వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు | tirumala brahmotsavalu special story | Sakshi
Sakshi News home page

వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు

Published Sat, Oct 1 2016 10:49 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు - Sakshi

వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు

ధర్మానికి హాని కలిగినపుడు భగవంతుడు అవతరిస్తాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కలియుగంలో ధర్మోద్ధరణకు  శ్రీమహావిష్ణువు ఉద్యుక్తుడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీరామునికి లక్ష్మణుడిగా సేవలందించిన తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిని భగవద్రామానుజులుగా అవతరింపజేసి ధర్మరక్షకుయ్యాడు. కారణజన్ముడైన రామానుజుడు ధర్మరక్షణకు బీజాలు నాటి, సనాతన హైందవ ధర్మరక్ష ణతోపాటు సాంఘిక అసమానతలను రూపుమాపి సమతాభావాన్ని చాటారు. వైదిక ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. తిరుమల క్షేత్రాన్ని విష్ణుక్షేత్రంగా నిరూపించారు. విశిష్టాద్వైత సిద్ధాంతంతో భక్తి మార్గాన్ని విస్తృతం చేశారు. శ్రీభాష్యాది గ్రంథాలతో ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించారు.
 
కేశవసోమయాజి, కాంతిమతి దంపతులకు శ్రీరామానుజులు క్రీ.శ. 1017వ సంవత్సరంలో పింగళనామ సంవత్సరం చిత్తిర (మేష) మాసం ఆర్ద్రానక్షత్రంలో కంచి సమీపంలోని శ్రీపెరుంబుదూరులో జన్మించారు. వీరి మేనమామ తిరుమలనంబి (శ్రీశైలపూర్ణులు). ఆయన తిరుమల నుంచి శ్రీపెరుంబుదూరు వచ్చి, బాలునిలోని దివ్య తేజస్సు, లక్షణాలు గుర్తించి ‘ఇైళె యాళ్వార్’ (రామానుజుడు- లక్ష్మణుడు) నామకరణం చేశారు. ఐదేళ్లకు అక్షరాభ్యాసం, ఎనిమిదేళ్లకు ఉపనయనం చేశారు. వేదాది విద్యలన్నీ  కారణజన్ముడైన రామానుజునికి కరతలామలకాలయ్యాయి.

పదహారేళ్ల ప్రాయంలో ఆయనకు వివాహం జరిగింది. భార్య పేరు రక్షకాంబ. రామానుజులు కంచిలో యాదవప్రకాశుల దగ్గర వేదాంత విద్యను అభ్యసించారు. రామానుజుడి మేధావిలాసానికి పెద్దలు ముచ్చటపడేవారు. యాదవప్రకాశులు ఉపనిషత్ వాక్యాలకు చెప్పే వ్యాఖ్యానాలను రామానుజులు నిశితంగా గమనించేవారు. కొన్ని సందర్భాల్లో యాదవప్రకాశుల వివరణ సమంజసంగా తోచనప్పుడు తానే బుద్ధియుక్తంగా వివరణ ఇచ్చేవారు.
 
అత్యుత్తమ శిష్యుడు
ఆచార్యులు ఎంతటి కఠిన పరీక్ష పెట్టినా, దానికి నిలవడం ఉత్తమ శిష్య లక్షణం. గోష్ఠీపురం (తిరుక్కొట్టియూర్) అనే ఊరిలో గోష్ఠీపూర్ణులు (తిరుక్కొట్టియూర్ నంబి) వద్ద శ్రీకృష్ణ చరమ శ్లోకం ‘సర్వధార్మాన్ పరిత్యజ్య’ అనే గీతాశ్లోకంలోని అపూర్వ అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయని రామానుజులు తెలుసుకున్నారు. వాటిని స్వయంగా గ్రహించేందుకు తిరుక్కోట్టియార్ వెళ్లారు. నంబి మాత్రం రామానుజుడిని పరీక్షించారు. ‘‘ఈసారి కాదు, మళ్లీ రండి’’ అంటూ పద్దెనిమిది పర్యాయాలు పరీక్షించినా.. ఏమాత్రం విసుగు చెందకుండా రామానుజుడు శ్రీరంగం నుంచి తిరుక్కోట్టియూర్‌కు వెళ్లి  నంబికి విశ్వాసానికి కల్గించారు. తర్వాత వారి ద్వారా చరమశ్లోకార్థాలను గ్రహించి, అత్యుత్త్తమ శిష్యుడిగా ప్రఖ్యాతి గడించారు.
 
ఆదర్శవంతమైన ఆచార్యుడు
తాను నేర్చిన విద్యను శిష్యులకు కూలంకషంగా ఉపదేశించడం ఉత్తమ ఆచార్య లక్షణం. తిరుక్కొట్టియూర్ నంబి చరమ శ్లోకార్థాలను ఉపదేశించేటపుడు, యోగ్యతను పరీక్ష చేయకుండా వాటిని ఎవ్వరికీ చెప్పవద్దని రామానుజుల దగ్గర ప్రమాణం చేయించుకొన్నారు. కానీ, తనకు ఆంతరంగిక శిష్యులు కూరేశులు, దాశరథికి ఆ అర్థాలను తెలుపకుండా ఉండలేనని, అందుకు అనుజ్ఞ ఇవ్వవలసినదని ప్రార్థించారు. నంబి సమ్మతిని పొంది తర్వాత వారికి ఉపదేశించారు.
 
సహ జనులపై సమతాభావం
కర్ణాటకలోని వైష్ణవ క్షేత్రం మేల్కోటె. అక్కడి అర్చామూర్తి మరుగున పడిపోయిన విషయాన్ని భగవానుడు స్వప్నంలో రామానుజులకు సాక్షాత్కరింపజేయగా, మేల్కోటెను పాలించే విష్ణువర్ధనుడి సహకారంతో ఆ మూర్తిని కనుగొని, ఆలయంలో పునఃప్రతిష్ఠించారు.
 ఈ కృషిలో తమకు సహకరించిన వారు ఆలయప్రవేశార్హత లేనివారుగా పరిగణింపబడే ఒక తెగ వారిపట్ల కృతజ్ఞత వ్యక్తీకరించారు. వారికి సంవత్సరంలో ఒకనాడు ఆలయంలో ప్రవేశించి, స్వామిని దర్శించుకొనే అవకాశాన్ని కల్పించారు. కాంచీపూర్ణులనే యామునుల శిష్యులు బ్రాహ్మణేతర కులానికి చెందినవారు. వారి శుద్ధమైన జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని రామానుజులవారు గుర్తించారు. కానీ, ఆకాలంలో సమాజంలోని కట్టుబాటును ఆచరించిన నంబి సున్నితంగా తిరస్కరించినా రామానుజులు మాత్రం సమతావాదాన్ని వీడలేదు. ప్రతిదినం కావేరీనదిలో స్నానం చేసి తిరిగి వచ్చేటపుడు రామానుజులు ధనుర్దాసు చేతిని ఆసరాగా తీసుకుని తిరిగి వచ్చేవారట.  
 
సకలశాస్త్ర పండితుడు
శాస్త్రాలు అధ్యయనం చేయడం వేరు,  అంశాల అనుకూల తర్కాలు ప్రయోగించి వాదించడం వేరు. ఈ సామర్థ్యం రామానుజులకు మెండుగా ఉండేది. తిరుమల ఆలయంలోని అర్చామూర్తి శ్రీవేంకటేశ్వరుడు శంఖచక్రహస్తుడై ఉండేవాడు కాడు. ఈ కారణంచేత తిరుమలలోని మూర్తి ఎవరు? అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించి, యథార్థ నిర్ణయం చేయడం కోసం తిరుమల ప్రాంతాన్ని పాలించే యాదంరాజు రామానుజులను ఆహ్వానించటంతో తిరుపతికి వచ్చారు. పురాణాగమాలు, ఆళ్వార్ల ప్రబంధాల ప్రమాణాల ప్రకారం ‘‘తిరుమలలోని మూర్తి శ్రీవేంకటేశ్వరుడే’’ అని నిరూపించారు. ఈ వాదప్రతివాదాలన్నీ రామానుజుల శిష్యులై న అనంతాచార్యులు తన ‘శ్రీవేంకటాచలేతిహాసమాల’ అనే గ్రంథంలో విశదీకరించారు.
 
రచనా నైపుణ్యం
రామానుజులు గొప్ప కవి కూడా. గీతాభాష్యంలో, శ్రీ భాష్యంలో, వేదార్థ సంగ్రహంలో పలుచోట్ల గల రామానుజుల సూక్తులు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. రామానుజులు బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరంగా భాష్యాన్ని విరచించి, దాన్ని కాశ్మీర్‌లోని శారదాపీఠానికి సమర్పించారు. శారదాదేవి దానిని శిరసావహించి, ‘‘భాష్యమంటే మీదే భాష్యం. మీరే భాష్యకారులు. ఇకపై మీ భాష్యం శ్రీ భాష్యమనే పేరులో ఖ్యాతి పొందుతుంది.’’ అని ప్రశంసించి, హయగ్రీవుల అర్చామూర్తిని రామానుజులకు బహూకరించారు.
 ఇతర సంప్రదాయానికి చెందిన విద్వాంసులు సైతం రామానుజుల శ్రీభాష్య రచనలోని మాధుర్యాన్ని మెచ్చుకుని ‘శ్రీవైష్ణవకాదంబరి’ అనే బిరుదుతో ప్రశంసించడం శ్రీ భాష్య ఘనతను, విశిష్టతను వ్యక్తం చేస్తున్నది.
 
ద్రావిడభాషా ప్రావీణ్యం
రామానుజులకు ద్రావిడభాషలో పాండిత్యం లేదని, అందువల్లనే వారు తమ గ్రంథాలను సంస్కృతంలో మాత్రమే రచించారని, ద్రావిడ గ్రంథాన్ని దేనినీ రచించలేదని కొందరి వాదన. కానీ. ఆళ్వార్ల ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రచించిన శ్రీవైష్ణవ గురు పరంపరలోని పలువురు పూర్వాచార్యులచే తమ వ్యాఖ్యలలో నూటికిపైగా గల సందర్భాలలో రామానుజులు ఆయా ఆళ్వార్ల పాశురాలను విలక్షణమైన రీతిలో అన్వయించారు. అపూర్వమైన అర్థాలను తెలిపారు. ఇవన్నీ రామానుజుల వారి ద్రావిడ భాషాపాండిత్యానికి, సందర్భోచిత సమన్వయ సామర్థ్యానికి చిహ్నాలు.
 
ఆలయ నిర్వహణలో సంస్కరణలు  

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయ కైంకర్య నిర్వహణలో రామానుజుల కాలానికి ముందు పలు లోపాలు ఉండేవి. తన శిష్యుడైన కూరేశులద్వారా రామానుజులు ఆలయ నిర్వహణలో పలు సంస్కరణలు చేపట్టారు. ఆ విధంగానే తిరుమల ఆలయంలో కూడా పలు ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను సంస్కరించి సరిచేశారు. మేల్కోటె ఆలయంలో కూడా 52 మంది శ్రీవైష్ణవ కుటుంబాలను ద్రావిడ దివ్యక్షేత్రాలనుంచి రప్పించి, వారిని ఆయా సేవలలో నియమించారు. ఇప్పటికీ అక్కడ ఆ వ్యవస్థ కొనసాగుతుండటం విశేషం. సింహాచలం, శ్రీకూర్మం, అహోబిలం మొదలైన క్షేత్రాల్లోనూ తగిన సంస్కరణలను చేశారు.
 
వైష్ణవాలయాల్లో జీయర్ వ్యవస్థకు పునాది
రామానుజులు తిరుమల ఆలయంలో పలు సమయాచారాలను సంస్కరించారు. వ్యవస్థను సుస్థిరం చేశారు. వాటి నిర్వహణ బాధ్యతను తమ శిష్యులైన అనంతాచార్యులకు అప్పగించి, శ్రీరంగానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి అనంతాచార్యులు వృద్ధులైనందున, ఆ బాధ్యత కోసం అనంతాచార్యుల శిష్యులైన విష్వక్సేన ఏకాంగి అనే బ్రహ్మచారిని నియమించారు. ఆయనకు సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు. శ్రీ వేంకటనాథ శఠగోపయతి అనే పేరు పెట్టి, ఆలయ కైంకర్య బాధ్యతను అప్పగించారు.
 
శ్రీవైష్ణవ సన్యాసికి తమిళంలో ‘జీయర్’ అని పేరు. మొదట ఒక జీయర్‌ను మాత్రమే నియమించినా, తర్వాత ఆ జీయర్‌కు ఉత్తరాధికారి(చిన్నజీయర్)గా ఇంకొకరిని కూడా నియమించారు. తర్వాత ఈ విధమైన జీయర్ వ్యవస్థ శ్రీరంగం, తిరునారాయణపురం (మేల్కోటై)లో, కంచిలో కూడా ఏర్పడిన ఈ వ్యవస్థ ఈనాటికీ ఈ క్షేత్రాలలో కొనసాగుతోంది. జీయర్ పర్యవేక్షణలో ఆ ఆలయాల సమయాచారాల నిర్వహణ సాగుతుండటాన్ని నేటికీ గమనించవచ్చు.
 
శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో ..
వైకుంఠంలో ఆదిశేషుడుగా, తర్వాత త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరామునిగా, కలియుగంలో భగవద్రామానుజులుగా అవతరించారు. తన నూట ఇరవై ఏళ్ల ధార్మిక జీవనంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రాచీనమైన వైష్ణవమతాన్ని ఉద్ధరించారు. సంఘం చేత వెలివేయబడిన నిమ్న కులాలవారికి శ్రీవైష్ణవ మత  స్వీకార అర్హతను కలిగించి, దాదాపు సహస్రాబ్ది కిందటే సాంఘిక సంస్కరణలకు నాంది పలికారు. సనాతన వైదిక సంస్కృతి, హైందవ ధర్మాన్ని పరిపుష్టం చెయ్యడానికి ఆసేతు హిమాచలం పర్యటించారు.

శ్రీవైష్ణవ సిద్ధాంతానుసారంగా వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఎన్నో వైష్ణవ ఆలయాలను, శ్రీవైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేశారు. ఆయా క్షేత్రాల్లో, ఆలయాల్లో అస్తవ్యస్తంగా, అసమగ్రంగా ఉన్న పూజలు, ఉత్సవాలు, ఆగమశాస్త్రాల నియమానుసారం సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దారు.
 
తిరుమల వేంకటాచల క్షేత్రంలో అర్చనాది కార్యక్రమాలను, ఉత్సవాలను పటిష్ఠం చేశారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠనాథుడైన శ్రీనివాసుడే సాలగ్రామ శిలామూర్తిగా వెలిశాడని, ఆ స్వామే మళ్లీ విఖనస మహర్షిగా అవతరించి, తన అర్చనా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, వైఖానస ఆగమం ప్రకారమే పూజలు జరిపి తీరాలని నిర్ణయించారు. శేషాచలక్షేత్రానికీ శేషాంశంతో అవతరించిన రామానుజులవారికీ విడదీయరాని, విడదీయలేని దివ్య అనుబంధం పెనవేసుకుంది.
 
మోకాళ్లతో పాకుతూ తిరుమల కొండకు  
తిరుమలకొండ సాక్షాత్తూ ‘శ్రీనివాస పరబ్రహ్మ’ అని ఆళ్వార్లు కీర్తించారు. వాళ్లలో కొందరు తిరుపతికి వచ్చినా, కొండ కింద నుంచే నమస్కరించారు. వాళ్ల అభిప్రాయాన్ని రామానుజులు కూడా గౌరవించి, అనుసరించారు. కొండను పాదాలతో తొక్కుతూ వెళ్లకూడదని నిశ్చయించారు. గురువు తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వారు, ఆలయంలో జరిగే అర్చనాదులు తీర్చదిద్దాలంటూ చేసిన అభ్యర్థన మేరకు భగవద్రామానుజులవారు కేవలం మూడుసార్లు మాత్రమే తిరుమల కొండపైకి వచ్చారు. అది కూడా మోకాళ్లతో పాకుతూ కఠోరదీక్షతో మాత్రమే కొండ మీదకు వెళ్లారు.
 
శ్రీనివాసుడికి శంఖచక్రాలంకరణ

పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తికి శత్రువుల నుంచి రక్షణగా శ్రీవేంకటేశ్వరస్వామి తన శంఖుచక్రాలను బహూకరించారు. మళ్లీ తిరిగి ఇవ్వడానికి రాగా, వాటిని ఈ కలియుగంలో ధరించనంటూ స్వామి స్వీకరించలేదు. అందువల్ల శంఖుచక్రాలు లేని తిరుమలలోని అర్చామూర్తి శివుడని వీరశైవులు వాదించారు. వారి వాదనను రామానుజులు ఖండించారు. వక్షఃస్థల మహాలక్ష్మితో విరాజిల్లుతూ ఉన్న ఈ స్వామివారికి, తన తపశ్శక్తి చేత శంఖుచక్రాలను స్వయంగా స్వామివారే ధరించునట్లు చేసి ఆ అర్చామూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశఅయిన శ్రీవేంకటేశ్వర స్వామివారే అని నిరూపించారు. తిరుమలను వైష్ణవ క్షేత్రంగా ప్రతిష్ఠించిన ఘనత శ్రీరామానుజులవారిదే.
 
బంగారు వ్యూహలక్ష్మి
శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ని భక్తులందరూ దర్శించడం కుదరదు. అందుకే రామానుజులు ‘బంగారు లక్ష్మి’ ప్రతిమను అలంకరింపజేశారు. ఆనాటినుంచి నియమబద్ధంగా వక్షఃస్థల లక్ష్మితో కూడి ఉన్న శ్రీనివాసునికి శుక్రవారంనాడు మాత్రమే అభిషేకం జరగాలని నిర్ణయించి అమలు చేయించిన ఘనత రామానుజుల వారిదే.
 
శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలల అలంకరణ
 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో ఐదవ రోజున గరుడోత్సవంనాడు శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి ధరించిన పూలమాలను తెచ్చి శ్రీవారికి ధరింపజేసే ఏర్పాటుతోపాటు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ ధరించిన పూలమాలను, కనుమ పండుగ రోజున గోదాకళ్యాణం రోజున తిరుమలకు తెచ్చి శ్రీవారికి సమర్పించే ఏర్పాటును రామానుజులవారు చేశారు. తిరుమల శ్రీస్వామి పుష్కరిణి ఒడ్డున ప్రాచీనమైన యోగ నరసింహస్వామి శిలావిగ్రహం పూజాపురస్కారాలు లేకుండా ఉండేది. ఆ మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠింపజేసి, నిత్యనివేదనాదులను ఏర్పాటు చేశారు శ్రీరామానుజులు.
 
గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ
రామానుజుల వారు తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించారు.  తర్వాత ఆ ఆలయం ఉత్తరోత్తరాభివృద్ధిని కాంక్షిస్తూ, గోవిందరాజస్వామికి దక్షిణ దిక్కులో గోదాదేవిని ప్రతిష్ఠించారు. ఆ ఆలయం చుట్టూ నాల్గు విశాలమైన వీథులను ఏర్పరిచారు. అక్కడే ఆలయ పరివారానికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఏయే దిక్కులలో ఎవరెవరు నివసించాలో, ధాన్యాగారం ఏ దిశలో ఉండాలో.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవస్థీకరించారు.
 
తిరుపతి నగర నిర్మాణ కౌశలం
కపిలతీర్థంలో నాలుగు మూలలా శ్రీసుదర్శన చక్రయంత్ర స్తంభాలు ప్రతిష్ఠించారు.  దానిని ‘చక్రత్తాళ్వార తీర్థం’గా మార్పుచేయడంతో పాటు, తిరుపతికి గోవిందరాజస్వామి, కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ‘చక్రత్తాళ్వార్ తీర్థం’లో ‘చక్రస్నానం’ అనే ‘అవబృధస్నానం’ జరిగే ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. ఇలా తిరుమల, తిరుపతి ఆలయాలలో అర్చనాది కార్యక్రమాలను, ఆలయ వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తరాల వారికి అందించిన ఘనత రామానుజాచార్యుల వారికి దక్కుతుంది.
 
రామానుజ పరంపరే జీయర్ల వ్యవస్థ
తిరుమల శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాలు, టీటీడీ పరిపాలన నిర్వహణలో మూడు రకాల వ్యవస్థలు అమలవుతున్నాయి. శ్రీరామానుజాచార్యులు నెలకొల్పిన జీయంగార్ల వ్యవస్థ ఆలయంలో నేటికీ ప్రామాణికంగా అమలవుతోంది. ఇక భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులు, ఇతర విధాన నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ తీసుకునే నిర్ణయాలను అమలు చేయించడం కోసం కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేస్తోంది.
 
తిరుమలలో జియ్యంగార్ల వ్యవస్థ ఇలా..
తిరుమలేశుని ఆలయంలో పూర్వం రాజులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పూజాకార్యక్రమాలను అమలు జరిపారు. రామానుజుల హయాం నుంచి తిరుమల ఆలయంలో పూజా కైంకర్యాలకు నిర్దిష్ట విధానాలను అమలు చేశారు. వైఖానస ఆగమం ప్రకారం ఆలయ నిర్వహణ జరిపించడం, స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే బాధ్యతను అర్చకులు నిర్వహించటం, అర్చకులంతా వైఖానసులై ఉండేలా చూడటం, అర్చకులు నిర్వహించే నిత్యపూజాకైంకర్య కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించడానికి రామానుజాచార్యులు జీయంగార్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు. జీయంగార్లు అంటే సన్యాసులు కారు. ఈ పదవికి వచ్చేవరకు సంసార సాగరాన్ని ఈదిన వారినే చినజీయర్ (ఉత్తరాధికారి)గా ఎంపిక చేస్తారు. ఈ జీయర్ వ్యవస్థలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీరు సన్యాసధర్మాలను తప్పక ఆచరించాలి.
 
మఠం పరిపాలన
శ్రీవారి ఆలయంలో వేకువజాము సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుండి రాత్రి ఏకాంతసేవ ముగిసే వరకు అన్నిరకాల పూజాకార్యక్రమాలను పెద్ద జీయర్, చిన్నజీయర్ లేదా వారి ప్రతినిధులైన ఏకాంగులు దగ్గరుండి పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలుకొని అన్ని రకాల వస్తువులను వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందజేస్తారు. జీయంగార్ల మఠాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల కోసం టీటీడీ ఏటా కోటిన్నర రూపాయలు కేటాయిస్తోంది. ఈ వ్యవస్థలో పెద్ద జీయంగార్, చిన జీయంగార్, ఏకాంగులు, అధ్యాపకులు ఉంటారు.
 
జీయర్ స్వరూపమిది..
పెద్ద జీయంగార్: ఆలయ పూజాకార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడు.

చిన్న జీయంగార్: పెద్ద జీయంగారికి ప్రధాన సహాయకుడిగా పని చేస్తారు.

అధ్యాపకులు, ఏకాంగులు: బ్రహ్మచారులైన వీరు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. వీరు వేద పాఠాలు చదువుతారు. పెళ్లయిన వారు కూడా ఉండవచ్చు. వీరు జీయంగార్లకు సహాయకులుగా పనిచేస్తారు.
 
తొలిపూజ, తొలి నివేదనం, తొలి దర్శనం
వేంక టాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందుకే ‘ఆదివరాహక్షేత్రం’ అనీ, ‘శ్వేత వరాహక్షేత్రం’ అని తిరుమల పేరు పొందింది. నిత్యం తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనాదుల క్షేత్రంలోని పూర్వసంప్రదాయాన్ని రామానుజులవారు పునరుద్ధరించారు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, భూదేవిని ఉద్ధరించి ఇక్కడే నిలిచాడు.
 
ఆ తర్వాత కొంతకాలానికి శ్రీనివాసుడు వచ్చి తాను కలియుగాంతం వరకు ఇక్కడ ఉండడానికి వంద అడుగుల స్థలం దానంగా ఇమ్మని కోరుతూ, అందుకు ప్రతిఫలంగా యుగాంతం వరకు ‘తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనం’ వరాహస్వామికి జరిగేటట్లుగా పత్రం రాసిచ్చాడు. ఈ క్షేత్ర సంప్రదాయం నిర్విఘ్నంగా అమలు జరిగేలా రామానుజులు ఇక్కడి విధివిధానాలను ఏర్పాటు చేశారు.
 శ్రీవారి ఆలయంలో సన్నిధి భాష్యకారులు
 
సన్నిధి అంటే ‘తిరుమల శ్రీవారి సన్నిధి’ అని అర్థం. ఆలయం విమాన ప్రదక్షిణ మార్గంలో ‘సన్నిధి భాష్యకారులు’గా రామానుజాచార్యులవారు కొలువై ఉన్నారు. శ్రీవారి కొప్పెర(హుండీ)కి ఎదురుగా తాళ్లపాక అరకు పక్కగా ‘సన్నిధి భాష్యకారుల’ను దర్శించవచ్చు. శ్రీవారికి నివేదనం జరిగిన ప్రతిసారీ శ్రీవారి సన్నిధి భాష్యకారులకు నివేదింపబడుతుంది. దీనిని 12వ శతాబ్దంలో అనంతాళ్వారులు శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించారు.
 
తణ్ణీరముదు ఉత్సవం
తిరుమలలోని పాపవినాశం నుంచి తీర్థజలాన్ని తెస్తున్న తిరుమలనంబికి శ్రీనివాసుడు బోయ యువకుడిగా అడ్డుపడి ‘నీళ్లివ్వు’ అన్నాడు. ‘శ్రీస్వామివారి కైంకర్యం కోసం తీసుకెళ్లే జలాన్ని ఇవ్వకూడదు’ అన్నాడు. కానీ, ఆ బోయవాడు వెనకనే నడుస్తూ, తన బాణంతో తిరుమలనంబి తలమీదనున్న కుండకు రంధ్రం చేసి దానినుండి జాలువారే నీటిని తాగాడు. ఖాళీ అయిన కుండను గమనించిన తిరుమలనంబి వెనక్కు తిరిగి బోయవాణ్ణి చూచి ‘ఎంత పాపం చేశావు.. ఇప్పటికే ఆలస్యమైంది. తీర్థాన్ని మళ్లీ తేవాలి కదా?’ అని చింతించారు. ‘తాతా! బాధపడకు. ఇదిగో ఈ కొండవాలులో చూడు. స్వచ్ఛమైన జలం ఉంది’ అంటూ బాణంతో కొట్టాడట. బాణం వల్ల పడిన రంధ్రం నుండి ఎగిసిపడిన జలాన్ని తీసుకొని తిరిగి బోయవానికోసం చూడగా అతడు అదృశ్యమయ్యాడట. దీనికి గుర్తుగా నేటికీ అదే రోజున తిరుమలలో ‘తణ్ణీరముదు ఉత్సవం’ జరుగుతుంది. దీన్ని కూడా రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు.
 
తిరుచానూరు పంచమి
ప్రతి సంవత్సరం కార్తిక శుద్ధపంచమినాడు అనగా ‘శ్రీ అలమేలుమంగ’ అవతరించిన ‘తిరుచానూరు పంచమి’ రోజున మాత్రం తిరుమల శ్రీవారి పూలమాలలు, పసుపు, కుంకుమలతో కూడిన సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పంపాలనే సంప్రదాయాన్ని కూడా రామానుజులవారే ఏర్పాటు చేశారు.  
 
మోకాళ్ల పర్వతంలో కొలువైన త్రోవ భాష్యకారులు
భగవద్రామానుజులవారు శ్రీభాష్య గ్రంథాలను విరచించటంతో భాష్యకారులుగా ప్రసిద్ధి పొందారు. యాత్రలో మూడుమార్లు పాదాలతో తిరుమల కొండమెట్లను తొక్కకుండా మోకాళ్లతో మాత్రమే దేకుతూ, కొండకు వచ్చారు. అలా వెళుతున్న సమయంలో ‘మోకాళ్ల మెట్టు’ దగ్గర కొద్దిసేపు వారు విశ్రాంతి తీసుకొన్నారు. అందుకు గుర్తుగా ఆ తరువాతి కాలంలో ఆ దివ్య స్థలంలో రామానుజులవారి విగ్రహం ప్రతిష్టింపబడింది. వారినే ‘త్రోవభాష్యకారులు’ అని అంటారు. త్రోవభాష్యకారులకు ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి నివేదనలు చేస్తారు.
 
జనబాహుళ్యంలోకి రామానుజ తత్వం
వైష్ణవ భక్తాగ్రేసరుడు రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ రూపొందించటం అభినందనీయం. రామానుజతత్త్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది.
- సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్
 
సహస్రాబ్ది ఉత్సవాలు
ఆచార్య పరంపరలో అగ్రగణ్యులు భగవద్రామానుజులు ఏర్పరచిన పూజా విధానాలే నేటికీ తిరుమలలో కొనసాగుతున్నాయి. ఆ మహనీయుడు అవతరించి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేవస్థానం తరఫున ఏడాదిపాటు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. 108 దివ్యదేశయాత్రలు, ధార్మిక ప్రవచనాలు, గ్రంథ ప్రచురణలు వంటి కార్యక్రమాల ద్వారా రామానుజుల భక్తితత్త్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళుతున్నాము.
- డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ఈవో
 
ఏడాదిపాటు సహస్రాబ్ది ఉత్సవాలు
రామానుజాచార్యులవారి సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈ ఏడాది మే 10న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా సంచార ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. రథం వెనుక వైపు శ్రీవేంకటేశ్వర స్వామివారు, రామానుజులవారు, పక్కభాగంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, రామానుజులవారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మే 10న ప్రారంభించిన ఈ సంచార రథం 108 దివ్యదేశాలలో పర్యటించి, రామానుజ తత్వానికి ప్రచారం కల్పించనుంది.
 
తిరుమలలో బాగ్ సవారీ ఉత్సవం
శ్రీనివాసుడు పుష్పాలంకార ప్రియుడు. ఈ క్షేత్రంలోని పూలన్నీ శ్రీవారి పూజకే వినియోగించాలని క్షేత్ర సంప్రదాయం. పుష్పకైంకర్యం కోసం అనంతాళ్వార్ అనే శిష్యుణ్ణి శ్రీరంగం నుంచి తిరుమలకు రప్పించారు పరమభక్తాగ్రేసరులైన రామానుజాచార్యులు. పుష్పకైంకర్యం కోసం తోటను పెంచాడు అనంతాళ్వారు. ఆ తోటను చూడడానికి రాత్రిపూట శ్రీనివాసభగవానుడు, లక్ష్మీదేవితోపాటు వచ్చి తోటను పాడుచేశాడు. దాన్ని గమనించి రాత్రిపూట కాపుకాసిన అనంతాళ్వారు వారిద్దరినీ బంధించాడు. కాని స్వామి తప్పించుకొని పోగా, లక్ష్మీదేవిని కట్టివేసి, స్వామిని వెంబడిస్తూ పరుగెత్తాడు. ఆలయానికి అప్రదక్షిణంగా పరుగెత్తి, పరుగెత్తి చివరకు పూలతోట దగ్గరకే వచ్చి స్వామి అదృశ్యమయ్యాడు.

లక్ష్మీదేవి మాత్రం చెట్టుకు బంధింపబడి ఉందని సంతోషించాడు. ఇంతలో తెల్లవారింది. ఆలయంలో స్వామివారి వక్షఃస్థలంలో లక్ష్మీదేవి కనిపించలేదని అర్చకులు ఆందోళనపడగా, శ్రీస్వామివారు ‘అనంతాళ్వారులు ఆమెను పూలతోటలో బంధించాడని, సగౌరవంగా పిలుచుకొని రమ్మని’ చెప్పాడు. వారు ఆలయం చేరుకోగానే, అమ్మవారు అదృశ్యమై శ్రీవారి వక్షఃస్థలం చేరుకొంది. ఈ గాథను స్మరిస్తూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ‘బాగ్‌సవారి ఉత్సవం’ ఏర్పాటు చేశారు రామానుజులవారు. ‘బాగ్’ అంటే తోట. సవారీ అంటే వ్యాహ్యాళి. తోటకు వెళ్లే ఉత్సవం కనుక ఇది ‘బాగ్‌సవారీ’ అంటారు. ఆ రోజు శ్రీనివాసుడు దేవేరులతో ఆలయానికి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు వెళ్లి పూజాకైంకర్యాలు అందుకుని, తిరిగి ఆలయం చేరుకుంటారు.
 
శంషాబాద్‌లో 216 అడుగుల పంచలోహ సమతామూర్తి
- వేయేళ్ల సందర్భంగా స్ఫూర్తికేంద్రం   
తెలంగాణాలో హైదరాబాద్‌నగరం శంషాబాద్‌కు సమీపంలోని శ్రీరామాపురం వద్ద 216 అడుగుల ఎత్తున శ్రీరామానుజుల పంచలోహ విగ్రహం (సమతామూర్తి) రూపకల్పన సాగుతోంది. స్వామి వారికి వెయ్యేళ్లు నిండుతున్న సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి నేతృత్వంలో ‘శ్రీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్థాపన జరుగుతోంది. వచ్చే ఏడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నిర్మాణం పనులు 2022 నాటికి పూర్తయ్యేలా నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే లక్ష్యంతో 2014లో పనులు ప్రారంభించారు  ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1000 కోట్లు.

ఈ విగ్రహం మొత్తం ఎత్తు 216 అడుగులు. ఈ విగ్రహం చైనాలోని నాన్జింగ్‌లో సిద్ధమవుతోంది. దాదాపు 1500 విడిభాగాల్లో మొత్తం సుమారు 700 టన్నుల బరువుతో సిద్ధమవుతోంది. విగ్రహ పీఠం భాగంలో 36 ఏనుగు బొమ్మలు ఉంటాయని, వాటిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుందని, ఈ పీఠంపై 108 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని, ఆయన చేతిలోని త్రిదండం 135 అడుగులు ఉంటుందని స్థపతి డీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు.
 
విజయకీలాద్రిపై 108 అడుగుల సుధామూర్తి ప్రతిపాదన

విజయవాడలోని విజయ కీలాద్రి పర్వతంపై 108 అడుగుల ఎత్తై రామానుజుల సుధామూర్తి (సిమెంట్ విగ్రహం) ఏర్పాటు చేయాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు సంకల్పించారు. విగ్రహస్థాపన ప్రణాళిక దశలోనే ఉంది. ఇదే పర్వతం మీదున్న శిథిలావస్థకు చేరిన శ్రీవేంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి, భూ వరాహస్వామి, శ్రీకృష్ణ స్వామి, సుదర్శన చక్రత్తాళ్వారు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, వైకుంఠ పెరుమాళ్, అష్టలక్ష్మి ఆలయాల జీర్ణోద్ధారణకు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement