ramanuja
-
రామానుజ జీవిత చరిత్రతో ‘జయహో రామానుజ’
సాయి వెంకట్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ని నిర్మాతలు వడ్లపట్ల మోహన్, ప్రసన్న కుమార్, టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, సెన్సార్ బోర్డు మెంబర్ అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘11వ శతాబ్దంలోని భగవత్ రామానుజుల జీవిత చరిత్ర ఆధారంగా ‘జయహో రామానుజ’ తెరకెక్కిస్తున్నాం. 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నెల 15 నుంచి మూడవ షెడ్యూలు ప్రారంభిస్తాం. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నాం. మొదటి భాగాన్ని ఈ ఏడాది దసరాకు, రెండవ భాగాన్ని 2023 మే 5న రామానుజ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. -
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు..సండే సందడి
-
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. మూడో రోజు ఫోటోలు
-
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండోరోజు ఫోటోలు
-
సమతామూర్తి విగ్రహావిష్కరణకు శ్రీరామనగరం ముస్తాబు
-
శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతోన్న శ్రీరామనగరం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్‌కు అమర్చిన మార్బుల్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహం.. ► ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని ► 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు శరవేగంగా రహదారుల విస్తరణ ► ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఎన్‌హెచ్ 44 నుంచి పెద్దషాపూర్ తండా చౌరస్తా– గొల్లూరు– అమీర్‌పేట్ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ► ఎన్ 44 మదనపల్లి క్రాస్ రోడ్డు నుంచి ముచ్చింతల్ మీదుగా చిన్న తూప్రాన్ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా.. తాగునీరు ► రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్ సమీపంలో 33/11కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్ ఆవరణలో తాత్కాలిక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ► రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్ ప్రధాన లైన్ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఆవుపేడతో పిడకలు సిద్ధం ► హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు. పద్మపత్రాలు విచ్చుకునేలా ఫౌంటెన్.. ► సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. వెదురు బొంగులు.. తాటి కమ్మలతో.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. ► నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు. -
శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు
రోజూలానే ఆరోజు కూడా రామానుజుడు మహాపూర్ణుల ఇంటికి వెళ్లారు. కాని ఇంట్లో ఎవరూ లేరు. ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల వారిని అడిగితే గురువు గారు హఠాత్తుగా ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. ఎందుకు? ఇంటికి చేరుకున్న రామానుజుడికి.. జరిగిన గొడవ గురించి, గురువుగారు హఠాత్తుగా ఎందుకు కంచి వదిలి వెళ్లిపోయారో తెలిసిపోయింది. గురువుగారి భార్యను అన్నమాటలు కూడా తెలుసుకున్న తరువాత చాలా బాధపడ్డారు. హృదయం భారమైంది. కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె కనిపించింది. సాధ్యమైనంత వరకు కోపం, బాధ ఆపుకుంటూ ‘‘మూడు తప్పులు చేశావు రక్షమాంబ, క్షమించరాని తప్పులు. రెండు సార్లు నీకు హెచ్చరిక చేశాను. నాకు ఉపదేశం చేసిన గురువుగారిని కూడా నీవు గౌరవించకపోతే మనం ఏం చేస్తున్నట్టు? మొదటి సారి కాంచీపూర్ణుని సాపాటుకు పిలిచి కులభేదాలు లేవంటూ గౌరవించాలన్న నా ప్రయత్నాన్ని ఫలించనీయలేదు. అది మొదటి తప్పు. మరోసారి ఆకలితో ఉన్న వైష్ణవుడికి భోజనం పెట్టమని కోరితే నిరాకరించావు. ఇంట్లో భోజన పదార్థాలు ఉన్నా లేవన్నావు. ఇక ఇప్పుడు నా ఆచార్యుడిని వెడలగొట్టిన పాపాన్ని నాకు కట్టబెట్టావు. నాకు దివ్యోపదేశం చేసిన గురువే నా జీవితంకన్నా, నీకన్నా చాలా ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా. నీకు ఇదివరకు ఎన్నో సార్లు చెప్పాను కూడా! హెచ్చరించినా వినడం లేదు. నా స్థాయికి మించిన సతీమణివి నువ్వు. నీవల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడం నా వల్ల కావడం లేదు. ఇక ప్రయోజనం లేదు. నీవు నీ పుట్టింటికి వెళ్లవచ్చు. నీతో వచ్చినవి, నీవు తెచ్చినవి, నీ పుట్టింటివారు నీకు ఇచ్చినవి తీసుకుని వెళ్లవచ్చు.’’ అని తీక్షణంగా మాట్లాడి, రామానుజుడు వెళ్లిపోయాడు. తంజ వణికిపోయింది. ఏనాడూ కోపంగా లేని రామానుజుడు అంతగా ఆగ్రహించడం తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి ఆమెను పంపించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు రామానుజులు. అంతలో ఒకరోజు ఆమె పుట్టింటినుంచి ఎవరో వచ్చి తమ్ముడి పెళ్లికి అక్కా బావలను నాన్న రమ్మంటున్నారని చెప్పారు. తండ్రి పంపిన కొన్ని కానుకలు ఇచ్చాడు. ఉత్తరం కూడా రాసి పంపాడు. తను వెళ్తానంది. రామనుజుడు సరేనన్నాడు. తాను రాలేనని చెప్పాడు. కొన్ని వస్తువులు తీసుకువెళ్తానంది. నీకు ఇష్టం వచ్చినవన్నీ తీసుకుపోవచ్చని చెప్పాడు. ఎప్పుడు వస్తానో తాను చెప్పలేదు. రామానుజుడూ అడగలేదు. పుట్టింటి ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఇంకా తాను వాడుకుంటున్న వస్తువులు కూడా సర్దుకుంది. ఆమె ముఖంలో పుట్టింటికి వెళ్లే సంతోషం కనిపించింది. ఏ తప్పు చేయని వారిని వైవాహిక బంధంనుంచి తెంచడం ధర్మం కాదు. మూడుతప్పులు చేసిన భార్యను వదిలివేయడం అధర్మం కాదు. స్వచ్ఛందంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంటే... ఇదీ ఒకందుకు మంచిదే అన్నట్టు రామానుజుడు మౌనం వహించాడు. వెళ్లిపోయింది. తనకు సహధర్మచరిగా ఉండవలసిన భార్య దొరకలేదు. ఇక సంసారమూ ఆ సంసార భారాలూ తనకు సాధ్యం కాదని తన దారి వేరని అర్థమైపోయింది. మళ్లీ ఇక ఆమె గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఆయన జీవితంలోకి ఆమె వచ్చిన దాఖలా లేదు. సన్యాసాశ్రమం రామానుజుడు ఇక సన్యాసాశ్రమం తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమనే నిశ్చయానికి వచ్చాడు. భిక్షువైన సన్యాసి ద్వారాగానీ లేదా భగవంతుడి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలి. రామానుజుడు వరదరాజ స్వామి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలని సంకల్పించాడు. అనంత సరస్సులో స్నానం చేసి పునీతుడైనాడు. ‘ఈ సంసార బంధంనుంచి నన్ను విముక్తుడిని చేయి వరదరాజా.. నీ దివ్య ఆదేశాలను స్వీకరించడానికి నేను సిద్ధం. నన్ను నీ చరణాలను ఆశ్రయించనీయి, త్రిదండం ఇప్పించు. కాషాయ వస్త్రాలు దాల్చనీ, స్వామీ’ అని ప్రార్థించాడు. కాంచీపూర్ణుడి ద్వారా అతనికి అనుజ్ఞ లభించింది. త్రిదండము, కాషాయ వస్త్రాలు, ఉపవీతము, కౌపీనము, వేష్టి, శిక్యము మొదలైనవి ఇచ్చి ఇకనుంచి అతను రామానుజ ముని అని పిలువబడతాడన్నారు. రామానుజ మునికి సన్యాసాశ్రమ ధర్మపద్ధతి ప్రకారం మఠం ఏర్పాటుచేసి పీఠాన్ని అందులో ఆయన్ను ప్రతిష్ట చేయండి అని ఆదేశించారు వరదరాజస్వామి. కొన్నాళ్లు కంచి రామానుజ మఠంలో ఆయన సన్యాసిగా జీవనం సాగించారు. సన్యాసాశ్రమంలో కఠిన నియమాలు సవివరంగా పాటించారు. యామునాచార్యులను తలచుకున్నారు. ఇదంతా నాయందు వారి అపారమైన దయ, లీల. తన మార్గంలో కంటకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు. చివరకు ఈ దారికి మళ్లించారు. ఇక వారి ఆశయాలను నెరవేర్చే బృహత్ కార్యాన్ని చేపట్టాలి. కాని నేను ఒక్కడినే ఉన్నాను. నాకొక తోడు ఉండాలి. గోవిందుడు గుర్తుకు వచ్చాడు. ఆ«ధ్మాత్మిక వాజ్ఞ్మయం తెలిసిన వాడు, శాస్త్రాలు చదువుకున్నవాడు. భౌతిక లంపటాలమీద ఆసక్తి లేని వాడు. సమ్యక్ దృష్టి కలిగిన వాడు. నేనంటే అభిమానం ఉన్నవాడు. మనసు తెలిసిన ఆత్మబంధువు. గోవిందుడికన్నానాకెవరు దొరకుతారు? కాని అతను కాళహస్తిలో ఉంటూ శైవమతాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరు అతన్ని మనదారికి మళ్లించగలరు? కంచి వరదుడికి కాంచీపూర్ణుడి వలె, తిరుమల వేంకటేశ్వరస్వామికి శ్రీశైలపూర్ణుడు అంతటి సన్నిహితుడు. శ్రీశైలపూర్ణుడి సాయం దొరికితే చాలు అనుకున్నాడు. అతనికి వెలుగు దారి చూపమని కాంచీ వరదుడినే మళ్లీ వేడుకున్నాడు. దాశరథి కురేశులు రామానుజుడికి ఇద్దరు చెల్లెళ్లు. భూమి, కమల. పురుష మంగళలోని అనంత దీక్షితతో భూమి వివాహం అయింది. వారికి దాశరథి జన్మించాడు. దాశరథిని ముదలి ఆండన్ అని కూడా పిలుస్తారు. కమలకు పుట్టిన వాడు వరద విష్ణు ఆచార్య. ఆండన్ 105 సంవత్సరాలు జీవించారు. రహస్యత్రయమనే గ్రం«థాన్ని రచించారు. రామానుజుని ప్రధాన శిష్యుల్లో ఒకరు. దాశరథి తనను శిష్యుడిగా స్వీకరించాలని అర్థిస్తాడు. దాశరథితోపాటు శ్రీవత్సాంక కూడా శిష్యుడైనాడు. శ్రీ వత్సాంకుడు కుర్ అనే అగ్రహారానికి అధిపతి, ధనవంతుడు. కనుక ఆయనను కురేశుడు అని ఆళ్వన్ అని కూడా అంటారు. కురేశుడు తన భార్య ఆండాళ్‌తో కలిసి వచ్చి శిష్యులై ఉండేందుకు అనుమతించాలని కోరారు. రామానుజుడికి సన్నిహిత శిష్యులుగా దాశరథి, కురేశుడు రాణించారు. (వీరి పుత్రులే పరాశర, వేదవ్యాసభట్టర్) పంచసంస్కారాలు గావించారు. అంతకు ముందు గురువైన యాదవప్రకాశుడు కూడా శైవం నుంచి విశిష్టాద్వైతం స్వీకరించి రామానుజుడి శిష్యుడైనాడు. శ్రీరంగం వైపు పయనం శ్రీరంగం వైష్ణవ పీఠంలో రామానుజుని ఆచార్యుడుగా ప్రతిష్టించాలని యామునాచార్యుల శిష్యగణం మాట్లాడుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్న కంచి వరదుడి అనుగ్రహంతోనే రామానుజుడు కంచినుంచి కదలడం సాధ్యమవుతుందని వారు గమనించారు. శ్రీరంగనాథుని స్తుతించి ఒక కోరిక కోరారు. ‘‘మీరు ఏ విధంగానైనా వరదరాజస్వామిని ఒప్పించి రామానుజుని శ్రీరంగానికి రప్పించాలి’’ అని విన్నవించారు. శ్రీరంగనాథుడు కంచిలో వరద రాజుకు సందేశం పంపుతూ రామానుజుడిని పంపాలని కోరతాడట. ఆ సందేశానికి వరదరాజు ‘‘మమ్మల్ని మేము కోల్పోవడానికి సిద్ధపడినప్పుడే మా రామానుజుని వదులుకునేది’’ అని తిరుగు సందేశం పంపారట. అధికారికంగా వరదుడిని ఒప్పించడం కష్టమని తేలిపోయింది. ఆయనను మెప్పించడానికి మార్గాలు వెదకాలనుకున్నారు. వరదుడు సంగీతప్రియుడు, మధురగానానికి లొంగుతాడని తెలిసి సంగీత విశారదుడు భక్త అగ్రగణ్యుడైన వర రంగముని (మరోపేరు తిరువరంగ పెరుమాళ్ అఱైయార్)ను వరదరాజపెరుమాళ్ సన్నిధికి వెళ్లమని వేడుకుంటారు. ఆయన కాంచీపురం చేరుకుని, దివ్యప్రబంధంలోని పాశురాలను మధురంగా గానం చేశారు. వరదరాజస్వామి ఆయన గానానికి ముగ్ధుడై ఆలయమర్యాదలతో సత్కరించాలని ఆదేశిస్తాడు. ‘‘ఈ సత్కారాలు నాకెందుకు స్వామీ. ఇవన్నీ నాకు అక్కర లేదు. మీరు కాదనకుండా నాకు ఒక వరం ఇవ్వండి స్వామీ’’ అని వర రంగడు కోరుతాడు. ‘‘సరే నన్ను నా భార్యలను కాకుండా మరేదయినా కోరుకోవా’’ అంటాడు వరదరాజపెరుమాళ్. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వరరంగడు రామానుజుడిని అడుగుతాడు. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. వెంటనే రామానుజుని చేయిపట్టుకుని శ్రీరంగానికి బయలుదేరతాడాయన. యమునాచార్యుల కల ఫలించబోతున్నదని శిష్యులు రామానుజుడికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కావేరీ తీరానికి రాగానే రామానుజుడిని వేదమంత్రోచ్చారణలతో పూర్ణకుంభంతో ఎదురేగి, దివ్యప్రబంధ పాశుర గానంతో సకల వైదిక లాంఛనాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఊరేగింపుగా రామానుజుడు తూర్పుద్వారంనుంచి శ్రీరంగాలయ ప్రవేశం చేసారు. తరువాత దక్షిణానికి తిరిగి అక్కడనుంచి పడమరవైపు ప్రదక్షిణగా మళ్లి అక్కడినుంచే శ్రీరంగనాథునికి సాష్టాంగ నమస్కారము సమర్పించి, అమ్మవారు శ్రీరంగనాయకి సన్నిధికి వెళ్లి ప్రణామం చేసి, చంద్ర పుష్కరిణిని దర్శించి ప్రణమిల్లి, పుష్కరిణీజలాన్ని తీసుకుని త్రాగి, జయవిజయుల రక్షణలో ఉన్న ద్వారంలో ప్రవేశించి, దివ్యశూరులైన అక్కడి ఆళ్వారులను దర్శించి చుట్టూ ఉన్న ఉపాలయాలను సందర్శించి ప్రణవ విమానానికి ప్రణమిల్లి, విష్ణు సేనాని విష్వక్సేనుల వారి సన్నిధికి చేరి సాష్టాంగ నమస్కారం చేసి, రంగమంటపంలో ప్రవేశించినారు. సరిగ్గా అదే సమయానికి రామానుజునికి స్వాగతం చెప్పినట్టు ఉత్సవరులు నంబెరుమాళ్ రామానుజుని చూడాలని స్వయంగా బయటకు వచ్చారు. నంబెరుమాళ్ కనిపించగానే రామానుజులు పలుమార్లు సాష్టాంగపడిపోయారు. మహానంద పరవశులైనారు. ఇక మూలవిరాట్టు, అనంత శయనుడు, శేషశాయి, ప్రణవవిమానాంతర్గత శయనమూర్తి, శ్రీరంగనాథుని దర్శించారు. ఆ దివ్యమంగళ విగ్రహుని పరాత్పరునిచూడగానే కళ్లు వర్షించాయి. మనసు పులకించింది తనువు వణికింది. ఉచ్ఛస్వరం ఉబికి వచ్చింది. సంస్కృత శ్లోకాలు ఆశువుగా వెలువడ్డాయి. నమో నమో వాజ్ఞ్మనసాతి భూమయే నమో నమో వాజ్ఞ్మనసైక భూమయే నమో నమో అనంతమహావిభూతయే నమో నమో అనంతదయైక సింధవే అని స్తుతించారు. వాక్కుకు మనసుకు అందని వాడా వందనం వందనం, వాక్కు మనస్సుకు మాత్రమే అందే వాడా వందనం వందనం, అనంతమహా వైభవుడా వందనం వందనం, అనంత దయా సముద్రుడా వందనం వందనం అని స్వామిని చూస్తూ ఉండిపోయాడు.మరో శ్లోకం కూడా రామానుజుని మనో వాక్కులనుంచి ప్రవహించింది. నధర్మనిష్ఠోస్మిన చాత్మవేది నభక్తిమాన్ త్వచ్ఛరణారవిన్దే అకించనోన్యగతిఃశరణ్యః త్వత్పాదమూలం శరణం ప్రపద్యే (నాకు ధర్మమంటే ఏమిటో తెలియదు. నిçష్ఠ అర్థం కాదు. ఆత్మతత్వం బోధపడదు. నీ పాదపద్మాల మీదైనా భక్తి ఉందా అంటే అదీ లేదు. అకించనుడను. గమ్యమేమిటో తెలియదు (అగమ్యగోచరుడిని), ఇంకో గతి లేదు. నీ పాదములనే శరణు వేడుతున్నాను). కరుణాసముద్రుడైన భగవంతునికి తానేమీ కానని తెలుపుకుని నిరహంకారుడై పూర్తిగా శరణువేడే నిజవైష్ణవ నిరాడంబర, నిజభక్తి సూత్రాలుగా ఈ శ్లోకాలు ప్రతి వైష్ణవ తిరువారాధనలో పలికే మంత్రాలై ఈనాటికీ వెలుగుతున్నాయి. శ్రీవారి పాదాలను (శఠగోపము) రామానుజుని పాదాలపై ఉంచారు. బద్ధులైన ఆత్మలను విముక్తులను చేయడానికి నిత్యవిభూతిని, లీలా విభూతిని వినియోగించమని ఆదేశిస్తూ ఆ రెండింటినీ రామానుజులకు అప్పగించారు శ్రీరంగనాథుడు. పెరియనంబి ద్వారా శెంగోలు కిరీటాన్ని ఇచ్చి రామానుజుడికి ఉడయవరు అనే నామాన్ని ఇచ్చారు. పెరియనంబి వైపు తిరిగి, రామానుజుడు, ఆచార్యవర్యా మిమ్మల్ని ఆశ్రయించడం వల్ల మీ దయతో నాకు ఈ శ్రీరంగనాథుని అనుగ్రహం కలిగిందని నమస్కరించారు. పెరియనంబి ‘‘నాయనా...అదిగో అటు చూడు అని నమ్మాళ్వార్లను చూపి, ఆయనే భవిష్యత్తులో ఒక ఆచార్యులు వచ్చునని చెప్పినారు. అది నీవేనని యామునులు చెప్పినారు. కలి ధర్మాలను నశింపచేసి భగవత్తత్త్వాన్ని జనులకు విశదం చేసే మహత్తర కార్యక్రమ బాధ్యతను స్వీకరించు’’ అని దీవించారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను, వ్యవహారాలను, జరగవలసిన కార్యక్రమాలను నిర్ధారించి, నిర్దేశించి, దగ్గరుండి నిర్వహింపజేసి, ఆచరణ ద్వారా అందరికీ నేర్పి, ఈనాటికీ ఏనాటికీ మరిచిపోకుండా నిలబెట్టిన ఘనుడు ఆచార్య రామానుజుడు. ఆ కార్యక్రమం కలియుగ వైకుంఠ ధామమైన శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు ఆరంభించారు. పెరియ తిరుమండపం (పెద్ద శ్రీ మండపం)లో ప్రవేశించారు, అన్నీ పరిశీలించారు. శ్రీ భాండాగారంలోకి వెళ్లారు. అక్కడి తూకాలు చూశారు, కొలతల ప్రమాణాలను సరిచూచారు. తిరువారై అంటే పూలమాలల సేవ, సాట్టువడి అంటే శ్రీ గంధపు సేవ, అముడుపడి అంటే అన్న ప్రసాద సేవ, తిరువిళక్కు అంటే జ్యోతి సేవ తదితర సేవలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించారు. సేవల అంతరార్థాలను వివరించారు. పద్ధతులను నిర్దేశించారు. ప్రక్రియలు ప్రబోధించారు. దేవాలయానికి ఉన్న ఆస్తులు, భూములు, పూలవనాలు, పనిచేసేవారు, వారి బాగోగుల గురించి అడిగారు. పలకరించారు. లోపతాపాలను విచారించి సరిదిద్ది నిర్దిష్ట కార్యప్రణాళికను రూపొందించారు. శ్రీ రంగనికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల విధి విధానాలను సంకలనం చేసి క్రమబద్ధీకరించారు. సరైన వ్యక్తులను సరైన స్థానాలలో నియమించారు శ్రీరంగ రామానుజులు. ∙ఆచార్య మాడభూషి శ్రీధర్ -
స్వామి సేవకు వేళాయెరా!
* రెండువేల ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుమలేశుని ఆలయంలో అర్చక వ్యవస్థకు 1800 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి ఆత్మసాక్షాత్కారంగా విఖనసముని తొలిసారిగా పూజా కైంకర్యాలు నిర్వహించినట్టు ఐతిహ్యం. ఆ తర్వాత ఆలయంలో మొదటిసారిగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ్ దీక్షితులు వేంకటేశుడికి పూజాకైంకర్యాలు నిర్వహించారు. తర్వాత కౌశిక గోత్రానికి చెందిన శ్రీనివాస దీక్షితులు వచ్చారు. 1996 వరకు శ్రీవారి ఆలయంలో అర్చక మిరాశి వ్యవస్థ కొనసాగింది. ఆలయ వ్యవహారాలు, నగల రక్షణ బాధ్యత వీరి చేతుల్లోనే ఉండేది. * 1977 నుంచి ప్రస్తుతం భరద్వాజ గోత్రంలో అర్చక పైడిపల్లి, అర్చక గొల్లపల్లి, కౌశిక గోత్రంలో అర్చక పెద్దింటి, అర్చక తిరుపతమ్మగారి అనే నాలుగు కుటుంబాలు శ్రీవారి ఆలయంలో అర్చక వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. * భరద్వాజ గోత్రానికి చెందిన అర్చక గొల్లపల్లి రమణ దీక్షితులు, పైడిపల్లి శ్రీనివాస నారాయణ దీక్షితులు, కౌశిక గోత్రానికి చెందిన పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు, అర్చక తిరుపతమ్మగారి శ్రీనివాస నరసింహ దీక్షితులు ఇప్పుడు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. * వీరు వేకువజామున 1గంటకు నిద్రలేస్తారు. చల్ల నీటి స్నానం చేసి మడికట్టుకుంటారు. ద్వాదశి ఊర్వపుండ్రాళ్లు (నామాలు) పెట్టుకుంటారు. * అర్చక నిలయంలో కొలువైన విఖన స ముని వద్ద ప్రార్థన చేస్తారు. సన్నిధి గొల్ల దివిటీ చేతబట్టి అర్చకులను ఆలయానికి తీసుకెళుతారు. జీయర్ ఆదేశాలతో సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తీస్తారు. గోవింద గోవింద అంటూ అర్చకులు ఆలయ ప్రవేశం చేస్తారు. * గర్భాలయంలో కైంకర్య పూజా విధులు నిర్వహిస్తున్నందున మూలమూర్తిపై ఎక్కడ నోటి గాలి, లాలాజలం పడుతుందో? అని శిరోవస్త్రం (నోటికి వస్త్రం కట్టుకుంటారు). * జీయర్ ఇచ్చే పుష్పాలను స్వామికి అలంకరించి, హారతులు సమర్పిస్తారు. వారపు, పర్వదినాల్లో విశేష అలంకరణ చేస్తారు. వేకువజామున 2.30 గంటలకు సుప్రభాతంలో మేల్కొలుపు నుంచి తిరిగి అర్ధరాత్రి 1.30 గంటలకు పవళింపు (ఏకాంత) సేవ వరకు నిత్య కైంకార్యల్లోనూ అర్చకులు పాత్ర విశేషంగా ఉంది. ఇలా అర్చకులు స్వామి సేవకులుగా సపర్యలు చే స్తూ పరమానందం పొందుతున్నారు. -
మహంతులే మార్గదర్శకులుగా...
ఐదువందల ఏళ్ళ కిందట ఢిల్లీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని ‘క్రేడల్క్రేల’ గ్రామంలో రామానంద మఠం ఉండేది. ఆ మఠాధిపతి అభయ ఆనంద్జీ. ఈయన శిష్యుడే హథీరాంజీ. దక్షిణభారత దేశ యాత్రలో భాగంగా వేంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వర స్వామిని అయోధ్య రాముడి అంశగా భక్తితో కొలుస్తూ ప్రసన్నం చేసుకున్నాడు. బావాజీ భక్తికి ముగ్ధుడైన స్వామి నిత్యం ఆనంద నిలయం దాటి హథీరాం మఠం విడిదికి వెళ్లి, బావాజీతో పాచికలాడేవారట. అయితే ఆటలో తానే ఓడిపోయి భక్తుని గెలిపిస్తూ ఆనందించేవారట. తిరుమలలో హథీరాంజీ స్థాపించిన మఠం ఆలయానికి ఆనుకుని ఆగ్నేయదిశలో ఉంది. 90 ఏళ్ల మహంతుల పాలన క్రీ.శ.13వ శతాబ్దం తర్వాత విజయనగర రాజులు, ఆ తర్వాత 1843 ముందు వరకు ఈస్టిండియా కంపెనీ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలన సాగింది. 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు 90 ఏళ్లపాటు ఆలయ పాలన హథీరాం మఠం మహంతుల చేతుల్లోనే సాగింది. 1843 జూలై 10 తేదీన హథీరాం మఠం తరపున శ్రీవారి ఆలయానికి తొలి ధర్మకర్తగా మహంత్ సేవాదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆణివార ఆస్థానం రోజున బ్రిటీషు ప్రభువుల నుండి శ్రీవారి ఆలయ ఆస్తిపాస్తులు, స్వామికి అలంకరించే తిరువాభరణాలు, ఉత్సవమూర్తులు, ఉత్సవ వర్ల ఊరేగింపులో వాడే వాహనాలు, కైంకర్యాల్లో వినియోగించే పురాతన వస్తువులు, వస్త్రాలు, పాత్రలు, ఆలయానికి సంబంధించిన అన్ని రికార్డులు సేవాదాస్కు అప్పగించారు. ఇందుకు తార్కాణంగానే తిరుమల ఆలయ లెక్కల అప్పగింతలు వంటి కార్యక్రమాలన్నీ ‘ఆణివార ఆస్థానం’ రోజునే నిర్వహించే ఆచారాన్ని టీటీడీ అమలు చేస్తుండటం విశేషం. మహంతుల అధికారిక ముద్ర ‘విష్వక్సేన’ మహంతుల అధికారిక ముద్ర (సీలు) విష్వక్సేనుడు. సేవాదాస్ హయాంలోనే పుష్కరిణిలోని ‘జలకేళి మండపోత్సవం’ పేరుతో తెప్పోత్సవం ప్రారంభించారు. రెండవ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న ధర్మదాస్ తిరుపతి కపిలతీర్థం పుష్కరిణి, సంధ్యావందన మండపాన్ని జీర్ణోద్ధారణ చేశారు. 1878లో తిరుమల ఆలయంలోని పడికావలి గోపురం (మహద్వార గోపురం)కు మరమ్మతులు చేయించారు. ప్రయాగదాస్ హయాంలో అభివృద్ధి వేగవంతం మహంతుల పాలనలో చివరి విచారణకర్తగా బాధ్యతలు చేపట్టిన మహంత్ ప్రయాగదాస్ హయాంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన వేగవంతం అయ్యాయి. 1900 సంవత్సరం నుంచి 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే వరకు 33 సంవత్సరాల పాటు ఆయన పాలన సాగింది. ఆ కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, పనులు నేటి తరం టీటీడీ పాలకులకు కూడా మార్గదర్శకంగా నిలిచాయి. 1908లో ఆనంద నిలయం శిఖరంపై బంగారు కలశాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా తిరుమలకు వచ్చేందుకు ప్రధాన మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాట మార్గాలు అభివృద్ధి చేశారు. జంతుదాడుల నుంచి రక్షించుకోవటంతోపాటు వెలుతురు కోసం అటవీ కాలిబాటల్లో వాషింగ్టన్ (ఆధునిక బల్బులు) విద్యుత్ బల్పులు ఏర్పాటు చేయించారు. అలిపిరిమార్గంలో గాలిగోపురం నిర్మించారు. తిరుమల, తిరుపతిలో ధర్మసత్రాలు నిర్మించారు. రహదారులు, తాగునీరు, శుభ్రత, ఆరోగ్యం, వైద్య సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించి పనులు వేగవంతం చేయించారు. పరిపాలన సౌలభ్యం కోసం తిరుపతిలో పాత హుజారు ఆఫీసు నిర్మాణం, మద్రాసులో దేవస్థానం ముద్రణాలయం, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర ఉన్నత పాఠశాల నిర్మాణం, వేదపాఠశాల విస్తరణ, ఓరియంటల్ కళాశాల, ఆయుర్వేద పాఠశాల నిర్మాణాలు చేపట్టారు. మూలమూర్తి, ఉత్సవమూర్తులకు ఆభణాలు, కిరీటాలు వంటి విలువైన నగలు తయారు చేయించారు. దేవాలయాల శిలాశాసనాలు పరిశోధన చేయించారు. 1933లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేయటంతో మహంతుల పాలన ముగిసింది. శ్రీవారికి మహంతుల ‘నిత్యహారతి ’ మహంతు బాబాజీ పేరుతో తిరుమల ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలో గోక్షీర నివేదనం, నవనీత హారతి సమర్పించే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ నాటి నుంచి నేటి హథీరాం మహంత్ అర్జున్‌దాస్ లేదా మఠానికి చెందిన సాధువులు/బైరాగులు ప్రతిరోజూ వేకువజాము సుప్రభాతవేళకు ముందు ఆలయానికి వెళ్లి సంప్రదాయంగా హారతి అందజేస్తున్నారు. ఇక గోకులాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు హథీరాంమఠానికి విడిదికి వచ్చి ప్రత్యేక పూజలందుకుంటారు. మఠం మహంతుకు ఆలయ మర్యాదలు పరివట్టం, తీర్థం, శఠారి మర్యాదలు అందజేస్తారు. మహంతుల కాలంలోనే స్థానికులకు కొండమీద స్థలాలు అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తిరుమలకొండ మీద ఆలయంలో పనుల నిర్వహణ కోసం సిబ్బంది కొరత ఉండడంతో సదుపాయాల్లేక భక్తులు ఇబ్బంది పడేవారు. దాంతో మహంతులు చొరవ తీసుకుని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర సమీప గ్రామ ప్రాంతాల్లో దండోరా వేసి అక్కడివారిని తిరుమలకు రప్పించారు. వారికి స్థలాలను, అనుభవ హక్కులు ఇచ్చారు. స్థిరనివాసం కల్పించారు. వ్యాపారాలకు అనుమతులిచ్చారు. కొండకు వచ్చే భక్తులకు అండగా ఉంటూ జీవనం సాగించుకునేందుకు స్థానికులకు మహంతులు భరోసా ఇచ్చారు. విచారణ కర్త పాలన కాలం సం. 1. మహంతు సేవాదాస్ 1843-1864 21 2. మహంతు ధర్మదాస్ 1864-1880 16 3. మహంతు భగవాన్‌దాస్ 1880-1890 10 4. మహంతు మహావీర్‌దాస్ 1890-1894 04 5. మహంతు రామకృష్ణదాస్ 1894-1900 06 6. మహంతు ప్రయాగదాస్ 1900-1933 33 రూ.వేల కోట్లలో మఠం ఆస్తులు హథీరాం మఠం నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని అనధికారిక లెక్కలు. ప్రధానంగా తిరుమల, తిరుపతిలో మఠాలతోపాటు ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. మఠం నిర్వహణా బాధ్యతను 1962 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ నిర్వహిస్తోంది. మఠాధిపతిగా అర్జున్‌దాస్ హథీరాం మఠం మహంతుగా అర్జున్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో మహంతుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన్ను బాధ్యతల నుండి తప్పించింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో 2007లో తిరిగి మఠం మహంత్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి మహంత్ అర్జున్‌దాస్ కొనసాగుతున్నారు. -
తరాలు మారినా... సంప్రదాయాలు మారలేదు!
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి కైంకర్యంలో ఎన్నెన్నో సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఉత్సవ ప్రియుడైన స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తులు వందలయేళ్లుగా ప్రత్యేక కానుక లు సమర్పిస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. వీటిలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ నుండి గొడుగులు, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల సంస్థానం నుండి ఏరువాడ జోడు పంచెలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. వాటి విశేషాల గురించి తెలుసుకుందామా!! తరాలుగా తిరుమలేశుని సేవలో చెన్నయ్ గొడుగులు తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నయ్ (నాటి చెన్నపట్నం) నుండి గొడుగులు సమర్పించే సంప్రదాయం వందలయేళ్లుగా వస్తోంది. చెట్టియార్లు, హిందూధర్మార్థ ట్రస్టుతోపాటు ఎన్నెన్నో కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. నాడు దివిటీ వెలుగుల్లో... సౌకర్యాలు అంతగా లేని నాటి రోజుల్లో దివిటీల వెలుగుల ఎడ్లబండ్లు, కాలినడకన ఊరేగింపుగా తీసుకొచ్చేవారట. దశాబ్దమున్నరకాలంగా గొడుగుల సమర్పణలో అనేకరకాల వివాదాలు చోటు చేసుకోవటంతో తిరుమల ఆలయ మర్యాదలు లేకుండా కేవలం భక్తులు గొడుగులు సమర్పిస్తే తీసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా అనేకమంది భక్తులు శ్రీవారికి ఛత్రిలు సమర్పిస్తున్నారు. ఇందులో హిందూ ధర్మార్థ సమితి గత 12 ఏళ్లుగా గొడుగులు సమర్పించే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. * శ్రీవారి బ్రహ్మోత్సవం తొలిరోజు చెన్నయ్‌లోని చెన్నకేశవాలయం నుంచి 11 గొడుగులతో భక్తబృందం కాలినడకన బయలుదేరుతారు. తొలుత తిరుచానూరు అమ్మవారికి రెండు గొడుగులు సమర్పిస్తారు. తర్వాత గరుడసేవ రోజున ఆలయం వద్ద మరో 9 గొడుగులు సమర్పిస్తారు. స్వామివైభవం, దర్పానికి ప్రతీకగా ఆలయాల్లో గొడుగులను వాడే సంప్రదాయాన్ని వెయ్యేళ్ల క్రితమే భగవద్రామానుజులవారు ఆరంభించినట్టు చరిత్ర. 4 నుండి10 అడుగుల ఎత్తు వరకు... శ్రీవారికి సమర్పించే గొడుగులను 4 నుండి 10 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. గరుడసేవ కోసం 10 అడుగులు, ఇతర వాహనాలకు 9 అడుగులు, సూర్య, చంద్రప్రభ వాహనాలకు 7.5 అడుగులు, బంగారు తిరుచ్చి వాహనాలకు 4 నుండి 6 అడుగుల ఎత్తులో తయారు చేస్తారు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుండి రూ.50 వేల వరకు ధర పలుకుతాయి. వీటి అలంకరణకు వెండి కలశాలు, ఇతర సామగ్రి వాడతారు. తరతరాలుగా గొడుగుల తయారీలోనే... తిరుమలతోపాటు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలకు గొడుగులు తయారు చేసే కుటుంబాలలో ప్రధానంగా చిన్నస్వామి షా కుటుంబాన్ని చెప్పొచ్చు ఈయన పూర్వీకులది మహారాష్ర్టలోని సౌరాష్ట్ర ప్రాంతం. వలసల ద్వారా చెన్నయ్‌లోని చింతాద్రిపేటలోని అయ్యామెదలువీధిలో స్థిరపడ్డారు. చిన్నస్వామి కుమారుడు స్వామి షా, మనుమలు గజేంద్రషా, సుబ్రమణి షా. ఈ కుటుంబ సభ్యులు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మూడు నెలల ముందు చెన్నయ్ ప్యారిస్‌లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో గొడుగుల తయారీపై దృష్టిపెడతారు. ఇలా తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ), మధుర మీనాక్షి, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, తిరువళ్లూరు వీర రాఘవస్వామి, కాంచీపురం వరదరాజస్వామి, చెన్నయ్‌లోని పార్థసారథి స్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల, నెల్లూరు రంగనాథ స్వామి ఆలయాలకు కూడా వీరు గొడుగులు సమర్పించారు. * పూర్వం వీటిని కాగితంతో తయారు చేసేవారట. తాజాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పద్ధతి, డిజిటల్, బోల్డ్ సిల్క్, ప్యూర్సిల్క్ పద్ధతుల్లో గొడుగులు సిద్ధమవుతున్నాయి. వాటిపై ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల బొమ్మల అల్లికలు చేస్తున్నారు. ఊరేగింపులో ఉత్సవమూర్తి పక్కనే గొడుగులు ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడతారు. లోకకల్యాణం కోసమే గొడుగుల సమర్పణ లోకకల్యాణం కోసం పదకొండేళ్ల్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో వీటిని తీసుకొస్తాం. మార్గంలో అడుగడుగునా పూజలు అందుకుంటాయి. ఈ గొడుగులు స్వామి వారికి సమర్పించటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని పెద్దల విశ్వాసం. ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని దీక్షగా నిర్వహిస్తున్నాం. ఈ యజ్ఞానికి టీటీడీ యాజమాన్యం సంపూర్ణంగా సహకరిస్తోంది. - ఆర్ఆర్. గోపాలన్ చైర్మన్, హిందూ ధర్మార్థ ట్రస్టు మహద్భాగ్యం తిరుమల వెంకన్నను దర్శించుకోవడమే మహాభాగ్యం. అటువంటి స్వామికి మరింత దర్పాన్ని తీసుకొచ్చే గొడుగులను మా ఇంటి నుండి తీసుకు వెళ్లటం మహద్భాగ్యం... గర్వకారణంగా, పూర్వజన్మ సకృతంగా భావిస్తాం. - గజేంద్రషా, చెన్నయ్ పూర్వజన్మ సుకృతం ఈ భాగ్యం పూర్వజన్మసుకృతం. ఇంతకంటే ఆనందం లేదు. తిరుపతికి వెళ్లినప్పుడు స్వామి ఊరేగింపులో మా చేత తయారైన గొడుగుల చూసి ఆనందించే క్షణాలు విలువ చెప్పలేము. - సుబ్రమణి షా, చెన్నయ్ జగన్మోహనుడి అలంకరణలో శ్రీవిల్లిపుత్తూరు పుష్పమాలలు, చిలుక ప్రతియేటా బ్రహ్మోత్సవం గరుడ రోజున శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి అమ్మవారికి అలంకరించిన పూలమాలలను తిరుమలేశునికి అలంకరించటం సంప్రదాయం. ♦ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి శ్రీమహావిష్ణువును శ్రీకృష్ణునిగా, తనను గోపికగా భావించి రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు పాశురాలను గానం చేశారు. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను పరిణయమాడారు. నాటినుంచి గోదాదేవి (ఆండాళ్)గా ప్రసిద్ధి పొందారు ♦ దానికి గుర్తుగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో నెలరోజులపాటు సుప్రభాతం బదులు గోదాదేవి ‘తిరుప్పావై’ పఠిస్తారు. ♦ బ్రహ్మోత్సవం ఐదోరోజు అలంకార ప్రియుడైన మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శ్వేతవర్ణ పట్టు శేషవస్త్రం, శిఖపై కొప్పు, వజ్రాలు పొదిగిన బంగారు వాలు జడ, ఎదపై పచ్చలహారం, కుడిచేతిలో బంగారు చిలుకను, ఎడమవైపు శ్రీవిల్లిపుత్తూరు చిలుకను ధరించి ఆసీనులై జగన్మోహనాకారంగా భక్తలోకాన్ని సమ్మోహపరుస్తూ దివ్యమంగళరూపంలో దర్శనమివ్వటం సంప్రదాయం ♦ ఐదోరోజు రాత్రి ఉత్కృష్టైమైన గరుడవాహన సేవలో గర్భాలయ మూలవిరాట్టుకు అలంకరించే మకర కంఠి, లక్ష్మీహారం, సహస్ర నామమాల ధరించి మలయప్పస్వామి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడిపై ఊరేగుతూ అశేష భక్తజనాన్ని అనుగ్రహిస్తారు. అదేసందర్భంగా గోదాదేవి పనుపున శ్రీవిల్లి పుత్తూరు ఆలయం నుండి వచ్చిన తులసిమాలలు అలంకరిస్తారు. -
ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు
తెలంగాణాప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడుపంచెలు సమర్పించటం సంప్రదాయం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ జోడు పంచెలు గద్వాల్ సంస్థానం నుండి కానుకగా అందే సంప్రదాయం నాలుగు వందల యేళ్ల నుండి నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఏరువాడ జోడు పంచెలంటే? ఏరు అంటే నదీపరివాహక ప్రాంతం అని అర్థం. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణానది మధ్య ఉంది. ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడుపంచెలు తయారు చేయటం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి. గద్వాల సంస్థానాధీశుల వారసత్వం గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయం. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు. 41 రోజుల పాటు దీక్షతో జోడు పంచెలు గద్వాల సంస్థానాధీశుల విజ్ఞప్తి మేరకు ఐదేళ్లుగా గద్వాల లింగంబాగ్ కాలనీలోని చేనేత పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కరుణాకర్ తన ఇంటిమీద తయారు చేశారు. వీటిని ఇప్పటికే సిద్ధం చేశారు. * సాక్షాత్తు కలియుగ దేవదేవునికి అలంకరించే వ స్త్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మగ్గంతో ఐదుమంది సహచర చేనేత కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల షణ్ముఖ రావు, కరుణాకర్, మేడం రమేష్‌తో కలసి సిద్ధం చేశారు. * మొత్తం 41 రోజుల పాటు దీక్షతో ఈ జోడు పంచెలు తయారు చేశారు. 11 గజాల జోడు పంచెలు గద్వాల ఏరువాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. 15 అంగుళాల వెడల్పు అంచుతో తయారు చేశారు. ఈ జోడు పంచెలపై రాజకట్టడాల గుర్తుగా ఎనిమిది కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా తయారు చేశారు. ఒక్కోపంచెను తయారు చేయడానికి 20 రోజులు పడుతుంది. బ్రహ్మోత్సవాల్లో మూలమూర్తికి అలంకరణ గద్వాల సంస్థానం నుండి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం. పూర్వజన్మసుకృతం గద్వాల సంస్థానం ఆచారం ప్రకారం మా ఇంట్లో తయారైన జోడుపంచెలు సాక్షాత్తు తిరుమల గర్భాలయ మూలమూర్తి అలంకరణకు వాడుతుండటం మా పూర్వజన్మసుకృతం. ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేము. - మహంకాళి కరుణాకర్ -
నిజరూప దర్శన భాగ్యం
దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు గురువారం మాత్రమే దక్కుతుంది. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా స్వామి నిరాడంబర స్వరూపంతో దర్శనమిస్తారు. గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని అంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డ (పరివీటం, పరివేష్ఠనం) తో నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు స్వామి. ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్థ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. ఆ రోజంతా భక్తులు శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహ ద్భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాల బదులు 24/ 4 కొలతలు గల పట్టుధోవతి ధరింపచేస్తారు. 12/ 2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాను చుడతారు. మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలో నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తారు. భక్తుల్లో కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారికి గోచరిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు. -
స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి
ఆపదమొక్కులవాడికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. నిత్యపెళ్లికొడుకైన ఆ స్వామి సన్నిధిలో వివాహబంధంతో ఒక్కటవుతుంటాయి కొత్తజంటలు. మరికొందరు భక్తులు నామకరణం, అన్నప్రాశసన, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం, కేశఖండన, ఉపనయనం, సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తూ తరిస్తున్నారు భక్తకోటి. ఇందుకు టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణ వేదిక కేంద్రమైంది. పురోహిత సంఘం తిరుమలలో సనాతన హైందవ సంప్రదాయానికి లోబడి వైదిక కర్మలు నిర్వహించేందుకు టీటీడీ పౌరోహిత సంఘం ఉంది. ఇక్కడ నిష్ణాతులైన పురోహితులు ఉన్నారు. మొత్తం 120మంది పౌరోహితులు, మంగళవాయిద్యాలు వాయించటం, చెవిపోగులు కుట్టడం వంటి వాటిలో నాయీ బ్రాహ్మణుల 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకన్న సన్నిధిలో ముహూర్తంతో పనిలేదు! దేవదేవుని సన్నిధి అయిన తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. బాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. ఇలా తిరుమలలో రోజూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. శుభలగ్నాలతో పనిలేకుండా కూడా పెళ్లి వేడుకలు సాగుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఉచిత ‘కల్యాణం’ భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరైన వివాహ బంధం పటిష్టతకు టీటీడీ గట్టి పునాదులు వేసింది. అదే తరహాలోనే ‘కల్యాణం’ పేరుతో కొత్త పథకానికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శ్రీకారం చుట్టారు. వివాహానికి కావాలసిన వాటినన్నిటినీ ఉచితంగా సమకూర్చుటం వల్ల ధార్మిక ప్రచారంతోపాటు మానవసేవకూ మార్గం ఏర్పడుతుందని టీటీడీ భావించింది. * తిరుమల కల్యాణవేదిక పౌరోహిత సంఘం కేంద్రంగా 2016, ఏప్రిల్ 25 నుండి ‘కల్యాణం’ పథకానికి శ్రీకారం చుట్టారు. పురోహితుడు, మంగళవాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో విద్యుత్ చార్జీలకు రూ.860 వసూలు చేసే విధానాన్ని రద్దు చేశారు. * వివాహం సందర్భంగా శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల క్యూలైను నుండి కొత్తజంటలతోపాటు వారి అమ్మానాన్నలు, బంధుమిత్రులు మొత్తం 6 మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటకు శ్రీవారి ప్రసాద బహుమానంగా పది చిన్న లడ్డూలు అందజేస్తారు. * చట్టప్రకారం వధూవరులు మేజరై ఉండాలి. వారి వయసు తెలిపే 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపాలి. పెళ్లికి పెద్దల అంగీకారం ఉండాలి. వధువు, వరుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు హాజరు కావాలి. * ఫొటోమెట్రిక్ పద్ధతిలో అందరూ వేలి ముద్రలు వేసి రిజిస్టర్ చేసుకున్నాకే పెళ్లి వేడుక నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత ఎస్‌ఎంసీలోని 232 కాటేజీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. * పౌరోహిత సంఘంలో సామూహిక పెళ్లి వేడుక నిర్వహించుకునేందుకు టీటీడీ కొత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌక ర్యం కల్పించింది. www.ttdseva online.com ద్వారా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. * తిరుమలలో 23 మఠాలు, ప్రైవేట్ సత్రాలు, టీటీడీకి సంబంధించిన శంకుమిట్ట కాటేజీ (ఎస్ఎంసీ) 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీ (టీబీసీ) 2 కల్యాణ మండపాల్లోనూ పెళ్ళిళ్లు చేసుకోవచ్చు. వీటికి మాత్రమే నగదు చెల్లించాలి? టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణవేదికలో వివాహాలు మాత్రం ఉచితం. అయితే, మిగిలిన వాటికి నగదు చెల్లించాలి. వీటి నిర్వహణకోసం కేవలం గంట ముందు వచ్చి నగదు చెల్లించి రశీదు పొందితే చాలు టీటీడీ అవసరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నగదు చెల్లింపు వివరాల్లోకి వెళితే..., ఉపనయనం:రూ.300, చెవులు కుట్టించడం: రూ.50, అన్నప్రాశన-రూ.200, నామకరణం-200, కేశఖండన-రూ.200, అక్షరాభ్యాసం:రూ.200, సత్యనారాయణ స్వామి వ్రతం:రూ.300, నవగ్రహ హోమం: రూ.300, రూ.100, ప్రార్థనావివాహం-రూ.200. నామకరణం హిందువులు నిర్వహించే షోడ శ కర్మలలో నామకరణం, అన్నప్రాశన, కర్ణవేధ, కేశఖండన, అక్షరాభ్యాసం, ఉపనయనం అతిముఖ్యమైనవి. వీటన్నింటినీ వెసులుబాటును బట్టి ఇండ్లలోనూ, లేదా ఎవరికి ఎక్కడ మొక్కుబడి ఉంటే అక్కడి దేవాలయాలలోనూ నిర్వహిస్తుంటారు. అయితే తిరుమలలో ఆయా కార్యక్రమాలు చేయిస్తామని మొక్కుకున్నవారు తిరుమలకు వచ్చి, ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడాన్ని ఒక వేడుకగా నిర్వహించుకోవడం పరిపాటి. ముఖ్యంగా తమ పిల్లలకు ఏవైనా గండాలు లేదా ఆపదలు కలిగితే, అటువంటప్పుడు వారు సవ్యంగా ఉంటే ఆయా కార్యక్రమాలను తిరుమల స్వామివారి సన్నిధిలో జరిపించుకుంటామని మొక్కుకుంటారు. స్వామి వారి అనుగ్రహంతో వారికి ఆ గండాలు లేదా ఆపదలు గడిచి, గట్టెక్కిన తర్వాత తిరుమల వచ్చి మొక్కుబడులు తీర్చుకోవడం పరిపాటి. సాధారణంగా ఈ కార్యక్రమాలను తిరుమల పౌరోహిత సంఘంలో నిర్వహిస్తారు. అలా నిర్వహించుకోవడాన్ని స్వామివారి ఆశీస్సులతో కూడిన అనుగ్రహంగా, తమ అదృష్టంగా భక్తులు భావిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం దక్షిణాది రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేయించే సంప్రదాయం ఉంది. ఈ పూజకు చాలా ఆదరణ ఉంది. విష్ణుమూర్తి అంశయైన శ్రీ సత్యనారాయణస్వామి అంటే హిందువులందరికీ అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లా అన్నవరంలో సుప్రసిద్ధ సత్యనారాయణస్వామి దేవాలయం ఉంది. అనేకమంది కుటుంబంతో సహా ఆ దేవాలయానికి వెళ్లి అక్కడ సత్యనారాయణస్వామి వ్రతం, పూజలు చేస్తారు. ఈ కార్యాన్ని తిరుమల పౌరోహిత సంఘంలోనూ నిర్వహిస్తారు. ప్రార్థనా వివాహం (మరుమాంగల్యం) హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జంటలకు అనేక రకాల దోషాల నివారణ కోసం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. వివాహం జరిగినా సంతానం లేకపోతేనో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలవంటి కారణాలతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. తొలుత కొత్తమాంగల్యం ధరిస్తారు. అనంతరం వివాహం సందర్భంగా కట్టిన తొలి మంగళసూత్రాన్ని శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. అలా చేయడం వల్ల వివాహబంధంలోని ఆటంకాలు తొలగినట్లుగా భావిస్తారు. -
భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే!
ధార్మిక సంస్థ అయిన టీటీడీ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతోపాటు ఎన్నెన్నో సామాజిక, సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. టీటీడీ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు భక్తులకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. కొండ కు వచ్చే ప్రతి భక్తుడు ఉచితంగా భోజనం చేయడానికి అన్నదానం, కార్పొరేట్ వైద్యం అందుకోలేని నిరుపేద రోగుల కోసం ప్రాణదానం, కన్నవారి ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కోసం బాలమందిరం, నా అన్నవాళ్ళు లేని వృద్ధుల పునరావాసం కోసం కరుణాధామం, వినికిడి శబ్దానికి నోచుకోని చెవిటి చిన్నారుల కోసం శ్రవణం ప్రాజెక్టుల ద్వారా ధార్మికసంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రాథమికస్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు విద్యాదానం, ఆసుపత్రుల ద్వారా నిరుపేదలకు ఉచితవైద్యం అందిస్తోంది. ఇందుకోసం వెంకన్న భక్తులు పెద్దమొత్తంలో విరాళాలు సమర్పిస్తూ టీటీడీ పథకాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వేల రూపాయలతో ప్రారంభమైన అనేక పథకాలు నేడు సుమారు రెండువేల పైబడటం విశేషం. టీటీడీ పథకాల కోసం భక్తులు ఇచ్చే విరాళాల మొత్తానికి భారత ఆదాయపన్ను చట్టం అధికరణం 80(జి) కింద పన్ను మినహాయింపు ఉంది. రూ.లక్ష,ఆపైన విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ తిరుమలలో బస, శ్రీవారి దర్శనం, ప్రత్యేక బహుమానాలు అందజేస్తోంది. టీటీడీ ఈవో పేరుతోనే డీడీ, చెక్‌లు ఈ ట్రస్టులకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్న దాతలు డిమాండ్ డ్రాఫ్టు, చెక్కులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి పేరుతో సమర్పించాలి. ♦ రూ. కోటి, అంతకుమించి విరాళాలిచ్చేదాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.2,500 అంతకుమించి అద్దెతో వీఐపీ సూట్ కేటాయిస్తారు. దీనిని ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా పొందవచ్చు. ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా వీఐపీ బ్రేక్ కల్పిస్తారు. మూడు రోజులపాటు సుప్రభాత దర్శనం కల్పిస్తారు. దాత అభీష్టం మేరకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందజేస్తారు. సంవత్సరంలో ఓసారి ప్రసాదంగా పది పెద్ద లడ్డూలు, పది మహాప్రసాదం ప్యాకెట్లు ఇస్తారు. ♦ సంవత్సరానికి ఒకసారి ఒక శాలువా, ఒక రవికగుడ్డ బహూకరిస్తారు. ♦ దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన వెండి పతకంతో పాటుగా ఒక ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు. ♦ దాతలు తమ పేరుతో విరాళం ఇస్తే ఆ దాత జీవితకాలం; సంస్థలు, సమిష్టి దాతలతో విరాళం ఇస్తే 20 సంవత్సరాల పాటు టీటీడీ సదుపాయాలు అందుతాయి. ఈ పథకానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. దాత కోరిన విధంగా ఒకసారి శ్రీనివాస మంగాపురంలో సర్వకామప్రద లక్ష్మీ శ్రీనివాస మహాయజ్ఞం నిర్వహిస్తారు. లక్ష, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు... ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో ఒకరోజు రూ.100 అద్దె గది ఉచితంగా కేటాయిస్తారు. ♦ దాత, కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో ఒకరోజు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ ఏడాదిలో ఒకసారి ఆరు చిన్నలడ్డూలు, శాలువా, జాకెట్టు పీస్ బహూకరిస్తారు. ♦ రూ.ఐదు లక్షలు, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు... ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో మూడు రోజులు డోనర్స్ కౌంటరులో ఉచిత లేదా అద్దె చెల్లింపు ప్రాతిపదికపై వీఐపీ వసతి కల్పిస్తారు. ♦ దాతకు, అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), మూడు రోజులు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ సంవత్సరంలో ఒకసారి పది చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక రవిక బట్ట బహూకరిస్తారు. దాతకు మొదటిసారి శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకం, ఐదు మహాప్రసాదం ప్యాకెట్లు అందజేస్తారు. రూ.పది లక్షలు, అంతకు మించి... ♦ దాతకు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.500 అద్దె వీఐపీ సూట్ గది యేటా మూడు రోజులు ఉచితంగా కేటాయిస్తారు. ♦ దాతకు, వారి కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో మూడు రోజులు బ్రేక్ లేదా ప్రారంభ సమయంలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ సంవత్సరంలో ఒకసారి ప్రసాదంగా ఇరవై (20) చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక జాకెట్టు పీస్ బహూకరిస్తారు. ♦ దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకంతో పాటుగా ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు. వ్యక్తిగత దాతలు సదుపాయాలిలా పొందాలి ♦ దాతలు సంబంధిత ట్రస్టు ద్వారా పొందిన పాసు పుస్తకాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద చూపించాలి. ♦ దాతతోపాటు ఐదు మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. వారి వివరాలు ముందస్తుగా పేర్కొనవలెను. వారి ఫొటో గుర్తింపు కార్డులను చూపించాలి. ♦ పాసుపుస్తకం, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఆ దాతపేరుతోనే ఇస్తారు. ♦ ప్రతిసంవత్సరమూ దాత జీవిత సర్టిఫికేట్‌ను దాతల విభాగం, టీటీడీకి సమర్పించాలి. ♦ దాత ఏవైనా కారణాలచేత తిరుమలకువచ్చి ప్రసాదాలు, బహుమానాలు, దర్శనాలు స్వీకరించలేకపోతే వారి లైఫ్ సర్టిఫికేట్, సంతకంతో కూడిన గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత వ్యక్తికి సూచించినట్లయితే వారికి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ వివరాలు ముందస్తుగా తిరుమలలోని దాతల విభాగంలో తెలిపి, వారి అనుమతి పొందాలి. ♦ దాతతోపాటు పేర్కొన్న న లుగురు సభ్యుల పేర్లు జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే తగిన కారణాలు తెలిపి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనుమతితో మార్పు చేసుకోవచ్చు. ♦ ముందస్తుగా దాతలకు తెలపకుండానే పై సవరణలలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవడానికై టీటీడీకి సర్వహక్కులు కలవు. కంపెనీల, ట్రస్టులు, సంస్థలు సదుపాయాలిలా పొందాలి ♦ పాతపద్ధతి ప్రకారం, ఐదుగురు సభ్యులతో కూడిన కంపెనీ, ట్రస్టు, సంస్థలకు ఈ క్రింద పేర్కొన్న షరతులు వర్తిస్తాయి. ♦ కేవలం డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు, మేనేజింగ్ట్రస్టీ, ఎవరైనా భాగస్వాములు, ఉద్యోగస్థులు వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఈ సదుపాయాలు వర్తిస్తాయి. ♦ డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు లేక కంపెనీ సెక్రటరీ, మేనేజింగ్ ట్రస్టీ లేక సంస్థలోని ఇతరసభ్యులు కేవలం ఐదుమంది పేర్లను పేర్కొంటూ గుర్తింపు పత్రాలు జతపరచి అధికారిక పత్రాలు సమర్పించాలి. ఈ పత్రాలను 15 రోజులలోపు తిరుమలలోని దాతల విభాగంలో అందజేసి ముందస్తు అనుమతి పొందాలి. ♦ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, మేనేజింగ్ ట్రస్టీలు, భాగస్వాములు, ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు తగు గుర్తింపుకార్డు చూపించగలిగితేనే వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఇట్టి సంస్థలు మనుగడలోనే ఉన్నట్లు దాతల విభాగానికి తగు పత్రాల్ని సమర్పించాలి. ♦ ఈ సంస్థలకు సంబంధించిన పై వారు ఏ కారణం చేతనైనా తిరుమలకు వచ్చి దర్శనం, ప్రసాదం, బహుమానం తీసుకోని ఎడల ఆ సంస్థలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను, అధికారిక గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత సంతకంతో ఎవరికి ఆ సౌకర్యాలు కలుగజేయాలో తిరుమలలోని దాతల విభాగానికి ముందే తెలుపుతూ వారి నుండి ఉత్తర్వులు ముందే పొందాలి. ♦ దాత ఆ సంస్థలకు సంబంధించిన చిరునామాతో విరాళాలు ఇచ్చినపుడు వారికి ఆ సంస్థల పేర్లతోనే పాసుపుస్తకం, ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ సవరణలు 05-11-2011 తర్వాత విరాళాలిచ్చిన దాతలకు వర్తిస్తాయి. ♦ విరాళాలను డిమాండు డ్రాప్టు లేదా చెక్కు ద్వారా మాత్రమే అందజేయాలి. డీడీతో పాటుగా దాత రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జతచేస్తూ, దాత కు సంబంధించిన వివరాలు అంటే- దాతతో కలుపుకుని ఐదుగురి కుటుంబ సభ్యులపేర్లు, బంధుత్వం, వారి వయస్సు, చిరునామా తెలియజేయాలి. ♦ తిరుమలలో విరాళాలను ఇవ్వడానికి (చెక్కు లేదా డిమాండ్ డ్రాప్టు ద్వారా మాత్రమే) ఉపకార్యనిర్వహణాధికారి కార్యాలయం, డోనార్ సెల్, టీటీడీ, తిరుమల వద్ద సంప్రదించండి. (ఫోను నెంబర్లు- 0877-2263472, 3727) టీటీడీ ట్రస్టులివి... 1. శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు 2. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు 3. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు 4. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు 5. శ్రీ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస సంస్థ (బర్డు) 6. శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు 7. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు 8. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం 9. శ్రీ వేంకటేశ్వర పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ ట్రస్టు 10. శ్రీ వేంకటేశ్వర బాలమందిరం ట్రస్టు -
శ్రీవారి సేవలో తరించిన హైందవేతరులు
సనాతన హైందవ క్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హిందువులతోపాటు హైందవేతరులు కూడా సేవించి తరించారు. వారు నిర్దేశించిన వాటిలో చాలావరకు టీటీడీ కూడా అనుసరిస్తూ భక్తులకు విశిష్ట సేవలు అందిస్తోంది. శ్రీవారి ఆలయంలో మన్రో గంగాళం ♦ మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉన్న సర్ థామస్ మన్రో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతని కార్యదర్శుల్లో ఒకరు తిరుమలేశునికి మొక్కుకోమని సలహా ఇచ్చారు. ఆ సలహాను స్వీకరించటంతోనే మన్రో కడుపునొప్పి తగ్గింది ♦ మొక్కుని తీర్చుకునేందుకు ప్రతిరోజూ ఒక గంగాళానికి సరిపడా మిరియాల పొంగలిని భక్తులకు ప్రసాదంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన్రో. అందుకోసం మన్రోగంగాళం పేరుతో, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు తాలూకా, కోటబయలు అనే గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించేలా ఒక శాశ్వత నిధి ఏర్పాటు చేశారు ♦ ఆ నిధితో ఏర్పాటు చేసిన ప్రసాదాల పంపిణీ వ్యవస్థ తిరుమల ఆలయంలో నేటికీ నిర్విఘ్నంగా అమలవుతోంది. వెంకన్నపై లార్డ్ విలియమ్స్ భక్తి విశ్వాసాలు ♦ బ్రిటిష్ప్రభుత్వంలోని ఉన్నతాధికారి లార్డ్ విలియమ్స్ దీర్ఘకాలిక రోగంతో బాధపడేవాడట. తనకు నయమైతే శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తానని మొక్కుకొనమన్న ఓ హిందూ అధికారి సూచన మేరకు విలియమ్స్ స్వామివారికి దణ్ణం పెట్టుకున్నాడట. ఆ వ్యాధి ఆ రోజు నుండి క్రమంగా నయమైంది ♦ దాంతో లార్డ్ విలియమ్స్ ‘చలిపండిలి’ పేరుతో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే కాలిబాటలోని తొలిమైలులో (నేరేడు మాకుల ప్రాంతం) చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కాలినడకలో వచ్చే భక్తుల దాహార్తిని తీర్చింది ♦ ఈ సేవను ఇప్పటికీ టీటీడీ కొనసాగిస్తోంది ♦ షేక్ హుస్సేన్ అనే భక్తుడు తన తాత, తండ్రుల సంకల్పం మేరకు స్వామివారికి ఒక్కొక్కటి 23 గ్రాముల బరువు కలిగిన 108 బంగారుపూలను బహూకరించారు. ప్రతి మంగళవారం గర్భాలయ మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఈ బంగారు పుష్పాలే వాడతారు ♦ స్వామి సన్నిధిలో బీబీ నాంచారమ్మ అనే మహ్మదీయ భక్తురాలు సేవ చేసినట్టు చరిత్ర. ఈమె భక్తి పారవశ్యంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొగలు చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ చిత్రాలు ఉన్న 500 నాణేలతో ఉన్న దండను శ్రీవారికి సమర్పించారు ♦ కింగ్‌జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో మరో హారాన్ని తయారు చేశారు. 1972కు ముందు ఈ హారాలనే వినియోగించేవారు నాదస్వర చక్రవర్తి షేక్ చినమౌలానా ♦ నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. ఆయన ఏకైక కుమార్తె వీవీ జాన్ కుమారులు షేక్ ఖాసీం, షేక్ బాబు తిరుమలేశుని ఆలయం నాదస్వర విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు. -
బ్రహ్మాండపతికి బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కో వాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో భక్తులను కటాక్షిస్తాడు. వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అంకురార్పణతో ఆరంభం... వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీతప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తనప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) -నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారు. సింహవాహనం మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానే నంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మంచిముత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలనే స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలురు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ, సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహ పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయామోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. గరుడవాహనం స్వామివారి వాహనం గరుత్మంతుడు. ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. గజ వాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభ వాహనం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ రెండు వాహనసేవల ద్వారా స్వామి లోకానికి తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరోరూపమైన చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘరోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. -
సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించి సుమారు రెండుసంవత్సరాలవుతోంది. ఈ రెండేళ్ల పాలన కాలంలో ఆయన ఎన్నెన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. స్వామిని సందర్శించు కోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతోదూరం నుంచి వచ్చే సామాన్య భక్తులకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు, వారికి సకల సదుపాయాలను కల్పించేందుకు రకరకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వాటి అమలులో కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాక్షి ఫన్డే ప్రత్యేకసంచికతో ఆయన పంచుకున్న అనుభూతులు, అనుభవాల సమాహారమిది... టీటీడీ ఈవోగా దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు కదా, దీనిపై మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా బయటప్రాంతంలో పనిచేయటానికి, ధార్మిక సంస్థలో పనిచేయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన సంస్థను నడిపించటం కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ పరిధి దాటకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నాము. సామాన్య భక్తులకు టీటీడీ సదుపాయాలు అందాలన్న లక్ష్యంతోనే ధార్మిక సంస్థ కార్యక్రమాలు సాగుతున్నాయి. అదే సందర్భంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికీ ప్రాధాన్యత ఇస్తున్నాము. 2015లో రెండు బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించారు కదా, ఈసారి ఏ మార్పులు తీసుకొస్తారు? గత ఏడాది వచ్చిన రెండు బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించాం. ఈసారి కూడా ఉత్సవాల్లో మార్పులు ఉండవు కానీ, గతంలో జరిగిన లోపాలను సవరించుకుంటూ, వాహన సేవల్లో ఉత్సవమూర్తిని భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు పెంచాం. అదేసమయంలో ఆలయంలో మూలవర్ల దర్శనమూ త్వరగా లభించేలా ఏర్పాట్లు చేశాం. గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారట..? నిజమే! వాహన సేవలు ఉదయం 9 నుండి 11 గంటలవరకు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహించటం సంప్రదాయం. విశేషమైన గరుడవాహనసేవను దర్శించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం కేవలం గరుడ వాహన సేవను రాత్రి 8 గంటలకే నిర్వహించటం దశాబ్దకాలంగా అమలవుతోంది. ప్రస్తుతం అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించడం అసాధ్యం. పోనీ 8 గంటల నుండి అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిస్తే ఆలయంలో ఏకాంతసేవ నిర్వహణకు అడ్డంకులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పండితుల సూచన మేరకు రాత్రి 7.30 గంటలకే వాహనసేవ ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ విధానం వల్ల లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవను దర్శించే అవకాశం ఉంది. ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలు తీరు ఎలా ఉంది? చక్కగా ఉంది. దీనివల్ల భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. తోపులాటలు తగ్గాయి. స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 10 శాతానికి పైగా పెరిగింది. ఆలయంలో ఈ మూడు క్యూలైన్ల విధానం అమలుపై మరింత దృష్టి పెట్టాం. తోపులాటలు లేకుండా, సంతృప్తికరమైన దర్శనం కల్పించడంలో ఉన్న అవకాశాలన్నింటినీ తప్పక అమలు చేస్తాం. మరి రూ. 300 టికెట్ల ఆన్లైన్ బుకింగ్..? రూ.300 టికెట్లకు విశేష స్పందన ఉంది. ఇలా టికెట్లు పొందిన భక్తులకు కేవలం రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది. ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా 2015-2016 మధ్యకాలంలో 57,12,737 మంది టికెట్లు పొందారు. వారంతా స్వామిని సంతృప్తిగా దర్శించుకున్నారు. టికెట్లు పొందినవారిలో తమిళనాడు 32.40 శాతం, ఆంధ్రప్రదేశ్ 24.77 శాతం, కర్ణాటక 14.75 శాతం ఉంది. దక్షిణభారతదేశంలో 85.36 శాతం, మిగిలిన ప్రాంతంలో 14.64శాతం బుకింగ్ జరిగింది. పోస్టాఫీసుల ద్వారా 2,42,634 టికెట్లు పొందారు. మొత్తం 109 దేశాల్లోని ప్రవాస భారతీయల్లో అత్యధికంగా ఈ రూ.300 టికెట్ల అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుపథం ద్వారా సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్, గల్ఫ్ దేశాల్లో మొత్తం 65, 864 మంది ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి... ఇంటర్నెట్ ద్వారా భక్తులకు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతోపాటు ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవాటికెట్లు విడుదల చేస్తున్నాం. * ఆన్లైన్లో ముందస్తుగా గదులు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. ఆక్యుపెన్సీ శాతాన్ని బాగా పెంచాం. భక్తులకు సదుపాయంతోపాటు స్వామికి ఆదాయం కూడా పెరిగింది. * తిరుమలలోని పీఏసీ-1, 2, 3, 4 తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నాం. దాతలకు, ముందస్తుగా గదులు బుక్ చేసుకునే భక్తులకు డిపాజిట్‌ను రద్దు చేశాం. టీటీడీకి విరాళాలు అందిస్తున్న దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించాం. దాతలు 48 గంటలలోపు డిజిటల్ పాసుపుస్తకం పొందేలా, ట్రస్టుల వారీగా ఇ-రిజిస్ట్రేషన్ చేసుకునేలా సౌకర్యం కల్పించాం. తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు టీసీఎస్ సహకారంతో నెక్ట్స్‌జెన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. సేవా టికెట్లు, గదుల ముందస్తు బుకింగ్ గడువును 60 నుంచి 90 రోజులకు పెంచాము. భక్తులు సులభంగా కానుకలు సమర్పించేందుకు ఈ-హుండీ ప్రవేశ పెట్టాం. దీనిద్వారా కానుకలు సమర్పించే భక్తులకు పేమెంట్గేట్ వే చార్జీలు (కమీషన్ చార్జీలు) రద్దు చేశాం. 2015, మార్చి 21న ప్రారంభమైన ఈ-పబ్లికేషన్స్‌లో 3700 గ్రంథాలున్నాయి. * 5 భాషల్లో వెలువడుతున్న సప్తగిరి మాస పత్రికను 2016, జనవరి నెల నుండి రంగుల్లో అందిస్తున్నాం. శ్రీవేంకటేశ్వరస్వామికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకోసం డీమ్యాట్ ఖాతా ప్రారంభించాం. టీటీడీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలనుకుంటున్న భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: 1800425333333, 18004254141 అందుబాటులో ఉంచాం. వీటితోపాటు కొత్తగా వాట్స్ యాప్ నంబరు: 9399399399, ఈ-మెయిల్: Helpdesk@tirumala.org ప్రవేశపెట్టాం. శ్రీనరసింహస్వామి సన్నిధి ఎదురుగా గల లక్ష్మీదేవి విగ్రహం వద్ద నూతన హుండీని, ఆలయం ఎదురుగా శ్రీవారి వెండి, బంగారు, రాగి డాలర్ల విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి శిలావిగ్రహాలను రెండు నెలల్లో, పంచలోహ విగ్రహాలను మూడు నెలల్లో తయారు చేసి దరఖాస్తు చేసుకున్న వారికి అందించేందుకు ఏర్పాట్లు చేశాం. రాతి విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆలయాలకు ఉచితంగా, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై అందిస్తున్నాం. అదేవిధంగా పంచలోహ విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ, కాలనీల్లోని ఆలయాలకు 90 శాతం సబ్సిడీపై ఇతరులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం భక్తులకోసం కొత్తకాంప్లెక్స్ను పూర్తిచేశాం. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం లగేజి డిపాజిట్ కౌంటర్, అల్పాహారం, టీ, కాఫీ తదితర వసతులను ఏర్పాటు చేశాం. ఇదే తరహాలోనే కాలినడక భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కాంప్లెక్స్ నిర్మించాం. ఆధునిక వసతులు కల్పిస్తాం. తిరుపతి, తిరుమలలోని అన్ని వసతిగృహాల్లో పరిశుద్ధ తాగునీటి కోసం ఆర్వో జలప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశాం. శ్రీవారి భక్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అల్పాహారం అందిస్తున్నాం. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే హాళ్లను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేశాం. భక్తుల సౌకరార్థం గాలి, వెలుతురు, పరిశుభ్రత మెరుగ్గా ఉండేలా వేచి ఉండే గదిని, టోకెన్ మంజూరు కౌంటర్లను ప్రారంభించాం. కల్యాణవేదికలో వివాహాలు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రారంభించాం. కల్యాణంలో పాల్గొనే వారికి వసతి, దర్శనం, లడ్డూప్రసాదాలను ఉచితంగా ఇస్తున్నాం. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో రూ.40 కోట్ల వ్యయంతో అదనంగా ఎనిమిది ఆపరేషన థియేటర్లు, ఓపీ బ్లాక్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. స్విమ్స్‌లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఏటా రూ.25 కోట్లు ఆర్థిక సాయం అందించాం. మధురైలోని అరవింద నేత్ర వైద్యశాల శాఖను ఏర్పాటు చేసేందుకు తిరుపతిలో స్థలాన్ని కేటాయించాం. ఈ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్వీబీసీ కి నూతన స్టూడియో, పరిపాలనా భవనాలను రూ.14.70 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తాం. త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్‌ను ప్రారంభిస్తాం. భవిష్యత్ ప్రాధాన్యతాంశాలు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచటం; అదే సందర్భంలో వీఐపీలకు వారి స్థాయిని బట్టి ప్రోటోకాల్ నిబంధనలు చక్కగా అమలు చేయటం. తిరుమలలో యాత్రిసదన్లను అభివృద్ధి చేయటంతోపాటు వాటి సంఖ్యను పెంచటం. తిరుమల క్షేత్రంలో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే చర్యలు అమలు చేయటం. భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదాలు వితరణ చేయటం. నీటి ఆదాను పెంచటం. వృథానీటిని సమృద్ధిగా ఉద్యానవనాలకు వినియోగించటం. విద్యుత్ వాడకంలో భాగంగా ఎల్ఈడీ బల్బుల వినియోగం పెంచడం. సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావడం, తద్వారా పర్యావరణానికి మేలు జరిగే చర్యలు చేపట్టడం. -
భక్తులే సేవకులు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు భక్తులే సేవ చేసే మహద్భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ‘శ్రీవారి సేవ’ పేరుతో 2000వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 195 మందితో ప్రారంభమైన ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో గతపదహారేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మందికి పైగా సేవకులు సాటి భక్తులకు విశేష సేవలందించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు సాటి భక్తులే సేవలందించే మహదవకాశాన్ని శ్రీవారి సేవ పేరుతో టీటీడీ కల్పిస్తోంది. సేవకులుగా నమోదు ఎలా చేసుకోవాలి? శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకోవాలంటే నెల ముందుగా ‘ప్రజాసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానాలు, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్, తిరుపతి-517501, ఫోన్ నంబరు: 0877-2264392’ చిరునామాకు లేఖ రాయాలి. పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ తరహాలో సాధారణ సేవకు కూడా ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించారు. నమోదు చేసుకున్న వారిని సేవకు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు (ప్రొసీడింగ్స్) కాపీతోపాటు దరఖాస్తు పత్రం పంపుతారు. లేదా మొబైల్ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపుతారు. డ్రెస్‌కోడ్: పురుషులు: తెలుపురంగు దుస్తులు - స్త్రీలు: మావిచిగురంచుతో కూడిన నారింజరంగు చీర, మావిచిగురంచు రవిక శ్రీవారి సేవకులకు మార్గదర్శకాలు శ్రీవారి సేవకుల వయస్సు 18 నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి సేవకు వచ్చే వారి సేవకులందరూ ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) కాపీ సమర్పించాలి దరఖాస్తులకు పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు జత చేసి సేవాసదన్‌లో సమర్పించాలి సేవకులకు కాషాయ రంగు స్కార్ఫ్‌లు అందజేస్తారు. విధుల్లో ఉన్నప్పుడు శ్రీవారి సేవ స్కార్ఫ్‌లు ధరించాలి. సేవాకాలం ముగిసిన వెంటనే వాటిని తిరిగి సేవాసదన్‌లో అప్పగించాలి సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. కనీసం ఆరుగంటలపాటు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల ముందే సేవకు హాజరై శిక్షణ తీసుకోవాలి ఎల్లప్పుడూ ‘గోవింద’ నామాన్ని స్మరిస్తూ, సాటి భక్తులను కూడా ‘గోవిందా, శ్రీనివాసా’ అని సంబోధించాలి తిరునామం, తిలకం లేదా కుంకుమ, చందనం బొట్టు ధరించాలి సాటి భక్తులలోనే స్వామివారిని దర్శిస్తూ అంకితభావంతో సేవ చేయాలి శ్రీవారి సేవలో నిర్దేశించిన నియమ నిబంధనలు ఏదేని పరిస్థితుల్లో శ్రీవారి సేవకులు అతిక్రమిస్తే వారిని రెండేళ్ళ వరకు సేవకు అనుమతించరు తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి సేవకులకు శిక్షణ తరగతులు జరుగుతాయి. 