రోజూలానే ఆరోజు కూడా రామానుజుడు మహాపూర్ణుల ఇంటికి వెళ్లారు. కాని ఇంట్లో ఎవరూ లేరు. ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల వారిని అడిగితే గురువు గారు హఠాత్తుగా ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. ఎందుకు? ఇంటికి చేరుకున్న రామానుజుడికి.. జరిగిన గొడవ గురించి, గురువుగారు హఠాత్తుగా ఎందుకు కంచి వదిలి వెళ్లిపోయారో తెలిసిపోయింది. గురువుగారి భార్యను అన్నమాటలు కూడా తెలుసుకున్న తరువాత చాలా బాధపడ్డారు. హృదయం భారమైంది. కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె కనిపించింది. సాధ్యమైనంత వరకు కోపం, బాధ ఆపుకుంటూ ‘‘మూడు తప్పులు చేశావు రక్షమాంబ, క్షమించరాని తప్పులు. రెండు సార్లు నీకు హెచ్చరిక చేశాను. నాకు ఉపదేశం చేసిన గురువుగారిని కూడా నీవు గౌరవించకపోతే మనం ఏం చేస్తున్నట్టు? మొదటి సారి కాంచీపూర్ణుని సాపాటుకు పిలిచి కులభేదాలు లేవంటూ గౌరవించాలన్న నా ప్రయత్నాన్ని ఫలించనీయలేదు. అది మొదటి తప్పు. మరోసారి ఆకలితో ఉన్న వైష్ణవుడికి భోజనం పెట్టమని కోరితే నిరాకరించావు. ఇంట్లో భోజన పదార్థాలు ఉన్నా లేవన్నావు. ఇక ఇప్పుడు నా ఆచార్యుడిని వెడలగొట్టిన పాపాన్ని నాకు కట్టబెట్టావు. నాకు దివ్యోపదేశం చేసిన గురువే నా జీవితంకన్నా, నీకన్నా చాలా ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా. నీకు ఇదివరకు ఎన్నో సార్లు చెప్పాను కూడా! హెచ్చరించినా వినడం లేదు. నా స్థాయికి మించిన సతీమణివి నువ్వు. నీవల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడం నా వల్ల కావడం లేదు. ఇక ప్రయోజనం లేదు. నీవు నీ పుట్టింటికి వెళ్లవచ్చు. నీతో వచ్చినవి, నీవు తెచ్చినవి, నీ పుట్టింటివారు నీకు ఇచ్చినవి తీసుకుని వెళ్లవచ్చు.’’ అని తీక్షణంగా మాట్లాడి, రామానుజుడు వెళ్లిపోయాడు. తంజ వణికిపోయింది. ఏనాడూ కోపంగా లేని రామానుజుడు అంతగా ఆగ్రహించడం తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి ఆమెను పంపించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు రామానుజులు. అంతలో ఒకరోజు ఆమె పుట్టింటినుంచి ఎవరో వచ్చి తమ్ముడి పెళ్లికి అక్కా బావలను నాన్న రమ్మంటున్నారని చెప్పారు. తండ్రి పంపిన కొన్ని కానుకలు ఇచ్చాడు. ఉత్తరం కూడా రాసి పంపాడు. తను వెళ్తానంది. రామనుజుడు సరేనన్నాడు. తాను రాలేనని చెప్పాడు. కొన్ని వస్తువులు తీసుకువెళ్తానంది. నీకు ఇష్టం వచ్చినవన్నీ తీసుకుపోవచ్చని చెప్పాడు. ఎప్పుడు వస్తానో తాను చెప్పలేదు. రామానుజుడూ అడగలేదు. పుట్టింటి ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఇంకా తాను వాడుకుంటున్న వస్తువులు కూడా సర్దుకుంది. ఆమె ముఖంలో పుట్టింటికి వెళ్లే సంతోషం కనిపించింది. ఏ తప్పు చేయని వారిని వైవాహిక బంధంనుంచి తెంచడం ధర్మం కాదు. మూడుతప్పులు చేసిన భార్యను వదిలివేయడం అధర్మం కాదు. స్వచ్ఛందంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంటే... ఇదీ ఒకందుకు మంచిదే అన్నట్టు రామానుజుడు మౌనం వహించాడు. వెళ్లిపోయింది. తనకు సహధర్మచరిగా ఉండవలసిన భార్య దొరకలేదు. ఇక సంసారమూ ఆ సంసార భారాలూ తనకు సాధ్యం కాదని తన దారి వేరని అర్థమైపోయింది. మళ్లీ ఇక ఆమె గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఆయన జీవితంలోకి ఆమె వచ్చిన దాఖలా లేదు.
సన్యాసాశ్రమం
రామానుజుడు ఇక సన్యాసాశ్రమం తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమనే నిశ్చయానికి వచ్చాడు. భిక్షువైన సన్యాసి ద్వారాగానీ లేదా భగవంతుడి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలి. రామానుజుడు వరదరాజ స్వామి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలని సంకల్పించాడు. అనంత సరస్సులో స్నానం చేసి పునీతుడైనాడు. ‘ఈ సంసార బంధంనుంచి నన్ను విముక్తుడిని చేయి వరదరాజా.. నీ దివ్య ఆదేశాలను స్వీకరించడానికి నేను సిద్ధం. నన్ను నీ చరణాలను ఆశ్రయించనీయి, త్రిదండం ఇప్పించు. కాషాయ వస్త్రాలు దాల్చనీ, స్వామీ’ అని ప్రార్థించాడు. కాంచీపూర్ణుడి ద్వారా అతనికి అనుజ్ఞ లభించింది. త్రిదండము, కాషాయ వస్త్రాలు, ఉపవీతము, కౌపీనము, వేష్టి, శిక్యము మొదలైనవి ఇచ్చి ఇకనుంచి అతను రామానుజ ముని అని పిలువబడతాడన్నారు. రామానుజ మునికి సన్యాసాశ్రమ ధర్మపద్ధతి ప్రకారం మఠం ఏర్పాటుచేసి పీఠాన్ని అందులో ఆయన్ను ప్రతిష్ట చేయండి అని ఆదేశించారు వరదరాజస్వామి.
కొన్నాళ్లు కంచి రామానుజ మఠంలో ఆయన సన్యాసిగా జీవనం సాగించారు. సన్యాసాశ్రమంలో కఠిన నియమాలు సవివరంగా పాటించారు. యామునాచార్యులను తలచుకున్నారు. ఇదంతా నాయందు వారి అపారమైన దయ, లీల. తన మార్గంలో కంటకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు. చివరకు ఈ దారికి మళ్లించారు. ఇక వారి ఆశయాలను నెరవేర్చే బృహత్ కార్యాన్ని చేపట్టాలి. కాని నేను ఒక్కడినే ఉన్నాను. నాకొక తోడు ఉండాలి. గోవిందుడు గుర్తుకు వచ్చాడు. ఆ«ధ్మాత్మిక వాజ్ఞ్మయం తెలిసిన వాడు, శాస్త్రాలు చదువుకున్నవాడు. భౌతిక లంపటాలమీద ఆసక్తి లేని వాడు. సమ్యక్ దృష్టి కలిగిన వాడు. నేనంటే అభిమానం ఉన్నవాడు. మనసు తెలిసిన ఆత్మబంధువు. గోవిందుడికన్నానాకెవరు దొరకుతారు? కాని అతను కాళహస్తిలో ఉంటూ శైవమతాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరు అతన్ని మనదారికి మళ్లించగలరు? కంచి వరదుడికి కాంచీపూర్ణుడి వలె, తిరుమల వేంకటేశ్వరస్వామికి శ్రీశైలపూర్ణుడు అంతటి సన్నిహితుడు. శ్రీశైలపూర్ణుడి సాయం దొరికితే చాలు అనుకున్నాడు. అతనికి వెలుగు దారి చూపమని కాంచీ వరదుడినే మళ్లీ వేడుకున్నాడు.
దాశరథి కురేశులు
రామానుజుడికి ఇద్దరు చెల్లెళ్లు. భూమి, కమల. పురుష మంగళలోని అనంత దీక్షితతో భూమి వివాహం అయింది. వారికి దాశరథి జన్మించాడు. దాశరథిని ముదలి ఆండన్ అని కూడా పిలుస్తారు. కమలకు పుట్టిన వాడు వరద విష్ణు ఆచార్య. ఆండన్ 105 సంవత్సరాలు జీవించారు. రహస్యత్రయమనే గ్రం«థాన్ని రచించారు. రామానుజుని ప్రధాన శిష్యుల్లో ఒకరు. దాశరథి తనను శిష్యుడిగా స్వీకరించాలని అర్థిస్తాడు. దాశరథితోపాటు శ్రీవత్సాంక కూడా శిష్యుడైనాడు. శ్రీ వత్సాంకుడు కుర్ అనే అగ్రహారానికి అధిపతి, ధనవంతుడు. కనుక ఆయనను కురేశుడు అని ఆళ్వన్ అని కూడా అంటారు. కురేశుడు తన భార్య ఆండాళ్‌తో కలిసి వచ్చి శిష్యులై ఉండేందుకు అనుమతించాలని కోరారు. రామానుజుడికి సన్నిహిత శిష్యులుగా దాశరథి, కురేశుడు రాణించారు. (వీరి పుత్రులే పరాశర, వేదవ్యాసభట్టర్) పంచసంస్కారాలు గావించారు. అంతకు ముందు గురువైన యాదవప్రకాశుడు కూడా శైవం నుంచి విశిష్టాద్వైతం స్వీకరించి రామానుజుడి శిష్యుడైనాడు.
శ్రీరంగం వైపు పయనం
శ్రీరంగం వైష్ణవ పీఠంలో రామానుజుని ఆచార్యుడుగా ప్రతిష్టించాలని యామునాచార్యుల శిష్యగణం మాట్లాడుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్న కంచి వరదుడి అనుగ్రహంతోనే రామానుజుడు కంచినుంచి కదలడం సాధ్యమవుతుందని వారు గమనించారు. శ్రీరంగనాథుని స్తుతించి ఒక కోరిక కోరారు. ‘‘మీరు ఏ విధంగానైనా వరదరాజస్వామిని ఒప్పించి రామానుజుని శ్రీరంగానికి రప్పించాలి’’ అని విన్నవించారు. శ్రీరంగనాథుడు కంచిలో వరద రాజుకు సందేశం పంపుతూ రామానుజుడిని పంపాలని కోరతాడట. ఆ సందేశానికి వరదరాజు ‘‘మమ్మల్ని మేము కోల్పోవడానికి సిద్ధపడినప్పుడే మా రామానుజుని వదులుకునేది’’ అని తిరుగు సందేశం పంపారట. అధికారికంగా వరదుడిని ఒప్పించడం కష్టమని తేలిపోయింది. ఆయనను మెప్పించడానికి మార్గాలు వెదకాలనుకున్నారు.
వరదుడు సంగీతప్రియుడు, మధురగానానికి లొంగుతాడని తెలిసి సంగీత విశారదుడు భక్త అగ్రగణ్యుడైన వర రంగముని (మరోపేరు తిరువరంగ పెరుమాళ్ అఱైయార్)ను వరదరాజపెరుమాళ్ సన్నిధికి వెళ్లమని వేడుకుంటారు. ఆయన కాంచీపురం చేరుకుని, దివ్యప్రబంధంలోని పాశురాలను మధురంగా గానం చేశారు. వరదరాజస్వామి ఆయన గానానికి ముగ్ధుడై ఆలయమర్యాదలతో సత్కరించాలని ఆదేశిస్తాడు. ‘‘ఈ సత్కారాలు నాకెందుకు స్వామీ. ఇవన్నీ నాకు అక్కర లేదు. మీరు కాదనకుండా నాకు ఒక వరం ఇవ్వండి స్వామీ’’ అని వర రంగడు కోరుతాడు. ‘‘సరే నన్ను నా భార్యలను కాకుండా మరేదయినా కోరుకోవా’’ అంటాడు వరదరాజపెరుమాళ్. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వరరంగడు రామానుజుడిని అడుగుతాడు. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. వెంటనే రామానుజుని చేయిపట్టుకుని శ్రీరంగానికి బయలుదేరతాడాయన. యమునాచార్యుల కల ఫలించబోతున్నదని శిష్యులు రామానుజుడికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
కావేరీ తీరానికి రాగానే రామానుజుడిని వేదమంత్రోచ్చారణలతో పూర్ణకుంభంతో ఎదురేగి, దివ్యప్రబంధ పాశుర గానంతో సకల వైదిక లాంఛనాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఊరేగింపుగా రామానుజుడు తూర్పుద్వారంనుంచి శ్రీరంగాలయ ప్రవేశం చేసారు. తరువాత దక్షిణానికి తిరిగి అక్కడనుంచి పడమరవైపు ప్రదక్షిణగా మళ్లి అక్కడినుంచే శ్రీరంగనాథునికి సాష్టాంగ నమస్కారము సమర్పించి, అమ్మవారు శ్రీరంగనాయకి సన్నిధికి వెళ్లి ప్రణామం చేసి, చంద్ర పుష్కరిణిని దర్శించి ప్రణమిల్లి, పుష్కరిణీజలాన్ని తీసుకుని త్రాగి, జయవిజయుల రక్షణలో ఉన్న ద్వారంలో ప్రవేశించి, దివ్యశూరులైన అక్కడి ఆళ్వారులను దర్శించి చుట్టూ ఉన్న ఉపాలయాలను సందర్శించి ప్రణవ విమానానికి ప్రణమిల్లి, విష్ణు సేనాని విష్వక్సేనుల వారి సన్నిధికి చేరి సాష్టాంగ నమస్కారం చేసి, రంగమంటపంలో ప్రవేశించినారు. సరిగ్గా అదే సమయానికి రామానుజునికి స్వాగతం చెప్పినట్టు ఉత్సవరులు నంబెరుమాళ్ రామానుజుని చూడాలని స్వయంగా బయటకు వచ్చారు. నంబెరుమాళ్ కనిపించగానే రామానుజులు పలుమార్లు సాష్టాంగపడిపోయారు. మహానంద పరవశులైనారు. ఇక మూలవిరాట్టు, అనంత శయనుడు, శేషశాయి, ప్రణవవిమానాంతర్గత శయనమూర్తి, శ్రీరంగనాథుని దర్శించారు. ఆ దివ్యమంగళ విగ్రహుని పరాత్పరునిచూడగానే కళ్లు వర్షించాయి. మనసు పులకించింది తనువు వణికింది. ఉచ్ఛస్వరం ఉబికి వచ్చింది. సంస్కృత శ్లోకాలు ఆశువుగా వెలువడ్డాయి.
నమో నమో వాజ్ఞ్మనసాతి భూమయే
నమో నమో వాజ్ఞ్మనసైక భూమయే
నమో నమో అనంతమహావిభూతయే
నమో నమో అనంతదయైక సింధవే
అని స్తుతించారు. వాక్కుకు మనసుకు అందని వాడా వందనం వందనం, వాక్కు మనస్సుకు మాత్రమే అందే వాడా వందనం వందనం, అనంతమహా వైభవుడా వందనం వందనం, అనంత దయా సముద్రుడా వందనం వందనం అని స్వామిని చూస్తూ ఉండిపోయాడు.మరో శ్లోకం కూడా రామానుజుని మనో వాక్కులనుంచి ప్రవహించింది.
నధర్మనిష్ఠోస్మిన చాత్మవేది
నభక్తిమాన్ త్వచ్ఛరణారవిన్దే
అకించనోన్యగతిఃశరణ్యః
త్వత్పాదమూలం శరణం ప్రపద్యే
(నాకు ధర్మమంటే ఏమిటో తెలియదు. నిçష్ఠ అర్థం కాదు. ఆత్మతత్వం బోధపడదు. నీ పాదపద్మాల మీదైనా భక్తి ఉందా అంటే అదీ లేదు. అకించనుడను. గమ్యమేమిటో తెలియదు (అగమ్యగోచరుడిని), ఇంకో గతి లేదు. నీ పాదములనే శరణు వేడుతున్నాను). కరుణాసముద్రుడైన భగవంతునికి తానేమీ కానని తెలుపుకుని నిరహంకారుడై పూర్తిగా శరణువేడే నిజవైష్ణవ నిరాడంబర, నిజభక్తి సూత్రాలుగా ఈ శ్లోకాలు ప్రతి వైష్ణవ తిరువారాధనలో పలికే మంత్రాలై ఈనాటికీ వెలుగుతున్నాయి. శ్రీవారి పాదాలను (శఠగోపము) రామానుజుని పాదాలపై ఉంచారు. బద్ధులైన ఆత్మలను విముక్తులను చేయడానికి నిత్యవిభూతిని, లీలా విభూతిని వినియోగించమని ఆదేశిస్తూ ఆ రెండింటినీ రామానుజులకు అప్పగించారు శ్రీరంగనాథుడు. పెరియనంబి ద్వారా శెంగోలు కిరీటాన్ని ఇచ్చి రామానుజుడికి ఉడయవరు అనే నామాన్ని ఇచ్చారు. పెరియనంబి వైపు తిరిగి, రామానుజుడు, ఆచార్యవర్యా మిమ్మల్ని ఆశ్రయించడం వల్ల మీ దయతో నాకు ఈ శ్రీరంగనాథుని అనుగ్రహం కలిగిందని నమస్కరించారు. పెరియనంబి ‘‘నాయనా...అదిగో అటు చూడు అని నమ్మాళ్వార్లను చూపి, ఆయనే భవిష్యత్తులో ఒక ఆచార్యులు వచ్చునని చెప్పినారు. అది నీవేనని యామునులు చెప్పినారు. కలి ధర్మాలను నశింపచేసి భగవత్తత్త్వాన్ని జనులకు విశదం చేసే మహత్తర కార్యక్రమ బాధ్యతను స్వీకరించు’’ అని దీవించారు.
ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను, వ్యవహారాలను, జరగవలసిన కార్యక్రమాలను నిర్ధారించి, నిర్దేశించి, దగ్గరుండి నిర్వహింపజేసి, ఆచరణ ద్వారా అందరికీ నేర్పి, ఈనాటికీ ఏనాటికీ మరిచిపోకుండా నిలబెట్టిన ఘనుడు ఆచార్య రామానుజుడు. ఆ కార్యక్రమం కలియుగ వైకుంఠ ధామమైన శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు ఆరంభించారు. పెరియ తిరుమండపం (పెద్ద శ్రీ మండపం)లో ప్రవేశించారు, అన్నీ పరిశీలించారు. శ్రీ భాండాగారంలోకి వెళ్లారు. అక్కడి తూకాలు చూశారు, కొలతల ప్రమాణాలను సరిచూచారు. తిరువారై అంటే పూలమాలల సేవ, సాట్టువడి అంటే శ్రీ గంధపు సేవ, అముడుపడి అంటే అన్న ప్రసాద సేవ, తిరువిళక్కు అంటే జ్యోతి సేవ తదితర సేవలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించారు. సేవల అంతరార్థాలను వివరించారు. పద్ధతులను నిర్దేశించారు. ప్రక్రియలు ప్రబోధించారు. దేవాలయానికి ఉన్న ఆస్తులు, భూములు, పూలవనాలు, పనిచేసేవారు, వారి బాగోగుల గురించి అడిగారు. పలకరించారు. లోపతాపాలను విచారించి సరిదిద్ది నిర్దిష్ట కార్యప్రణాళికను రూపొందించారు. శ్రీ రంగనికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల విధి విధానాలను సంకలనం చేసి క్రమబద్ధీకరించారు. సరైన వ్యక్తులను సరైన స్థానాలలో నియమించారు శ్రీరంగ రామానుజులు.
∙ఆచార్య మాడభూషి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment