సాక్షి, తిరుమల: పోటెత్తుతున్న భక్తుల దర్శన సౌకర్యార్థం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని వెండి వాకిలికి అటుఇటుగా నేత్రద్వారాలు తెరవాల్సిన అవసరం ఉందని, దానివల్ల భక్తులు సులువుగా లోపలికి, బయటకు వెళ్లి వచ్చే అవకాశముందని ఆలయ ఓఎస్‌డి పి. శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి అన్నారు. దేవదేవుడు తలుచుకుంటే నేత్రద్వారాలు ఆపేశక్తి ఎవరికీ లేదని.. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొట్టమొదటి ఆలయ సన్నిధి ప్రాకారం మినహా మిగిలిన ఆలయ ప్రాకారాలన్నీ కొత్తగా నిర్మాణం చేసుకున్నవేనని ఆయన వివరించారు. అంకుర్పాణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే...
నాడు నిలువ నీడలేని స్వామి..
శ్రీ వేంకటేశ్వర స్వామివారు పూర్వపు రోజుల్లో చింత చెట్టుకింద ఉండేవారట. నిలువ నీడలేని రోజుల్లో అడవి జాతి మనుషులు వారి పద్ధతుల్లో పూజించేవారు. స్వామిపై సూర్య, చంద్రుల నీడ పడుతోందని ఆళ్వారుల కీర్తనల ద్వారా వెల్లడైంది. అంటే స్వామికి గుడి లేదన్నది విస్పష్టం. ఆ తర్వాత ‘‘నీ ముంగిట తొలి గడపగా ఉండాలి’’ అని కీర్తించిన కులశేఖరాళ్వారు మాటలతో గర్భాలయం వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత గర్భాలయం ఆనుకునే నిర్మాణాలు, ఆనంద నిలయం వచ్చి ఉండవచ్చు.
గరుడాళ్వార్ తర్వాత నిర్మాణాలన్నీ కొత్తవే..
స్వామి కొలువైన సన్నిధి ప్రాకారం మినహా మిగిలినవన్నీ కొత్త నిర్మాణాలే. తొలిరోజుల్లో గరుడాళ్వార్ వెనుకనే ధ్వజస్తంభం, కొబ్బరికాయలు కొట్టే అఖిలాండం ఉండేవి. భక్తులు పెరగడంతో వాటిని 13వ శతాబ్దం తర్వాత సంపంగి ప్రాకారం వెలుపలకు తరలించారు. ఆ తర్వాత ఆలయంలో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఆలయంలోనే అనేక మార్పులు, చేర్పులతో కొత్త నిర్మాణాలు వచ్చాయి.
పూజకు మాత్రమే ఆగమం..
తిరుమల శ్రీవారి కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారమే సాగుతున్నాయి. ఆ కైంకర్యాల్లో ఎలాంటి లోపాల్లేవు. ఆగమం కేవలం పూజకు మాత్రమే సంబంధం. నిర్మాణాల్లో మార్పులు చేర్పులు.. ఏది మంచి, ఏది చెడు చూడాల్సింది శిల్ప నిపుణులు, స్తపతులు మాత్రమే. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా భయపడను? 1996లోనే అప్పటి ఆలయ ఆగమ విద్వాంసులు మాడంబాక్కం శ్రీనివాసులు తిరుమల ఆలయంలో నేత్రద్వారాలు తెరుచుకోవటం శ్రేయస్కరమన్నారు. ఆగమ పండితుల మధ్య సమన్వయం లేకపోవడం, రాజకీయ కారణాలతో అది ఆగింది. కొండలతో కూడుకున్న తిరుమల లాంటి ఆలయ నిర్మాణాల్లో ఆగమం చూడకూడదు. ఆగమం పట్టించుకుంటే తిరుమల ఆలయం ఇంత స్థాయిలో విస్తరించి ఉండేదా? పెరుగుతున్న భక్తుల కోసం మార్పులు చేయవచ్చు. నా నలభై ఏళ్ల అనుభవంతోనే చెబుతున్నా.. భక్తుల కోసం స్వామి పూజ, స్వామి సన్నిధి మినహా ఇతర ఆలయాల్లోని నిర్మాణాల్లో ఎన్ని మార్పులు చేసినా తప్పులేదు.
వాహన సేవలూ మార్చవచ్చు
భక్తుల కోసం కొంతకాలంగా గరుడ వాహనం ఊరేగింపు సమయాన్ని రాత్రి 9 గంటలకు బదులు రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించునే అవకాశం కలుగుతోంది. ఇదే తరహాలో మిగిలిన వాహన సేవలూ మార్చవచ్చు. వాహన సేవల సమయాలను ఆగమంలో చెప్పలేదు. అలాగే, సహస్ర దీపాలంకార సేవ సమయం కూడా మార్చుకోవచ్చు. ఇకపోతే.. స్వామి తలపై భక్తులు ప్రయాణించకూడదన్న భావనతోపాటు రాజకీయ కారణంతో తిరుమల రోప్‌వే ప్రాజెక్టు ఆగింది. కొండ మీద సెల్ టవర్లు, వంతెనలు సైతం నిర్మించినందున రోప్‌వేకూ ఎలాంటి అభ్యంతరం లేదు.