స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి | tirumala brahmotsavalu special story | Sakshi
Sakshi News home page

స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి

Published Sun, Oct 2 2016 2:13 AM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి - Sakshi

స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి

ఆపదమొక్కులవాడికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. నిత్యపెళ్లికొడుకైన ఆ స్వామి సన్నిధిలో వివాహబంధంతో ఒక్కటవుతుంటాయి కొత్తజంటలు. మరికొందరు భక్తులు నామకరణం, అన్నప్రాశసన, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం, కేశఖండన, ఉపనయనం, సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తూ తరిస్తున్నారు భక్తకోటి. ఇందుకు టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణ వేదిక కేంద్రమైంది.
 
పురోహిత సంఘం
తిరుమలలో సనాతన హైందవ సంప్రదాయానికి లోబడి వైదిక కర్మలు నిర్వహించేందుకు  టీటీడీ పౌరోహిత సంఘం ఉంది. ఇక్కడ నిష్ణాతులైన పురోహితులు ఉన్నారు. మొత్తం 120మంది పౌరోహితులు, మంగళవాయిద్యాలు వాయించటం, చెవిపోగులు కుట్టడం వంటి వాటిలో నాయీ బ్రాహ్మణుల 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
 
వెంకన్న సన్నిధిలో ముహూర్తంతో పనిలేదు!
దేవదేవుని సన్నిధి అయిన తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. బాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. ఇలా తిరుమలలో రోజూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. శుభలగ్నాలతో పనిలేకుండా కూడా పెళ్లి వేడుకలు సాగుతుండటం ఇక్కడి ప్రత్యేకత.  
 
ఉచిత ‘కల్యాణం’
భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరైన వివాహ బంధం పటిష్టతకు టీటీడీ గట్టి పునాదులు వేసింది. అదే తరహాలోనే ‘కల్యాణం’ పేరుతో కొత్త పథకానికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శ్రీకారం చుట్టారు. వివాహానికి కావాలసిన వాటినన్నిటినీ ఉచితంగా సమకూర్చుటం వల్ల ధార్మిక ప్రచారంతోపాటు మానవసేవకూ మార్గం ఏర్పడుతుందని టీటీడీ భావించింది.
* తిరుమల కల్యాణవేదిక పౌరోహిత సంఘం కేంద్రంగా 2016, ఏప్రిల్ 25 నుండి ‘కల్యాణం’ పథకానికి శ్రీకారం చుట్టారు. పురోహితుడు, మంగళవాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో విద్యుత్ చార్జీలకు రూ.860 వసూలు చేసే విధానాన్ని రద్దు చేశారు.
* వివాహం సందర్భంగా శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల క్యూలైను నుండి కొత్తజంటలతోపాటు వారి అమ్మానాన్నలు, బంధుమిత్రులు మొత్తం 6 మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటకు శ్రీవారి ప్రసాద బహుమానంగా పది చిన్న లడ్డూలు అందజేస్తారు.
* చట్టప్రకారం వధూవరులు మేజరై ఉండాలి. వారి వయసు తెలిపే 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపాలి. పెళ్లికి పెద్దల అంగీకారం ఉండాలి.  వధువు, వరుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు హాజరు కావాలి.
* ఫొటోమెట్రిక్ పద్ధతిలో అందరూ వేలి ముద్రలు వేసి రిజిస్టర్ చేసుకున్నాకే పెళ్లి వేడుక నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత ఎస్‌ఎంసీలోని 232 కాటేజీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో  వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు.
* పౌరోహిత సంఘంలో సామూహిక పెళ్లి వేడుక నిర్వహించుకునేందుకు టీటీడీ కొత్తగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌక ర్యం కల్పించింది. www.ttdseva online.com ద్వారా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.  
* తిరుమలలో 23 మఠాలు, ప్రైవేట్ సత్రాలు, టీటీడీకి సంబంధించిన శంకుమిట్ట కాటేజీ (ఎస్‌ఎంసీ) 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీ (టీబీసీ) 2 కల్యాణ మండపాల్లోనూ పెళ్ళిళ్లు చేసుకోవచ్చు.
 
వీటికి మాత్రమే నగదు చెల్లించాలి?
టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణవేదికలో వివాహాలు మాత్రం ఉచితం. అయితే, మిగిలిన వాటికి నగదు చెల్లించాలి. వీటి నిర్వహణకోసం కేవలం గంట ముందు వచ్చి నగదు చెల్లించి రశీదు పొందితే చాలు టీటీడీ అవసరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నగదు చెల్లింపు వివరాల్లోకి వెళితే..., ఉపనయనం:రూ.300, చెవులు కుట్టించడం: రూ.50, అన్నప్రాశన-రూ.200, నామకరణం-200, కేశఖండన-రూ.200, అక్షరాభ్యాసం:రూ.200,  సత్యనారాయణ స్వామి వ్రతం:రూ.300, నవగ్రహ హోమం: రూ.300, రూ.100, ప్రార్థనావివాహం-రూ.200.
 
నామకరణం

హిందువులు నిర్వహించే షోడ శ కర్మలలో నామకరణం, అన్నప్రాశన, కర్ణవేధ, కేశఖండన, అక్షరాభ్యాసం, ఉపనయనం అతిముఖ్యమైనవి. వీటన్నింటినీ వెసులుబాటును బట్టి ఇండ్లలోనూ, లేదా ఎవరికి ఎక్కడ మొక్కుబడి ఉంటే అక్కడి దేవాలయాలలోనూ నిర్వహిస్తుంటారు. అయితే తిరుమలలో ఆయా కార్యక్రమాలు చేయిస్తామని మొక్కుకున్నవారు తిరుమలకు వచ్చి, ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడాన్ని ఒక వేడుకగా నిర్వహించుకోవడం పరిపాటి. ముఖ్యంగా తమ పిల్లలకు ఏవైనా గండాలు లేదా ఆపదలు కలిగితే, అటువంటప్పుడు వారు సవ్యంగా ఉంటే ఆయా కార్యక్రమాలను తిరుమల స్వామివారి సన్నిధిలో జరిపించుకుంటామని మొక్కుకుంటారు.

స్వామి వారి అనుగ్రహంతో వారికి ఆ గండాలు లేదా ఆపదలు గడిచి, గట్టెక్కిన తర్వాత తిరుమల వచ్చి మొక్కుబడులు తీర్చుకోవడం పరిపాటి. సాధారణంగా ఈ కార్యక్రమాలను తిరుమల పౌరోహిత సంఘంలో నిర్వహిస్తారు. అలా నిర్వహించుకోవడాన్ని స్వామివారి ఆశీస్సులతో కూడిన అనుగ్రహంగా, తమ అదృష్టంగా భక్తులు భావిస్తారు.
 
సత్యనారాయణ స్వామి వ్రతం
దక్షిణాది రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేయించే  సంప్రదాయం ఉంది. ఈ పూజకు చాలా ఆదరణ ఉంది. విష్ణుమూర్తి అంశయైన శ్రీ సత్యనారాయణస్వామి అంటే హిందువులందరికీ అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లా అన్నవరంలో సుప్రసిద్ధ సత్యనారాయణస్వామి దేవాలయం ఉంది. అనేకమంది కుటుంబంతో సహా ఆ దేవాలయానికి వెళ్లి అక్కడ సత్యనారాయణస్వామి వ్రతం, పూజలు చేస్తారు. ఈ కార్యాన్ని తిరుమల పౌరోహిత సంఘంలోనూ నిర్వహిస్తారు.
 
ప్రార్థనా వివాహం (మరుమాంగల్యం)
హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జంటలకు అనేక రకాల దోషాల నివారణ కోసం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. వివాహం జరిగినా సంతానం లేకపోతేనో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలవంటి కారణాలతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. తొలుత కొత్తమాంగల్యం ధరిస్తారు. అనంతరం వివాహం సందర్భంగా కట్టిన తొలి మంగళసూత్రాన్ని శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. అలా చేయడం వల్ల వివాహబంధంలోని ఆటంకాలు తొలగినట్లుగా భావిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement