కొత్త కాంతుల దసరా! | A very Happy and prosperous Dussehra Celebrations in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొత్త కాంతుల దసరా!

Published Tue, Oct 8 2019 3:53 AM | Last Updated on Tue, Oct 8 2019 5:27 AM

A very Happy and prosperous Dussehra Celebrations in Andhra Pradesh - Sakshi

సోమవారం మహిషాసురమర్దనిదేవి అలంకరణలో బెజవాడ దుర్గమ్మ, తిరుమలలో రథం పైనుంచి భక్తులకు దర్శనమిస్తున్న స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ప్రతి మోములోనూ దసరా సంబరం శోభిల్లుతోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రమంతటా పండుగ సందడి మొదలైంది. ఊరూరా, వాడవాడలా దుర్గాదేవి విగ్రహాలు ఏర్పాటు చేసి, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నా పెద్దా అంతా దసరా వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వస్తున్న వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. కొత్త బట్టలు, ఆభరణాలు, గృహోపకరణాలు, వాహనాల కొనుగోలుదారులతో మార్కెట్‌లు కిటకిటలాడుతున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రాష్ట్రమంతా పండుగ కళ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలకు భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు. శ్రీశైలంలో రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్న భ్రమరాంబను దర్శించుకుని భక్తులు తన్మయులవుతున్నారు.  

కరువు తీరా వర్షం... కర్షకుల హర్షం 
దాదాపు దశాబ్దం తరువాత రాష్ట్రంలో ఈ ఏడాది కరువు తీరా వర్షాలు కురిశాయి. రుతుపవనాల రాక కొంత ఆలస్యమైనా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార, పెన్నా తదితర నదులు పొంగిపొరలుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. కృష్ణానది పరవళ్లు తొక్కడంతో ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ గేట్లు మూడుసార్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదిలారు. ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను వీలైనంత ఎక్కువగా రాయలసీమలోని ప్రాజెక్టులు, జలాశయాలకు తరలించింది.

ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం విశేషం. కరువుకు నెలవైన అనంతపురం జిల్లాలో వర్షాలు బాగా పడడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. ప్రకృతి కరుణించడంతో రైతులు ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో ఇప్పటిదాకా రికార్డుస్థాయిలో 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇక ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకాన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఈ పథకం కింద ఇప్పటిదాకా 40 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎరువుల కొరత, నకిలీ విత్తనాల బెడద లేకుండా ముందుగానే జాగ్రత్త వహిస్తోంది. పోలవరంతో సహా అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధమైంది. తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పేదలకు గొప్ప ఊరట 
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం పేద బతుకులకు గొప్ప ఊరటనిచ్చింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్‌ను దశల వారీగా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామన్న హామీని అమలు చేశారు. ఈ ఏడాది తొలి దశ కింద పింఛన్‌ను రూ.2,250కు పెంచారు. వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్‌ ప్రకటించారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు... ఇలా వివిధ వర్గాల ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌) ప్రకటించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించడం ద్వారా కొత్తచరిత్రకు నాంది పలికారు. ఆటో, ట్యాక్సీ కార్మికులకు ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేసే పథకాన్ని ఇటీవలే ప్రారంభించారు. అర్హులైన అందరి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. రూ.1,000 దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం పేదలకు ఆరోగ్య రక్షణ కల్పించింది.

అమ్మఒడి పథకాన్ని 2020 జనవరి 26న ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ బిడ్డలను చదివించగలమన్న భరోసా పేద తల్లులకు వచ్చింది. ఇక పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం ద్వారా తమది మనసున్న ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిరూపించారు. 

యువతలో నవోత్సాహం 
రాష్ట్రంలో యువత ఈ ఏడాది నిజమైన దసరా ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఎందుకంటే సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్యోగాల విప్లవం సృష్టించారు. ఒకేసారి 4 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక 2.68 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారు. ఇకపై ప్రతిఏటా జనవరిలో రిక్రూట్‌మెంట్‌ క్యాలండర్‌ ప్రకటిస్తామని చెప్పారు. 

పల్లెలు ప్రశాంతం... పేద కుటుంబాల్లో ఆనందం 
మద్యం బెల్టు దుకాణాలకు చరమ గీతం పాడడంతో పల్లెసీమలు ప్రశాంతతకు మారుపేరుగా మారాయి. పేదల బతుకుల్లో చిచ్చు పెడుతున్న బెల్టు షాపులను పూర్తిగా తొలగించడం ద్వారా ముఖ్యమంత్రి తన నిబద్ధతను చాటుకున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బెల్టు షాపుల విజృంభణ వల్ల గ్రామాల్లో సామాజిక వాతావరణం దెబ్బతిని, దసరా ఉత్సవాల్లో అపశృతులు దొర్లేవి. మద్యం బెల్టు షాపులను ప్రభుత్వం పూర్తిగా తొలగించడంతో ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు.

పేదలు తమ కష్టార్జితాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, యువత, విద్యార్థులు, పేద, మధ్య తరగతి... ఇలా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోంది. ఈ దసరా పండుగ తమకు నిజమైన ఆనందాన్ని తెచ్చిందని జనం చెబుతుండడం విశేషం. 

ఈ దసరా మాకు ప్రత్యేకం 
ఆటో కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న రూ.10 వేలు ఇచ్చారు. దీంతో మాకు ఈ దసరా ప్రత్యేకమైనదిగా మారింది. లేదంటే నిత్యం అప్పులవాళ్ల వేధింపులతో పండగ కూడా చేసుకునేవాళ్లం కాదు. జగనన్న మా కష్టాలను దూరం చేశారు.    
– బోనిల ఆదినారాయణ, ఆటో కార్మికుడు, తగరపువలస, విశాఖ జిల్లా 

మా సంతోషాలకు కారణం జగన్‌ 
నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. యువత ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని పాదయాత్రలో ఆయనకు విన్నవించుకున్నాం. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయం. ఉద్యోగాలు సాధించిన వారి ఇళ్లల్లో నిజమైన పండుగ  ఇది. జగనన్న ఇచ్చిన వరమే మా సంతోషాలకు కారణం.  
 – జె.నవీన్‌ పాటి, వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రెటరీ, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌

అంతా మేలే జరుగుతోంది 
ఐదేళ్లుగా సాగుకు నీళ్లు లేక అవస్థలు పడ్డాం. కొత్త ప్రభుత్వం వచ్చాక అంతా మేలే జరుగుతోంది. సోమశిలలో పుష్కలంగా నీరొచ్చింది. రబీ సాగుకు సిద్ధమవుతున్నాం. నెల్లూరు జిల్లా నుంచే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తుండడం సంతోషకరం. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.
– వెడిచర్ల హరిబాబు, రామదాసుకండ్రిగ, నెల్లూరు జిల్లా 

నిజమైన పండుగ వచ్చింది
మా జీవితంలో నిజమైన పండుగ వచ్చింది. గ్రామ సచివాలయంలో ఉద్యోగం సాధించా. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. ఇది చాలా గర్వించదగ్గ విషయం. జీవితంలో ఇంతటి ఆనందం ఎçప్పుడూ పొందలేదు. ఇదంతా వైఎస్‌ జగన్‌ పుణ్యమే.  జగనన్న మా జీవితంలో నిజమైన పండుగ తెచ్చారు.
– భావన, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, వి.కోట, చిత్తూరు జిల్లా 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement