సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు! | tirumala brahmotsavalu special story | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు!

Published Sat, Oct 1 2016 11:55 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు! - Sakshi

సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించి సుమారు రెండుసంవత్సరాలవుతోంది. ఈ రెండేళ్ల పాలన కాలంలో ఆయన ఎన్నెన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. స్వామిని సందర్శించు కోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతోదూరం నుంచి వచ్చే సామాన్య భక్తులకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు, వారికి సకల సదుపాయాలను కల్పించేందుకు రకరకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వాటి అమలులో కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాక్షి ఫన్‌డే ప్రత్యేకసంచికతో ఆయన పంచుకున్న అనుభూతులు, అనుభవాల సమాహారమిది...
 
టీటీడీ ఈవోగా దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు కదా, దీనిపై మీ స్పందన?
చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా బయటప్రాంతంలో పనిచేయటానికి, ధార్మిక సంస్థలో పనిచేయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన సంస్థను నడిపించటం కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ పరిధి దాటకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నాము. సామాన్య భక్తులకు టీటీడీ సదుపాయాలు అందాలన్న లక్ష్యంతోనే ధార్మిక సంస్థ కార్యక్రమాలు సాగుతున్నాయి. అదే సందర్భంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికీ ప్రాధాన్యత ఇస్తున్నాము.  
 
2015లో రెండు బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించారు కదా, ఈసారి ఏ మార్పులు తీసుకొస్తారు?
గత ఏడాది వచ్చిన రెండు బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించాం. ఈసారి కూడా ఉత్సవాల్లో మార్పులు ఉండవు కానీ, గతంలో జరిగిన లోపాలను సవరించుకుంటూ, వాహన సేవల్లో ఉత్సవమూర్తిని భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు పెంచాం. అదేసమయంలో ఆలయంలో మూలవర్ల దర్శనమూ త్వరగా లభించేలా ఏర్పాట్లు చేశాం.
 
గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారట..?
నిజమే! వాహన సేవలు ఉదయం 9 నుండి 11 గంటలవరకు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహించటం సంప్రదాయం. విశేషమైన గరుడవాహనసేవను దర్శించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం కేవలం గరుడ వాహన సేవను రాత్రి 8 గంటలకే నిర్వహించటం దశాబ్దకాలంగా అమలవుతోంది. ప్రస్తుతం అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించడం అసాధ్యం. పోనీ 8 గంటల నుండి  అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిస్తే ఆలయంలో ఏకాంతసేవ నిర్వహణకు అడ్డంకులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పండితుల సూచన మేరకు రాత్రి 7.30 గంటలకే వాహనసేవ ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ విధానం వల్ల లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవను దర్శించే అవకాశం ఉంది.
 
ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలు తీరు ఎలా ఉంది?
చక్కగా ఉంది. దీనివల్ల భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. తోపులాటలు తగ్గాయి. స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 10 శాతానికి పైగా పెరిగింది. ఆలయంలో ఈ మూడు క్యూలైన్ల విధానం అమలుపై మరింత దృష్టి పెట్టాం. తోపులాటలు లేకుండా, సంతృప్తికరమైన దర్శనం కల్పించడంలో ఉన్న అవకాశాలన్నింటినీ తప్పక అమలు చేస్తాం.
 
మరి రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్..?
రూ.300 టికెట్లకు విశేష స్పందన ఉంది. ఇలా టికెట్లు పొందిన భక్తులకు కేవలం రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది. ఈ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 2015-2016 మధ్యకాలంలో 57,12,737 మంది టికెట్లు పొందారు. వారంతా స్వామిని సంతృప్తిగా దర్శించుకున్నారు. టికెట్లు పొందినవారిలో తమిళనాడు 32.40 శాతం, ఆంధ్రప్రదేశ్  24.77 శాతం, కర్ణాటక 14.75 శాతం ఉంది. దక్షిణభారతదేశంలో 85.36 శాతం, మిగిలిన ప్రాంతంలో 14.64శాతం బుకింగ్ జరిగింది. పోస్టాఫీసుల ద్వారా 2,42,634 టికెట్లు పొందారు. మొత్తం 109 దేశాల్లోని ప్రవాస భారతీయల్లో అత్యధికంగా ఈ రూ.300 టికెట్ల అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుపథం ద్వారా సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్, గల్ఫ్ దేశాల్లో మొత్తం 65, 864 మంది ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.
  
మీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి...

ఇంటర్నెట్ ద్వారా భక్తులకు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతోపాటు ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవాటికెట్లు విడుదల చేస్తున్నాం.
* ఆన్‌లైన్‌లో ముందస్తుగా గదులు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. ఆక్యుపెన్సీ శాతాన్ని బాగా పెంచాం. భక్తులకు సదుపాయంతోపాటు స్వామికి ఆదాయం కూడా పెరిగింది.

* తిరుమలలోని పీఏసీ-1, 2, 3, 4 తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నాం. దాతలకు, ముందస్తుగా గదులు బుక్ చేసుకునే భక్తులకు డిపాజిట్‌ను రద్దు చేశాం. టీటీడీకి విరాళాలు అందిస్తున్న దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించాం. దాతలు 48 గంటలలోపు డిజిటల్ పాసుపుస్తకం పొందేలా, ట్రస్టుల వారీగా ఇ-రిజిస్ట్రేషన్ చేసుకునేలా సౌకర్యం కల్పించాం. తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు టీసీఎస్ సహకారంతో నెక్ట్స్‌జెన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం.  సేవా టికెట్లు, గదుల ముందస్తు బుకింగ్ గడువును 60 నుంచి 90 రోజులకు పెంచాము.  భక్తులు సులభంగా కానుకలు సమర్పించేందుకు ఈ-హుండీ ప్రవేశ పెట్టాం. దీనిద్వారా కానుకలు సమర్పించే భక్తులకు పేమెంట్‌గేట్ వే చార్జీలు (కమీషన్ చార్జీలు) రద్దు చేశాం.  2015, మార్చి 21న ప్రారంభమైన ఈ-పబ్లికేషన్స్‌లో 3700 గ్రంథాలున్నాయి.

* 5 భాషల్లో వెలువడుతున్న సప్తగిరి మాస పత్రికను 2016, జనవరి నెల నుండి రంగుల్లో అందిస్తున్నాం.  శ్రీవేంకటేశ్వరస్వామికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకోసం డీమ్యాట్ ఖాతా ప్రారంభించాం.  టీటీడీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలనుకుంటున్న భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: 1800425333333, 18004254141 అందుబాటులో ఉంచాం. వీటితోపాటు కొత్తగా వాట్స్ యాప్ నంబరు: 9399399399, ఈ-మెయిల్: Helpdesk@tirumala.org ప్రవేశపెట్టాం.  శ్రీనరసింహస్వామి సన్నిధి ఎదురుగా గల లక్ష్మీదేవి విగ్రహం వద్ద నూతన హుండీని, ఆలయం ఎదురుగా శ్రీవారి వెండి, బంగారు, రాగి డాలర్ల విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేశాం.  శ్రీవారి శిలావిగ్రహాలను రెండు నెలల్లో, పంచలోహ విగ్రహాలను మూడు నెలల్లో తయారు చేసి దరఖాస్తు చేసుకున్న వారికి అందించేందుకు ఏర్పాట్లు చేశాం.

రాతి విగ్రహాలను ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీల్లో ఆలయాలకు ఉచితంగా, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై అందిస్తున్నాం. అదేవిధంగా పంచలోహ విగ్రహాలను ఎస్‌సీ, ఎస్టీ, కాలనీల్లోని ఆలయాలకు 90 శాతం సబ్సిడీపై ఇతరులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నాం.  రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం భక్తులకోసం కొత్తకాంప్లెక్స్‌ను పూర్తిచేశాం. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం లగేజి డిపాజిట్ కౌంటర్, అల్పాహారం, టీ, కాఫీ తదితర వసతులను ఏర్పాటు చేశాం. ఇదే తరహాలోనే కాలినడక భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కాంప్లెక్స్  నిర్మించాం. ఆధునిక వసతులు కల్పిస్తాం.  తిరుపతి, తిరుమలలోని అన్ని వసతిగృహాల్లో పరిశుద్ధ తాగునీటి కోసం ఆర్‌వో జలప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశాం. శ్రీవారి భక్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అల్పాహారం అందిస్తున్నాం.  కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే హాళ్లను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేశాం. భక్తుల సౌకరార్థం గాలి, వెలుతురు, పరిశుభ్రత మెరుగ్గా ఉండేలా వేచి ఉండే గదిని, టోకెన్ మంజూరు కౌంటర్లను ప్రారంభించాం.  కల్యాణవేదికలో వివాహాలు చేసుకునేందుకు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రారంభించాం. కల్యాణంలో పాల్గొనే వారికి వసతి, దర్శనం, లడ్డూప్రసాదాలను ఉచితంగా ఇస్తున్నాం.  

తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో రూ.40 కోట్ల వ్యయంతో అదనంగా ఎనిమిది ఆపరేషన థియేటర్లు, ఓపీ బ్లాక్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. స్విమ్స్‌లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఏటా రూ.25 కోట్లు ఆర్థిక సాయం అందించాం.  మధురైలోని అరవింద నేత్ర వైద్యశాల శాఖను ఏర్పాటు చేసేందుకు తిరుపతిలో స్థలాన్ని కేటాయించాం. ఈ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.  ఎస్వీబీసీ కి నూతన స్టూడియో, పరిపాలనా భవనాలను రూ.14.70 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తాం. త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్‌ను ప్రారంభిస్తాం.
 
భవిష్యత్ ప్రాధాన్యతాంశాలు
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచటం; అదే సందర్భంలో వీఐపీలకు వారి స్థాయిని బట్టి ప్రోటోకాల్ నిబంధనలు చక్కగా అమలు చేయటం. తిరుమలలో యాత్రిసదన్లను అభివృద్ధి చేయటంతోపాటు వాటి సంఖ్యను పెంచటం. తిరుమల క్షేత్రంలో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే చర్యలు అమలు చేయటం. భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదాలు వితరణ చేయటం. నీటి ఆదాను పెంచటం. వృథానీటిని సమృద్ధిగా ఉద్యానవనాలకు వినియోగించటం. విద్యుత్ వాడకంలో భాగంగా ఎల్‌ఈడీ బల్బుల వినియోగం పెంచడం. సోలార్  విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావడం, తద్వారా పర్యావరణానికి మేలు జరిగే చర్యలు చేపట్టడం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement