మహంతులే మార్గదర్శకులుగా...
ఐదువందల ఏళ్ళ కిందట ఢిల్లీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని ‘క్రేడల్‌క్రేల’ గ్రామంలో రామానంద మఠం ఉండేది. ఆ మఠాధిపతి అభయ ఆనంద్‌జీ. ఈయన శిష్యుడే హథీరాంజీ. దక్షిణభారత దేశ యాత్రలో భాగంగా వేంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వర స్వామిని అయోధ్య రాముడి అంశగా భక్తితో కొలుస్తూ ప్రసన్నం చేసుకున్నాడు. బావాజీ భక్తికి ముగ్ధుడైన స్వామి నిత్యం ఆనంద నిలయం దాటి హథీరాం మఠం విడిదికి వెళ్లి, బావాజీతో పాచికలాడేవారట. అయితే ఆటలో తానే ఓడిపోయి భక్తుని గెలిపిస్తూ ఆనందించేవారట. తిరుమలలో హథీరాంజీ స్థాపించిన మఠం ఆలయానికి ఆనుకుని ఆగ్నేయదిశలో ఉంది.
90 ఏళ్ల మహంతుల పాలన
క్రీ.శ.13వ శతాబ్దం తర్వాత విజయనగర రాజులు, ఆ తర్వాత 1843 ముందు వరకు ఈస్టిండియా కంపెనీ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలన సాగింది. 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు 90 ఏళ్లపాటు ఆలయ పాలన హథీరాం మఠం మహంతుల చేతుల్లోనే సాగింది. 1843 జూలై 10 తేదీన హథీరాం మఠం తరపున శ్రీవారి ఆలయానికి తొలి ధర్మకర్తగా మహంత్ సేవాదాస్ బాధ్యతలు చేపట్టారు.
ఆణివార ఆస్థానం రోజున బ్రిటీషు ప్రభువుల నుండి శ్రీవారి ఆలయ ఆస్తిపాస్తులు, స్వామికి అలంకరించే తిరువాభరణాలు, ఉత్సవమూర్తులు, ఉత్సవ వర్ల ఊరేగింపులో వాడే వాహనాలు, కైంకర్యాల్లో వినియోగించే పురాతన వస్తువులు, వస్త్రాలు, పాత్రలు, ఆలయానికి సంబంధించిన అన్ని రికార్డులు సేవాదాస్‌కు అప్పగించారు. ఇందుకు తార్కాణంగానే తిరుమల ఆలయ లెక్కల అప్పగింతలు వంటి కార్యక్రమాలన్నీ ‘ఆణివార ఆస్థానం’ రోజునే నిర్వహించే ఆచారాన్ని టీటీడీ అమలు చేస్తుండటం విశేషం.
మహంతుల అధికారిక ముద్ర ‘విష్వక్సేన’
మహంతుల అధికారిక ముద్ర (సీలు) విష్వక్సేనుడు. సేవాదాస్ హయాంలోనే పుష్కరిణిలోని ‘జలకేళి మండపోత్సవం’ పేరుతో తెప్పోత్సవం ప్రారంభించారు. రెండవ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న ధర్మదాస్ తిరుపతి కపిలతీర్థం పుష్కరిణి, సంధ్యావందన మండపాన్ని జీర్ణోద్ధారణ చేశారు. 1878లో తిరుమల ఆలయంలోని పడికావలి గోపురం (మహద్వార గోపురం)కు మరమ్మతులు చేయించారు.
ప్రయాగదాస్ హయాంలో అభివృద్ధి వేగవంతం
మహంతుల పాలనలో చివరి విచారణకర్తగా బాధ్యతలు చేపట్టిన మహంత్ ప్రయాగదాస్ హయాంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన వేగవంతం అయ్యాయి. 1900 సంవత్సరం నుంచి 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే వరకు 33 సంవత్సరాల పాటు ఆయన పాలన సాగింది. ఆ కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, పనులు నేటి తరం టీటీడీ పాలకులకు కూడా మార్గదర్శకంగా నిలిచాయి. 1908లో ఆనంద నిలయం శిఖరంపై బంగారు కలశాన్ని ఏర్పాటు చేశారు.
