భక్తుల మధ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Tirumala Srivari Salakatla Brahmotsavam Among Devotees Mada Veedhi | Sakshi
Sakshi News home page

భక్తుల మధ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Published Tue, Jul 12 2022 8:25 AM | Last Updated on Tue, Jul 12 2022 2:48 PM

Tirumala Srivari Salakatla Brahmotsavam Among Devotees Mada Veedhi - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలపై వేంచేసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన వాహన సేవలను మాడ వీధుల్లో నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్‌ 1న గరుడ సేవ జరుగనుందని చెప్పారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి వివరించారు. 

ముఖ్య నిర్ణయాలివీ
ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల నిర్వహణ. తిరుమల వచ్చే భక్తులను ఎలాంటి టోకెన్‌ లేకుండా నేరుగా దర్శనానికి పంపే విధానం కొనసాగింపు. తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్‌ కౌంటర్ల ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. తిరుమల ఆక్టోపస్‌ బేస్‌ క్యాంప్‌లో మిగిలిన పనులను రూ.7 కోట్లతో పూర్తి చేయడానికి నిర్ణయం. రూ.2.90 కోట్లతో అమరావతిలోని శ్రీవారి ఆలయం వద్ద పూల తోటల పెంపకం, పచ్చదనం పెంపొందించేందుకు ఆమోదం.

2023వ సంవత్సరానికి 8 రకాల క్యాలెండర్లు, డైరీలు కలిపి 33 లక్షల ప్రతులు ముద్రించాలని నిర్ణయం. సప్తగిరి మాసపత్రికను 5 భాషల్లో నెలకు 2.10 లక్షల కాపీలు ముద్రించేందుకు నిర్ణయం. చెన్నైకి చెందిన భక్తురాలు డాక్టర్‌ పర్వతం తిరువాన్మయూర్, ఉత్తాండి ప్రాంతాల్లో రూ.6 కోట్లు విలువ చేసే రెండు ఇళ్లను శ్రీవారికి కానుకగా అందించాలని ముందుకు రాగా వాటిని స్వీకరించేందుకు ఆమోదం. అమెరికాకు చెందిన డాక్టర్‌ రామనాథం గుహ బెంగళూరులోని డాలర్స్‌ కాలనీలో ఉన్న రూ.3.23 కోట్ల విలువచేసే అపార్ట్‌మెంట్‌ను స్వామివారికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విరాళాన్ని స్వీకరించడానికి ఆమోదం. 

బూందీ పోటు ఆధునికీకరణపై అధ్యయనానికి ఆదేశం
తిరుమల బూందీ పోటు ఆధునికీకరణకు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌ సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మార్క్‌ఫెడ్‌ ద్వారా 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయం, ధరల ఖరారుకు మార్క్‌ఫెడ్‌ అధికారులతో అవగాహన ఒప్పందం. శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులపై ఆగమ పండితులతో చర్చించి నిర్ణయం.

మావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కృష్ణారావు, పార్థసారధిరెడ్డి, మారుతీ ప్రసాద్, రాజేష్‌కుమార్‌శర్మ, మొరంశెట్టి రాములు, నందకుమార్, విద్యాసాగర్‌రావు, సనత్‌కుమార్, శశిధర్, మల్లీశ్వరి, శంకర్, విశ్వనాథ్, మధుసూదన్‌యాదవ్, సంజీవయ్య, వైద్యనాథన్‌ కృష్ణమూర్తి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.

అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు
తిరుమల: అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఏపీఎన్‌ఆర్టీఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్‌ 18 నుంచి 9 నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు సోమవారంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు నిర్వహించారు. జూన్‌ 18న శాన్‌ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్‌ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు జరిగాయి. ఈ నెల 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్‌ డీసీ, 9న అట్లాంటా, 10న బర్మింగ్‌ హమ్‌ నగరాల్లో కల్యాణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement