
బ్రహ్మోత్సవాలే కాదు...జగత్కల్యాణోత్సవాలు
వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవ ణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను జరిపించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి.
వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. సౌర, చాంద్రమానాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. వైఖానన ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణ నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.
నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు లేకుండా అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఈసారి అధిక భాద్రపద మాసం రావటం వల్ల బ్రహ్మోత్సవ సుముహూర్తం ఓ నెల ముందుకు వచ్చింది.
అంకురార్పణ
వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీతప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు.
దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)-నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం
బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
పెద్ద శేషవాహనం
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు.
చిన్నశేషవాహనం
రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు.
హంసవాహ నం
రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం.
హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమెన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారని ఐతిహ్యం.
సింహవాహనం
మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం
మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.
కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వారాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు.
సర్వభూపాల వాహనం
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వ భూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.
మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కార మిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహ పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది.
గరుడవాహనం
ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు.
హనుమంత వాహ నం
ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతు భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు.
గజ వాహనం
గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
సూర్యప్రభ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.
చంద్ర ప్రభ వాహనం
ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు.
రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
అశ్వవాహనం
ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.
చక్రస్నానం
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసి పోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరోరూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
ధ్వజావరోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
వెండిరథం వెలుగులు కనుమరుగు
వెంకన్న సన్నిధిలో వెండిరథం వెలుగులు కనుమరుగయ్యాయి. మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో తిరుమలేశునికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తొలిసారి జరిగే వార్షిక బ్రహ్మోత్సవం ఎనిమిదోనాడు కొయ్యతేరుపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వెండిరథం ఊరేగించటం సంప్రదాయం. అలాగే, ఏటా వార్షిక వసంతోత్సవాలలో రెండోరోజు వెండిరథంపై ఉత్సవమూర్తులు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
ఈ సంప్రదాయం 1992 వరకు సాగింది. తర్వాత శ్రీవారికి కొత్తగా స్వర్ణరథం సిద్ధం చేశారు. అప్పటి నుంచి వెండిరథానికి బదులు స్వర్ణరథాన్ని ఊరేగిస్తున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వెండిరథాన్ని తప్పనిసరిగా ఊరేగించాలని అర్చకులు, పండితులు చెబుతున్నారు. స్వర్ణరథం అలంకార ప్రాయంగా మాత్రమే చూడాలని పండితులు చెబుతున్నారు. కొత్త వెండిరథం అవసరమని పండితుల సూచనతో ఆ దిశగా టీటీడీ అడుగులు వేసినా ఇంతవరకు సఫలం కాలేదు.
స్వామి సేవలో స్వర్ణరథం
1992లో తయారు చేసిన స్వర్ణరథం సుమారు 21 ఏళ్లపాటు సేవలందించింది. క్రమేణా అది మసకబారడంతో మాజీ టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో మరొక స్వర్ణరథాన్ని తయారు చేయాలన్న సంకల్పం 2013 నాటికి కార్యరూపం దాల్చింది. తిరుమలలోని మ్యూజియంలో ప్రత్యేకంగా వర్క్‌షాపు ఏర్పాటు చేసి కొత్త స్వర్ణరథాన్ని సిద్ధం చేశారు.
ఇది భారతదేశంలోనే అతిపెద్దది. 32 అడుగు ల ఎత్తు. 30 టన్నుల బరువు గల ఈ రథానికి మొత్తం 74 కిలోల మేలిమి బంగారం వాడారు. 18 అంగుళాల మందంతో కూడిన 2900 కిలోల రాగి పై తొమ్మిదిసార్లు స్వర్ణతాపడం చేశారు. బీహెచ్‌ఈఎల్ సంస్థ రూపొందించిన హైడ్రాలిక్ చక్రాలతో సరికొత్త హంగులతో స్వర్ణరథాన్ని తీర్చిదిద్దారు. వైఖానస ఆగమోక్తంగా కొత్త స్వర్ణరథానికి సంప్రోక్షణ, వైదిక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పను రథపీఠంపై వేంచేపు చేశారు. తొలిసారిగా 2013, అక్టోబరు 10వ తేది గరుడ వాహన సేవ సందర్భంగా రథరంగ డోలోత్సవం నిర్వహించారు. స్వర్ణకాంతుల స్వర్ణరథంలో దేవదేవుడైన స్వామివారు, అమ్మవార్లతో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అప్పటి నుంచి ఉత్సవాల్లో కొత్త స్వర్ణరథం భాగమైంది.