీ కూడా పెరిగింది. దిట్టానికి అనుగుణంగా సరుకులు సరఫరా చేయాల్సి వచ్చింది. ఆలయంలోని ఉగ్రాణంలోకి సరుకులు తీసుకెళ్లేందుకు ఆలయం వెలుపల దక్షిణ దిశలో ప్రత్యేకంగా ద్వారం తెరవాలని ప్రతిపాదన వచ్చింది. దీనిపై సుదీర్ఘకాలం చర్చజరిగింది. ఆగమ పండితులు ముక్తకంఠంతో తిరస్కరించారు. ఆలయ నిర్మాణానికి విరుద్ధంగా మరొక ద్వారం తెరిస్తే వ్యతిరేక ఫలితాలు ఉత్పన్నం అవుతాయని ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా సరుకులను ఆలయ ఉగ్రాణంలోకి తీసుకెళ్లేందుకు ఆలయ ఇంజనీర్లు ప్రత్యేకంగా కన్వేయర్ బె ల్ట్ అమర్చారు. ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఈ కన్వేయర్ బెల్ ్టద్వారానే సరుకులను ఉగ్రాణంలోకి చేరవేస్తున్నారు. అలాగే ఆలయం వెలుపల ఉత్తర దిశలోని బూంది పోటులో తయారైన బూందిని కూడా మరో కన్వేయర్ బెల్టు ద్వారా ఆలయంలోని పోటుకు పంపుతున్నారు. ఇక్కడ తయారైన లడ్డూలను తిరిగి లడ్డూ కౌంటర్లకు పంపేందుకు కూడా కన్వేయర్ బెల్ట్నే వాడుతున్నారు. ఆలయంలోని గర్భాలయానికి ముందు ఉన్న మెట్టు (కులశేఖరపడి) ద్వారా 27వేలు, రాములవారి మేడ నుండి (లఘుదర్శనం) 45వేల మంది, జయవిజయల నుండి (మహాలఘులో ) 90 వేల మంది భక్తులకు దర్శనం కల్పించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువసంఖ్యలో వస్తే మరుసటి రోజు దర్శనం కల్పిస్తారు. ఆలయంలో మార్పులు చేయకూడదు * స్వయం వ్యక్త సాలగ్రామ స్వరూపంలో శ్రీవేంకటేశ్వర స్వామి గర్భాలయంలోని ‘ఉపధ్యక’ పుణ్యప్రదేశంలో వెలిసారు. * దేవశిల్ప విశ్వకర్మ వేయి స్తంభాలతో దివ్యమైన ఆలయం నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. * మహాయుగాలుగా దివ్యమైన దేవాలయం మరుగున ఉంది. అది సామాన్య మానవులకు కనిపించకుండా అదృశ్యంగా ఉంది. ఇందుకు శాస్త్ర ఆధారం ఉంది. కంటికి కనిపించే ఆలయాన్ని నిర్మాణంగా పరిగణించకూడదు. స్వామి దేహంగా భావించాలి. అలాంటి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అలా చేయటం శాస్త్రం విరుద్ధం. అలా శాస్త్ర విరుద్ధంగా చేయటం వల్ల ప్రతికూల ఫలితాలు సంభవిస్తాయి. శిల్పశాస్త్రం ప్రకారం నేత్రద్వారాల ఏర్పాటుకు వీలుంది నేత్రద్వారాలు తెరవాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. దానిపై ఏళ్లకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇంతవరకు పరిష్కారం లభించలేదు. తమిళనాడులోని తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం వంటి ఆలయాల్లోకి భక్తులు సులభంగా వెళ్లిరావటానికి అనేక మార్గాలున్నాయి, కాలానుగుణంగా మార్పులు జరిగాయి. తిరుమల ఆలయాన్ని వాటితో పోల్చలేము. అయితే, పెరుగుతున్న భక్తులకు సులభంగా గర్భాలయ మూలమూర్తి దివ్యమంగళ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించేందుకు మార్పుల అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు శిల్పశాస్త్రం సమ్మతిస్తోంది. - ఏబీ లక్ష్మీనారాయణ, 1976-2002 టీటీడీ ఆలయాల స్థపతి, ప్రస్తుత స్థపతి సలహాదారు -
లడ్డూ మాధుర్యానికి 75 ఏళ్లు
అమృత పదార్థంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ అమృతోత్సవాన్ని పూర్తి చేసుకుంది. మాధుర్యంలో సాటిలేని లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ, ఆయన భక్తజనకోటికీ కూడా ప్రీతిపాత్రమైనది. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించిన ట్టు చారిత్రక ఆధారం. అప్పటినుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారట. తొలుత పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర. అప్పట్లోనే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు. దాంతో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. 1940 నుంచే భక్తుల చేతికి లడ్డూ 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచారు. 1940 నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు అందజేయటం ప్రారంభించారు. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అనే పేరుతో పిలుస్తారు. 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఈ దిట్టం పరిమాణాలను ఖరారు చేసింది. ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. ఒక లడ్డూ తయారీకి... భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీకి టీటీడీ రూ.30 దాకా ఖర్చుపెడుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా 2015లో లెక్కలు వేశారు. ఇందులో భాగంగానే ఆలయ పోటులో దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తారు. ఇందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తారు. ఆలయంలో నిత్యం 900 కేజీల ఆవునెయ్యి లడ్డూల తయారీకే వాడతారు. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు దక్కించుకోవటంలో 2009లో అప్పటి ఈవో కేవీ రమణాచారి కృషి చేశారు. రాయితీలడ్డూలపై రూ.60 కోట్లు భక్తుల కానుకలతో ధార్మిక సంస్థ మనుగడ సాగిస్తోంది. అదే భక్తులకు అందజేసే ఉచిత, రాయితీ ధరలతో ఇచ్చే లడ్డూల వల్ల ఏటా రూ.60 కోట్ల వ్యయాన్ని టీటీడీ భరిస్తోంది. నాలుగేళ్లకు ముందు సర్వదర్శనం, కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులు, అంగప్రదక్షిణం, వికలాంగులు, వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చే తల్లిదండ్రులు, శ్రీవారి సేవకులకు రూ.10 రాయితీ ధరతో రూ.20కి రెండు లడ్డూల చొప్పున అందిస్తున్నారు. ఇలా ఏటా సుమారుగా రూ.40 కోట్ల వరకు అదనంగా టీటీడీ ఖర్చు చేస్తోంది. ఇక సర్వదర్శనం, కాలిబాట దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందిస్తుండటం వల్ల మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు 900 కిలోల ఆవునెయ్యి వాడతారు. ఆవునెయ్యిని ఆలయం వెలుపల ఉన్న ఎనిమిది భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. పైపులైను ద్వారా నెయ్యిని ఈ ట్యాంకుల నుంచి పోటుకు సరఫరా చేస్తారు. ఇవి చాలకపోవడం వల్ల మరికొన్ని ట్యాంకులు సిద్ధం చేశారు. -
ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది. ‘వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’’ శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానప’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు. సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూట లా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు. పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు. తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు. ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగ లు కూడా ఉన్నాయి. ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది. శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమానానికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు. అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించాడు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే. ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు. శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు. పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి. గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం. రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు)ని వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’ మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు. తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివారి ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూర్తకాగానే కురాలం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు. గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముదూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ కిచిలిగడ్డ ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. -
సింహవాహనంపై శ్రీనివాసుడు
తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు శుక్రవారం ఉదయం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై విహరించారు. స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. గోవింద నామ స్మరణతో మాఢ వీధులు మార్మోగుతున్నాయి. కాగా సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో విహరిస్తారు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లున్న శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం భక్తుల తాపత్రయాలను పోగొడుతుంది. మరోవైపు కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడు వెలసిన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంగా విలసిల్లుతూ ఉంటోంది. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకునికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే స్వామివారికి జరిగే అన్ని సేవలలో... ప్రతి శుక్రవారం జరిగే అభిషేకానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ అభిషేక సేవలో స్వామివారి మూలవిరాట్‌కు కొన్ని ప్రత్యేక పదార్ధాలతో మర్ధనా చేస్తారు. అందుకే తిరుమలేషుని అర్చవతార రూపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ అభిషేక ప్రత్యేకత గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులు 'సాక్షి'కి వివరించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోస్టర్లను, బుక్లెట్లను టీటీడీ విడుదల చేసింది. సోమవారం అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి ఈఓ సాంబశివరావు పోస్టర్లను విడుదల చేశారు. సెప్టెంబర్ 16 న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 24 న ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14 న ప్రారంభమై 22 వరకు కొనసాగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. అనంతరం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. -
కాలినడకన తిరుమలకు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు బుధవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల చేరుకునేందుకు కాలిబాటన నడకను ప్రారంభించారు. తిరుమలలో రేపు ప్రధాన న్యాయమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగత పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు బుధవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. -
వెల్లి‘విరి’సిన భక్తి పారవశ్యం
సద్ధర్మాచరణే భక్తి కొబ్బరికాయ కొట్టడమే భక్తికి గుర్తు కాదని, సద్ధర్మాచరణ ముఖ్యమని ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. ఆమె పేరిట ఉన్న ట్రస్ట్ తరఫున అన్నమయ్య పూలరథం తిరుమలకు తరలిన సందర్భంగా సోమవారం ఆమె రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి కల్చరల్ : తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి పుష్పకైంకర్యసేవలో వినియోగానికి కొండవీటి జ్యోతిర్మయి ట్రస్టు ఆధ్వర్యంలో భక్తుల నుంచి సేకరించిన పూలతో అన్నమయ్య రథం సోమవారం తిరుమలకు కదిలింది. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని దాట్ల సుభద్రాయమ్మ కళాప్రాంగణం నుంచి సుమారు 3 టన్నుల పూలతో రథం పయనమైంది. ట్రస్టు వ్యవస్థాపకురాలు కొండవీటి జ్యోతిర్మయి రథాన్ని ప్రారంభించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం భక్తులనుద్దేశించి జ్యోతిర్మయి మాట్లాడారు. సద్ధర్మ ఆచరణ లేని పూజ వ్యర్థమని పేర్కొన్నారు. నగర ప్రముఖుడు దాట్ల బుచ్చివెంకటపతిరాజు, జ్యోతిర్మయి తదితరులు రథానికి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. మేళతాళాల మధ్య రథం కదలగా పెద్ద సంఖ్యలో భక్తులు అనుసరించారు. మహిళలు గోవిందనామాలను ఆలపించారు. రథం ముందు కళాకారులు ప్రదర్శించిన కోలాటం అలరించింది. జ్యోతిర్మయి కీర్తనలను ఆలపించారు. కళాప్రాంగణం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రదక్షిణ మార్గంలో రథం పయనించి, తిరుమలకు పయనమైంది. ఆదిత్య విద్యాసంస్థల డెరైక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జి.నాగేశ్వరరావు, ట్రస్టు నగర శాఖ కన్వీనర్ పీవీఎస్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర ఆలయ సందర్శన స్థానిక ఎస్.వి.జనరల్ మార్కెట్లోని శ్రీ భూసమేత శ్రీవేంకటేశ్వరాలయాన్ని సోమవారం ఉదయం కొండవీటి జ్యోతిర్మయి దర్శించారు. స్వామిని ప్రస్తుతిస్తూ కీర్తనలను ఆలపించారు. అర్చకుడు సంతోషంగా ఉంటేనే ఆలయం శోభిస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు జ్యోతిర్మయికి స్వాగతం పలికారు. ‘భక్తి అంటే కొబ్బరి కాయ కొట్టడం కాదు’ భక్తి అంటే కేవలం కొబ్బరికాయ కొట్టడమే కాదని గురు కొండవీటి జ్యోతిర్మయి ట్రస్టు వ్యవస్థాపకురాలు, ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు, సోమవారం నగరానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. భక్తి అంటే పూజలు చేయడం ఒక్కటే కాదని, సద్ధర్మ ఆచరణ కూడా ఉండాలని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు సామాజిక వాతావరణం, టీవీలు, సినిమాలు ఇతరత్రా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రస్టు తరఫున ‘నేను, నా ఊరు’ పేరిట ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలను చైతన్యపరచాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 100 గ్రామాల్లోని పర్యటించి ప్రజల ను చైతన్యపరిచామని, దురలవాట్లను మాన్పి ంచి, భక్తిమార్గం వైపు వారిని మళ్లించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. తమ కృషి వల్ల కొందరు మద్యం మానేశారని, ఆధ్యాత్మి కతవైపు అడుగులు వేశారని చెప్పారు. -
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మాండ నాయకుని వైభవం నాడు నేడు
నాడు ఎందరెందరో రాజులు తమ విజయ పరంపరలో భాగంగా స్వామికి ఎన్నెన్నో ఉత్సవాలు జరిపించారు. తిరుమలలో నెలకో బ్రహ్మోత్సవం జరిగిన సందర్భాలూ ఉన్నాయని శాసనాధారం. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు అనుగుణంగా కొన్ని దశాబ్దాలుగా ఏడాదికి ఒకసారి, అధికమాసంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమలకొండకు కనీసం కాలిబాట కూడా లేని రోజుల్లోనూ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరిగేవి. ఇందుకోసం భక్త జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. కాలినడకన కొందరు, డోలీల్లో మరికొందరు తిరుమలకొండకు చేరుకుని, ఉత్సవాలను తిలకించేవారు. నేడు తిరుమలలో రెండు ఘాట్‌రోడ్లు ఏర్పడ్డాక జనం పెరిగారు. కనీస వసతులు పెరిగాయి. కాఫీ, టీ కూడా లభించని రోజులు పోయి హైటెక్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అలనాటి రాజుల తరహాలోనే నేడు కోట్లకు పడగలెత్తిన దాతలు దేవదేవునికి భూరి విరాళాలు సమర్పించుకునేందుకు బారులు తీరుతున్నారు. దాంతో ఆలయ ఆదాయం పెరిగింది. హైటెక్ హంగులు సంతరించుకున్నాయి. ఉత్సవాల నిర్వహణలో ఆధునికత సంతరించుకుంది. పురాతన సంప్రదాయాలను కొనసాగిస్తూనే కొత్తకొత్త ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది దేవస్థానం. నాడు మహంతుల పాలన తిరుమల ఆలయానికి రెండు వేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. ఆలయ పాలన బాధ్యతలను రాజులు, మహరాజులు, ఆర్కాటు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్ ప్రభువులు ఆయా కాలాల్లో చూసారు. రామానంద సంప్రదాయానికి చెందిన హథీరాం మహంతుల కాలం (1843 -1933)లో ఆలయ పోషణ, పరిపాలన నిరాటంకంగా సాగింది. నేడు ఆలయ పాలన 1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కమిటీలో నియమించేది. 1951 తర్వాత ట్రస్టు బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. ఆలయ పాలనకు నేడు ఈవో నేతృత్వంలో జేఈవో (తిరుపతిలో ఒకరు, తిరుమలకు మరొకరు)లుగా ఐఏఎస్ అధికారులు ఉంటారు. ట్రస్టుబోర్డు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉంటుంది. ఆలయ నిర్వహణ బాధ్యత, భక్తుల క నీస మౌలిక సదుపాయాల కల్పన వీరి నేతృత్వంలోనే సాగుతుంది. నాడు స్వామికి కంటి నిండా కునుకు అప్పట్లో తిరుమలకొండపై కేవలం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, పుష్కరిణి గట్టుపై చిన్నపాటి శ్రీ భూ వరాహస్వామి ఆలయం మాత్రమే ఉండేది. తినేందుకు ఆహారం, ఉండేందుకు నీడకు కూడా కరువే. దీనికి తోడు క్రూర మృగాలు, జంతువుల భయమెక్కువ. సూర్యోదయం తర్వాత ఆలయ మహద్వార తలుపులు తెరుచుకునేవి. తిరిగి సూర్యాస్తమయం లోపే మూసేయాల్సి వచ్చేది. కొండమీద ఆలయం పక్కనే హథీరాం మఠం, వేయికాళ్ల మండపం తప్ప మరే భవనాలూ ఉండేవి కావు. ఆలయంలో స్వామి కైంకర్య విధులు నిర్వహించే అర్చకులు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం శుద్ధి చేసి పూజా నైవేద్యాలు సమర్పించేవారు. ఆ ఆర్వాతే యాత్రికులకు దర్శనం కల్పించేవారు. ఆలయంలో పూజా కైంకర్యాలన్నీ పగటి పూటే జరగటం వల్ల భక్త రక్షకుడైన స్వామి హాయిగా నిద్రించే అవకాశం ఉండేది. జగాలనేలే స్వామికి నేడు కునుకే కరవు జగాన్ని రక్షించే జగత్కల్యాణ చక్రవర్తి శ్రీవేంకటేశ్వర స్వామికి నేటి పరిస్థితుల్లో గంటంటే గంట పాటే కునుకు తీసే అవకాశం లభిస్తోంది. వేకువజాము 2.30 గంటలకు సుప్రభాత సేవ మేల్కొలుపు పాటతో నిద్రలేచే స్వామి తిరిగి ఆ రోజు రాత్రి 1 గంటకు ఏకాంత సేవలో నిద్రకు ఉపక్రమిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నిత్యం ఆ రోజు విశేషాలను బట్టి రకరకాల పూజలు, సేవలు అందుకుంటూ 22 గంటలకుపైగా ఏకధాటిగా భక్తులకు దర్శనమిస్తారు. నాడు దండోరాతో ఆహ్వానం మహరాజులు, మహంతుల కాలాలలో తిరుమలేశుని ఉత్సవాలు అంగరంగవైభవంగా సాగేవి. ఆలయ పాలనతోపాటు భక్తులకు ఏ లోటూ లేకుండా అవసరాలు తీరేవని రికార్డులు చెబుతున్నాయి. 1843లో మహంతుల కాలం నుంచి, 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మోత్సవాల సమాచారాన్ని దండోరాలతో ఊరూవాడా తెలియజేసేవారు. ‘‘ఇందుమూలంగా యావన్మంది పుర పెజలకు తెలియసేయటం ఏమనగా! ఫలానా.... తేదీల్లో తిరపతి ఏడు కొండల ఎంకన్న సామి బ్రొమోత్సోలు జరగతాయట. సామి ఉత్సవాలను కళ్లారా చూసేందుకు ముసలీముతకా, చిన్నపెద్దా అందరూ రావాలని దేవస్థానం ఆపీసర్లు ఇగ్నప్తి చేస్తున్నారు. తరలి రారండహో..!’’ అంటూ చిత్తూరుజిల్లా, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో డప్పులతో దండోరా వేయించేవారు. ఆ తర్వాత కరపత్రాలు, గోడ పత్రికలు, దినపత్రికలతో బాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక ఉత్సవాల ప్రచారం మెరుగు పడింది. నేడు మీడియా ద్వారా నేరుగానే... మీడియా విస్తరణతో తిరుమలలో జరిగే ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వేల కిలోమీటర్ల దూరం నుంచే వీక్షించే అవకాశం కలిగింది. ఒకవైపు ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్, ప్రభుత్వ మీడియా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ కూడా ‘శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్’ పేరుతో సొంత టీవీ సంస్థను ఏర్పాటు చేసుకుంది. ఈ ఛానల్ ద్వారా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు మూలమూర్తి (నమూనా ఆలయంలో చిత్రీకరించిన పూజాకైంకర్యాల ప్రసారాలు), ఉత్సవమూర్తులకు జరిగే పూజలు, సేవలన్నీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తుల ఇళ్లవద్దకే చేరుతున్నాయి. నాడు వెండివాహనాలపైనే ఊరేగింపు అప్పట్లో అన్ని వాహనాలూ వెండివే. పగలు సూర్యకాంతిలో, రాత్రి చంద్రుని వెన్నెల్లో వెండివాహనాలు అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించేవి. బ్రహ్మోత్సవాలకు ముందు వాహనాలకు మెరుగులద్దేవారు. ఆలయంలో ఆర్జిత సేవలతోపాటు అలంకార ప్రాయంగా ఉత్సవాలు నిర్వహించటం కోసం కాలానుగుణంగా వెండిరథం కూడా ఉండేది. వెండి రథాన్ని రెండోబ్రహ్మోత్సవంలోనూ, వార్షిక వసంతోత్సవాల్లోనూ ఊరేగించేవారు. నేడు స్వర్ణ రథాలపై స్వామి దర్శనం కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు అనుగుణంగా నాటి వెండివాహనాలన్నీ కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో కాంతులీనే బంగారు వాహనాలపై మలయప్ప స్వామి తన ఉభయ దేవేరులతో కలసి ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తున్నాడు. వెండి రథం స్థానంలో 1992లో తొలిసారిగా బంగారు రథం వచ్చి చేరింది. సరిగ్గా 21 ఏళ్లపాటు సేవలందించిన ఆ స్వర్ణరథాన్ని తిరుపతిలోని శ్రీనివాసమంగాపురానికి తరలించారు. దాని స్థానంలో 2013లో రూ.30 కోట్లతో మరొక కొత్త స్వర్ణరథాన్ని టీటీడీ సిద్ధం చేసింది. ప్రస్తుత ఊరేగింపుల్లో కొత్త స్వర్ణరథానిదే ప్రత్యేక ఆకర్షణ. నాడు కొయ్య చక్రాలపైనే తేరు ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో కొయ్యతేరుకు చాలా ప్రాధాన్యత ఉంది. స్వామిని దర్శించినా, లేకపోయినా ఉత్సవాల్లో కొయ్య తేరు లాగితే చాలు మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అప్పట్లో సాంకేతికత అంతగా అందుబాటులోకి లేదు. తేరు కొయ్య చక్రాలపైనే తిరిగేది. ఆలయం చుట్టూ తొలిరోజుల్లో మట్టిరోడ్డే ఉండేది. తర్వాత బండలు పరిచారు. ఆ తర్వాత తారు రోడ్డు వచ్చింది. దానిపై తేరు కొయ్య చక్రాలు నిలిపినా నిలిచేవి కావు. లోతట్టు ప్రాంతానికి తేరు వేగంగా దూసుకెళ్లేది. దాంతో కేవలం తేరు నిర్వహణ కోసమే తిరుపతిలోని బండ్లవీధికి చెందిన కొన్ని కుటుంబాలు మిరాశీ పద్ధతిలో సేవలందించేవి. వారే అతికష్టం మీద తేరు ఊరేగింపును ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేవారు. ఒక్కోసారి ఇరుకైన మలుపుల వద్ద తేరు అర్ధంతరంగా ఆగేది. తిరిగి మరమ్మతులు చేసి ముందుకు సాగాలంటే కనీసం రెండు మూడు గంటలు పట్టేది. నేడు హైడ్రాలిక్ చక్రాలపై తేరు చక చకా తేరు (మహారథం)కు వాడే కొయ్యచక్రాలకు బదులు హైడ్రాలిక్ చక్రాలు అమర్చారు. అది కూడా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఇనుము, ఉక్కుతో కూడి హైడ్రాలిక్ బ్రే క్ సిస్టమ్స్ కలిగిన నాలుగు చక్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిసారి బ్రహ్మోత్సవాలకు ముందు బెల్ సంస్థ నుంచి ప్రత్యేక ప్రతినిధులు తిరుమలకు చేరుకుంటారు. చక్రాలను పరిశీలించి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు. తేరు ఊరేగింపు పూర్తిగానే తిరిగి వెళతారు. అధునాతన సౌకర్యాలు, హైడ్రాలిక్ చక్రాల వల్ల తేరు ఊరేగింపు నేడు సులువుగా మారింది. ఇరుకైన మలుపుల్లో కూడా రెండు గంటల్లోనే తేరు ఊరేగింపు పూర్తవుతోందంటే ఆశ్చర్యమే! నాడు ఊరి జనమే భద్రత! గతంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం ఊరి జనమే సేవలందించేవారు. ఎంతమంది జనం పోగైతే వాహనాలకు అంత భద్రత ఉండేది. నేడు సీసీ కెమెరాల నిఘాలో... దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలు పెరిగాయి. దాంతో తిరుమలలో సీసీ కెమెరా, భద్రతా వ్యవస్థల నిఘా పెరిగింది. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరినిండా నిఘా (సీసీ కెమెరా) కళ్లే కనిపిస్తాయి. ఉత్సవాల నిర్వహణ కోసం పోలీసు భద్రత ఉంటుంది. తిరుమలకు వచ్చి వెళ్లే వాహనాల తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థే ఉంది. నాటి చలికి కుంపటి సెగ ఉండాల్సిందే! నాడు వాతావరణ పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. చలి ఎక్కువ. వర్షాలు వస్తే నాలుగైదు రోజుల విడిచేవి కావు. చలి నుంచి కాపాడుకునేందుకు కుంపటి సెగ కాచుకునేవారు. ఆలయంలో పనిచేసే అర్చకులు, సిబ్బంది కూడా ఆలయం పక్కనే కట్టెలు కాలేసి, చలి కాచుకునే వారు. సిబ్బంది, స్థానికులతోపాటు యాత్రికులూ ఉపశమనం పొందేవారు. నేడు ఏసీ లేని భవనమే లేదు..! తిరుమలలో వాతావరణ పరిస్థితులు బాగా మారిపోయాయి. వాహనాల కాలుష్యం, శబ్దకాలుష్యం పెరిగి, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో వాతావరణం బాగా వేడెక్కింది. ఒకప్పుడు కాటేజీలకు ఫ్యాను పెట్టేందుకే భయపడ్డ టీటీడీ అధికారులు ప్రస్తుతం ఏసీలు అమర్చకుండా భవనాలే నిర్మించటం లేదు. నాడు మేళ తాళాలతో సాగనంపేవారు శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఆలయ మర్యాదలు ఉండేవి. రంగనాయక మండపంలో కల్యాణోత్సవం పూర్తికాగానే స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన గృహస్థ భక్తులను వారు బస చేసిన గ్రామ చావడి (సత్రం) వరకు మేళతాళాలతో సాగనంపే ఆచారం ఉండేది. పెద్ద లడ్డూలు, అన్నప్రసాదాలు భక్తులకు బహుమానంగా అందేవి. నేడు కనీస మర్యాదలూ కరవే! మర్యాదల మాటెలా ఉన్నా కల్యాణోత్సవం టికెట్లు దక్కించుకునేందుకు భక్తులు ఎన్నెన్ని సిఫారసులు చేయాల్సి వస్తుందో ఆ ఏడుకొండలవాడికే ఎరుక. బ్రహ్మోత్సవాలంటే ఊరంతా పండగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను స్థానికులు తమ ఇంటి పండువలా నిర్వహించుకునేవారు. తమ పూరి గుడిసెలు, పక్కా ఇళ్లకు వెల్ల వేసేవారు. ఇళ్లకు, కాలనీ సందుల్లో మామిడి తోరణాలు, అరటి మొక్కలు కట్టేవారు. ఉత్సవాలను దర్శించుకునేందుకు వచ్చే బంధువుల కోసం ఇంటిలో కిరాణా సామగ్రిని ముందుగానే సమకూర్చుకునేవారు. స్థానికుల్లో ఉన్నతులైనవారు, ఆలయాల్లో పనిచేసే అర్చకులుపిండివంటలు చేసి బంధువులతోపాటు యాత్రికులకూ విరివిగా వితరణ చేసేవారు. నేడు ఆ పరిస్థితులే కానరావడం లేదు. ఉరుకులు పరుగుల జీవితంలో స్థానికులకు అంత తీరుబడి ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా, వచ్చిన భక్తులు సేదతీరేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి భవనాలకు కొదవేలేదు. నాడు డోలీలే శరణ్యం! అప్పట్లో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే భక్తులు అష్టకష్టాలు పడేవారు. అడవి జంతువుల భయం ఎక్కువ. దానికితోడు అడవి దారిలో కాచుకునే దోపిడీ దొంగల బెడద ఎక్కువ. అందుకే పదీ పదిహేను కుటుంబాలు కలసికట్టుగానూ, భక్త బృందాలుగానూ వెళ్లేవారు. నడవలేని వృద్ధులు, వికలాంగులను కూలీలు డోలీలపై మోసుకెళ్లేవారు. పొడవాటి కట్టెకు ఊయల ఏర్పాటు చేసి అందులో వ్యక్తిని కూర్చోబెట్టుకుని సునాయాసంగా కొండెక్కేవారు. అలిపిరి నుంచి కాలిబాట మీదుగా తిరుమలలోని పాత కల్యాణ మండపానికి సమీపంలోని డోలీ మండపం బ్లాక్ (డీఎంబీ) వరకు మోసుకె ళ్లేవారు. నేడు విరివిగా వాహనాలు... మద్రాసు ఉమ్మడి రాష్ర్ట బ్రిటీషు గవర్నర్ సర్ ఆర్థర్ హూప్ నేతృత్వంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ఘాట్‌రోడ్డుకు పక్కగా సర్వే చేసి తారు రోడ్డు నిర్మించారు. 1945 ఏప్రిల్ 10 న తిరుమల-తిరుపతి మధ్య మొదటి ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. తొలుత ఎడ్లబండ్లు, ఆ తర్వాత నల్లరంగు మినీ బస్సులు ఒకే మార్గంలోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. తర్వాత 1973లో రెండో ఘాట్‌రోడ్డు ఏర్పడింది. రాకపోకలు వేర్వేరు రోడ్లపై సాగే సౌకర్యం కలిగింది. వాహనాల రాక పెరిగింది. భక్తులు రోజుకు పది వేలకు చేరారు. బ్రహ్మోత్సవాలు, పండుగలు, పర్వదినాల్లో లక్షలాదిగా తరలివస్తున్నారు. నాడు నాలుగు రేకుల షెడ్ల కిందే నిరీక్షణ రెండో ఘాట్‌రోడ్డు ఏర్పడే వరకు మహద్వార గోపురం నుంచే భక్తులు ఆలయంలోకి వెళ్లేవారు. పదినిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చేవారు. రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చి తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు వేరుపడ్డాక జనం రాక రెట్టింపైంది. దీంతో స్వామి దర్శనం కోసం బారులు తీరే భక్తులు ఎండా, వాన, చలి, వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించిన అధికారులు పుష్కరిణి గట్టుపై పాత పుష్కరిణి కాంప్లెక్స్ (పీపీసీ) పేరుతో సిమెంట్ రేకులతో నాలుగు షెడ్లు నిర్మించారు. ఒక్కో షెడ్డులో 500 మంది చొప్పున నాలుగు షెడ్లలో 2 వేలమంది వేచి ఉండేవారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, జనవరి 1 వంటి ప్రత్యేక పర్వదినాల్లో .. ఆ పీపీసీ షెడ్లు కూడా నిండి క్యూలైను వరాహస్వామి ఆలయం మీదుగా ఉత్తరమాడ వీధి, పెరుందేవమ్మ తోట నుంచి పాపవినాశనం రోడ్డు, సురాపురం తోట నుంచి పాత అన్నదానం కాంప్లెక్స్ వరకు సాగేది. నేడు రెండు భారీ క్యూకాంప్లెక్స్‌లలో... 1980 నాటికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో రద్దీని తట్టుకునే విధంగా 1985లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రారంభించారు. దాంతో ఏకంగా 20 వేల మంది భక్తులు అన్ని మౌలిక వసతుల మధ్య నిరీక్షించే సౌకర్యం కలిగింది. అది కూడా చాలకపోవడంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లోని స్థానిక నివాసాలను ఖాళీ చేయించి 2003లో రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను నిర్మించారు. దీనివల్ల మరో 20వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం కలిగింది. ప్రస్తుతం ఈ రెండు క్యూ కాంప్లెక్స్‌లు కూడా సరిపోక వెలుపల నిరీక్షించాల్సి వస్తోంది! నాడు వేల నుంచి లక్షల్లోకి బడ్జెట్ అప్పట్లో వేలల్లో మాత్రమే బడ్జెట్ ఉండేది. మొదటి ఘాట్‌రోడ్డు రావడంతో క్రమంగా భక్తులు పెరిగారు. ఆలయానికి వచ్చే ఆదాయం కూడా పెరిగింది. సత్రాల నిర్మాణం కోసం వేల నుంచి ఖర్చు లక్ష ల్లోకి పెరిగింది. తిరుమల, తిరుపతిలో అనేక సత్రాలు అందుబాటులోకి వచ్చాయి. నేడు రూ.2401 వేల కోట్లకు పెరిగిన టీటీడీ బడ్జెట్ టీటీడీ పాలనంతా చిన్న రాష్ట్ర ప్రభుత్వ తరహాలోనే సాగుతుంది. 1933 ప్రారంభంలో టీటీడీ బడ్జెట్ లక్షల్లో ఉంటూ వేళ్లపై లెక్క పెట్టగలిగేంత ఉండేది. ప్రస్తుతం 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రూ.2401 కోట్లతో దేవస్థానం బడ్జెట్‌ను ఆమోదించింది. రూ.లక్షల్లో ఉండే టీటీడీ ఆస్తులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. రెండు లక్షల కోట్లకు పైబడ్డాయి. శ్రీవారి హుండీ ఆదాయం నేడు రోజుకు రూ. 2కోట్ల నుంచి రూ.3 కోట్లు దాటుతుండడంతో భక్తులకు వైద్యం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భక్తుల కోసమే పుట్టిన తిరుమలకొండ భక్తులను ఉద్ధరించేందుకు శ్రీనివాసుడు వైకుంఠాన్ని వీడి ఇల వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువైనాడు. తన భక్తులకు ఎటువంటి కష్టం రానీయకుండా తిరుమల కొండపై ఊరు పుట్టించారని పూర్వం నుంచే స్థానికులు చెబుతుండేవారు. 1843 నుండి ఆలయ పాలన మహంతుల చేతుల్లోకి వె ళ్లింది. ఆలయం అభివృద్ధి చెందాలంటే భక్తులు రావాలి. వారి సంఖ్య క్రమంగా పెరగాలి. వచ్చేవారికి కూడు, గూడు వంటి వసతులు కల్పించాలంటే ఆలయం చుట్టూ ఊరుండాలని మహంతులు భావించారు. దాంతో తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం, పెరుమాళ్పల్ల్లి, తిరుచానూ రు, శ్రీకాళహస్తి, తమిళనాడులోని వేలూ రు, కంచితోపాటు అనేక గ్రామాలోన్లి జనాన్ని రప్పించారు. మఠం భూములు లీజుకు ఇచ్చారు. నివాసాలు ఏర్పరచుకునేందుకు అనుమతి ఇచ్చారు. 1910లో ధర్మకర్తగా ఆలయ పాలన బాధ్యతలు చేపట్టిన అప్పటి మహంతు ప్రయాగ్‌దాస్ తిరుమలకొండ మీద నివాసాలు కల్పించేందుకు చొరవ చూపారు. స్థానికులనే స్వామి ఆలయంలోనూ, హథీరాం మఠంలోనూ ఉద్యోగులుగా నియమించుకున్నారు. అలా ఆలయానికి దక్షిణ దిశలో గజేంద్రమోక్షం కొలను (ప్రస్తుతం మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్), పడమర దిశలో చంద్రబాబుతోట (నారాయణగిరి ఉద్యానవనం), గొల్లకృష్ణయ్య సందు (రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్), ఉత్తర దిశలో పెరిందేవమ్మతోట ( రామ్‌భగీచా గెస్ట్‌హౌస్), ఈశాన్య దిశలో మూలమఠంతోట, సింగమాలవీధి (తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం) సురాపురంతోట (సురాపురంతోట కాటేజి), తూర్పు దిశలో బొమ్మల గోపురం, మొండిగోపురం (ఆస్థాన మండపం, కల్యాణకట్టలు), మాధవ నిలయం (రెండో యాత్రిసదన్) వద్ద స్థానికుల సంఖ్య పెరిగింది. వేళ్లమీద లెక్కపెట్టే గుడిసెల నుంచి వీధులు, ఆ తర్వాత కాలనీలు వెలిసాయి. ఆలయం చుట్టూ ఊరు తయారైంది. మహంతుల కాలంలో 300 లోపే ఉన్న తిరుమల జనాభా 1970 నాటికి దాదాపు 25 వేలకు పైబడింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పదిరోజుల పాటు స్థానికులు నిర్వహించే పూటకూళ్ల ద్వారా యాత్రికులకు కూడు, గూడు సమకూర్చేవారు. హథీరాం మఠం, సాథూరాం మఠాల పక్కన పూటకూళ్ల మిట్ట ఉండేది. అక్కడ ముందుగానే ఇంతమందికి భోజనం కావాలి? ఇన్ని రోజులు ఉంటాము... అన్న వివరాలు తెలియజేస్తేనే అవసరమైన ఆహార పదార్థాలు సిద్ధం చేస్తారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం రాగిరోటి, సజ్జ రోటి, జొన్నరొట్టెలు, దుంపలతో పులుసు సిద్ధం చే సేవారు. ఇక ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకకు చెందిన యాత్రికుల కోసం వరి అన్నం, పప్పు, సాంబారు, పులుసు వడ్డించేవారు. పిల్లాపాపలతో కాపురాలు సాగించే స్థానికులు మాత్రం ఎక్కువగా రాగి, సజ్జ సంగటితో కడుపు నింపుకునేవారు. ఇక బస విషయానికి కొస్తే ఆలయం వద్ద హథీరాం మఠం, వేయికాళ్ల మండపం తప్ప మరొక పక్కా భవనం కనిపించదు. అందుకే పూటకూళ్లు నిర్వహించేవారి పూరి గుడిసెలపైనే యాత్రికులు ఆధారపడాల్సి వచ్చేది. పూరి గుడిసెల్లోనే పరదాలు కట్టి విభజించుకుని ఉత్సవాలకు వచ్చిన యాత్రికులు, స్థానికులు ఉండేవారు. మహంతుల చొరవ వల్ల స్థానికుల సంఖ్య ఏడాదికేడాదికి రెట్టింపయ్యింది. భోజనం, బస వసతులు పెరిగాయి. దీనివల్ల బ్రహ్మోత్సవాల పది రోజులే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి యాత్రికుల రాక పెరిగింది. అంతరించే దశలో తిరుమల ఊరు ప్రస్తుతం తిరుమలకొండ మీద ఊరు అంతరించే దశకు చేరుకుంది. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులు, సౌకర్యాల వల్ల పెరిగిన రద్దీ కారణంగా బలవంతంగా స్థానికులను తిరుపతికి దించేందుకు 1975లో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. తొలుత 1985లో ఆలయానికి దక్షిణ దిశలోని పూటకూళ్లమిట్ట, సాథూరాం మఠం, గజేంద్రమోక్షం, ఆ పక్కనే చంద్రబాబుతోటను ఖాళీ చేయించి మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. అప్పటి నుంచి 2003 వరకు దాదాపుగా ఊరు ఖాళీ అయింది. మాస్టర్ప్లాన్పేరుతో ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించిన టీటీడీ భూమిపై హక్కు ఉన్న పదిశాతం స్థానికులకు మాత్రమే తిరుమలలో తిరిగి పునరావాసం కల్పించింది. ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బాలాజీనగర్‌లో 1060, మ్యూజియం వద్ద రిహాబిలిటేషన్ సెంటర్ (ఆర్బీసెంటర్) వద్ద మరో వందదాకా నివాస గృహాలున్నాయి. తిరుమలలో మరో 25 ఏళ్లకు భక్తుల సౌకర్యాల కల్పన కోసం టీటీడీ రెండోమాస్టర్ప్లాన్ రూపొందిస్తోంది. ప్రస్తుతం రెండు లక్షల మంది భక్తులు కూర్చుని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులను దర్శించుకునే విధంగా టీటీడీ అభివృద్ధి పనులు పూర్తి చేసింది. మాస్టర్ ప్లాన్‌తోనే మార్పులు అప్పట్లోనే ఉత్సవాల్లో కోలాటాలు, చెక్కభజనలు ప్రారంభించాం. అయితే వాటిని చూడాలంటే భక్తులు వాహనాలతో పాటు ముందూ వెనుక వస్తూ ఉత్సవ దేవుణ్ణి, భజనల్ని చూడాల్సి వచ్చేది. అందుకే మాస్టర్‌ప్లాన్ అమలు ప్రారంభించాం. దాంతో మాడ వీధులు, ఆలయ ప్రాంతం బాగా విస్తరించింది. ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పడ్డాయి. లక్షలాది మంది భక్తులు ఎక్కడికక్కడ కూర్చుని ఉత్సవ వైభవాన్ని హాయిగా దర్శించే అవకాశం కలిగింది. అలాగే, మీడియా బాగా విస్తరించటం వల్ల కూడా భక్తులకు ఉత్సవాలు దగ్గరయ్యాయి. - పీవీఆర్కే ప్రసాద్, టీటీడీ మాజీ ఈవో (03.11.1978-08.07.1982) నాడు తొక్కిసలాటలు.. నేడు హాయిగా ఉత్సవాలు ఆలయ నాలుగు మాడ వీధుల విస్తరణకు ముందు ఉత్సవాల్లో తొక్కిసలాటలు జరిగేవి. ప్రతి సంవత్సరం పది, పదిహేను మందికి కాళ్లు, చేతులు విరిగేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. నాడు పీవీఆర్కే ప్రసాద్ వంటి ఎందరో పెద్దలు క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను దశలవారీగా చేస్తూ వచ్చారు. వాళ్లల్లో నేనూ ఒకడిని కావడం నా అదృష్టం. స్థానికులు ఆయా పరిస్థితులకు అనుగుణంగా టీటీడీకి సంపూర్ణ సహకారం అందించడం వల్ల లక్షలాది జనం ఉత్సవాలను సంతృప్తిగా వీక్షించగలుగుతున్నారు. - అజేయకల్లం, టీటీడీ మాజీ ఈవో (08.12.2002-10.02.2005) బ్రహ్మోత్సవం.. ఉండూరోళ్ల సంబరం ‘ఏంకటేశుడి బ్రహ్మోత్సవాలు ఉండూరోళ్ల (తిరుమల స్థానికులు) సంబరం. పాత రోజుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఉండూరోళ్లదే పెద్ద పాత్ర. ఆ తర్వాత అధికారుల హవా పెరిగిపోయింది. పదిరోజులు యాత్రికులతో ఊరు కిటకిటలాడిపోతోంది. ఉండూరోళ్ల బంధువులు పిల్లాజెల్లాతో వచ్చి వేడుకల్ని చూసి ఆనందించేవారు. ఆ రోజులే వేరు’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో 94 ఏళ్ల నైనప్పగారి సుబ్బయ్య (తిరుమల గాంధీ) తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ పది రోజులు మా పెద్దలు మా ఇంట్లోని సామాన్లు ఓ మూలన సర్దేసేవారు. కొంత స్థలాన్ని పరదాలు కట్టి వాళ్లకిచ్చేవారు. అందులోనే మేము, వాళ్లు (యాత్రికులు) పదిరోజులుంటూ ఉత్సవాలను చూసేవాళ్లం. వెళ్లేటప్పుడు పదో పరకో ఇచ్చేవారు. నా చిన్నప్పటి ఉత్సవాల్లో జీవం ఉండేది, ప్రస్తుతం అంతా రెడీమెడ్గా తయారైపోయింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు అన్నకూటోత్సవం నాడు శ్రీవారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించేవారు. ఆ రోజు మూలమూర్తికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధిలో అన్నపురాశితో స్వామికి నైవేద్యం సమర్పించేవారు. ఆ అన్నపు రాశిని భక్తులకు పంచిపెట్టేవారు. అప్పట్లో తిరుమలలో పూటకూళ్లు తప్ప ప్రైవేట్ హోటళ్లు ఉండేవి కావు. అందుకే భక్తులకు ఆలయ అన్నప్రసాదాలే ఆహారం! స్థానికంగా ఉండే కొన్ని కుటుంబాలు ఆలయంలో స్వామికి నైవేద్యంగా సమర్పించే ఈ అన్నపు రాశిపైనే ఆధారపడి జీవించాయి. కరువు కాలాల్లో కూడా ఆహార కొరతను తీర్చుకునేందుకు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి .. చుట్టుపక్కల గ్రామాల నుంచి పేదజనం తిరుమలకు చేరుకునేవారు. గంపల్లో అన్నాన్ని తీసుకెళ్లి ఆకలి తీర్చుకునేవారు. అలాగే, నిత్యం శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూ వరాహస్వామికి సమర్పించే ప్రసాదాలపై ఆధార పడి ఎన్నెన్నో కుటుంబాలు జీవించాయి. నేడు ఉచిత అన్నప్రసాద వితరణ తిరుమల కొండకు వచ్చే లక్షలాది భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ నిత్యాన్న సత్రం ద్వారా రుచికరమైన అన్నప్రసాదాన్ని టిటిడి అధికా రులు అందిస్తున్నారు. తిరుపతి బాలాజీ లడ్డూ... బహుత్ అచ్చాహై! నాణ్యత, రుచి, పరిమాణంలో తిరుగులేని తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని 1968లో నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి సంకల్పించారు. అప్పటి మిరాశీదారు ఏ.రామస్వామి దీక్షితులు కల్యాణోత్సవం లడ్డూను ఢిల్లీకి తీసుకెళ్లి స్వయంగా ఇందిరాగాంధికి అందజేశారు. ఆమె భక్తితో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ‘తిరుపతి బాలాజీ లడ్డూ బహుత్ అచ్చాహై’ అంటూ ఆనందంతో పరవశించిపోయారు. నాడు బూందీ.. నేడు లడ్డూ పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర తిరుమల ఆలయంలో పల్లవుల కాలం (క్రీ.శ.830) నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. రెండవ దేవరాయలు కాలం నుండి ఈ ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్య వేళలు) ఖరారయ్యాయట. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహరపడి(క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. దీన్ని గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. అప్పటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీ ప్రసాదం విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 1940 తొలిరోజుల్లో కొండ లడ్డు (అప్పట్లో కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత రెండు, అయిదు, పది, పదిహేను, ప్రస్తుతం ఇరవై ఐదు రూపాయలకు చేరింది. చాలా కాలంపాటు రూ.2 కే విక్రయించేవారు. తర్వాత నాలుగు, ఐదు, పదికి పెరిగింది. ఆ తర్వాత ఏకంగా రూ.25 కుపెరిగింది. కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూకంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల మధ్య బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5.36 నిముషాల నుంచి 6.00 గంటల మధ్య మీన లగ్నమందు ధ్వజారోహణం ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి ఏపీ సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రాత్రి 7.45 గంటలకు స్వామి వారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని టీటీడీ ఆలయ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడించారు. తిరుమల చేరుకునేందుకు చంద్రబాబు ప్రయాణించే అలిపిరి టోల్గేట్ నుంచి రెండవ ఘాట్ రోడ్డు వద్ద భారీగా బందోబస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే చంద్రబాబు పర్యటించే అన్ని ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు ఆర్టీసీ మరిన్ని బస్సు సర్వీసులను నడుపుతుందని ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. -
తిరుమలకు తప్పిన నీటిగండం
బ్రహ్మోత్సవాలకు సమస్య లేనట్టే సాక్షి, తిరుమల: వచ్చే నెలాఖరులో నిర్వహించనున్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు నీటి సమస్య తొలగింది. వారం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లోకి నీరు చేరుతోంది. తెలుగు గంగనుంచి వచ్చే సరఫరా, బోర్లలో లభించే నీరు దీనికి అదనం. ప్రస్తుతం లభ్యమయ్యే నీరు వంద రోజులకు సరిపోతుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొన్నటి వరకూ నీటి లభ్యతపై ఆందోళనగా ఉన్న టీటీడీకి ప్రస్తుత వర్షాలు ఊరటనిచ్చాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నీటి గండం ఎలా అధిగమించాలో తెలియక టీటీడీ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరుణుడు కరుణించడంతో వారం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాల్లోకి వర్షపు నీరు చేరింది. గోగర్భం డ్యాంలో 151 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 790 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 580 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 232 లక్షల గ్యాలన్ల నీరు చేరింది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తులు కిటకిటలాడారు. సాయంత్రం 6 గంటల వరకు 29,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు. వెలుపల కిలోమీటరు వరకు వేచిఉన్నారు. వీరికి 24 గంటల తర్వాత దర్శనం లభించనుంది. కాలిబాట భక్తులకు 16 గంటలు, రూ. 300 టికెట్ల దర్శన భక్తులకు 8 గంటల తర్వాత దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో గదుల కోసం భక్తులు పడిగాపులు కాచారు. నాలుగు గంటల పాటు వేచిఉన్నా తలనీలాలు తీయడం ఆలస్యం కావడంతో జీఎన్సీ వద్దున్న కల్యాణకట్టలో భక్తులు ఆగ్రహంతో గేటు విరిచారు. హుండీలో గురువారం భక్తులు సమర్పించిన కానుకల్ని శుక్రవారం లెక్కించగా రూ. 3.23 కోట్లు లభించింది. -
తిరుమల రథసప్తమి బ్రహ్మోత్సవం
-
గరుడ వాహనంపై దేవదేవుడు
భక్తులతో పోటెత్తిన తిరుమల సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధవారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. గర్భాలయంలోని మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామమాల ధరించిన మలయప్ప స్వామి, గరుత్మంతుడిపై ఊరేగారు. శ్రీవిల్లి పుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన తులసి మాల, చెన్నై నుంచి వచ్చిన నూతన ఛత్రాల(గొడుగులు)ను గరుడ వాహనంలో అలంకరించారు. గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం హోరెత్తింది. స్వామి వైభోగాన్ని కళ్లారా చూసి లక్షలాది మంది భక్తులు ఆనందపరవశులయ్యారు. రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. సేవ ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కాగా, వాహన సేవ ప్రారంభం, ఊరేగింపులో వీఐపీల మధ్య చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. బంధుగణంతో తరలివచ్చిన వీఐపీలను అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది నానాతంటాలు పడ్డారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి కొత్త గొడుగులు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా జీయర్ మఠానికి చేరుకున్న 8 కొత్త గొడుగులకు ప్రత్యేక పూజలు చేసి, నాలుగు మాడవీధులలో ఊరేగించిన తర్వాత వాటిని ఆలయానికి అప్పగించారు. ఇక సమైక్యాంధ్ర బంద్ ప్రభావం, బస్సుల కొరత ఉన్నా గరుడ వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. నేడు కొత్త స్వర్ణరథం ఊరేగింపు తిరుమలలో గురువారం శ్రీవారి కొత్త స్వర్ణరథాన్ని ఊరేగించనున్నారు. రూ.25 కోట్లతో ఇటీవల టీటీడీ దీన్ని తయారు చేయించింది. ఆగమోక్తంగా పూజలు నిర్వహించి, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రథాన్ని ఊరేగించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. -
సింహవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : బ్రహ్మోత్సవాలలో మూడవరోజు సోమవారం ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు ఈ అవతారంలో లోకానికి చాటుతారు. అలాగే నేటి రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. .ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో భక్తులు కిటకిటలాడారు. -
వెంకన్నకు విరాళాల వెల్లువ
టీటీడీకి విరాళాలు ఇచ్చే దాతలకు భారత ప్రభుత్వ ఆదాయపన్ను చట్టం 80(జీ) కింద పన్ను మినహాయింపు కూడా ఉండటంతో విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అధినేత విజయ్‌మాల్యా 1980లో శ్రీవారి ఆలయ తిరుమామణి మండపానికి బంగారు తాపడం చేయించారు. పారిశ్రామిక దిగ్గజాలైన రతన్‌టాటా, అనిల్ అంబానీ తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ప్లాస్మా టీవీలు, ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయించారు. ముఖేష్ అంబానీతోపాటు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని భక్తులెందరో శ్రీవారికి ఆభరణాలను తయారు చేయించారు. 2008లో పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి రూ.5 కోట్ల విలువగల మేలిమి వజ్రాలు పొదిగిన క టి, వరద హస్తాలను స్వామికి సమర్పించారు. తర్వాత కొత్తగా నిర్మించిన తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవన సముదాయానికి వంటసామగ్రి, ఫర్నిచర్‌ను విరాళంగా సమర్పించారు. 2009లో గాలి జనార్దన్‌రెడ్డి సుమారు రూ.45 కోట్లు విలువైన వజ్ర కిరీటాన్ని బహూకరించారు. ఆయన సోదరుడు గాలి కరుణాకరరెడ్డి గర్భాలయ మూలమూర్తికి బంగారు పాద తొడుగులు సమర్పించారు. టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటిరూపాయలు విరాళంగా ఇచ్చారు. సుమారు రూ.1 కోటి విలువైన సూర్యప్రభ వాహనాన్ని నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా సమర్పించారు. 2010లో రూ.4 కోట్లతో కల్యాణవేదిక నిర్మించారు. అలాగే ఆలయ ప్రాకారాన్ని స్వర్ణతాపడం చేయించడం కోసం మొత్తం 113 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరంకు చెందిన ప్రవాస భారతీయుడు అనంత కోటిరాజు రూ.20 కోట్ల విరాళంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవన సముదాయాన్ని నిర్మించారు. రూ. 5 కోట్ల ఖర్చుతో తిరుమలలో పరిశుద్ధమైన నీటిని సరఫరా చేస్తున్నారు కోటిరాజు. 2013 ఏప్రిల్‌లో ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు రూ.16.65 కోట్లు విరాళం ఇచ్చారు. టీటీడీ చేపట్టే కార్యక్రమాలకు దాతలు ఆజ్ఞాతంగా ఇచ్చే విరాళాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. 1500 టన్నుల కూరగాయల విరాళం నిత్యాన్నదాన ట్రస్టు ద్వారా రోజూ భోజనానికి అవసరమైన 3.5 టన్నుల కూరగాయల్ని వితరణ రూపంలో భక్తులే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.1 కోటి పైబడిన 120 నుంచి 150 టన్నుల కూరగాయలు పంపుతున్నారు భక్తులు. మైసూరుకు చెందిన మంజులా సౌందర్ రాజన్, చెన్నయ్‌లోని అనంతకృష్ణన్, వేలూరులోని కనకస్వామి, బెంగళూరులోని కుమార స్వామి, వేలూరులోని చంద్రన్, చిక్కబళ్లాపూర్ చంద్రశేఖర్, మదనపల్లి రవి, విజయవాడకు చెందిన కుటుంబరావు కూరగాయలు అందజేస్తున్నారు. పుష్పకైంకర్యంలోనూ భక్తుల వితరణ తమిళనాడు సేలంలోని నిత్యపుష్పకైంకర్య ట్రస్టు, బె ంగుళూరులోని ఓం శ్రీ సాయిఫ్లవర్స్, హైదరాబాద్ శ్రీధర్ అండ్ గ్రూప్, బెంగుళూరులోని ఫాంహౌస్ అసోషియేషన్స్, మంత్రి దానం నాగేందర్, ఈరోడ్‌లోని శ్రీ సేవ ట్రస్టు, కరూర్‌లోని రమేష్‌బాబు పుష్పకైంకర్యంలో ప్రధాన దాతలు. వీరితోబాటు మరెందరో భక్తులు స్వామివారికి పుష్పకైంకర్యం చేయిస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక కథనాలు సహదేవ కేతారి సాక్షి, తిరుమల ఫొటోలు కె.మోహనకృష్ణ సాక్షి, తిరుమల కొన్ని ఫొటోలు, సమాచార సౌజన్యం: టీటీడీ ప్రజా సంబంధాల విభాగం -
బ్రహ్మోత్సవాలపై ఉగ్ర గురి!
సాక్షి, పుత్తూరు/చిత్తూరు/చెన్నై/హైదరాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉగ్రవాదుల కన్ను పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో రక్తపాతం సృష్టించేందుకు ముష్కరులు భారీ కుట్ర పన్నారు. స్వామివారికి పట్టే గొడుగుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే తమిళనాడు పోలీసులు, రాష్ట్ర పోలీసులు, ఆక్టోపస్ కమాండో బృందాల సాహసోపేతమైన 11 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌తో ఈ కుట్ర భగ్నమైంది. లేదంటే ఉగ్రవాదులు బ్రహ్మో త్సవాల్లో బీభత్సం సృష్టించేవారని నిఘా, పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడులో పోలీసులకు చిక్కిన ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశారు. ఆపరేషన్‌లో పాల్గొన్న తమిళనాడు ఎస్ఐబీ సీఐ లకష్మణ్ను ఉగ్రవాదులు కత్తులతో పొడిచారు. ఆయన చెనై్నలో చికిత్స పొందుతున్నారు. శనివారం తెల్లవారుజాము 3.30 నుంచి రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్‌కు పుత్తూరు వేదికైంది. ఏ క్షణానికి ఏమౌతుందోనన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు రాష్ట్రంలో.. అదీ తిరుమలకు అతి సమీపంలో మకాం వేశారని తెలిసి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చెనై్నలో ఉగ్రవాది అరెస్టుతో కదిలిన డొంక.. ఫక్రుద్దీన్.. అలియాస్ పోలీస్ ఫక్రుద్దీన్.. ఇస్లామిక్ డిఫెన్స ఫోర్స (ఐడీఎఫ్) సంస్థకు చెందిన ఈ కరుడుగట్టిన ఉగ్రవాది తన ఇద్దరు అనుచరులతో శుక్రవారం రాత్రి చెనై్నలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా పుత్తూరులో ఉగ్రవాదుల జాడ తెలిసింది. బాంబులు తయారీ, అమర్చడం, పేల్చడం తదితరాల్లో ఫక్రుద్దీన్ సిద్ధహస్తుడు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో కల్లోలం సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెనై్న పోలీస్ కమిషనర్ జార్జకు సమాచారం అందడంతో పెరియమేడులోని ఒక లాడ్జిపై దాడి చేశారు. గదిలో దాగి ఉన్న పోలీస్ ఫక్రుద్దీన్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదులు బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్ ఉన్నారన్న సమాచారం సేకరించారు. పక్కింటివాళ్లమంటూ తలుపు తట్టిన పోలీసులు.. విచారణలో ఫక్రుద్దీన్ వెల్లడించిన విషయాలను చిత్తూరు ఎస్పీ కాంతిరాణా టాటాకు తమిళనాడు ఎస్ఐబీ ఐజీ వివరించారు. నగరి సీఐ శివభాస్కర్‌రెడ్డి సహకారంతో శనివారం తెల్లవారుజామునే తమిళనాడు పోలీసులు పుత్తూరు చేరుకున్నారు. ఉగ్రవాదులున్న మేదర వీధిలోని ఇంటి వద్దకు వెళ్లి ఇన్స్పెక్టర్ లకష్మణ్ తొలుత తలుపులు తట్టారు. పక్కింటివాళ్లమని చెబుతూ వారిని పిలిచారు. ఉగ్రవాదులు తలుపులు తీయగానే పోలీసులు లోపలికి ప్రవేశించారు. తేరుకున్న ఉగ్రవాదులు లకష్మణ్పై కత్తితో దాడికి దిగారు. ఆయనతో పాటు లోపలికి వెళ్లిన కానిస్టేబుల్‌పైనా రాడ్డుతో దాడిచేశారు. దాంతో ఆ వెనుకే ఉన్న మరో పోలీసు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ కడుపులోకి బులెట్ దూసుకెళ్లింది. పక్కనే ఉన్న బిలాల్ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు బయటకు వచ్చేశారు. ఉదయం 7 గంటలప్పుడు చిత్తూరు ఎస్పీ కాంతిరాణా ఘటనా స్థలికి చేరుకున్నారు. డీజీపీ ప్రసాదరావుకు పరిస్థితిని వివరించి అదనపు బలగాలను కోరారు. తిరుమల ఆక్టోపస్ కమాండో యూనిట్‌ను పుత్తూరు తరలించారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఆపరేషన్ పూర్తిచేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాల జారీ చేశారు. ఆక్టోపస్ కమాండో బృందాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఎస్పీ కాంతిరాణా ఆదేశాలతో ఓ పోలీసు బృందం ఉగ్రవాదులతో చర్చలు జరిపి లొంగిపోవాల్సిందిగా కోరింది. కానీ వారు అంగీకరించకపోవడంతో కమాండో బృందాలు ఇంటిపై నుంచి రంద్రాలు చేసి పది వరకూ బాష్పవాయువు గోళాలను ఇంట్లోకి వదిలారు. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడటంతో బిలాల్ భార్య, ముగ్గురు పిల్లలు మొదట బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు బయటికొచ్చి లొంగిపోయారు. అప్పటికే బుల్లెట్ గాయమైన ఇస్మాయిల్‌ను ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఇద్దరినీ తమిళనాడు పోలీసులకు అప్పగించారు. ...అందుకే పుత్తూరు: డీజీపీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉగ్రవాదులు పుత్తూరులో షెల్టర్ తీసుకుని ఉంటారని డీజీపీ బి.ప్రసాదరావు చెప్పారు. వారు తిరుమలలో పేలుళ్లకు కుట్ర పన్నారా అన్నది విచారణలోనే తేలుతుందన్నారు. ఉగ్రవాదులున్న రెండు ఇళ్లలో ఒక పిస్టల్, భారీగా పేలుడు పదార్థాలు, 80 జిలెటెన్ స్టిక్స, పేల్చడానికి సిద్ధంగా ఉంచిన ఆరు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ‘ఉగ్ర’ కదలికలపై నిఘా లోపం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలను పసిగట్టడంలో మన ఇంటెలిజెన్స విభాగం వైఫల్యాన్ని పుత్తూరు ఉదంతం మరోసారి కళ్లకు కట్టింది. తిరుపతి సహా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలున్న చిత్తూరు జిల్లాలో ఏకంగా 6 నెలలపాటు ఉగ్రవాదులు కుటుంబాలతో పాటుగా మకాం వేసినా పసిగట్టలేకపోవడం రాష్ట్ర నిఘా వైఫల్యానికి పరాకాష్టగా భావిస్తున్నారు. తమిళనాడు పోలీసులు ఆపరేషన్‌కు దిగేదాకా వారి ఆనుపానులు కూడా రాష్ట్ర పోలీసులకు ఏమాత్రమూ తెలియకపోవడం గమనార్హం! ఆక్టోపస్ తొలి ఆపరేషన్ సక్సెస్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెరర్రిస్ట ఆపరేషన్స (ఆక్టోపస్) తొలిఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఒక్క బులెట్ పేలకుండానే పని పూర్తి చేసింది. రెండు ఆక్టోపస్ యూనిట్లు తిరుమలలో భద్రత కోసం ఉండగా, 250 మంది హైదరాబాద్‌లో ఉన్నారు. తెలంగాణ ఆందోళనలప్పుడు విద్యుత్‌సౌధ లోపల తాళం వేసుకున్న ప్రజాప్రతినిధులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు, దిల్సుఖ్నగర్ పేలుళ్ల తర్వాత తనిఖీల్లో ఆక్టోపస్ కమెండోలు పాల్గొన్నా ఉగ్రవాద నిరోధక చర్యల్లో నేరుగా పాల్గొన్నది మాత్రం పుత్తూరులోనే. ఎవరీ ఫక్రుద్దీన్..? అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన ఫక్రుద్దీన్ (48) కాశ్మీర్ మిలిటెంట్ల వద్ద శిక్షణ పొందాడు. తమిళనాడు మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెందిన ఇతని కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. 2011లో బీజేపీ అగ్రనేత అద్వానీపై హత్యాయత్నం కేసు తదితరాల్లో ఫక్రుద్దీన్ నిందితుడు. ఇతని అనుచరులు ఇస్మాయిల్, బిలాల్, అబూబకర్లపై రూ.20 లక్షల రివార్డుంది. ఆపరేషన్ జరిగిందిలా.. తెల్లవారుజామున 3.30 గంటలు.. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై పోలీసులు దాడికి దిగారు. ఇన్స్పెక్టర్ లకష్మణ్తల, వీపుపై ఉగ్రవాదులు కత్తితో పొడిచారు. 4.30 గంటలు: అప్రమత్తమైన స్పెషల్ టాస్కఫోర్స పోలీసులు ఉగ్రవాదుల ఇంటిపై కాల్పులు జరిపారు. చనిపోయాడన్న ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ లకష్మణ్ను ఉగ్రవాదులు ఇంటి బయటికి నెట్టేసి తలుపులు వేసుకున్నారు. ఇంటి వెనుకవైపునకు వెళ్లిన పోలీసులు ఉగ్రవాదులు షెల్టర్ తీసుకున్న మరొక ఇంట్లో రెండు బాంబులు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 గంటలు: పోలీసులు... ముష్కరులు ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో వారు వంటగ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి పేల్చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఫైర్ ఇంజిన్‌ను పిలిపించి ఇంట్లోకి కిటికీ ద్వారా నీటిని పంప్ చేసి మంటలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఉదయం 6 గంటలు: ఉగ్రవాదులు ఉన్న మేదరవీధి ప్రాంతానికి విద్యుత్ నిలిపేశారు. ఇంట్లో ఉన్న వారు టీవీల్లో న్యూస్ చూసి మరింత అప్రమత్తమయ్యే అవకాశం లేకుండా చేశారు. ఉదయం 7 గంటలు: చిత్తూరు ఎస్పీ కాంతిరాణా, తిరువళ్లూరు ఎస్పీ అన్బూ ప్రత్యేక బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్న బాంబులను పరిశీలించారు. ఉదయం 8 గంటలు: 50 మంది ఆక్టోపస్ కమాండోలు వచ్చారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఉదయం 9 గంటలు: ‘బిలాల్ మాపై నమ్మకం ఉంటే వెంటనే బయటకు వచ్చేయ్... ఆడవారిని, పిల్లల్ని బయటకు పంపేయ్...’ అని పోలీసులు తమిళంలో గట్టిగా అరిచి చెప్పారు. బదులుగా, ‘నేను అల్లా దగ్గరకు వెళ్లడానికైనా సిద్ధమే... మీరు మగాళ్లయితే లోపలికి రండి’ అంటూ ప్రతి సవాల్ విసిరాడు. ఉదయం 9- మధ్యాహ్నం ఒంటి గంట: ఉగ్రవాదులున్న వీధిని పోలీసులు బ్లాక్ చేశారు. వారున్న పెంకుటిల్లులోకి వెళ్లే, దాడి చేసే అవకాశాలపై చర్చించుకున్నారు. చివరకు ఇంటి పైకప్పుకు డ్రిల్లింగ్ చేసి భాష్పవాయుగోళాలు లోపలకు జారవిడిచారు. మధ్యాహ్నం 1.50 గంటలు: ఇంటి నుంచి ఒక మహిళ, ముగ్గురు పిల్లలను బయటకు పంపించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలు: ముందు గదిలో బాష్పవాయుగోళాలు పడడంతో ముష్కరులు వెనుక గదిలో దాక్కున్నారు. గంట తర్వాత లొంగిపోయƒూరు. అలిపిరిలో ఇంతకుముందే రెక్కీ? ఉగ్రవాదుల లక్ష్యం తిరుమలే అయి ఉండొచ్చని ఇంటెలిజెన్స వర్గాలు చెబుతున్నాయి. ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు... తిరుమల అలిపిరి వద్ద ఉగ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్.. మరో ఇద్దరితో కలిసి ఇంతకుముందే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. -
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర!
గత అర్థరాత్రి నుంచి తమ బలగాలు పుత్తూరులో చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తి అయిందని ఆక్టోపస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్‌తోపాటు మున్నాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిద్దరిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అంబులెన్స్‌లో చెన్నైకు తరలించినట్లు చెప్పారు. తిరుమలలో నేటి నుంచి ప్రారంభంకానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని వివరించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోలీసులకు చిక్కిన ఉగ్రవాదిని దర్యాప్తులో భాగంగా విచారించగా కీలక సమాచారాన్ని అందించాడని తెలిపారు. దాంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేసి చెప్పారు. అయితే ఉగ్రవాదులతోపాటు ఉన్న మహిళ ముగ్గురు చిన్నారులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆక్టోపస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ ముఖ్య నిందితుడు అన్న విషయం తెలిసిందే.