
చీమల పుట్ట నుంచి సిరుల గిరుల వరకు
శేషాచల గిరులపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి శతాబ్దాల తరబడి చీమలపుట్టలో దాగి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రకృతిలో సేద తీరాడు. నాటి ‘తిరువేంగడమే’ నేటి ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి చైతన్యానికి దర్పణమైనతిరుమల పుణ్య క్షేత్రం. పూర్వం స్వామి ఆలయాన్ని తొలిసారిగా తొండమాన్ చక్రవర్తి కట్టించాడని, ఆ తర్వాత పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు దశలవారీగా అభివృద్ధి చేశారని చరిత్ర. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు సజీవ సాక్ష్యమైన తిరుమల కోవెల భక్తుల కోర్కెలు తీర్చే కల్పవక్షంగా భాసిల్లుతోంది.
పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, వేంకటేశ్వరస్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అని పిలిచేవారు. ఈ తిరువేంగడం అనే కొండ తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది.
క్రీ.పూ.1వ శతాబ్దంలో తిరుమలలో చీమలపుట్ట చేత కప్పబడిన స్వామివారి విగ్రహాన్ని తొండమాన్ చక్రవర్తి తొలిసారిగా దర్శించి ఆ శిలామూర్తి చుట్టూ ఓ చిన్నమండపాన్ని కట్టించాడట. ఆ మండపంలోనే స్వామి చాలా కాలంపాటు భక్తుల చేత పూజలందుకొంటూ ఉండేవారని చరిత్ర.
క్రీ.శ.8వ శతాబ్దకాలంలో ఆళ్వారులు శ్రీనివాసుని వైభవ కీర్తిని తమ కీర్తనల ద్వారా నలుదిశలా చాటారు. కులశేఖరాళ్వారు ఎన్ని జన్మలెత్తినా సరే స్వామివారి గడప/లేక పీఠంగానైనా ఉండాలంటూ ఓ పాశురం ద్వారా తన భక్తిని చాటుకున్నాడట.
శిలామూర్తి చుట్టూ గర్భగృహం తిరుమళి కేశికై ఆళ్వారు, కులశేఖరాళ్వారుల మధ్యకాలంలో నిర్మించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. అప్పటి వాతావరణ పరిస్థితుల కారణంగా ‘తిరువేంగడం’ కొండ మీదకు వెళ్లడం కష్టంగా ఉండటంతో వైష్ణవ భక్తులు వెండితో శ్రీవారి ప్రతిరూపాన్ని ‘తిరుచోగినూర్’ (నేటి తిరుచానూరు)లో ప్రతిష్టించి అక్కడే గుడికట్టారట.
క్రీ.శ. 8 -10వ శతాబ్దంలో గర్భగృహం, అంతరాళం నిర్మాణం
ఆళ్వారుల కాలంలో తమిళదేశంలో శైవమతం విస్తృతమైంది. అక్కడి నుంచి తిరుచానూరుకూ విస్తరించింది. దీంతో క్రీ.శ.9వ శతాబ్దంలో తిరుమలలో నామమాత్రంగా ఉన్న చిన్నగుడిని విస్తరించే పనులు చేపట్టార ట. అందులో భాగంగా క్రీ.శ.945లో గర్భగృహం నిర్మించారు. ఇక్కడి శేషాచల కొండల్లోని రాళ్లను పలకలుగా పగులకొట్టి వాటితోనే గర్భగృహంతోపాటు అంతరాళం పూర్తి చేశారు. ఇందుకు ఆధారంగా ఆలయంలోని మొదటి ప్రాకారంలో ఉత్తరపు గోడపై ఒకటవ కొప్పాత్ర మహేంద్ర పర్మాన్ శాసనం ఉంది.
దీనికి ముందున్న అర్ధమండపం (ప్రస్తుత శయన మండపం), అంతరాళం (ప్రస్తుతం రామన్‌మేడై/ రాములవారి మేడ)తో కలిపి లోపలి ప్రాకారంలోని మొదటి సముదాయంగా నిర్మించారు.క్రీ.శ.10వ శతాబ్దంలో గర్భాలయానికి ప్రాకారం నిర్మాణం
10వ శతాబ్దం, ఆ తర్వాత కాలంలో ఆలయ నిర్మాణం, దశలవారీగా అభివృద్ధి జరిగింది. గర్భగృహ ఆవరణకు గోడకు చుట్టూ మరొక గోడ (ప్రాకారం) నిర్మించినట్టు పరిశోధకుల విశ్లేషణ. తర్వాత క్రీ.శ.12-13 శతాబ్దాల మధ్య కాలంలో ఆలయానికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
క్రీ.శ.1262లో సుందర పాండ్యుడు ఆనంద నిలయ విమానం మీద కలశానికి బంగారు పూత పూయించాడట. తర్వాత వీర నరసింగరాయలు దేవాలయం మరింత ప్రకాశవంతంగా కనిపించేలా బంగారుపూత పూయించాడట. విజయనగర శిల్పరీతులలో తిరుమామణి మండపం
క్రీ.శ.13వ శతాబ్దంలో ఆలయానికి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, నూతన నిర్మాణాలు చేపట్టారు. తర్వాత క్రీ.శ.1417లో మల్లన్న (మాధవదాసు) తిరుమామణి మండపం (ప్రస్తుతం బంగారుమేడ/ బంగారు వాకిలి)ను నాలుగు వరుసల్లో 16 రాతి స్తంభాలతో నిర్మించారు. ఈ మండపం పడమట దిశలో ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి.
ఇదే మండపాన్నే ముఖమండపం, ఆస్థాన మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపంలోని శిల్పాలన్నీ విజయనగర శిల్పరీతులలో ఉన్నాయి. ఈ మండపం తూర్పుదిశలో నమస్కార భంగిమలో మూలమూర్తికి అభిముఖంగా గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. దీన్నే గరుడ మండపం అని కూడా పిలుస్తారు. 12శ శతాబ్దంలో రెండవ గోపురం, విమాన ప్రదక్షిణం
క్రీ.శ.1209 సంవత్సరం ఆలయంలో నాటికి రెండవ గోపురం (నిర్మాణంలో ఇదే తొలిగోపురం అయినప్పటికీ ప్రస్తుత ఆలయంలో రెండవదిగా కనిపిస్తుంది) నిర్మాణం చేపట్టారు. ఈ గోపురం దాటి ఆలయంలోని స్వామివారి గర్భాలయం విమానానికి నాలుగు దిశల్లో ఉన్న ప్రాకారాన్ని విమాన ప్రదక్షిణం/ విమాన ప్రాకారం అంటారు.
ఇదే ప్రాకారాన్ని అనుసరించి మరొక ప్రాకారంలో కొన్ని రాతి చెక్కడాలు, మండపాలు, చిన్నచిన్న దేవతా సన్నిధులు నిర్మించారు. ఈ ప్రాకారంలో ఆగ్నేయ దిశలో వంటశాల నిర్మించారు. క్రీ.శ.16లో పడమట దిశలో పెద్దమండపం నిర్మించారు (ప్రస్తుతం కానుకలు లెక్కించే పరకామణిగా ఈ మండపాన్ని వినియోగిస్తున్నారు).
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల్లో ఎక్కువ రోజులు ఉత్సవమూర్తులను ఈ మండపంలోనే ఉంచుతారు. ఇదే ప్రాకారంలోనే ఉత్తర దిశలో తాళ్లపాక అన్నమాచార్యుల అర, ఆ తర్వాత రామానుజ (భాష్యకార్ల) సన్నిధి ఏర్పాటైంది. ఇదే క్రమంలో నృసింహ స్వామికి, వరదరాజస్వామికి కూడా ఆలయాలు నిర్మించారు.
క్రీ.శ.13 నుండి మహద్వార గోపురం, సంపంగి ప్రదక్షిణం ఆలయ ప్రవేశ ద్వారమైన మహద్వారంపై నిర్మించిన గోపురాన్ని‘ మహద్వార గోపురం’, ‘ సింహద్వార గోపురం’ , ‘పడికావలి గోపురం’ అనే వివిధ పేర్లతో పిలుస్తారు. తమిళంలో ‘పెరియ తిరువాశల్’ అంటే పెద్దవాకిలి అని అర్థం. ఈ గోపురాన్ని క్రీ.శ.13వ శతాబ్దం నుండి అంచెలంచెలుగా నిర్మించారు. మహద్వారాన్ని ఆనుకుని 16 రాతి స్తంభాలతో కృష్ణరాయ మండపాన్ని నిర్మించారు.
ప్రతిమామండపంగా ప్రసిద్ధి పొందిన ఈ మండపంలో విజయనగర శిల్ప సంప్రదాయం కనిపిస్తుంది. స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగించిన తర్వాత ఈ ప్రతిమా మండపంలోకి కొంత సమయం పాటు వేంచేపు చేసే సంప్రదాయం నేటికీ అమల్లో ఉంది. ఈ మండపానికి ఉత్తరదిక్కున అద్దాల మండపం, దక్షిణదిక్కులో రంగనాయక మండపం నిర్మించారు. క్రీ.శ.1320-1360 మధ్య మహ్మదీయుల దండయాత్రల వల్ల తమిళదేశంలోని శ్రీరంగక్షేత్రంలోని శ్రీరంగనాథుని విగ్రహాలు ఇక్కడ దాచి ఉంచడం వల్ల ఈ మండపం రంగనాయక మండపంగా ప్రసిద్ధి పొందింది.
క్రీ.శ.15వ శతాబ్దంలో ధ్వజస్తంభ మండపం నిర్మించారు. ఇదే మండపంలోని రాతిపీఠంపై ఎత్తై దారు స్తంభమే ధ్వజస్తంభం. క్రీ.శ.1470లో విజయనగర చక్రవర్తి సాళ్వ నరసింహ రాయలు తన భార్య, ఇద్దరు కుమారులు, తనపేరుతో సంపంగి ప్రాకారం, ఇతర మండపాలు నిర్మించారు.
ఇక వైష్ణవ భక్తుడైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని మరింత విస్తరించారు. క్రీ.శ.1513 నుండి 1521 మధ్యకాలంలో ఏడుసార్లు తిరుమలయాత్ర చేసి స్వామి అలంకరణకు వెలకట్టలేని వజ్రవైఢూర్య మరకత మాణిక్యాది ఆభరణాలిచ్చారు. ఆలయ నిర్వహణ బాధ్యతను పోషించారు. అనుక్షణం శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రణమిల్లుతున్నట్టుగా రెండు చేతులు జోడిస్తున్నట్టుగా ప్రతిమా మండపంలో తిరుమలాదేవి, చిన్నాదేవితో ప్రతిమలు ఏర్పాటు చేయించారు.
ఆగమం ప్రకారం ఆలయ దక్షిణ దిశలోని మండపాల్లోనే కల్యాణోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. పడమట దిశలోని మండపాల్లో గిడ్డంగులుగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఆలయం కాలానుగుణంగా అప్పటి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తూన్నా.. ప్రాకారాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
నాడు వందల్లో ... నేడు వేలల్లో 1945, ఏప్రిల్ 10 మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండో ఘాట్‌రోడ్డు వచ్చేనాటికీ ఈ సంఖ్య సుమారుగా 8 వేలకు చేరింది. 1980లో రోజుకు పదిహేనువేలు, 1990 నాటికి రోజుకు 20 నుంచి 25వేలు, 1995 నాటికి 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు, 2010 నాటికి ఈ సంఖ్య 60 వేలకు చేరింది. ప్రస్తుతం 2015లో సెలవులు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు, ఒక్కోసారి సాధారణ దినాల్లోనూ ఈ సంఖ్య లక్ష దాటుతోంది.
నిర్మాణ పరంగా 60 వేల మందికే సంతృప్తికర దర్శనం.. ఆలయంలో ఉన్న స్థలాభావ పరిస్థితుల వల్ల కులశేఖరడి (మూల మూర్తికి పది అడుగుల దూరం) నుంచి రోజుకు 27 వేల మంది భక్తులకు దర్శనం కల్పించవచ్చు. ఈ పరిస్థితులు క్రీ.శ. 2000 సంవత్సరానికి ముందు వరకు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 2004 వరకు రాములవారి మేడ (లఘుదర్శనం/ 35 అడుగుల దూరం) నుంచి రోజుకు 45 వేల వరకు భక్తులకు దర్శనం కల్పించేవారు.
ఇక 2004 నుండి ఘంటా మంటపంలోని ద్వారపాలకులైన జయ విజయుల (మహాలఘు/ 60 అడుగుల దూరం) నుంచి వేగంగా క్యూలైన్లను నెడుతూ 70 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు. తోపులాటల్ని నివారించేందుకు టీటీడీ సన్నిధిలో మూడు క్యూలైన్ల విధానం అమలు చేసింది. ప్రస్తుత విధానంలో 60 వేల మంది భక్తులకు మాత్రమే మూలమూర్తి దర్శనాన్ని సంతృప్తికరంగా కల్పించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు దాటితే తోపులాటలు నిత్యకృత్యమయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ రెట్టింపుస్థాయిలో వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా.
పూజాకైంకర్యాలు తగ్గించొద్దు: పండితులు
వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం తిరుమల ఆలయంలో కనిష్టంగా 6 గంటలపాటు గర్భాలయ మూలమూర్తి పూజా కైంకర్యాలకు సమయం కేటాయించాలి. మరోవైపు పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్వామి దర్శనం కల్పించాల్సి ఉంది. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినం, బ్రహ్మోత్సవాల్లో ఒకటి రెండు గంటల మినహా మిగిలిన సమయాన్ని భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాల్సి వస్తోంది. ఈ కారణంగా స్వామి పూజల్లో కోత పడుతోంది. అలా చేయటం శ్రేయస్కరం కాదని పండితులు హెచ్చరిస్తున్నారు.
స్వామి దర్శనం కోసం భక్తకోటి...
1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. 1945, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్‌రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారుగా 8 వేలకు పెరిగింది. 1980లో రోజుకు పదిహేను వేలు, 1990 నాటికి రోజుకు 20 నుంచి 25వేల , 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు , 2010 నాటికి ఈ సంఖ్య 60 వేలకు చేరింది.
2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లమంది భక్తులు వచ్చారు. ఇక ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలో సుమారు 1.8 కోట్లు దాటింది. భవిష్యత్‌లో ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
నేత్రద్వారాల ఏర్పాటుకు ఆగమం అభ్యంతరం
ఆలయ నిర్మాణం ఆగమ నిబంధనలకు లోబడి జరిగింది. శ్రీవారి పోటెత్తుతున్న భక్తులందరికీ సత్వరంగా స్వామి దర్శనం కల్పించాలంటే వెండి వాకిలి ప్రాకారానికి నేత్రద్వారం తెరవాలన్న ప్రతిపాదన రెండు దశాబ్దాల నుంచి నలుగుతూనే ఉంది. దీని ప్రకారం వెండివాకిలికి అటుఇటూ 20 అడుగుల దూరంలో రెండు ద్వారాలు తెరవాల్సి ఉంది. ఈ నేత్రద్వారాల నుండి లోనికి, వెలుపలకు పంపడం ద్వారా ఎలాంటి తోపులాటలు లేకుండా చేయాలన్నదే దీని సారాంశం.
పనిలో పనిగా ఆనంద నిలయ ప్రాకారానికి కూడా ప్రత్యేక ద్వారం తెరవాలని కూడా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
దీనిప్రకారం రాములవారి మేడకు ముందున్న స్నపన మంటపం దక్షిణదిశ ప్రాకారానికి కొత్తగా ప్రత్యేకద్వారం ఏర్పాటు చేయాలి. వీఐపీ అయినా, సామాన్యుడైనా భక్తులందరికీ 35 అడుగుల దూరం నుంచే సంతృప్తికరమైన దర్శనం కల్పించి వైకుంఠ వాకిలి వద్ద బంగారు బావి సమీపం వరకు భక్తులను వెలుపలకు పంపాలన్నదే మరో ఉద్దేశం. దీనివల్ల జయవిజయలను దాటి లోనికి వెళ్లిన భక్తులు తిరిగి అదే మార్గంలో రాకుండా సులభంగా కొత్త ప్రత్యేకద్వారం నుంచి వెలుపలకు పంపవచ్చు.
ఈ ద్వారాలు అమల్లోకి వస్తే భక్తులందరికీ సంతృప్తికర దర్శనంతోపాటు రోజుకు లక్ష మందికి పైబడి దర్శనం కల్పించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఆ మేరకు 2010లో అప్పటి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ఎక్కువ మంది భక్తులకు స్వామి దర్శనం కల్పించాలనే సంకల్పంతో దర్శనంలో కొత్త విధానాలతో పాటు ఆలయ ఆగమాలకు అభ్యంతరం లేకుండా చూడాలని జాతీయ స్థాయిలో చర్చకు లేవదీశారు.
అందులో భాగంగా 2010 నవంబర్ 20, 21వ తేదీల్లో జాతీయ స్థాయి సదస్సును తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. అందులో ఆగమ పండితులు, అర్చకులు, టీటీడీ పూర్వపు ఈఓలు, ఆలయం తో ముడిపడిన అనువజ్ఞుల చేత ఉపన్యాసాలు ఇప్పించారు. సదస్సు విజయవంతం అయినప్పటికీ ఆలయంలో కొత్త దర్శన విధానాలపై, నేత్రద్వారాలు, ప్రత్యేక ద్వారాలపై ఆగమ పండితులు తిరస్కరించారు.
మరోసారి 2012లో అప్పటి టీటీడీ ఈఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం కూడా నేత్రద్వారాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినా, అమలు చేయలేక పోయారు. ఏది ఏమైనా స్వామివారి దర్శనం కోసం పరితపిస్తున్న భక్తజనావళికంతటికీ విమర్శలకు, శాస్త్రవిరుద్ధతకు తావులేకుండా సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పించవలసిన ప్రధాన బాధ్యత టీటీడీ మీద ఉన్న ప్రధాన కర్తవ్యం.
క్రీ.శ. మొదటి శతాబ్దం నాటి త మిళ గ్రంథం ‘శిలప్పాదిగారం’లో తిరుమల ఆలయ ప్రస్తావన ఉంది. క్రీ.శ. 614 సంవత్సరంలో పల్లవ రాణి సమవాయి (పెరిందేవి) గర్భాలయానికి జీవోద్ధరణ చేసినట్టు చరిత్ర. గర్భాలయం తర్వాత కొన్నేళ్ళకు ఆనంద నిలయంపై విమాన గోపురాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. క్రీ.శ.1262 నాటికే విమాన గోపురం సంపూర్ణంగా ఉన్నట్టు శాసనాధారం.
కన్వేయర్ బెల్ట్‌ల ద్వారానే సరుకులు, బూంది-లడ్డూ
పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ప్రసాదాల తయారీ కూడా పెరిగింది. దిట్టానికి అనుగుణంగా సరుకులు సరఫరా చేయాల్సి వచ్చింది. ఆలయంలోని ఉగ్రాణంలోకి సరుకులు తీసుకెళ్లేందుకు ఆలయం వెలుపల దక్షిణ దిశలో ప్రత్యేకంగా ద్వారం తెరవాలని ప్రతిపాదన వచ్చింది. దీనిపై సుదీర్ఘకాలం చర్చజరిగింది. ఆగమ పండితులు ముక్తకంఠంతో తిరస్కరించారు. ఆలయ నిర్మాణానికి విరుద్ధంగా మరొక ద్వారం తెరిస్తే వ్యతిరేక ఫలితాలు ఉత్పన్నం అవుతాయని ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు.
ఇందుకు ప్రత్యామ్నాయంగా సరుకులను ఆలయ ఉగ్రాణంలోకి తీసుకెళ్లేందుకు ఆలయ ఇంజనీర్లు ప్రత్యేకంగా కన్వేయర్ బె ల్ట్ అమర్చారు. ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఈ కన్వేయర్ బెల్ ్టద్వారానే సరుకులను ఉగ్రాణంలోకి చేరవేస్తున్నారు. అలాగే ఆలయం వెలుపల ఉత్తర దిశలోని బూంది పోటులో తయారైన బూందిని కూడా మరో కన్వేయర్ బెల్టు ద్వారా ఆలయంలోని పోటుకు పంపుతున్నారు. ఇక్కడ తయారైన లడ్డూలను తిరిగి లడ్డూ కౌంటర్లకు పంపేందుకు కూడా కన్వేయర్ బెల్ట్‌నే వాడుతున్నారు.
ఆలయంలోని గర్భాలయానికి ముందు ఉన్న మెట్టు (కులశేఖరపడి) ద్వారా 27వేలు, రాములవారి మేడ నుండి (లఘుదర్శనం) 45వేల మంది, జయవిజయల నుండి (మహాలఘులో ) 90 వేల మంది భక్తులకు దర్శనం కల్పించే అవకాశం ఉంది.
అంతకంటే ఎక్కువసంఖ్యలో వస్తే మరుసటి రోజు దర్శనం కల్పిస్తారు.
ఆలయంలో మార్పులు చేయకూడదు
* స్వయం వ్యక్త సాలగ్రామ స్వరూపంలో శ్రీవేంకటేశ్వర స్వామి గర్భాలయంలోని ‘ఉపధ్యక’ పుణ్యప్రదేశంలో వెలిసారు.
* దేవశిల్ప విశ్వకర్మ వేయి స్తంభాలతో దివ్యమైన ఆలయం నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
* మహాయుగాలుగా దివ్యమైన దేవాలయం మరుగున ఉంది. అది సామాన్య మానవులకు కనిపించకుండా అదృశ్యంగా ఉంది. ఇందుకు శాస్త్ర ఆధారం ఉంది. కంటికి కనిపించే ఆలయాన్ని నిర్మాణంగా పరిగణించకూడదు. స్వామి దేహంగా భావించాలి. అలాంటి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అలా చేయటం శాస్త్రం విరుద్ధం. అలా శాస్త్ర విరుద్ధంగా చేయటం వల్ల ప్రతికూల ఫలితాలు సంభవిస్తాయి.
శిల్పశాస్త్రం ప్రకారం నేత్రద్వారాల ఏర్పాటుకు వీలుంది
నేత్రద్వారాలు తెరవాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. దానిపై ఏళ్లకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇంతవరకు పరిష్కారం లభించలేదు. తమిళనాడులోని తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం వంటి ఆలయాల్లోకి భక్తులు సులభంగా వెళ్లిరావటానికి అనేక మార్గాలున్నాయి, కాలానుగుణంగా మార్పులు జరిగాయి. తిరుమల ఆలయాన్ని వాటితో పోల్చలేము. అయితే, పెరుగుతున్న భక్తులకు సులభంగా గర్భాలయ మూలమూర్తి దివ్యమంగళ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించేందుకు మార్పుల అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు శిల్పశాస్త్రం సమ్మతిస్తోంది.
- ఏబీ లక్ష్మీనారాయణ, 1976-2002 టీటీడీ ఆలయాల స్థపతి, ప్రస్తుత స్థపతి సలహాదారు