భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే! | tirumala brahmotsavalu special story | Sakshi
Sakshi News home page

భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే!

Published Sun, Oct 2 2016 12:54 AM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే! - Sakshi

భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే!

ధార్మిక సంస్థ అయిన టీటీడీ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతోపాటు ఎన్నెన్నో సామాజిక, సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. టీటీడీ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు భక్తులకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. కొండ కు వచ్చే ప్రతి భక్తుడు ఉచితంగా భోజనం చేయడానికి అన్నదానం, కార్పొరేట్ వైద్యం అందుకోలేని నిరుపేద రోగుల కోసం ప్రాణదానం, కన్నవారి ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కోసం బాలమందిరం, నా అన్నవాళ్ళు లేని వృద్ధుల పునరావాసం కోసం కరుణాధామం, వినికిడి శబ్దానికి నోచుకోని చెవిటి చిన్నారుల కోసం శ్రవణం ప్రాజెక్టుల ద్వారా ధార్మికసంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది.

ప్రాథమికస్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు విద్యాదానం, ఆసుపత్రుల ద్వారా నిరుపేదలకు ఉచితవైద్యం అందిస్తోంది. ఇందుకోసం వెంకన్న భక్తులు పెద్దమొత్తంలో విరాళాలు సమర్పిస్తూ టీటీడీ పథకాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వేల రూపాయలతో ప్రారంభమైన అనేక పథకాలు నేడు సుమారు రెండువేల పైబడటం విశేషం. టీటీడీ పథకాల కోసం భక్తులు ఇచ్చే విరాళాల మొత్తానికి భారత ఆదాయపన్ను చట్టం అధికరణం 80(జి) కింద పన్ను మినహాయింపు ఉంది. రూ.లక్ష,ఆపైన విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ  తిరుమలలో బస, శ్రీవారి దర్శనం, ప్రత్యేక  బహుమానాలు అందజేస్తోంది.  
 
టీటీడీ ఈవో పేరుతోనే డీడీ, చెక్‌లు

ఈ ట్రస్టులకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్న దాతలు డిమాండ్ డ్రాఫ్టు, చెక్కులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి పేరుతో సమర్పించాలి.
రూ. కోటి, అంతకుమించి విరాళాలిచ్చేదాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.2,500 అంతకుమించి అద్దెతో వీఐపీ సూట్ కేటాయిస్తారు. దీనిని ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా పొందవచ్చు.
దాతతోపాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా వీఐపీ బ్రేక్ కల్పిస్తారు. మూడు రోజులపాటు సుప్రభాత దర్శనం కల్పిస్తారు. దాత అభీష్టం మేరకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందజేస్తారు. సంవత్సరంలో ఓసారి ప్రసాదంగా పది పెద్ద లడ్డూలు, పది మహాప్రసాదం ప్యాకెట్లు ఇస్తారు.  
సంవత్సరానికి ఒకసారి ఒక శాలువా,  ఒక రవికగుడ్డ బహూకరిస్తారు.
దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన వెండి పతకంతో పాటుగా ఒక ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు.
దాతలు తమ పేరుతో విరాళం ఇస్తే ఆ దాత  జీవితకాలం; సంస్థలు, సమిష్టి దాతలతో విరాళం ఇస్తే 20 సంవత్సరాల పాటు టీటీడీ సదుపాయాలు అందుతాయి. ఈ పథకానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. దాత కోరిన విధంగా ఒకసారి శ్రీనివాస మంగాపురంలో సర్వకామప్రద లక్ష్మీ శ్రీనివాస మహాయజ్ఞం నిర్వహిస్తారు.
 
లక్ష, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు...

దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో ఒకరోజు రూ.100 అద్దె గది ఉచితంగా కేటాయిస్తారు.
దాత, కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో ఒకరోజు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఏడాదిలో ఒకసారి ఆరు చిన్నలడ్డూలు, శాలువా, జాకెట్టు పీస్ బహూకరిస్తారు.  
రూ.ఐదు లక్షలు, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు...
దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో మూడు రోజులు డోనర్స్ కౌంటరులో ఉచిత లేదా అద్దె చెల్లింపు ప్రాతిపదికపై వీఐపీ వసతి కల్పిస్తారు.
♦  దాతకు, అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), మూడు రోజులు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
సంవత్సరంలో ఒకసారి పది చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక రవిక బట్ట బహూకరిస్తారు. దాతకు మొదటిసారి శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకం, ఐదు మహాప్రసాదం ప్యాకెట్లు అందజేస్తారు.
 
రూ.పది లక్షలు, అంతకు మించి...  
దాతకు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.500 అద్దె వీఐపీ సూట్ గది యేటా మూడు రోజులు ఉచితంగా కేటాయిస్తారు.
దాతకు, వారి కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో మూడు రోజులు బ్రేక్ లేదా ప్రారంభ సమయంలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
సంవత్సరంలో ఒకసారి ప్రసాదంగా ఇరవై (20) చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక జాకెట్టు పీస్ బహూకరిస్తారు.
దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకంతో పాటుగా ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు.
 