భక్తులు సులభంగా తిరుమలకు వచ్చేందుకు ప్రధాన మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాట మార్గాలు అభివృద్ధి చేశారు. జంతుదాడుల నుంచి రక్షించుకోవటంతోపాటు వెలుతురు కోసం అటవీ కాలిబాటల్లో వాషింగ్‌టన్ (ఆధునిక బల్బులు) విద్యుత్ బల్పులు ఏర్పాటు చేయించారు. అలిపిరిమార్గంలో గాలిగోపురం నిర్మించారు. తిరుమల, తిరుపతిలో ధర్మసత్రాలు నిర్మించారు. రహదారులు, తాగునీరు, శుభ్రత, ఆరోగ్యం, వైద్య సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించి పనులు వేగవంతం చేయించారు.
పరిపాలన సౌలభ్యం కోసం తిరుపతిలో పాత హుజారు ఆఫీసు నిర్మాణం, మద్రాసులో దేవస్థానం ముద్రణాలయం, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర ఉన్నత పాఠశాల నిర్మాణం, వేదపాఠశాల విస్తరణ, ఓరియంటల్ కళాశాల, ఆయుర్వేద పాఠశాల నిర్మాణాలు చేపట్టారు. మూలమూర్తి, ఉత్సవమూర్తులకు ఆభణాలు, కిరీటాలు వంటి విలువైన నగలు తయారు చేయించారు. దేవాలయాల శిలాశాసనాలు పరిశోధన చేయించారు. 1933లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేయటంతో మహంతుల పాలన ముగిసింది.
శ్రీవారికి మహంతుల ‘నిత్యహారతి ’
మహంతు బాబాజీ పేరుతో తిరుమల ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలో గోక్షీర నివేదనం, నవనీత హారతి సమర్పించే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ నాటి నుంచి నేటి హథీరాం మహంత్ అర్జున్‌దాస్ లేదా మఠానికి చెందిన సాధువులు/బైరాగులు ప్రతిరోజూ వేకువజాము సుప్రభాతవేళకు ముందు ఆలయానికి వెళ్లి సంప్రదాయంగా హారతి అందజేస్తున్నారు.
ఇక గోకులాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు హథీరాంమఠానికి విడిదికి వచ్చి ప్రత్యేక పూజలందుకుంటారు. మఠం మహంతుకు ఆలయ మర్యాదలు పరివట్టం, తీర్థం, శఠారి మర్యాదలు అందజేస్తారు.
మహంతుల కాలంలోనే స్థానికులకు కొండమీద స్థలాలు
అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తిరుమలకొండ మీద ఆలయంలో పనుల నిర్వహణ కోసం సిబ్బంది కొరత ఉండడంతో సదుపాయాల్లేక భక్తులు ఇబ్బంది పడేవారు. దాంతో మహంతులు చొరవ తీసుకుని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర సమీప గ్రామ ప్రాంతాల్లో దండోరా వేసి అక్కడివారిని తిరుమలకు రప్పించారు. వారికి స్థలాలను, అనుభవ హక్కులు ఇచ్చారు. స్థిరనివాసం కల్పించారు. వ్యాపారాలకు అనుమతులిచ్చారు. కొండకు వచ్చే భక్తులకు అండగా ఉంటూ జీవనం సాగించుకునేందుకు స్థానికులకు మహంతులు భరోసా ఇచ్చారు.
విచారణ కర్త పాలన కాలం సం.
1. మహంతు సేవాదాస్ 1843-1864 21
2. మహంతు ధర్మదాస్ 1864-1880 16
3. మహంతు భగవాన్‌దాస్ 1880-1890 10
4. మహంతు మహావీర్‌దాస్ 1890-1894 04
5. మహంతు రామకృష్ణదాస్ 1894-1900 06
6. మహంతు ప్రయాగదాస్ 1900-1933 33
రూ.వేల కోట్లలో మఠం ఆస్తులు
హథీరాం మఠం నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని అనధికారిక లెక్కలు. ప్రధానంగా తిరుమల, తిరుపతిలో మఠాలతోపాటు ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. మఠం నిర్వహణా బాధ్యతను 1962 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ నిర్వహిస్తోంది.
మఠాధిపతిగా అర్జున్‌దాస్
హథీరాం మఠం మహంతుగా అర్జున్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో మహంతుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన్ను బాధ్యతల నుండి తప్పించింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో 2007లో తిరిగి మఠం మహంత్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి మహంత్ అర్జున్‌దాస్ కొనసాగుతున్నారు.