24 విభాగాల్లో శ్రీవారి సేవ: తిరుమలలో ప్రధానంగా 24 విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీటిలో నిఘా, ఆరోగ్య, అన్నదానం, ఉద్యానవనాలు, వైద్య, లడ్డూప్రసాదం, శ్రీవారి ఆలయం, రవాణా, కళ్యాణకట్ట, పుస్తక విక్రయ శాలలతోపాటు మరికొన్ని ఉన్నాయి. అందించే సేవలివి: టీటీడీ పరిపాలనలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ సేవ ఎంతో దోహదం చేస్తోంది స్వామి దర్శనానికి వచ్చే క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులరద్దీని క్రమబద్ధీకరిస్తారు క్యూలైన్లు, కంపార్ట్మెంట్ల లో వేచి ఉండే భక్తులకు ఆహారం, మంచినీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు భక్తులు వెంట తెచ్చుకున్న లగేజీని, బ్యాగులను స్కాన్ చేస్తారు ఉద్యానవన విభాగంలో పూలమాలలు తయారు చేస్తారు పుస్తక విక్రయశాలల్లో పర్యవేక్షిస్తారు దర్శన క్యూలైన్లు, వైద్యశాలల్లో వయోవృద్ధులకు, రోగులకు సహకరిస్తారు ఉచిత చిన్న లడ్డూలు తయారు చేస్తారు లడ్డూ టోకెన్లు మంజూరు చేస్తారు వృత్తి నిపుణులైన వైద్యులు, ఇంజనీర్లు, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇతర నిపుణులు అవసరమైనపుడు ఆయా విభాగాల్లో సేవలందిస్తున్నారు. ఇతర సేవా విభాగాలు: సాధారణ సేవతో పాటు టీటీడీ కొన్ని అర్హతలు, మార్గదర్శకాలు పాటిస్తూ పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ లాంటి ప్రత్యేక సేవలు ప్రవేశపెట్టింది. పరకామణి సేవ: శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను పరకామణి సేవకులు లెక్కించాల్సి ఉంటుంది. 2012లో ప్రారంభించిన ఈ సేవలో 2016, జూన్ 23 వరకు 402 బృందాల్లో 42,558 మంది సేవలందించారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో లడ్డూ కౌంటర్లలో 2013, జనవరి 13న ప్రారంభమైన సేవలో 2016, జూన్ 23 వరకు 359 బృందాల్లో 18,014 మంది సేవలందించారు. సేవకులకు టీటీడీ ప్రత్యేక వసతులు బస: పురుషులు, మహిళలు కలిపి మొత్తం 2300 మంది శ్రీవారి సేవకులకు బస ఉంది. శ్రీవారి సేవాసదన్‌లో సుమారు 700 మంది పురుష సేవకులకు, పీఏసీ-3లో 1600 మంది మహిళా సేవకులకు బస ఉంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, వైకుంఠ ఏకాదశి లాంటి రద్దీ రోజుల్లో 5000 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తారు. ఇందుకోసం అదనంగా పీఏసీ-2లో కొన్ని గదులను కూడా ఆ సమయంలో వినియోగిస్తారు. వారం రోజుల పాటు తోటి భక్తులకు సేవ చే స్తే ఎనిమిదోరోజు సుపథం మార్గం గుండా శ్రీవారి ఉచిత దర్శనం కల్పించి, రాయితీపై లడ్డూలు అందజేస్తారు. తిరుపతిలో శ్రీవారి సేవ 2014, మార్చి7న తిరుపతిలోని విష్ణునివాసం వసతిగృహంలో శ్రీవారి సేవ కార్యాలయం ప్రారంభించారు ఇప్పటివరకు 49,988 మంది శ్రీవారి సేవకుల సేవలందించారు. తిరుపతిలో మూడు షిప్టుల్లో శ్రీవారి సేవకులకు సేవావిధులు నిర్వహించాలి టీటీడీ స్థానిక ఆలయాలతోపాటు అన్నప్రసాదం, గోసంరక్షణశాల, మార్కెటింగ్ విభాగం, కేంద్రీయ వైద్యశాల, రిసెప్షన్ విభాగం, విష్ణు నివాసంలో ఎస్కలేటర్ వద్ద సేవలందిస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, కోదండరామాలయం, లక్ష్మీనారాయణస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవలందిస్తున్నారు. శ్రీసత్యసాయి సేవాసమితి శిక్షణ: శ్రీవారి సేవకుల్లో సేవానిరతి, ధర్మచింతన మరింతగా పెంచడం ద్వారా భవిష్యత్తులో వారిని హిందూ ధర్మ రథసారథులుగా తీర్చిదిద్దాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తిలో అత్యున్నత ప్రమాణాలతో భక్తులకు సేవలందిస్తున్న శ్రీసత్యసాయి సేవాసమితి సహకారంతో తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవకులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ సమయంలో ధ్యానం, భజన, 30 నిమిషాలపాటు ‘సేవ’ ప్రాశస్త్యంపై తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఉపన్యాసం ఉంటుంది. సేవకులు భక్తులతో మెలిగే విధానం, తిరుమలలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు టీటీడీలో విభాగాలవారీగా అందించాల్సిన సేవలపై టీమ్ లీడర్లకు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆ టీమ్ లీడర్లు గ్రూపులోని సేవకులకు అవగాహన కల్పిస్తారు. రూ.70 కోట్లతో సేవాసదన్: తిరుమలలో సుమారు 4 వేల మంది సేవకులకు బస కల్పించేలా రూ. 70 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో త్వరలో శ్రీవారి సేవాసదన్ నిర్మించనున్నారు. వీఐపీలూ శ్రీవారి సేవకులే! శ్రీవారి సేవలో సాధారణ భక్తులే కాకుండా వీఐపీలు కూడా పాలు పంచుకున్నారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, జస్టిస్ ఈశ్వరయ్య, సినీహీరో చిరంజీవి కుటుంబ సభ్యుల వంటి వివిధ రంగాలకు చెందిన ఎందరెందరో దిగ్గజాలు శ్రీవారి సేవలో పాల్గొని సాటి భక్తులకు సేవ చేశారు. ఈ సేవలను మరింతగా విస్తరిస్తాం..! భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇందులో రైతులు, వ్యాపారులు, యువత, మహిళలు, ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, బ్యాంకర్లు... ఇలా ఎవరికి వారు స్వామి సన్నిధిలో ఏడు రోజుల పాటు సాటి భక్తులకు సేవచేసి అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నారు. పదహారేళ్లకాలంలో ఏడున్నర లక్షలమంది స్వచ్ఛందంగా భక్తులు సేవ చేసిన ఘనత టీటీడీకే దక్కింది. ఈ స్వచ్ఛంద సేవాకార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని సంకల్పించాము. - కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుమల జేఈఓ -
స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తిరుమల
నిత్య జనసందోహంతో కూడిన తిరుమల క్షేత్రంలో టీటీడీ కార్పొరేట్ స్థాయిలో పరిశుభ్రత అమలు చేస్తోంది. టీటీడీతోపాటు ఔట్ సోర్సింగ్ సంస్థలతో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే ఏర్పాట్లు చేసింది. కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్కి తిరుమల ఎంపిక కావడంతో ప్రభుత్వరంగ సంస్థలు కోలిండియా, ఓఎన్జీసీ సామాజిక బాధ్యతగా నిధులు మంజూరు చేస్తున్నాయి. తిరుమలలో చేపట్టాల్సిన పలురకాల అభివృద్ధి పనులకు అవసరమైన రూ.26 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసింది మురుగు నీటి శుద్ధి ద్వారా సమకూరిన 5 ఎంఎల్డీ నీటిని తిరిగి ఉద్యానవనాలు, శ్రీగంధం మొక్కలు, ఘాట్రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకానికి వాడుతున్నారు. ఇందుకోసం రూ.6 కోట్లు, ఘనవ్యర్థాల నిర్వహణకు రూ.1.5 కోట్లు, ప్రస్తుత విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చేందుకు రూ.5.5 కోట్లు ఖర్చవుతోంది కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ కార్ల వినియోగానికి రూ.6 కోట్లు ఖర్చవుతుంది భక్తులకు పరిశుద్ధ తాగునీటిని అందించడానికిగానూ మరో 20 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చవుతోంది. ఈ పనులు పూర్తి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. -
ఆభరణాల ఆనందనిలయుడు
బంగారు, వజ్ర. వైఢూర్య, మరకత, మాణిక్యాదుల అభరణాలు అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలిచిన భక్తుల కోర్కెలు తీరుస్తూ తిరుమల ఆలయంలో కొలువైనాడు. నాడు ఆకాశ రాజు నుంచి నేటి వరకు స్వామివారికి సమర్పించిన అమూల్యమైన ఆభరణాలు కానుకల రూపంలో స్వామి ఖజానాలో చేరిపోతున్నాయి. సాక్షాత్తూ స్వామికి అలంకరించే ఆభరణాలతోపాటు బాంకుల్లో డిపాజిట్ల రూపంలోని సుమారు 11 టన్నుల పైబడి బంగారం నిల్వల మదింపు అమూల్యం. ఆభరణాల జాబితాను టీటీడీ సిద్ధం చేసి భద్రపరిచింది. అందులో గర్భాలయ మూలమూర్తి అలంకరణలో అతిముఖ్యంగా 120, ఉత్సవవరులైన శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామివారికి 383 ఆభరణాలు వాడుతున్నారు. ఆ జాబితాలోని ఆభరణ విశేషాలేమిటో తెలుసుకుందాం!! మూలవర్ల అలంకరణకు విశేష ఆభరణాలు ≈ బంగారు పీతాంబరం, బంగారు కవచం - 19.410 కేజీలు ≈ నవరత్నాలు పొదిగిన పెద్ద కిరీటం - 13.374 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన వామ్చెట్ బంగారు కటి హస్తం - 8.129 కేజీలు ≈ బంగారు సాలిగ్రామాల హారం - 8.150 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన బంగారు కత్తి - 7.420 కేజీలు ≈ 108 బంగారు శంఖాలు - 6.100 కేజీలు ≈ వైకుంఠ హస్తం చైనుతో సహా - 5.908 కేజీలు ≈ మకర కంఠి మొదటిభాగం - 5.616 కేజీలు ≈ బంగారు గొడుగు - 5.530 కేజీలు ≈ జెమ్చెట్ శంఖు - 4.013 కేజీలు ≈ జెమ్చెట్ చక్రం - 4.077 కేజీలు ≈ జెమ్చెట్ రెండు కర్ణపత్రాలు - 3.100 కేజీలు ≈ రెండు బంగారు నాగాభరణాలు - 3.320 కేజీలు ≈ పచ్చలు, తెలుపు, ఎరుపు రాళ్లు పొదిగిన బంగారు కిరీటం - 3.145 కేజీలు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఆభరణాలు ≈ మలయప్పస్వామివారి బంగారు కవచాలు - 3.990కేజీలు ≈ శ్రీదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.400 కేజీలు ≈ భూదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.430 కేజీలు ≈ పద్మపీఠం - 2.869కేజీలు ≈ కొలువు శ్రీనివాసమూర్తి బంగారు తోరణం - 2.090 కేజీలు ≈ బంగారు పద్మాలు - 2.313 కేజీలు ≈ నూతన యజ్ఞోపవీతం - 2.043 కేజీలు ≈ 108 లక్ష్మీ డాలర్ల హారం - 2.560 కేజీలు ≈ బంగారు చేతి గంట - 2.794 కేజీలు ≈ కెంపులు పొదిగిన వైకుంఠ హస్త నాగాభరణం - 2.100 కేజీలు ≈ కెంపులు పొదిగిన బంగారు కఠికాహస్త - నాగాభరణం - 2.070 కేజీలు ≈ రత్నాలు పొదిగిన వజ్ర కవచ కిరీటం - 2.750 కేజీలు ≈ వజ్రాల కిరీటం - 2.935 కేజీలు ≈ బంగారు బిందె - 2.370 కేజీలు ≈ బంగారు గిన్నెలు - 2.080 కేజీలు ≈ బంగారు గోముఖ పళ్లెం - 2.085 కేజీలు ≈ శ్రీరాములవారి బంగారు ధనుస్సు, ఇతర ఆభరణాలు - 1.202 కేజీలు ≈ బంగారు తట్ట - 1.029 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు నడుము వజ్రకవచం - 1.831 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు కంఠ వజ్రకవచం - 1.661 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు పాదపద్మ వజ్రకవచం - 1.495 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు వెనుక వజ్రకవచం - 1.837 కేజీలు ≈ సీమ కమలాలు పొదిగిన హారం - 1.020 కేజీలు ≈ మకర కంటి రెండవ భాగం - 1.552 కేజీలు ≈ బంగారుపళ్లెం - 1.195 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన బంగారు కాసుల దండ - 1.955 కేజీలు ≈ సీమకమలాలు, పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కిరీటం - 1.893కేజీలు ≈ మకర కంటి మూడవ భాగం - 1.434 కేజీలు ≈ బంగారు చెంబు - 1.020 కేజీలు ఠి బంగారు బెత్తం - 1.380 కేజీలు ≈ రత్నాలు చెక్కిన బంగారు కిరీటం - 1.185 కేజీలు ≈ రాళ్లకొండై బంగారు కిరీటం - 1.365 కేజీలు ≈ బంగారు కి రీటం - 1.190 కేజీలు జి బంగారు బిందె-1.995కేజీలు ≈ ఉత్సవవర్ల బంగారు కిరీటం-1.170 కేజీలు తిరుమల ఆలయంలో ఆభరణాల లెక్కలివి ♦ శ్రీవారి మూలమూర్తి ఆభరణాలు - 120 ♦ ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్ప ఆభరణాలు-383 ♦ రాఘోజీ వారి తిరువాభరణాల రిజిస్టర్- 07 ♦ వెంకటగిరి రాజావారి తిరువాభరణాల రిజిస్టర్ - 11 ♦ వెండి ఆభరణాలు - 223 ♦ రాగి, ఇత్తడి, బంగారు తాపడం చేసిన వస్తువులు - 17 ♦ ముల్లెలు - 09 ♦ శ్రీవారి భాష్యకార్ల ఆలయానికి సంబంధించిన ఆభరణాలు, వస్తువులు -13 ♦ రికార్డు రూములోపల గల ఆభరణాలు - 08 ♦ తిరుమల శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చెందిన ఆభరణాలు - 28 తిరుపతి, అనుబంధ ఆలయాల్లో ⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు వస్తువులు-128 ⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన వెండి వస్తువులు-253 ⇒ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని బంగారు, రత్నాల ఆభరణాలు-162 ⇒ అమ్మవారి వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు-97 ⇒ అమ్మవారి ఆలయంలోని లోహవిగ్రహాలు, శిలా విగ్రహాలు - 23 ⇒ అమ్మవారి ఆలయంలోని రాగి, ఇత్తడి వస్తువులు-33 ⇒ తిరుచానూరు ఆలయంలోని శ్రీసుందరరాజ స్వామి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-44 ⇒ శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-73 ⇒ పంచలోహ విగ్రహాలు-148 ⇒ కార్వేటి నగరంలోని శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-78 ⇒ వేణుగోపాలస్వామి వారి బంగారు తాపడం చేసిన ఉత్సవ మూర్తుల ఆభరణాలు, వస్తువులు-31 ⇒ నగరిలోని కరియ మాణిక్యస్వామి ఆలయంలోని ఆభరణాలు వస్తువులు-36 ⇒ బుగ్గ అగ్రహారంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-13 ⇒ నారాయణవనం శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, సంబంధిత ఆలయాలలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-92 ⇒ నారాయణవనం శ్రీ అవనాక్షమ్మ ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-13 ⇒ నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి, రాగి ఆభరణాలు-54 ⇒ తిరుపతి పాదాల మండపంలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆభరణాలు బంగారు, వెండి, రాగి ఆభరణాలు-71 ⇒ తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలోని బంగారు, రాగి ఆభరణాలు -47 ⇒ వెండి ఆభరణాలు వస్తువులు-92 ⇒ శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు ఆభరణాలు-112 - వెండి, రాగి వస్తువులు-20 ⇒ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని రుషికేష్ ఆంధ్రా ఆశ్రమానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు-167 ⇒ అప్పలాయగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-56 ⇒ వాయల్పాడులోని శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-77 శ్రీవారి ఆభరణాల విశేషాలెన్నెన్నో... ⇒ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయలు తిరుమలదేవుడికి వెలకట్టలేనన్ని ఆభర ణరాశులను కానుకగా సమర్పించారు. ఇతర సామ్రాజ్యాలపై దాడులకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ రాయలవారు స్వామివారిని దర్శించుకుని అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. వాటిలో అతిముఖ్యమైనవి. ⇒ 13.360 కిలోలు బరువుగల 3,308 కారెట్లు కలిగిన నవరత్న కిరీటం, త్రిసర హారం, మూడుపేటల నెక్లెస్, ఇంద్రనీలాలు, గోమేధికాలు, మాణిక్యాలు, కర్పూర హారతి కోసం 25 వెండిపళ్ళాలు, శ్రీవారి ఏకాంత సేవకు అవసరమైన 374 క్యారెట్ల బరువుగల రెండు బంగారు గిన్నెలు. బంగారు తీగె, రత్నాలతో చేసిన కంఠాభరణాలు, బంగారు కత్తి, రత్నాలు, మణులు పొదిగిన ఒర, ఎర్రలు, పచ్చలు పొదిగిన 132 క్యారెట్లు బరువున్న కత్తి, పచ్చలతో తయారు చేసిన పిడి కత్తి, మణులతో తయారు చేసిన పిడికత్తి ఒర, 87 క్యారెట్ల బరువుగల మణుల పతకం. శ్రీవారికి టీటీడీ తయారు చేయించిన ఆభరణాలు... వజ్రకిరీటం - 1940 వజ్రాల హారం - 1954 వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు - 1972 వజ్రాల కటిహస్తం - 1974 వజ్రాల కిరీటం - 1986 (బరువు 13.360 కేజీలు, అప్పటి విలువ రూ.5 కోట్లు) ⇒ శ్రీవారికి ఉన్న అరుదైన ఆభరణాల్లో గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు. ⇒ స్వామివారికి అధికారికంగా ముఖ్యమైన ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటితోపాటు వినియోగంలోలేని పురాతన కిరీటాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రకిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఒకేరకమైన ఆభరణాలు రెండు నుంచి మూడు సెట్లలో అనేక ఆభరణాలు ఉన్నాయి. -
వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు
ధర్మానికి హాని కలిగినపుడు భగవంతుడు అవతరిస్తాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కలియుగంలో ధర్మోద్ధరణకు శ్రీమహావిష్ణువు ఉద్యుక్తుడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీరామునికి లక్ష్మణుడిగా సేవలందించిన తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిని భగవద్రామానుజులుగా అవతరింపజేసి ధర్మరక్షకుయ్యాడు. కారణజన్ముడైన రామానుజుడు ధర్మరక్షణకు బీజాలు నాటి, సనాతన హైందవ ధర్మరక్ష ణతోపాటు సాంఘిక అసమానతలను రూపుమాపి సమతాభావాన్ని చాటారు. వైదిక ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. తిరుమల క్షేత్రాన్ని విష్ణుక్షేత్రంగా నిరూపించారు. విశిష్టాద్వైత సిద్ధాంతంతో భక్తి మార్గాన్ని విస్తృతం చేశారు. శ్రీభాష్యాది గ్రంథాలతో ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించారు. కేశవసోమయాజి, కాంతిమతి దంపతులకు శ్రీరామానుజులు క్రీ.శ. 1017వ సంవత్సరంలో పింగళనామ సంవత్సరం చిత్తిర (మేష) మాసం ఆర్ద్రానక్షత్రంలో కంచి సమీపంలోని శ్రీపెరుంబుదూరులో జన్మించారు. వీరి మేనమామ తిరుమలనంబి (శ్రీశైలపూర్ణులు). ఆయన తిరుమల నుంచి శ్రీపెరుంబుదూరు వచ్చి, బాలునిలోని దివ్య తేజస్సు, లక్షణాలు గుర్తించి ‘ఇైళె యాళ్వార్’ (రామానుజుడు- లక్ష్మణుడు) నామకరణం చేశారు. ఐదేళ్లకు అక్షరాభ్యాసం, ఎనిమిదేళ్లకు ఉపనయనం చేశారు. వేదాది విద్యలన్నీ కారణజన్ముడైన రామానుజునికి కరతలామలకాలయ్యాయి. పదహారేళ్ల ప్రాయంలో ఆయనకు వివాహం జరిగింది. భార్య పేరు రక్షకాంబ. రామానుజులు కంచిలో యాదవప్రకాశుల దగ్గర వేదాంత విద్యను అభ్యసించారు. రామానుజుడి మేధావిలాసానికి పెద్దలు ముచ్చటపడేవారు. యాదవప్రకాశులు ఉపనిషత్ వాక్యాలకు చెప్పే వ్యాఖ్యానాలను రామానుజులు నిశితంగా గమనించేవారు. కొన్ని సందర్భాల్లో యాదవప్రకాశుల వివరణ సమంజసంగా తోచనప్పుడు తానే బుద్ధియుక్తంగా వివరణ ఇచ్చేవారు. అత్యుత్తమ శిష్యుడు ఆచార్యులు ఎంతటి కఠిన పరీక్ష పెట్టినా, దానికి నిలవడం ఉత్తమ శిష్య లక్షణం. గోష్ఠీపురం (తిరుక్కొట్టియూర్) అనే ఊరిలో గోష్ఠీపూర్ణులు (తిరుక్కొట్టియూర్ నంబి) వద్ద శ్రీకృష్ణ చరమ శ్లోకం ‘సర్వధార్మాన్ పరిత్యజ్య’ అనే గీతాశ్లోకంలోని అపూర్వ అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయని రామానుజులు తెలుసుకున్నారు. వాటిని స్వయంగా గ్రహించేందుకు తిరుక్కోట్టియార్ వెళ్లారు. నంబి మాత్రం రామానుజుడిని పరీక్షించారు. ‘‘ఈసారి కాదు, మళ్లీ రండి’’ అంటూ పద్దెనిమిది పర్యాయాలు పరీక్షించినా.. ఏమాత్రం విసుగు చెందకుండా రామానుజుడు శ్రీరంగం నుంచి తిరుక్కోట్టియూర్కు వెళ్లి నంబికి విశ్వాసానికి కల్గించారు. తర్వాత వారి ద్వారా చరమశ్లోకార్థాలను గ్రహించి, అత్యుత్త్తమ శిష్యుడిగా ప్రఖ్యాతి గడించారు. ఆదర్శవంతమైన ఆచార్యుడు తాను నేర్చిన విద్యను శిష్యులకు కూలంకషంగా ఉపదేశించడం ఉత్తమ ఆచార్య లక్షణం. తిరుక్కొట్టియూర్ నంబి చరమ శ్లోకార్థాలను ఉపదేశించేటపుడు, యోగ్యతను పరీక్ష చేయకుండా వాటిని ఎవ్వరికీ చెప్పవద్దని రామానుజుల దగ్గర ప్రమాణం చేయించుకొన్నారు. కానీ, తనకు ఆంతరంగిక శిష్యులు కూరేశులు, దాశరథికి ఆ అర్థాలను తెలుపకుండా ఉండలేనని, అందుకు అనుజ్ఞ ఇవ్వవలసినదని ప్రార్థించారు. నంబి సమ్మతిని పొంది తర్వాత వారికి ఉపదేశించారు. సహ జనులపై సమతాభావం కర్ణాటకలోని వైష్ణవ క్షేత్రం మేల్కోటె. అక్కడి అర్చామూర్తి మరుగున పడిపోయిన విషయాన్ని భగవానుడు స్వప్నంలో రామానుజులకు సాక్షాత్కరింపజేయగా, మేల్కోటెను పాలించే విష్ణువర్ధనుడి సహకారంతో ఆ మూర్తిని కనుగొని, ఆలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ కృషిలో తమకు సహకరించిన వారు ఆలయప్రవేశార్హత లేనివారుగా పరిగణింపబడే ఒక తెగ వారిపట్ల కృతజ్ఞత వ్యక్తీకరించారు. వారికి సంవత్సరంలో ఒకనాడు ఆలయంలో ప్రవేశించి, స్వామిని దర్శించుకొనే అవకాశాన్ని కల్పించారు. కాంచీపూర్ణులనే యామునుల శిష్యులు బ్రాహ్మణేతర కులానికి చెందినవారు. వారి శుద్ధమైన జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని రామానుజులవారు గుర్తించారు. కానీ, ఆకాలంలో సమాజంలోని కట్టుబాటును ఆచరించిన నంబి సున్నితంగా తిరస్కరించినా రామానుజులు మాత్రం సమతావాదాన్ని వీడలేదు. ప్రతిదినం కావేరీనదిలో స్నానం చేసి తిరిగి వచ్చేటపుడు రామానుజులు ధనుర్దాసు చేతిని ఆసరాగా తీసుకుని తిరిగి వచ్చేవారట. సకలశాస్త్ర పండితుడు శాస్త్రాలు అధ్యయనం చేయడం వేరు, అంశాల అనుకూల తర్కాలు ప్రయోగించి వాదించడం వేరు. ఈ సామర్థ్యం రామానుజులకు మెండుగా ఉండేది. తిరుమల ఆలయంలోని అర్చామూర్తి శ్రీవేంకటేశ్వరుడు శంఖచక్రహస్తుడై ఉండేవాడు కాడు. ఈ కారణంచేత తిరుమలలోని మూర్తి ఎవరు? అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించి, యథార్థ నిర్ణయం చేయడం కోసం తిరుమల ప్రాంతాన్ని పాలించే యాదంరాజు రామానుజులను ఆహ్వానించటంతో తిరుపతికి వచ్చారు. పురాణాగమాలు, ఆళ్వార్ల ప్రబంధాల ప్రమాణాల ప్రకారం ‘‘తిరుమలలోని మూర్తి శ్రీవేంకటేశ్వరుడే’’ అని నిరూపించారు. ఈ వాదప్రతివాదాలన్నీ రామానుజుల శిష్యులై న అనంతాచార్యులు తన ‘శ్రీవేంకటాచలేతిహాసమాల’ అనే గ్రంథంలో విశదీకరించారు. రచనా నైపుణ్యం రామానుజులు గొప్ప కవి కూడా. గీతాభాష్యంలో, శ్రీ భాష్యంలో, వేదార్థ సంగ్రహంలో పలుచోట్ల గల రామానుజుల సూక్తులు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. రామానుజులు బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరంగా భాష్యాన్ని విరచించి, దాన్ని కాశ్మీర్‌లోని శారదాపీఠానికి సమర్పించారు. శారదాదేవి దానిని శిరసావహించి, ‘‘భాష్యమంటే మీదే భాష్యం. మీరే భాష్యకారులు. ఇకపై మీ భాష్యం శ్రీ భాష్యమనే పేరులో ఖ్యాతి పొందుతుంది.’’ అని ప్రశంసించి, హయగ్రీవుల అర్చామూర్తిని రామానుజులకు బహూకరించారు. ఇతర సంప్రదాయానికి చెందిన విద్వాంసులు సైతం రామానుజుల శ్రీభాష్య రచనలోని మాధుర్యాన్ని మెచ్చుకుని ‘శ్రీవైష్ణవకాదంబరి’ అనే బిరుదుతో ప్రశంసించడం శ్రీ భాష్య ఘనతను, విశిష్టతను వ్యక్తం చేస్తున్నది. ద్రావిడభాషా ప్రావీణ్యం రామానుజులకు ద్రావిడభాషలో పాండిత్యం లేదని, అందువల్లనే వారు తమ గ్రంథాలను సంస్కృతంలో మాత్రమే రచించారని, ద్రావిడ గ్రంథాన్ని దేనినీ రచించలేదని కొందరి వాదన. కానీ. ఆళ్వార్ల ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రచించిన శ్రీవైష్ణవ గురు పరంపరలోని పలువురు పూర్వాచార్యులచే తమ వ్యాఖ్యలలో నూటికిపైగా గల సందర్భాలలో రామానుజులు ఆయా ఆళ్వార్ల పాశురాలను విలక్షణమైన రీతిలో అన్వయించారు. అపూర్వమైన అర్థాలను తెలిపారు. ఇవన్నీ రామానుజుల వారి ద్రావిడ భాషాపాండిత్యానికి, సందర్భోచిత సమన్వయ సామర్థ్యానికి చిహ్నాలు. ఆలయ నిర్వహణలో సంస్కరణలు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయ కైంకర్య నిర్వహణలో రామానుజుల కాలానికి ముందు పలు లోపాలు ఉండేవి. తన శిష్యుడైన కూరేశులద్వారా రామానుజులు ఆలయ నిర్వహణలో పలు సంస్కరణలు చేపట్టారు. ఆ విధంగానే తిరుమల ఆలయంలో కూడా పలు ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను సంస్కరించి సరిచేశారు. మేల్కోటె ఆలయంలో కూడా 52 మంది శ్రీవైష్ణవ కుటుంబాలను ద్రావిడ దివ్యక్షేత్రాలనుంచి రప్పించి, వారిని ఆయా సేవలలో నియమించారు. ఇప్పటికీ అక్కడ ఆ వ్యవస్థ కొనసాగుతుండటం విశేషం. సింహాచలం, శ్రీకూర్మం, అహోబిలం మొదలైన క్షేత్రాల్లోనూ తగిన సంస్కరణలను చేశారు. వైష్ణవాలయాల్లో జీయర్ వ్యవస్థకు పునాది రామానుజులు తిరుమల ఆలయంలో పలు సమయాచారాలను సంస్కరించారు. వ్యవస్థను సుస్థిరం చేశారు. వాటి నిర్వహణ బాధ్యతను తమ శిష్యులైన అనంతాచార్యులకు అప్పగించి, శ్రీరంగానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి అనంతాచార్యులు వృద్ధులైనందున, ఆ బాధ్యత కోసం అనంతాచార్యుల శిష్యులైన విష్వక్సేన ఏకాంగి అనే బ్రహ్మచారిని నియమించారు. ఆయనకు సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు. శ్రీ వేంకటనాథ శఠగోపయతి అనే పేరు పెట్టి, ఆలయ కైంకర్య బాధ్యతను అప్పగించారు. శ్రీవైష్ణవ సన్యాసికి తమిళంలో ‘జీయర్’ అని పేరు. మొదట ఒక జీయర్ను మాత్రమే నియమించినా, తర్వాత ఆ జీయర్‌కు ఉత్తరాధికారి(చిన్నజీయర్)గా ఇంకొకరిని కూడా నియమించారు. తర్వాత ఈ విధమైన జీయర్ వ్యవస్థ శ్రీరంగం, తిరునారాయణపురం (మేల్కోటై)లో, కంచిలో కూడా ఏర్పడిన ఈ వ్యవస్థ ఈనాటికీ ఈ క్షేత్రాలలో కొనసాగుతోంది. జీయర్ పర్యవేక్షణలో ఆ ఆలయాల సమయాచారాల నిర్వహణ సాగుతుండటాన్ని నేటికీ గమనించవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో .. వైకుంఠంలో ఆదిశేషుడుగా, తర్వాత త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరామునిగా, కలియుగంలో భగవద్రామానుజులుగా అవతరించారు. తన నూట ఇరవై ఏళ్ల ధార్మిక జీవనంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రాచీనమైన వైష్ణవమతాన్ని ఉద్ధరించారు. సంఘం చేత వెలివేయబడిన నిమ్న కులాలవారికి శ్రీవైష్ణవ మత స్వీకార అర్హతను కలిగించి, దాదాపు సహస్రాబ్ది కిందటే సాంఘిక సంస్కరణలకు నాంది పలికారు. సనాతన వైదిక సంస్కృతి, హైందవ ధర్మాన్ని పరిపుష్టం చెయ్యడానికి ఆసేతు హిమాచలం పర్యటించారు. శ్రీవైష్ణవ సిద్ధాంతానుసారంగా వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఎన్నో వైష్ణవ ఆలయాలను, శ్రీవైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేశారు. ఆయా క్షేత్రాల్లో, ఆలయాల్లో అస్తవ్యస్తంగా, అసమగ్రంగా ఉన్న పూజలు, ఉత్సవాలు, ఆగమశాస్త్రాల నియమానుసారం సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దారు. తిరుమల వేంకటాచల క్షేత్రంలో అర్చనాది కార్యక్రమాలను, ఉత్సవాలను పటిష్ఠం చేశారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠనాథుడైన శ్రీనివాసుడే సాలగ్రామ శిలామూర్తిగా వెలిశాడని, ఆ స్వామే మళ్లీ విఖనస మహర్షిగా అవతరించి, తన అర్చనా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, వైఖానస ఆగమం ప్రకారమే పూజలు జరిపి తీరాలని నిర్ణయించారు. శేషాచలక్షేత్రానికీ శేషాంశంతో అవతరించిన రామానుజులవారికీ విడదీయరాని, విడదీయలేని దివ్య అనుబంధం పెనవేసుకుంది. మోకాళ్లతో పాకుతూ తిరుమల కొండకు తిరుమలకొండ సాక్షాత్తూ ‘శ్రీనివాస పరబ్రహ్మ’ అని ఆళ్వార్లు కీర్తించారు. వాళ్లలో కొందరు తిరుపతికి వచ్చినా, కొండ కింద నుంచే నమస్కరించారు. వాళ్ల అభిప్రాయాన్ని రామానుజులు కూడా గౌరవించి, అనుసరించారు. కొండను పాదాలతో తొక్కుతూ వెళ్లకూడదని నిశ్చయించారు. గురువు తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వారు, ఆలయంలో జరిగే అర్చనాదులు తీర్చదిద్దాలంటూ చేసిన అభ్యర్థన మేరకు భగవద్రామానుజులవారు కేవలం మూడుసార్లు మాత్రమే తిరుమల కొండపైకి వచ్చారు. అది కూడా మోకాళ్లతో పాకుతూ కఠోరదీక్షతో మాత్రమే కొండ మీదకు వెళ్లారు. శ్రీనివాసుడికి శంఖచక్రాలంకరణ పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తికి శత్రువుల నుంచి రక్షణగా శ్రీవేంకటేశ్వరస్వామి తన శంఖుచక్రాలను బహూకరించారు. మళ్లీ తిరిగి ఇవ్వడానికి రాగా, వాటిని ఈ కలియుగంలో ధరించనంటూ స్వామి స్వీకరించలేదు. అందువల్ల శంఖుచక్రాలు లేని తిరుమలలోని అర్చామూర్తి శివుడని వీరశైవులు వాదించారు. వారి వాదనను రామానుజులు ఖండించారు. వక్షఃస్థల మహాలక్ష్మితో విరాజిల్లుతూ ఉన్న ఈ స్వామివారికి, తన తపశ్శక్తి చేత శంఖుచక్రాలను స్వయంగా స్వామివారే ధరించునట్లు చేసి ఆ అర్చామూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశఅయిన శ్రీవేంకటేశ్వర స్వామివారే అని నిరూపించారు. తిరుమలను వైష్ణవ క్షేత్రంగా ప్రతిష్ఠించిన ఘనత శ్రీరామానుజులవారిదే. బంగారు వ్యూహలక్ష్మి శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ని భక్తులందరూ దర్శించడం కుదరదు. అందుకే రామానుజులు ‘బంగారు లక్ష్మి’ ప్రతిమను అలంకరింపజేశారు. ఆనాటినుంచి నియమబద్ధంగా వక్షఃస్థల లక్ష్మితో కూడి ఉన్న శ్రీనివాసునికి శుక్రవారంనాడు మాత్రమే అభిషేకం జరగాలని నిర్ణయించి అమలు చేయించిన ఘనత రామానుజుల వారిదే. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలల అలంకరణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో ఐదవ రోజున గరుడోత్సవంనాడు శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి ధరించిన పూలమాలను తెచ్చి శ్రీవారికి ధరింపజేసే ఏర్పాటుతోపాటు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ ధరించిన పూలమాలను, కనుమ పండుగ రోజున గోదాకళ్యాణం రోజున తిరుమలకు తెచ్చి శ్రీవారికి సమర్పించే ఏర్పాటును రామానుజులవారు చేశారు. తిరుమల శ్రీస్వామి పుష్కరిణి ఒడ్డున ప్రాచీనమైన యోగ నరసింహస్వామి శిలావిగ్రహం పూజాపురస్కారాలు లేకుండా ఉండేది. ఆ మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠింపజేసి, నిత్యనివేదనాదులను ఏర్పాటు చేశారు శ్రీరామానుజులు. గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ రామానుజుల వారు తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత ఆ ఆలయం ఉత్తరోత్తరాభివృద్ధిని కాంక్షిస్తూ, గోవిందరాజస్వామికి దక్షిణ దిక్కులో గోదాదేవిని ప్రతిష్ఠించారు. ఆ ఆలయం చుట్టూ నాల్గు విశాలమైన వీథులను ఏర్పరిచారు. అక్కడే ఆలయ పరివారానికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఏయే దిక్కులలో ఎవరెవరు నివసించాలో, ధాన్యాగారం ఏ దిశలో ఉండాలో.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవస్థీకరించారు. తిరుపతి నగర నిర్మాణ కౌశలం కపిలతీర్థంలో నాలుగు మూలలా శ్రీసుదర్శన చక్రయంత్ర స్తంభాలు ప్రతిష్ఠించారు. దానిని ‘చక్రత్తాళ్వార తీర్థం’గా మార్పుచేయడంతో పాటు, తిరుపతికి గోవిందరాజస్వామి, కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ‘చక్రత్తాళ్వార్ తీర్థం’లో ‘చక్రస్నానం’ అనే ‘అవబృధస్నానం’ జరిగే ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. ఇలా తిరుమల, తిరుపతి ఆలయాలలో అర్చనాది కార్యక్రమాలను, ఆలయ వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తరాల వారికి అందించిన ఘనత రామానుజాచార్యుల వారికి దక్కుతుంది. రామానుజ పరంపరే జీయర్ల వ్యవస్థ తిరుమల శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాలు, టీటీడీ పరిపాలన నిర్వహణలో మూడు రకాల వ్యవస్థలు అమలవుతున్నాయి. శ్రీరామానుజాచార్యులు నెలకొల్పిన జీయంగార్ల వ్యవస్థ ఆలయంలో నేటికీ ప్రామాణికంగా అమలవుతోంది. ఇక భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులు, ఇతర విధాన నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ తీసుకునే నిర్ణయాలను అమలు చేయించడం కోసం కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేస్తోంది. తిరుమలలో జియ్యంగార్ల వ్యవస్థ ఇలా.. తిరుమలేశుని ఆలయంలో పూర్వం రాజులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పూజాకార్యక్రమాలను అమలు జరిపారు. రామానుజుల హయాం నుంచి తిరుమల ఆలయంలో పూజా కైంకర్యాలకు నిర్దిష్ట విధానాలను అమలు చేశారు. వైఖానస ఆగమం ప్రకారం ఆలయ నిర్వహణ జరిపించడం, స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే బాధ్యతను అర్చకులు నిర్వహించటం, అర్చకులంతా వైఖానసులై ఉండేలా చూడటం, అర్చకులు నిర్వహించే నిత్యపూజాకైంకర్య కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించడానికి రామానుజాచార్యులు జీయంగార్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు. జీయంగార్లు అంటే సన్యాసులు కారు. ఈ పదవికి వచ్చేవరకు సంసార సాగరాన్ని ఈదిన వారినే చినజీయర్ (ఉత్తరాధికారి)గా ఎంపిక చేస్తారు. ఈ జీయర్ వ్యవస్థలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీరు సన్యాసధర్మాలను తప్పక ఆచరించాలి. మఠం పరిపాలన శ్రీవారి ఆలయంలో వేకువజాము సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుండి రాత్రి ఏకాంతసేవ ముగిసే వరకు అన్నిరకాల పూజాకార్యక్రమాలను పెద్ద జీయర్, చిన్నజీయర్ లేదా వారి ప్రతినిధులైన ఏకాంగులు దగ్గరుండి పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలుకొని అన్ని రకాల వస్తువులను వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందజేస్తారు. జీయంగార్ల మఠాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల కోసం టీటీడీ ఏటా కోటిన్నర రూపాయలు కేటాయిస్తోంది. ఈ వ్యవస్థలో పెద్ద జీయంగార్, చిన జీయంగార్, ఏకాంగులు, అధ్యాపకులు ఉంటారు. జీయర్ స్వరూపమిది.. పెద్ద జీయంగార్: ఆలయ పూజాకార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడు. చిన్న జీయంగార్: పెద్ద జీయంగారికి ప్రధాన సహాయకుడిగా పని చేస్తారు. అధ్యాపకులు, ఏకాంగులు: బ్రహ్మచారులైన వీరు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. వీరు వేద పాఠాలు చదువుతారు. పెళ్లయిన వారు కూడా ఉండవచ్చు. వీరు జీయంగార్లకు సహాయకులుగా పనిచేస్తారు. తొలిపూజ, తొలి నివేదనం, తొలి దర్శనం వేంక టాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందుకే ‘ఆదివరాహక్షేత్రం’ అనీ, ‘శ్వేత వరాహక్షేత్రం’ అని తిరుమల పేరు పొందింది. నిత్యం తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనాదుల క్షేత్రంలోని పూర్వసంప్రదాయాన్ని రామానుజులవారు పునరుద్ధరించారు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, భూదేవిని ఉద్ధరించి ఇక్కడే నిలిచాడు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీనివాసుడు వచ్చి తాను కలియుగాంతం వరకు ఇక్కడ ఉండడానికి వంద అడుగుల స్థలం దానంగా ఇమ్మని కోరుతూ, అందుకు ప్రతిఫలంగా యుగాంతం వరకు ‘తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనం’ వరాహస్వామికి జరిగేటట్లుగా పత్రం రాసిచ్చాడు. ఈ క్షేత్ర సంప్రదాయం నిర్విఘ్నంగా అమలు జరిగేలా రామానుజులు ఇక్కడి విధివిధానాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో సన్నిధి భాష్యకారులు సన్నిధి అంటే ‘తిరుమల శ్రీవారి సన్నిధి’ అని అర్థం. ఆలయం విమాన ప్రదక్షిణ మార్గంలో ‘సన్నిధి భాష్యకారులు’గా రామానుజాచార్యులవారు కొలువై ఉన్నారు. శ్రీవారి కొప్పెర(హుండీ)కి ఎదురుగా తాళ్లపాక అరకు పక్కగా ‘సన్నిధి భాష్యకారుల’ను దర్శించవచ్చు. శ్రీవారికి నివేదనం జరిగిన ప్రతిసారీ శ్రీవారి సన్నిధి భాష్యకారులకు నివేదింపబడుతుంది. దీనిని 12వ శతాబ్దంలో అనంతాళ్వారులు శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించారు. తణ్ణీరముదు ఉత్సవం తిరుమలలోని పాపవినాశం నుంచి తీర్థజలాన్ని తెస్తున్న తిరుమలనంబికి శ్రీనివాసుడు బోయ యువకుడిగా అడ్డుపడి ‘నీళ్లివ్వు’ అన్నాడు. ‘శ్రీస్వామివారి కైంకర్యం కోసం తీసుకెళ్లే జలాన్ని ఇవ్వకూడదు’ అన్నాడు. కానీ, ఆ బోయవాడు వెనకనే నడుస్తూ, తన బాణంతో తిరుమలనంబి తలమీదనున్న కుండకు రంధ్రం చేసి దానినుండి జాలువారే నీటిని తాగాడు. ఖాళీ అయిన కుండను గమనించిన తిరుమలనంబి వెనక్కు తిరిగి బోయవాణ్ణి చూచి ‘ఎంత పాపం చేశావు.. ఇప్పటికే ఆలస్యమైంది. తీర్థాన్ని మళ్లీ తేవాలి కదా?’ అని చింతించారు. ‘తాతా! బాధపడకు. ఇదిగో ఈ కొండవాలులో చూడు. స్వచ్ఛమైన జలం ఉంది’ అంటూ బాణంతో కొట్టాడట. బాణం వల్ల పడిన రంధ్రం నుండి ఎగిసిపడిన జలాన్ని తీసుకొని తిరిగి బోయవానికోసం చూడగా అతడు అదృశ్యమయ్యాడట. దీనికి గుర్తుగా నేటికీ అదే రోజున తిరుమలలో ‘తణ్ణీరముదు ఉత్సవం’ జరుగుతుంది. దీన్ని కూడా రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు. తిరుచానూరు పంచమి ప్రతి సంవత్సరం కార్తిక శుద్ధపంచమినాడు అనగా ‘శ్రీ అలమేలుమంగ’ అవతరించిన ‘తిరుచానూరు పంచమి’ రోజున మాత్రం తిరుమల శ్రీవారి పూలమాలలు, పసుపు, కుంకుమలతో కూడిన సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పంపాలనే సంప్రదాయాన్ని కూడా రామానుజులవారే ఏర్పాటు చేశారు. మోకాళ్ల పర్వతంలో కొలువైన త్రోవ భాష్యకారులు భగవద్రామానుజులవారు శ్రీభాష్య గ్రంథాలను విరచించటంతో భాష్యకారులుగా ప్రసిద్ధి పొందారు. యాత్రలో మూడుమార్లు పాదాలతో తిరుమల కొండమెట్లను తొక్కకుండా మోకాళ్లతో మాత్రమే దేకుతూ, కొండకు వచ్చారు. అలా వెళుతున్న సమయంలో ‘మోకాళ్ల మెట్టు’ దగ్గర కొద్దిసేపు వారు విశ్రాంతి తీసుకొన్నారు. అందుకు గుర్తుగా ఆ తరువాతి కాలంలో ఆ దివ్య స్థలంలో రామానుజులవారి విగ్రహం ప్రతిష్టింపబడింది. వారినే ‘త్రోవభాష్యకారులు’ అని అంటారు. త్రోవభాష్యకారులకు ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి నివేదనలు చేస్తారు. జనబాహుళ్యంలోకి రామానుజ తత్వం వైష్ణవ భక్తాగ్రేసరుడు రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ రూపొందించటం అభినందనీయం. రామానుజతత్త్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. - సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ సహస్రాబ్ది ఉత్సవాలు ఆచార్య పరంపరలో అగ్రగణ్యులు భగవద్రామానుజులు ఏర్పరచిన పూజా విధానాలే నేటికీ తిరుమలలో కొనసాగుతున్నాయి. ఆ మహనీయుడు అవతరించి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేవస్థానం తరఫున ఏడాదిపాటు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. 108 దివ్యదేశయాత్రలు, ధార్మిక ప్రవచనాలు, గ్రంథ ప్రచురణలు వంటి కార్యక్రమాల ద్వారా రామానుజుల భక్తితత్త్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళుతున్నాము. - డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ఈవో ఏడాదిపాటు సహస్రాబ్ది ఉత్సవాలు రామానుజాచార్యులవారి సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈ ఏడాది మే 10న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా సంచార ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. రథం వెనుక వైపు శ్రీవేంకటేశ్వర స్వామివారు, రామానుజులవారు, పక్కభాగంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, రామానుజులవారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మే 10న ప్రారంభించిన ఈ సంచార రథం 108 దివ్యదేశాలలో పర్యటించి, రామానుజ తత్వానికి ప్రచారం కల్పించనుంది. తిరుమలలో బాగ్ సవారీ ఉత్సవం శ్రీనివాసుడు పుష్పాలంకార ప్రియుడు. ఈ క్షేత్రంలోని పూలన్నీ శ్రీవారి పూజకే వినియోగించాలని క్షేత్ర సంప్రదాయం. పుష్పకైంకర్యం కోసం అనంతాళ్వార్ అనే శిష్యుణ్ణి శ్రీరంగం నుంచి తిరుమలకు రప్పించారు పరమభక్తాగ్రేసరులైన రామానుజాచార్యులు. పుష్పకైంకర్యం కోసం తోటను పెంచాడు అనంతాళ్వారు. ఆ తోటను చూడడానికి రాత్రిపూట శ్రీనివాసభగవానుడు, లక్ష్మీదేవితోపాటు వచ్చి తోటను పాడుచేశాడు. దాన్ని గమనించి రాత్రిపూట కాపుకాసిన అనంతాళ్వారు వారిద్దరినీ బంధించాడు. కాని స్వామి తప్పించుకొని పోగా, లక్ష్మీదేవిని కట్టివేసి, స్వామిని వెంబడిస్తూ పరుగెత్తాడు. ఆలయానికి అప్రదక్షిణంగా పరుగెత్తి, పరుగెత్తి చివరకు పూలతోట దగ్గరకే వచ్చి స్వామి అదృశ్యమయ్యాడు. లక్ష్మీదేవి మాత్రం చెట్టుకు బంధింపబడి ఉందని సంతోషించాడు. ఇంతలో తెల్లవారింది. ఆలయంలో స్వామివారి వక్షఃస్థలంలో లక్ష్మీదేవి కనిపించలేదని అర్చకులు ఆందోళనపడగా, శ్రీస్వామివారు ‘అనంతాళ్వారులు ఆమెను పూలతోటలో బంధించాడని, సగౌరవంగా పిలుచుకొని రమ్మని’ చెప్పాడు. వారు ఆలయం చేరుకోగానే, అమ్మవారు అదృశ్యమై శ్రీవారి వక్షఃస్థలం చేరుకొంది. ఈ గాథను స్మరిస్తూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ‘బాగ్సవారి ఉత్సవం’ ఏర్పాటు చేశారు రామానుజులవారు. ‘బాగ్’ అంటే తోట. సవారీ అంటే వ్యాహ్యాళి. తోటకు వెళ్లే ఉత్సవం కనుక ఇది ‘బాగ్సవారీ’ అంటారు. ఆ రోజు శ్రీనివాసుడు దేవేరులతో ఆలయానికి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు వెళ్లి పూజాకైంకర్యాలు అందుకుని, తిరిగి ఆలయం చేరుకుంటారు. శంషాబాద్‌లో 216 అడుగుల పంచలోహ సమతామూర్తి - వేయేళ్ల సందర్భంగా స్ఫూర్తికేంద్రం తెలంగాణాలో హైదరాబాద్నగరం శంషాబాద్‌కు సమీపంలోని శ్రీరామాపురం వద్ద 216 అడుగుల ఎత్తున శ్రీరామానుజుల పంచలోహ విగ్రహం (సమతామూర్తి) రూపకల్పన సాగుతోంది. స్వామి వారికి వెయ్యేళ్లు నిండుతున్న సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి నేతృత్వంలో ‘శ్రీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్థాపన జరుగుతోంది. వచ్చే ఏడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నిర్మాణం పనులు 2022 నాటికి పూర్తయ్యేలా నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే లక్ష్యంతో 2014లో పనులు ప్రారంభించారు ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1000 కోట్లు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 216 అడుగులు. ఈ విగ్రహం చైనాలోని నాన్జింగ్లో సిద్ధమవుతోంది. దాదాపు 1500 విడిభాగాల్లో మొత్తం సుమారు 700 టన్నుల బరువుతో సిద్ధమవుతోంది. విగ్రహ పీఠం భాగంలో 36 ఏనుగు బొమ్మలు ఉంటాయని, వాటిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుందని, ఈ పీఠంపై 108 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని, ఆయన చేతిలోని త్రిదండం 135 అడుగులు ఉంటుందని స్థపతి డీఎన్వీ ప్రసాద్ తెలిపారు. విజయకీలాద్రిపై 108 అడుగుల సుధామూర్తి ప్రతిపాదన విజయవాడలోని విజయ కీలాద్రి పర్వతంపై 108 అడుగుల ఎత్తై రామానుజుల సుధామూర్తి (సిమెంట్ విగ్రహం) ఏర్పాటు చేయాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు సంకల్పించారు. విగ్రహస్థాపన ప్రణాళిక దశలోనే ఉంది. ఇదే పర్వతం మీదున్న శిథిలావస్థకు చేరిన శ్రీవేంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి, భూ వరాహస్వామి, శ్రీకృష్ణ స్వామి, సుదర్శన చక్రత్తాళ్వారు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, వైకుంఠ పెరుమాళ్, అష్టలక్ష్మి ఆలయాల జీర్ణోద్ధారణకు చేశారు. -
216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం
ఢిల్లీ: ప్రముఖ తత్వవేత్త రామానుజాచార్యులు 1000వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని త్రిదండి చినజియర్‌స్వామి తెలిపారు. ఇందుకోసం శంషాబాద్‌లో సమతాముక్తి స్పూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 216 అడుగుల రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజియర్ స్వామి.. రామానుజాచార్యుల విగ్రహం గురించి వివరించారు. ఈ సందర్భంగా మోదీది ఆదర్శ పాలన అని చినజియర్ స్వామి కితాబిచ్చారు. విదేశాల్లో భారత జెండాను మోదీ రెపరెపలాడిస్తున్నారని, నాడు భారత ప్రజలమని చెప్పుకోవడానికి ఇష్టపడని వారు నేడు భారత ప్రజలమని చెప్పుకుంటున్నారని చినజియర్ స్వామి మోదీ పాలనను కొనియాడారు.