వ్యక్తిగత దాతలు సదుపాయాలిలా పొందాలి
దాతలు సంబంధిత ట్రస్టు ద్వారా పొందిన పాసు పుస్తకాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద చూపించాలి.
దాతతోపాటు ఐదు మందిని శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారు. వారి వివరాలు ముందస్తుగా పేర్కొనవలెను. వారి ఫొటో గుర్తింపు కార్డులను చూపించాలి.
పాసుపుస్తకం, ఇన్‌కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఆ దాతపేరుతోనే ఇస్తారు.
ప్రతిసంవత్సరమూ దాత జీవిత సర్టిఫికేట్‌ను దాతల విభాగం, టీటీడీకి  సమర్పించాలి.
దాత ఏవైనా కారణాలచేత తిరుమలకువచ్చి ప్రసాదాలు, బహుమానాలు, దర్శనాలు స్వీకరించలేకపోతే వారి లైఫ్ సర్టిఫికేట్, సంతకంతో కూడిన గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత వ్యక్తికి సూచించినట్లయితే వారికి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ వివరాలు ముందస్తుగా తిరుమలలోని దాతల విభాగంలో తెలిపి, వారి అనుమతి పొందాలి.
దాతతోపాటు పేర్కొన్న న లుగురు సభ్యుల పేర్లు జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే తగిన కారణాలు తెలిపి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనుమతితో మార్పు చేసుకోవచ్చు.
ముందస్తుగా దాతలకు తెలపకుండానే పై సవరణలలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవడానికై టీటీడీకి సర్వహక్కులు కలవు.
 కంపెనీల, ట్రస్టులు, సంస్థలు సదుపాయాలిలా పొందాలి
పాతపద్ధతి ప్రకారం, ఐదుగురు సభ్యులతో కూడిన కంపెనీ, ట్రస్టు, సంస్థలకు ఈ క్రింద పేర్కొన్న షరతులు వర్తిస్తాయి.
కేవలం డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు, మేనేజింగ్‌ట్రస్టీ, ఎవరైనా భాగస్వాములు, ఉద్యోగస్థులు వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఈ సదుపాయాలు వర్తిస్తాయి.
డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు లేక కంపెనీ సెక్రటరీ, మేనేజింగ్ ట్రస్టీ లేక సంస్థలోని ఇతరసభ్యులు కేవలం ఐదుమంది పేర్లను పేర్కొంటూ గుర్తింపు పత్రాలు జతపరచి అధికారిక పత్రాలు సమర్పించాలి. ఈ పత్రాలను 15 రోజులలోపు తిరుమలలోని దాతల విభాగంలో అందజేసి ముందస్తు అనుమతి పొందాలి.
డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, మేనేజింగ్ ట్రస్టీలు, భాగస్వాములు, ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు తగు గుర్తింపుకార్డు చూపించగలిగితేనే వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఇట్టి సంస్థలు మనుగడలోనే ఉన్నట్లు దాతల విభాగానికి తగు పత్రాల్ని సమర్పించాలి.
ఈ సంస్థలకు సంబంధించిన పై వారు ఏ కారణం చేతనైనా తిరుమలకు వచ్చి దర్శనం, ప్రసాదం, బహుమానం తీసుకోని ఎడల ఆ సంస్థలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను, అధికారిక గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత సంతకంతో ఎవరికి ఆ సౌకర్యాలు కలుగజేయాలో తిరుమలలోని దాతల విభాగానికి ముందే తెలుపుతూ వారి నుండి ఉత్తర్వులు ముందే పొందాలి.
దాత ఆ సంస్థలకు సంబంధించిన చిరునామాతో విరాళాలు ఇచ్చినపుడు వారికి ఆ సంస్థల పేర్లతోనే పాసుపుస్తకం, ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు సర్టిఫికేట్ ఇస్తారు.
ఈ సవరణలు 05-11-2011 తర్వాత విరాళాలిచ్చిన దాతలకు వర్తిస్తాయి.
విరాళాలను డిమాండు డ్రాప్టు లేదా చెక్కు ద్వారా మాత్రమే అందజేయాలి. డీడీతో పాటుగా దాత రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జతచేస్తూ, దాత కు సంబంధించిన వివరాలు అంటే- దాతతో కలుపుకుని ఐదుగురి  కుటుంబ సభ్యులపేర్లు, బంధుత్వం, వారి వయస్సు, చిరునామా తెలియజేయాలి.
తిరుమలలో విరాళాలను ఇవ్వడానికి (చెక్కు లేదా డిమాండ్ డ్రాప్టు ద్వారా మాత్రమే) ఉపకార్యనిర్వహణాధికారి కార్యాలయం, డోనార్ సెల్, టీటీడీ, తిరుమల వద్ద సంప్రదించండి. (ఫోను నెంబర్లు- 0877-2263472, 3727)
 
టీటీడీ ట్రస్టులివి...
1. శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు
2. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు
3. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు
4. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు
5. శ్రీ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస సంస్థ (బర్డు)
6. శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు
7. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు
8. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం
9. శ్రీ వేంకటేశ్వర పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ ట్రస్టు
10. శ్రీ వేంకటేశ్వర బాలమందిరం ట్రస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement