శ్రీవారికి గద్వాల పంచెలు | Gadwal Chenetha labour work for venkateswara swamy | Sakshi
Sakshi News home page

శ్రీవారికి గద్వాల పంచెలు

Published Sat, Sep 17 2016 10:41 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

శ్రీవారికి నేసిన పంచెలను చూయిస్తున్న కార్మికులు - Sakshi

శ్రీవారికి నేసిన పంచెలను చూయిస్తున్న కార్మికులు

ఏరువాడ పంచె.. సంప్రదాయం శోభించే
  • తిరుమలేషుడి బ్రహ్మోత్సవాల్లో జోడు పంచెల ధారణ
  • మొదటిరోజు శ్రీవారికి అలంకరణ
  • 41రోజులుగా నిష్టతో నామాల మగ్గంపై తయారీ
  • గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచే కొనసాగుతున్న ఆనవాయితీ  
గద్వాల: కలియుగ ప్రత్యక్ష దైవం..అలంకార ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరస్వామికి, గద్వాల చేనేత పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఏటా నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఏరువాడ జోడు పంచెలను అలంకరిస్తారు. ఆ తర్వాతే వార్షిక బ్రహ్మోత్సవాలైనా, నవరాత్రి ఉత్సవాలైనా ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏరువాడ జోడు పంచెలను గద్వాల చేనేత కార్మికులే తయారు చేస్తుండటం విశేషం. దాదాపు 135ఏళ్లుగా ఇక్కడి చేనేత కార్మికులు ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలను అందజేస్తున్నారు. ఇందుకోసం శ్రావణ మాసంలో నేత పనిని ప్రారంభించి, మండల కాలం ఎంతో శ్రమించి వీటిని తయారు చేస్తారు. దేశం నలుమూలల నుంచి శ్రీవారికి ఎన్నో విలువైన కానుకలు అందుతున్నప్పటికీ వీటన్నింటిలోకెల్లా విలువైన కానుకను తెలంగాణ నుంచి అందుతుండటం ఇక్కడి చేనేత కార్మికులు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తారు. దేశంలోని ఏ చేనేత పరిశ్రమకు దక్కని ఖ్యాతి గద్వాల చేనేత పరిశ్రమకు దక్కిందని, అందుకే శ్రీవారి దయతో గద్వాల చేనేతకు దేÔ¶ , విదేశాల్లో ఇంత పేరుందని ఇక్కడి కార్మికుల నమ్మకం. ప్రతిఏటా గద్వాలలో తిరుమల శ్రీవారి కోసం తయారు చేస్తున్న ఏరువాడ జోడు పంచెలపై ఈ ఆదివారం ప్రత్యేక కథనం.. 
 
జోడు పంచెల ప్రాముఖ్యం..
గద్వాల సంస్థానం నుంచి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గద్వాల సంస్థానాధీశులు సాంప్రదాయబద్ధంగా నేత మగ్గంపై జోడు పంచెలను ఇక్కడి కార్మికులతో తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేసే ఆచారానికి వందేళ్లకు పూర్వమే శ్రీకారం చుట్టారు. ఏరువాడ జోడు పంచెలను ప్రతి  ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అందించేందుకు గాను ఇక్కడి చేనేత కార్మికులు శ్రావణ మాసం ప్రారంభంలో చేనేత పనిని మొదలు పెడతారు. నేత పూర్తయిన అనంతరం వాటిని సాంప్రదాయం ప్రకారం మడతపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించేందుకు గాను గద్వాల సంస్థానాధీశుల తరపున ఇక్కడి చేనేత పనిని పర్యవేక్షించే మహంకాళి కర్ణాకార్‌ ఈ జోడు పంచెలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ జోడు పంచెలను తొలి రోజున శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించి, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
 
సంస్థానాధీశుల కాలం నుంచి..
గద్వాల సంస్థానంలో కళలకు, కళాకారులకు ఎంతో ఆదరణ లభించేదని సాహితీ చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగానే చేనేత కళాసాంప్రదాయాన్ని కూడా గద్వాల సంస్థానంలో వికసింపజేసేందుకు నాటి సంస్థానాధీశులు కృష్ణరాంభూపాల్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(కాశీ)లో నేత పనిలో ఇక్కడివారికి శిక్షణ ఇప్పించి గద్వాలలో చేనేత పరిశ్రమ స్థిరపడేందుకు దోహదపడ్డారు. ఈ కాలంలోనే ఇక్కడి చేనేత పరిశ్రమ నుంచి గద్వాల సంస్థానం కానుకగా ఏరువాడ జోడు పంచెలు తయారు చేయించే విశిష్టమైన సాంప్రదాయానికి నాంది పలికారు. దీనిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అలంకరించే ఏర్పాట్లు చేశారు. అప్పటినుంచి నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. 
 
నామాల మగ్గంపై తయారీ..
శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను ప్రత్యేక మగ్గంపై తయారు చేస్తారు. గతంలో గుంత మగ్గంపై నేసేవారు. ప్రస్తుతం ఫ్రేమ్‌ మగ్గంపై తయారు చేస్తున్నారు. ముగ్గురు కార్మికులు ఒకేసారి నేసేలా ఉండటం ఈ ఫ్రేమ్‌ మగ్గం ప్రత్యేకత. దీనిని నామాల మగ్గం అని పిలుస్తారు. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మండలకాలం పడుతుంది. ఈ సమయంలో నేత కార్మికులు ఎంతో నిష్టతో సంప్రదాయబద్ధంగా నేత పనిని కొనసాగిస్తారు. సహజంగా నేత మగ్గాలను ఇద్దరు కలిసి ఒకేసారి నేస్తారు. నామాల మగ్గాన్ని మాత్రం ముగ్గురు కార్మికులు ఒకేసారి నేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేసినా నేత ముందుకు సాగదు. తెలిసీతెలియక తప్పులు జరిగితే మగ్గం దగ్గరికి వచ్చేసరికి తమకు ఆ విషయం పరోక్షంగా తెలుస్తుందని, అందువల్లే అత్యంత జాగ్రత్తగా మసలుకుంటామని చేనేత కార్మికులు చెబుతున్నారు. జోడు పంచెల తయారీ మొదలుకుని వాటì ని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్న ఇంట నిత్యపూజలు, గోవింద నామస్మరణ చేస్తూ పనికి ఉపక్రమిస్తే గానీ అనుకున్న సమయానికి పంచెలు తయారుకావని కార్మికులు అంటున్నారు.
 
జోడు పంచెల విశేషం..
గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన ఏరువాడ జోడు పంచెలను శ్రీవారి మూలవిరాట్‌కు అలంకరించడం విశేషం. ఒక్కో పంచె 11గజాల పొడవు, ఇరువైపులా 11 ఇంచుల అంచుతో కంచుకోట కొమ్మ నగిషితో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగివున్న సాంకేతికపరమైన అంశం.
 
సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం 
సంస్థానాధీశుల కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని వారి వంశస్తులు కొనసాగిస్తున్నారు. మైసూరు, గద్వాల సంస్థానధీశులు తిరుమలేషుడి సేవకు ప్రత్యేకత ఇచ్చారు. ఈ ఏడుకొండలవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపచేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఐదేళ్లుగా తన నివాసంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వంగా ఉంది. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం.  – మహంకాళి కర్ణాకర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement